March 15, 2013

నీచ రాజకీయాలకు మేం సహకరించం!

-అవిశ్వాసం పెట్టే సత్తా మాదే
-ఒక్కటి బెయల్‌పార్టీ..మరొకరి బ్లాక్‌మెయిల్ పార్టీ
-అవి తీర్మానం పెడితే మద్దతు ఇవ్వాలా?
-పొత్తులు లేవు.. అంతా ధర్మపోరాటమే:బాబు స్పష్టీకరణ
-ఒక్కో కార్యకర్త ఒక్కో పత్రిక, రేడియో కావాలని పిలుపు

ఏలూరు: "నీచమైన రాజకీయాలను చేస్తూ పశువుల్లా ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించే వాళ్లకు తెలుగుదేశం పార్టీ సహకరించదు..సహకరించబోదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే సత్తా ఒక్క టీడీపీకి మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం వద్ద శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించి 14.3 కిలోమీటర్లు నడిచారు. పైడిపర్రులో రాత్రి బస చేశారు. వేల్పూరు సెంటర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. "బెయిల్ కోసం కొందరు.. బ్లాక్‌మెయిల్ కోసం మరికొందరు.. అవిశ్వాస తీర్మానం పెట్టారు. అలాంటి తీర్మానానికి మద్దతు ఇవ్వాలా? జగన్ బెయిల్ కోసం ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి జైలు పార్టీ(వైసీపీ) ప్రయత్నిస్తుండగా, బ్లాక్‌మెయిల్ పార్టీ(టీఆర్ఎస్) ఆ పార్టీతో కుమ్మక్కైంది'' అన్నారు.

"చెన్నారెడ్డి, రాజశేఖరరెడ్డి, కిరికిరి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలపై మేమేకదా అవిశ్వాసం పెట్టింది? అసలు సమస్యలను గాలికి వదిలేసి దోపిడీ దారుగా మారే వారితో మేమెందుకు చేతులు కలపాలి?''అని నిలదీశారు. అసెంబ్లీలో తమ పార్టీ నేతల తీరుపై మహాలక్ష్మి చెరువు వద్ద జరిగిన సభలో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. "మా వాళ్లు అసెంబ్లీలో ఉతికి ఆరేశారు. తోక పార్టీలు పెట్టిన అవిశ్వాసం వెనుక దాగి ఉన్న వ్యవహారాలను ఎండగట్టారు. అవినీతితో ర్రాష్టాన్ని నాశనం చేసిన పిల్ల కాంగ్రెస్‌కు అవిశ్వాసం పెట్టే అర్హత ఎక్కడిది? దద్దమ్మలు, పనికిరానివాళ్లు ఈ ర్రాష్టాన్ని ఏలుతున్నారు'' అని దుయ్యబట్టారు. అంతకుముందు కొవ్వూరు, ఆచంట నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు.

"కాంగ్రెస్‌తో మేము సహకరిస్తున్నామని పిల్ల కాంగ్రెస్ ఎప్పుడూ పదే పదే చెబుతోంది. ఆ ఖర్మ మాకు పట్టలేదు. ఇలాంటి పార్టీలు ఎన్నో వచ్చాయి. పోయాయి. అవన్నీ కాంగ్రెస్‌లో కలిసేవే. కాంగ్రెస్‌ను 30 ఏళ్లుగా ఢీకొంటున్నాం. ఆ సత్తా మాకే ఉంది. ఇది ఎన్టీఆర్ ఇచ్చిన ధైర్యం'' అని అక్కడ శ్రేణులను ఉత్సాహపరిచారు. టీఆర్ఎస్ నాయకుడు ఆరు నెలలు కుంభకర్ణుడిలా పడుకుని లేస్తాడని ఎద్దేవా చేశారు. ర్రాష్టంలో 42 మంది తెలుగుదేశం ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పడానికి వీలవుతుందని నిర్దేశించారు. "మనకు పేపర్లు లేవు, మీరే ఒక ఆలిండియా రేడియోగా మారాలి. మీరే ఒక వార్తా పత్రిక కావాలి. ఇంటింటికి వెళ్లి పార్టీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు చెప్పాలి'' అని సూచించారు.