March 15, 2013

ప్రజాస్వామ్యాన్నీ కొనాలి.. ఆ పనిచేయలేను

ఆ తప్పు మళ్లీ చేయను
తీర్మానం నెగ్గాలంటే ఎమ్మెల్యేలను కొనాలి
పశ్చిమ యాత్రలో చంద్రబాబు స్పష్టీకరణ



ఏలూరు : "గతంలో ఒకసారి అవిశ్వాసం పెడితే ఎమ్మెల్యేలు అమ్ముడయ్యారు. సూట్‌కేసుల కోసం, ఖరీదైన కార్ల కోసం ఆశపడి పోయారు. మరోసారి ఆ తప్పు నేను చేయలేను. ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం అంటున్నారు. ఆ తీర్మానం నెగ్గాలంటే కచ్చితంగా ఎమ్మెల్యేలను కొనాలి. ప్రజాస్వామ్యాన్నీ కొనేయాలి. ఆ పని నేను చేయలేను'' అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంటు ఇవ్వాల్సిన వేళ.. సర్కారు 'చార్జీల' షాకులు ఇస్తోందని మండిపడ్డారు. 'ఇది సర్కారు కాదు.. దోపిడీదారు'' అని ధ్వజమెత్తారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం జగన్నాథపురం వద్ద గురువారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మార్టేరు, నెగ్గిపూడి, పెనుగొండ, ఐతంపూడి, ఏలేటిపాడు ఎక్స్‌రోడ్, గొల్లగుంటపాలెం, వేండ్రవారిపాలెం వరకు నడిచి ఇరగవరంలో రాత్రి బస చేశారు. విద్యుత్ సర్‌చార్జీలు మరోసారి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను మార్టేరు, పెనుగొండ సభల్లో ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. "భవిష్యత్‌లో మరో పదమూడు వేల కోట్ల మేర సర్‌చార్జీల వసూలుకు సర్కారు సిద్ధమవుతోంది. అసలీ ప్రభుత్వానికి దిశాదశా లేదు. ప్రజలను పీడించడం, పన్నులు వేసి దోపిడీ చేయడమే పనిగా పెట్టుకొంది'' అని మండిపడ్డారు.

టీఆర్ఎస్ 'అవిశ్వాసం' నిర్ణయాన్ని ఆయన తోసిపుచ్చారు. "ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొంటున్నారు. అలాంటివాళ్లు అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ సమర్థించాలా?'' అని మరోమారు ప్రశ్నించారు. చీకటి రాజకీయాలు, సూట్‌కేసు రాజకీయాలకు టీడీపీ దూరమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజునే అవిశ్వాసం అంటూ ఆ రెండు పార్టీలు చీకటి రాజకీయాలతో ముందుకొచ్చాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చకు ఒకసారి తాము సిద్ధం కాగా, 'ఆకలి అవుతున్నది' అంటూ వైఎస్ వెళ్లిపోయేవారని గుర్తుచేశారు.

కాగా మంత్రి పితాని బావ గుబ్బల తమ్మయ్య చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అంతకుముందు.. కవిటం వద్ద నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. "మన పార్టీలో ఉన్న పరిస్థితులను ప్రజలకు వివరించి విరాళం కోరగా.. పాదయాత్రలో ఇప్పటిదాకా 41 లక్షల రూపాయలకు పైగానే వసూలయ్యాయి. మీరూ ఎన్నో త్యాగాలు చేశారు. మరికొంత కాలం తప్పదు. అర ఎకరమో, పావు ఎకరమో అమ్ముకుని అయినాసరే పార్టీని బతికించుకోవడానికి సిద్ధం కావాలి'' అని పిలుపునిచ్చారు.