October 21, 2012

20వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర పోటోలు...(Part -2)

రేషన్ బియ్యం రద్దు!
కేంద్రం నగదు బదిలీ ఉద్దేశమిదే
పేదలకు మరింత భారం తప్పదు
అకౌంట్లో డబ్బులు వేసి బియ్యం నిలిపేస్తారు
దీనిని మేం ప్రతిఘటిస్తాం.. మీరు అడ్డుకోండి
ప్రజలకు చంద్రబాబు పిలుపు

ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంకు
బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్‌కు భాగస్వామ్యం
నేను వెళ్లాక చర్చించండి
వాస్తవమైతే నాతో కలిసిరండి
  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు బదిలీ పథకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ఆ పథకం అమల్లోకి వస్తే సబ్సిడీ బియ్యం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయనుందని హెచ్చరించారు. ఈ పథకం కారణంగా పేదలపై మరింత భారం పడి వారి జీవన ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

"రాష్ట్రంలో ప్రజలకు అందే సబ్సిడీ రేషన్ బియ్యాన్ని కాంగ్రెస్ పాలకులు రద్దు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్లు.. పేదలంతా బ్యాంకుల్లో అకౌంట్లు తెరిస్తే, బియ్యానికి ఇచ్చే సబ్సిడీని అందులో జమ చేస్తారు. అంటే, కుటుంబానికి ఇచ్చే 20 కిలోల బియ్యంపై కిలోకు రూ.5 వంతున రూ.100 ఆ కుటుంబ యజమాని అకౌంట్లో వేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. తద్వారా, సబ్సిడీ బియ్యాన్ని రద్దు చేసే విధంగా ఆ పథకం ఉంది. ఈ విధానాన్ని మేం ప్రతిఘటిస్తాం. పాలకుల కుట్రలను గ్రహించి మీరు కూడా అడ్డుకోండి'' అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పాదయాత్ర 20వ రోజైన ఆదివారం ఆయన కర్నూలు జిల్లా గూడూరు మండలం జూలకల్ నుంచి నడక సాగించారు.

గూడూరు గ్రామంలో ముస్లిం నేతలు ఎన్ఎండీ ఫరూక్, అల్లా బక్ష్ తదితరులు ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలకు 15 సీట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. చట్టసభల్లో 8 శాతం రిజర్వేషన్‌తోపాటు రూ.2,500 కోట్లు ముస్లింల అభివృద్ధికి కేటాయించి చరిత్ర సృష్టిస్తానని వెల్లడించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల సంక్షేమ పథకాలను రద్దు చేసిందని విమర్శించారు. మత సామరస్యానికి టీడీపీ కంటే కృషి చేసిన పార్టీలు ఏవీ లేవన్నారు. గోధ్రా ఘటనలో నరేంద్ర మోడీపై విమర్శలు వచ్చిన సమయంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని ఉంటే ముస్లింల మదిలో తాను చిరస్థాయిగా నిలిచిపోయే వాడినని చెప్పారు. ఆ విషయంలో తాను తప్పు చేశానని ముస్లింల ముందు ఒప్పుకొన్నారు. బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉందని విమర్శించారు.

నేను వెళ్లిన తర్వాత చర్చించండి.. వాస్తవమైతే నాతో రండి
"నాకు ఏ కోరికలు, ఆశలు లేవు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం చూశాను. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాను. మీ రుణం తీర్చుకోవాలని మీ ముందుకు వచ్చాను. కాంగ్రెస్ పాలకులు చేస్తున్న దోపిడీని వివరించి మిమ్మల్ని ఆలోచింప చేయడానికి పాదయాత్ర ప్రారంభించాను. నేను చెప్పిన విషయాలన్నీ విన్న మీరు నేను వెళ్లిన తర్వాత వాటిపై చర్చించండి. నేను చెప్పిన అంశాల్లో వాస్తవాలుంటే నాతో కలిసి రండి. ధర్మపోరాటం చేస్తున్న నాకు మద్దతు పలకండి. అవినీతి రహిత పాలనతోనే మీ కష్టాలు తీరతాయి'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా రాష్ట్రాన్ని దోచుకున్నారని, లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకున్న నేత 5 లక్షల కోట్ల సంపాదనే ధ్యేయంగా రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలని తాను 63 ఏళ్ల వయసులో కాళ్లు నొప్పి వస్తున్నా నడక సాగిస్తున్నానని వివరించారు.

టీడీపీ నగదు బదిలీ వేరు
తాను ప్రతిపాదించిన నగదు బదిలీ పథకానికి, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకానికి చాలా తేడా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ప్రతిపాదించిన నగదు బదిలీ పథకంలో ఇప్పటికే ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తీసివేయాలని అనుకోలేదని, వాటిని అలాగే ఉంచి, వాటికి అదనంగా మాత్రమే డబ్బులు ఇద్దామని అనుకున్నామని వివరించారు.

పాదయాత్రలో భాగంగా ఆదివారం ఆయన 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. "ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి పై స్థాయిలో జరుగుతున్న అవినీతిని అరికట్టడం ద్వారా కొంత ధనం ఆదా చేసి దానిని ప్రజలకు ఇవ్వాలనేది నా ఆలోచన. బియ్యం బదులు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచనే తప్పు. డబ్బులు ఇస్తే నేరుగా బ్రాందీ షాపులకు చేరతాయి. బియ్యం ఇస్తే నేరుగా ఇంటికి చేరతాయి.

అందువల్ల, పేదలకు ప్రయోజనం కల్పించే ఏ పథకంలోనూ మార్పులు చేయకుండా నగదు బదిలీ అమలు చేస్తాం. రైతులకు ఎరువులపై సబ్సిడీ తీసేసి, ఆ డబ్బులను బ్యాంకు అకౌంట్లో వేస్తామనేది కూడా తప్పుడు ఆలోచన'' అని వివరించారు. సబ్సిడీ భారం నుంచి తప్పించుకుని ఖర్చు తగ్గించుకునే పద్ధతిలోనే వాళ్లు ఆలోచిస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. తాము మాత్రం ప్రజలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాతే అదనపు ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు.

బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్‌కు భాగస్వామ్యం నేను వెళ్లాక చర్చించండి వాస్తవమైతే నాతో కలిసిరండి 20వ రోజు యాత్రలో చంద్రబాబు

చంద్రబాబు మీ కోసం పాదయాత్ర 21వ రోజు సోమవారం కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం కొత్తకోట సమీపంలోని పాలవాగు నుంచి ప్రారంభం కానుంది. ఉదయం పది గంటలకు పాలవాగు నుంచి బాబు పాదయాత్ర ప్రారంభమై 11.30 గంటలకు కొత్తకోట గ్రామానికి చేరుకుంటుంది. బాబు.. మరో రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి సుంకేసుల గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ జిల్లా రాజోలి చేరుకుంటారు. మార్గమధ్యంలో ఆయన రైతులు, కూలీల సమస్యలు తెలుసుకుంటారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్ 22.10.2012

 చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఆదివారం కూడా ఆయన కుమారుడు లోకేష్ పాల్గొన్నారు. గూడూరు మండలంలోని జూలకల్ గ్రామం నుంచి బాబు వెంటే నడిచారు. జూలకల్, గూడూరు గ్రామాల్లో చంద్రబాబు ప్రసంగాన్ని లోకేష్ శ్రద్ధగా విన్నారు. అలాగే లోకేష్‌తో పాటు చంద్రబాబు సోదరి కుమారుడు కె. ఉదయ్ కుమార్, మేనల్లుడు ఏ.కోదండరామనాయుడు పాదయాత్రలో పాల్గొన్నారు.

కాగా, రాష్ట్రంలో టీడీపీకి చెందిన యువత నిస్తేజంగా మారిందని, యువకుల చైతన్యానికి లోకేష్ నడుంబిగించాలని తెలుగుయువత ఉపాధ్యక్షుడు వై.నాగేశ్వరయాదవ్ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. యువకులను చైతన్యం చేసే భూమికను లోకేష్ చేపట్టి 2014 ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు.

అదివారం పాదయాత్రలో చంద్రబాబు వెంట లోకెష్ ...22.10.2012

బాబు యాత్రతో కొన్నిపనులు అవుతున్నాయ్!
ప్రజాభిప్రాయంలో ఆసక్తికర విషయాలు

  టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర గురించి ప్రజలేమనుకుంటున్నారు?... ఆయన చెప్తున్న విషయాలపై వారి స్పందన ఎలా ఉంది?...ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు చంద్రబాబు పాదయాత్ర మార్గంలో కొందరిని పలకరించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం చంద్రబాబు కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో పర్యటించారు. పాదయాత్ర మార్గంలోని జూలకల్లు, పొన్నేకల్లు, గూడూరు గ్రామాల్లో ప్రజలను పలకరించినప్పుడు ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

రాజు, రైతు(కోడుమూరు): చంద్రబాబు వచ్చినందుకు మాకిక్కడ కొన్ని పనులు అవుతున్నాయి. ఆయన వస్తున్నాడని తెలియగానే తుంగభద్ర ప్రాజెక్టు కోడుమూరు కాలువకు ఒకటన్నర దినం నీళ్లొదిలారు. ఆయన ఎమ్మిగనూరు దాటగానే నీళ్లు ఆగిపోయాయి. రెండు, మూడేళ్ల నుంచి నీరు వదలడం లేదు. ఇప్పుడెట్లా వదిలారు?. కౌలు రైతులకు కరువు నష్టపరిహారం ఇవ్వకుండా అనేక నెలల నుంచి తిప్పించుకుంటున్నారు.

చంద్రబాబు వచ్చి తిడతారని భయపడి ఇప్పటికిప్పుడు కొన్ని ఇస్తున్నారు. ఆయన వచ్చినందుకు మాకు మంచే జరిగింది. కోడుమూరు కాలువకు 10 రోజులు నీరిస్తే ఈ పంట బయటపడుతుంది. ప్రేమ్‌రాజు, బీఫార్మసీ విద్యార్థి(జూలకల్లు): చంద్రబాబు చెప్తున్న విషయాలు బాగానే ఉన్నాయి. జగన్ అవినీతి గురించి ఇప్పుడు బాబు చెప్పారు. రేపు ఆ పార్టీ వాళ్లు వాళ్లది చెప్తారు. ఎవరి వాదన వింటే వారిదే కరెక్ట్ అనిపిస్తోంది.

మాదమ్మ, వృద్ధురాలు(జూలకల్లు): చంద్రబాబు తండ్రి లెక్కన చానా వివరంగా చెప్పాడు. మకొచ్చేవన్నీ ఎలా తినేస్తున్నారో? బాగా చెప్పాడు. మాకొచ్చే పింఛన్లో రూ.150 ఇచ్చి మిగిలినవి నొక్కేస్తున్నారు. చంద్రబాబు ఈ సారి రూ.600 చేస్తామంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరే జనాలకు చేశారు. నేను జగన్‌ను చూడలేదు. మావాళ్లల్లో చంద్రబాబు మాటే వినిపిస్తోంది.

వెంకమ్మ, వృద్ధురాలు (పొన్నేకల్లు): చంద్రబాబు నడుస్తా వస్తున్నాడంటే చూద్దామని వచ్చాను. అయ్య కష్టపడి నడుస్తున్నారు. అందుకే వచ్చా. బ్యాంకు లోన్లు మాఫీ చేయిస్తాడని మా ఊళ్లో అనుకుంటున్నారు.

నూర్జాహాన్, పొన్నేకల్లు: చంద్రబాబు మంచిగా మాట్లాడాడు. మా ఊళ్లో కరువుతో చచ్చిపోతున్నాం. నీళ్లు లేవు. పంటలకు రేట్లు లేవు. చంద్రబాబు అయ్యే మాట్లాడారు. చెప్పినవన్నీ చేస్తే ఆయన చాల గొప్పోడు అవుతాడు. ఈ సారి ఆయనకు మద్దతిస్తే ఎట్లా ఉంటుందా? అనుకుంటున్నాం.

పెదగొల్ల ఎల్లప్ప, రైతు(గూడూరు): చంద్రబాబు తాను చేసిన తప్పులను తెలుసుకున్నట్లు కనిపిస్తోంది. రైతులకు ఈ సారి బాగా చేస్తానని చానా సేపు చెపుతున్నాడు. పంట పరిహారం రైతులకు అందడం లేదు. తినేస్తున్నారు. దాని గురించి కూడా చెప్పాడు.

షబ్బీర్, గూడూరు: కొన్ని రోజుల క్రితం వరకు మా ఊళ్లో జగన్ పార్టీ గాలి ఉండేది. ఆయన జైలుకు వెళ్లి రాకపోయేసరికి ఆ పార్టీ తగ్గింది. టీడీపీ మాట పెరుగుతోంది. రామారావు చేసిన పనులు ఆ పార్టీకి మంచిపేరు తెచ్చాయి. బాబు ఏమి చెప్తాడో విందామని ఇవాళ పనికి పోకుండా వచ్చా. ఆయన కోసం నిలబడి ఉన్నా.

గణేశ్, మాధవ్ (విద్యార్థులు-గూడూరు): చంద్రబాబు ఉపన్యాసం విన్నాం. ఆయన ఎవరెవరికీ ఏమేమిచేస్తాడో బాగా చెప్తూ ఉన్నాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం వల్ల ఈ సారి ఓటు ఆయనకేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. మేము పోయిన సారి కాంగ్రెస్‌కు వేశాం. పాదయాత్ర వల్ల చంద్రబాబు పార్టీ బలం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. జగన్ పార్టీ బలం మా ఊళ్లో తగ్గింది. జగన్ జైలు నుంచి రాకపోయేసరికి ఈ మధ్య మా ఊళ్లో కొంత మంది మళ్లీ ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.

బాబు యాత్రతో కొన్నిపనులు అవుతున్నాయ్! ప్రజాభిప్రాయంలో ఆసక్తికర విషయాలు 22.10.2012

20వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర పోటోలు...21.10.2012

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోడానికే మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్‌లో వైఎస్సార్‌సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని షర్మిల బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా అని సీతక్క సవాల్ విసిరారు.

తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన వైఖరి ఇప్పటికే చెప్పారని, 2008లోనే తాము తెలంగాణకు అనుకూలమని లేఖ రాసిన విషయాన్ని సీతక్క ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణపై స్పష్టతతో ఉన్న చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవడం సరికాదన్నారు. బాబు పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని ఆమె చెప్పారు.

వైఎస్సార్‌సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని షర్మిల బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా..? -సీతక్క సవాల్


ప్రెస్ నోట్ (21వ రోజు పాదయాత్ర రూట్)21.10.2012














chandrababu vastunna meekosam padayatra at kurnool dist_photos

19వ రోజు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర పోటోలు ( Part 2 ) )

చంద్రబాబు నేటి పాదయాత్ర షెడ్యూల్

  చంద్రబాబునాయుడు మీ కోసం పాదయాత్ర 20వ రోజు ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం జులకల్ గ్రామం నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. 11 గంటలకు పొన్నకల్లు గ్రామానికి చేరుకుంటుంది.

మధ్యాహ్నం 2 గంటలకు గూడూరు చేరుకుని బహిరంగ సభలో బాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్న భోజనం గూడూరులోనే చేసిన అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు మునగాల, 5 గంటలకు మల్లాపురం గ్రామానికి చేరుకుని ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం కొత్తకోట సమీపంలోని పాలవాగుకు 9.00 గంటలకు చేరుకుని అక్కడే రాత్రిబస చేస్తారు.

చంద్రబాబు నేటి పాదయాత్ర షెడ్యూల్ 21.10.2012