August 2, 2013


సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి మహానగరం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి, ఇది టిడిపి కొత్త నినాదం. సంక్షోభంలో సైతం రాజకీయ పక్షాలు అవకాశాలను వెతుక్కుంటాయి. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు అంశంతో సీమాంధ్రలో ఒకవైపు ఆందోళనలు సాగుతుండగా, టిడిపి నాయకులు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.
సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి నగరం కోసం చంద్రబాబు నాయకత్వం అవసరం అనే నినాదంతో తెలుగు యువత ప్రచార పోస్టర్లు రూపొందించి, అప్పుడే ప్రచారంలోకి తీసుకువచ్చారు. టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే ఈ ఎన్నికల వరకు తెలంగాణలో అధికారంలోకి రావడంపై టిడిపి పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. అయితే అదే సమయంలో విభజన అంశం వల్ల సీమాంధ్రలో అధికారంలోకి రావడానికి ఉపయోగించుకోవచ్చునని టిడిపి నాయకులు భావిస్తున్నారు.

ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హవా కనిపించి ఉండవచ్చు కానీ ఈ సంక్షోభ సమయంలో టిడిపి సరిగ్గా ప్రచారం చేసుకుంటే ఆ ప్రాంతంలో విజయం సాధించడానికి అవకాశం ఉందని టిడిపి నాయకులు చెబుతున్నారు. సాధారణంగా సీమాంధ్రలో ఎన్నికల్లో సామాజిక వర్గాల ప్రాధాన్యత ఎక్కువ. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు సాధారణ సమయంలో జరుగుతున్నవి కాదు కాబట్టి ఈసారి సామాజిక వర్గాల ప్రభావం తగ్గించడానికి ప్రయత్నించాలని టిడిపి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం హైదరాబాద్ నగరంలో ఐటి రంగంలో ఆయన సాధించిన ప్రగతిని ఎవరూ కాదనలేరని, ఇదే తరహా అభివృద్ధి సీమాంధ్రలో సాధ్యం కావాలంటే టిడిపి అధికారంలోకి రావాలనే నినాదంతో ఈసారి సీమాంధ్రలో ప్రచారం సాగిస్తామని టిడిపి నాయకులు చెబుతున్నారు.

సంక్షోభ సమయంలో బలమైన నాయకత్వం కావాలి, ఒక పార్టీ నేత జైలులో ఉన్నాడు, ఇక రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రజలకు చంద్రబాబు నాయకత్వం చారిత్రక అవసరం అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలోనే సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి రాజధాని ఏర్పాటు చేయడం సాధ్యం అనే ప్రచారం బలంగా జనంలోకి వెళితే టిడిపికి ప్రయోజన కరంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే సీమాంధ్రలో అభివృద్ధి సాధ్యం అని తెలంగాణకు చెందిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెబుతున్నారు.

దేశంలో నరేంద్ర మోడీతో పోటీ పడి అభివృద్ధి సాధించేవారు ఎవరైనా ఉన్నారా? అంటే ఒక్క చంద్రబాబు మాత్రమే కనిపిస్తారు, ఇలాంటి పరిస్థితిలో సీమాంధ్రకు బాబు నాయకత్వం అవసరం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించినా, కొత్త రాజధాని నిర్మాణంపై ఇప్పటి నుంచే దృష్టి సారించక తప్పదని అందుకే చంద్రబాబు నాయకత్వాన్ని సీమాంధ్ర ప్రజలు కోరుకుంటారని ఆయన తెలిపారు. 50 ఏళ్లలో హైదరాబాద్‌లో సాధించిన ప్రగతి సీమాంధ్రలో బాబు ఐదేళ్లలో సాధించి చూపిస్తారని టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు.

సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి మహానగరం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి!బాబుతోనే అభివృద్ధి సాధ్యం!

సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కొణకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, సీఎం రమేష్, సుజనా చౌదరిలు తమ పదవులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కొనకళ్ల నారాయణ అన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాజకీయ లబ్ది కోసం ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర విభజనపై స్పష్టమైన క్లారిటీ లేదని, ఏక పక్ష నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రజలు నష్టపోతున్నారని కొణకళ్ల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడ్డానికి ప్రజల్లోకి వెళ్ళి ఉద్యయం చేస్తామని, కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు.
సుజనా చౌదరి : కొన్ని కోర్టు ఖర్చు పెట్టి కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేసిందని, ఆ నివేదికలు చర్చకు పెట్టలేదని, ఈ రోజు కేంద్రం సొంత నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈనాడు కేంద్ర మంత్రుల రాజీనామాలు కూడా రాజకీయమేనని సుజనా చౌదరి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు అయి ఉండి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌కు ఎవరైనా రాజీనామాలు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్యపై చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఎం రమేష్ : 1999లో దివంగత మాజీ సీఎం వైఎస్ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని చెప్పి ఇప్పుడు రాష్ట్ర విభజనకు ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికే కేంద్ర నాటకం ఆడుతోందని సీఎం రమేష్‌పేర్కొన్నారు.
పార్లమెంటు సభ్యులుగా ఉండి ఏం చేయలేని పరిస్థితి ఉన్నందున తాము రాజీనామాలు చేస్తున్నామన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించకుండా డిగ్గీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేసేందుకు కేంద్రం దిగి వచ్చే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. వైయస్సే తెలంగాణకు అనుకూలమని కాంగ్రెసు పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. చర్చలు జరపకుండా కాంగ్రెసు తమ నిర్ణయాన్ని ప్రజల పైన రుద్దారన్నారు.

సీమాంధ్ర టీడీపీ ఎంపీల రాజీనామా