October 9, 2012

Neti padayatra


నేటి పాదయాత్ర (9.10.2012)

అడవి పందుల్లా కాంగ్రెస్ నేతలు
లక్షన్నర కోట్ల బడ్జెట్‌ను మేసేశారు
'ఉపాధి'ని దారిమళ్లించి పందికొక్కుల్లా మేశారు

ఇళ్ల స్వాహారాయుళ్లను జైలుకు పంపుతా
కాంగ్రెస్ నేతలూ.. ఖబడ్దార్
భవిష్యత్తులో రైతులకు కష్టాలు, కన్నీళ్లు ఉండవు
పవిత్ర యాత్రను ఆశీర్వదించండి

"ప్రజలు ఏమైనా చందమామను అడిగారా..? వైకుంఠాన్ని చూపమన్నారా..? కనీసం తాగేందుకు గుక్కెడు నీరివ్వలేని స్థితిలో ఉన్న వీరి పాలన ఎందుకు!? నీరు ఇవ్వలేరు.. కరెంటు సరఫరా చేయరు.. రోడ్లు వేయలేరు.. ఎందుకోసం పాలన సాగిస్తున్నారో అర్థం కాదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అక్రమార్కుల భరతం పట్టడానికే పాదయాత్ర చేపట్టానని ప్రకటించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, ప్రజలను చులకనగా చూస్తున్న కాంగ్రెస్ పాలకులారా.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలను వెలికి తీసి, స్వాహా చేసినవారిని జైలుకు పంపుతానని వ్యాఖ్యానించారు.

ఏడో రోజైన సోమవారం కళ్యాణదుర్గం నియోజకవర్గం కుర్లపల్లి క్రాస్ నుంచి చంద్రబాబు తన పాదయాత్రను ప్రారంభించారు. రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. బోయలపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సోమవారం ఏకంగా 12 గంటలపాటు పాదయాత్ర చేసి, 21 కిలోమీటర్లు ప్రయాణించి, నారాయణపురం క్రాస్ వద్ద బస చేశారు. రైతులు, మహిళల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. వేరుశనగ రైతు అంజినమ్మను పలకరించి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. టమాటా రైతు ఆంజనేయులు కష్టసుఖాలను తెలుసుకున్నారు.

మడకశిర ప్రాంతంలో సుమారు ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో వక్క తోటలు సాగు చేశామని, ఎడాపెడా విద్యుత్ కోతలతో లక్షలాది రూపాయల పంట కళ్లెదుటే ఎండిపోతోందని రైతులు మొర పెట్టుకున్నారు. ఇందుకు స్పందించిన బాబు వక్క రైతుల తరఫున ప్రభుత్వంపై పోరాటం చేసి ఆదుకుంటామన్నారు. తమ హయాంలో రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేసి, సబ్సిడీలు ఇచ్చి ఆదుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదవులను కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసే అడవి పందుల తరహాలో కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర సంపదను దోచేశారని మండిపడ్డారు. రైతు కష్టాలను తెలుసుకోవాలనే పాదయాత్ర చేపట్టానన్నారు.

మంత్రి రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు ఉండటం శోచనీయమన్నారు. భవిష్యత్తులో రైతులకు కష్టాలు, కన్నీళ్లు ఉండవని అభయమిచ్చారు. రైతుల పక్షాన పోరాటాలు చేసి, నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. రైతుల కోసం ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేసేది టీడీపీనే అన్నారు. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. "తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశా. నా అంత అనుభవం ఉన్న నాయకులెవరూ లేరు. అందుకే గత ఎన్నికల్లో నగదు బదిలీ వంటి వినూత్న పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టా'' అని చెప్పారు.

ఇందిరమ్మ పథకాన్ని పక్కదారి పట్టించిన కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఎవరికైనా అనారోగ్యం వచ్చిందంటే ఇక అప్పుల పాలు కావాల్సిందేనని, ఉపాధి హామీ పథకాన్ని దారి మళ్లించి కాంగ్రెస్ నాయకులు పంది కొక్కుల్లా మేశారని మండిపడ్డారు. నేరుగా ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి అనుకూలమైన పథకాలను రూపొందించాలన్న ఆశయంతో పవిత్ర యాత్రకు సిద్ధమయ్యానని, నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. "రాష్ట్ర ప్రజలు భవిష్యత్‌లో ఇబ్బందులు పడకూడదని సంస్కరణలు అమలు చేశా. ప్రతి నిరుపేద కుటుంబానికీ సంక్షేమ పథకాలు అమలు పరచాలనే లక్ష్యంతో పాలన సాగించా. బీసీల్లో ప్రతి కులానికి ప్రత్యేక పథకాన్ని రూపొందించా. మహోన్నత లక్ష్యంతో డ్వాక్రా సంఘాలను తయారు చేశా. కానీ, ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానన్న రాజశేఖర్ రెడ్డి వారిని భిక్షాధికారిని చేశారు'' అని ధ్వజమెత్తారు.

పాదయాత్ర Day 7 (8.10.2012)







Padayatra photos 7th Day 08.10.2012

పాదయాత్ర పోటోలు ఏడవ రోజు 08.10.2012

ప్రెస్ నోట్

ప్రెస్ నోట్ 08.10.2012