February 1, 2013

ఈ రాష్ట్రంలో యువత కోసం నేను కన్న కలలన్ని కల్లలయ్యాయి. వాళ్లకు బంగారు భవి ష్యత్తు ఇవ్వాలని నేను వేసిన పునాదులు చెదిరిపోయాయి. రాష్ట్రానికి సీఎంలా కాదు, ఒక సీఈ వోలా వ్యవహరిస్తున్నాడంటూ అప్పట్లో నన్ను ఎగతాళి చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అయి ఉండి ఫైళ్లు చంకలో పెట్టుకొని దేశ,విదేశాలు తిరిగాను. ఎవరికోసం? న్యూయార్క్ వంటి నగరంలో వీధుల్లో నడుచుకుంటూ వెళ్లాను.

ఎందుకోసం? ఈ రాష్ట్రం, ఈ విద్యార్థుల కోసమేకదా? ఈ రాష్ట్రానికి ఏమి అవసరం..చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలంటే ఏమి చేయాలంటూ శాశ్వత ఆలోచనలు చేశాను. నిరుద్యోగాన్ని తొలగించడానికే కాదు.. నాణ్యమైన కొలువులను రాష్ట్రానికి తెచ్చుకునేందుకూ పరితపించాను. మారుతున్న ప్రపంచ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏఏ రంగాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయో ముందుచూపుతో గ్రహించి అందుకు తగిన విద్యను ప్రోత్సహించాను.

పాదయాత్రగావెళ్లి ఒక ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతుండగా ఇదంతా గుర్తుకు వచ్చి, గుండె కలుక్కుమంది. "సార్! మీ హయాంలో మా గురించి పట్టించుకున్నారు. ఏది చేసినా మా విద్యకూ, ఉపాధికే ప్రాధాన్యమిచ్చి, విధానాలు రూపొందించారు. అప్పటి మీ భరోసాతో ఐటీలో భవిష్యత్తు ఉంటుందని ఆ కోర్సును ఎంచుకున్నాను. ఇప్పుడు చదువులు పూర్తవుతున్నాయి. కానీ, ఉద్యోగం దొరికే పరిస్థితి కనిపించడం లేదు'' అని ఓ విద్యార్థిని ఆవేదన చెందింది.

"ఎలాగైనా మిమ్మల్ని గెలిపించుకుంటాం. మాకు ఉద్యోగాలు గ్యారంటీ ఇస్తారా'' అని ఆ చెల్లెలు అడుగుతుంటే, ఆ కళ్లలో భవిష్యత్తు పట్ల బెంగ కనిపించింది. వీళ్లను చూస్తుంటే.. ఇది నేను అభివృద్ధి చేసిన రాష్ట్రమేనా అని అనుమానం కలుగుతోంది. విద్యకు పెద్దపీట వేసిన ఆ కాలం ఛాయలు ఇప్పుడెక్కడ? అన్నదాత బిడ్డలను కూడా ఐటీ నిపుణులుగా మార్చిన ఘనత మాది. ఇప్పుడు ఏ వర్గానికీ విలువ లేదు. చదువుకు ఇది చేటుకాలమే!

చదవులకిది చేటు కాలం!

పట్టించుకోకుంటే మీకూ అదే పరిస్థితి
పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్య
ఎవరితో కలిసేది లేదని స్పష్టీకరణ

  'సహకార ఎన్నికల్లో కిందిస్థాయి నేతలకు పదవులు వస్తాయి. వారిని ఈ ఎన్నికల్లో గెలిపించడానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు గట్టి ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే తర్వాత వారు మీ కోసం పనిచేస్తారు. మీరు పట్టించుకోకపోతే తర్వాత వాళ్లూ మిమ్మల్ని పట్టించుకోరు. ఈ విషయం గుర్తుంచుకొని పనిచేయండి' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అనేక జిల్లాల్లో పార్టీ నేతలు సహకార ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలివిడత ఎన్నికల్లో ఊహించినదానికన్నా పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చినందుకు పార్టీ నేతలను అభినందిస్తూనే నేతలు గట్టి ప్రయత్నం చేసి ఉంటే ఫలితాలు ఇంకా బాగుండేవన్నారు. మంచి ఫలితాలు తెచ్చిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నేతలను ఆయన ప్రశంసించారు. ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా ఉన్నా ఆ స్థాయిలో ఫలితాలు కనిపించనందుకు మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాల నేతలకు చురక వేశారు.

అంతర్గత తగాదాలు మాని పార్టీ పని కూడా చేయాలని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సహకార ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పనిచేసే సమస్య లేదని, టీడీపీ ఒంటరిగానే పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని పార్టీనేత ఎర్రబెల్లి దయాకరరావు చేసిన ప్రకటన ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. 'మనం ఎవరితోనూ కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. మన పని మనం చేద్దాం. మన దారిలో మనం వెళ్దాం. ఇలాంటి ప్రకటనలు చేయొద్దు' అని ఆయన సూచించారు.

వరంగల్ జిల్లాలో పార్టీకి చాలా పెద్ద నాయకులు ఉన్నారని, కానీ ఆ స్థాయిలో ఫలితాలు కనిపించట్లేదని అన్నారు. కాగా.. అంతకుముందు వరంగల్ జిల్లా తొర్రూరులో టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తొర్రూరులో ఏ పార్టీకీ సరైన మెజారిటీ రాలేదని, చైర్మన్ ఎంపిక కోసం టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. తమకు పదవులు అక్కర్లేదని, తొలివిడతలో టీఆర్ఎస్‌కు బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కాగా.. తమ పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి సహకార ఎన్నికల తొలివిడత ఫలితాలు అద్దం పట్టాయని టీడీపీ వ్యాఖ్యానించింది.

తొలి విడతలో టీడీపీ ఖాయంగా గెలుస్తుందనుకొన్న 90 సొసైటీల్లో ఎన్నికలపై ప్రభుత్వం స్టే ఇచ్చిందని, అలా ఇవ్వకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి, మీడియా విభాగం చైర్మన్ ప్రసాద్ చెప్పారు. 'తొలి విడతలో మాకు 408 సొసైటీలు వచ్చాయి. కాంగ్రెస్‌కు 544 వచ్చాయి. స్టేలు ఇచ్చిన సొసైటీల్లో ఎన్నికలు ఉంటే మా సంఖ్య కనీసం 490 అయ్యేది. మా సమాచారం ప్రకారం వైసీపీకి 172, టీఆర్ఎస్‌కు 51 వచ్చాయి' అని పెద్దిరెడ్డి వివరించారు.

టీఆర్ఎస్‌కు బేషరతు మద్దతు: ఎర్రబెల్లి

చంద్రబాబును ప్రశ్నించిన విద్యార్థినులు

"సార్.. మీరు హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. ఐటీ పార్క్‌ను తెచ్చి ఐటీ, కంప్యూటర్ ఇంజనీర్ కోర్సులు చేయడానికి మాలో ఉత్సాహం నింపారు. మీ ప్రోద్బలంతో ఉద్యోగాలు వస్తాయని మేము చదువుకుంటున్నాం. ఇప్పుడేమో తెలంగాణ సెంటిమెంట్ వాదానికి మీరు ఒప్పేసుకున్నారు. నాలాంటి వారు ఇంక ఎక్కడ ఉద్యోగాలు చేయాలి. మా పరిస్థితి ఏమిటి?'' ..చంద్రబాబు ఎదుట ఓ బీటెక్ విద్యార్థిని ఆవేదన ఇది.

తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన బాబుపై విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ సహా అనేక విషయాలపై ఆయన అభిప్రాయాలను రాబట్టారు. బాబు పాదయాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లినప్పుడు జరిగిన ఘటన ఇది. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ చంద్రబాబు ఇప్పటికే వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో.. గీతాంజలి అనే (బీటెక్ 4వ సంవత్సరం) విద్యార్థిని ముందుకొచ్చి, హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి పనులు చేపట్టారని, ఇలాంటప్పుడు తాము ఎక్కడకు పోవాలని ఆవేదనతో ప్రశ్నించారు.

"సీఎంగా చేసిన సమయంలో హైదరాబాద్‌లో బాండ్ విడ్త్ లేక అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్ సంస్థలేవీ రాలేకపోయాయి. ఆ లోపాన్ని అధిగమించేందుకు హైదరాబాద్‌కు కనెక్టివిటీని అభివృద్ధి చేసి సాఫ్ట్‌వేర్ సిటీగా చేయగలిగాను. హైదరాబాద్ తరువాత విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలకూ కనెక్టివిటీ తీసుకొచ్చి ఐటీ పార్క్‌లుగా అభివృద్ధి చేస్తున్న దశలోనే ఎన్నికలొచ్చిఓడిపోయాం'' అని బాబు బదులిచ్చారు. విజయవాడలో సాఫ్ట్‌వేర్ టెర్మినల్ పార్క్‌ను తమ హయాంలో తలపెట్టగా, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకొనేలేదన్నారు.

"మీ ఊళ్లలోనే మీరు ఉద్యోగాలు చేయాలనేది నా కోరిక'' అని వ్యాఖ్యానించారు. తమ హయాంలో నాలెడ్జ్ పార్క్‌లకు ప్రాధాన్యమిచ్చామని, దానివల్ల లక్షల మందికి సాంకేతిక రంగంలో ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయని, ఉద్యోగాలు రావడం తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం దేశం మార్పు దశలో ఉన్నదని, ఇప్పుడు అవినీతిని ఎదుర్కోలేకపోతే ఆఫ్రికాలాగా అయిపోతామని హెచ్చరించారు. టీడీపీని అధికారంలోకి తెస్తామని యువతీ యువకులు మాటలు చెబితే చాలదని, రోడ్డెక్కి ప్రజలను అవినీతిపై చైతన్యం చేయాలని కోరారు.

హైదరాబాద్‌ను ఇచ్చేస్తే.. మా గతేమిటి సార్..!

పంచభూతాలూ ఫలహారమే
వాళ్లొస్తే ఇంటి కప్పులూ మిగలవు!
నాసిరకం బొగ్గు కొనుగోలుతోనే కరెంటు కష్టాలు
పింఛను డబ్బుల్లోనూ సగం తిన్నారు
ఓడించి ఇంటికి పంపితేనే జన న్యాయం
పాదయాత్రలో జగన్, కిరణ్‌లపై చంద్రబాబు ధ్వజం

అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే లక్ష కోట్లు తిన్న జగన్‌ను అధికారంలోకి తెస్తే, ఇళ్ల కప్పులూ ఉండవని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి అవినీతిపరులకు ఓటు వేస్తే పంచభూతాలను సైతం ఫలహారంగా మింగేస్తారని హెచ్చరించారు. గజదొంగలతో చంచల్‌గూడ జైలు కిటకిటలాడుతోందని, మంత్రులూ అక్కడకే పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం మూలపాడు నుంచి ఆయన శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు.

కిలేశపురం గ్రామంలో గౌతమ బుద్ధుడు, అల్లూరి సీతారామరాజు, మదర్ థెరెస్సా, మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ, సుభాశ్ చంద్రబోస్ వంటి మహానుభావుల వేషధారణల్లోని చిన్నారులను అభినందించారు. మహానుభావుల వేషాలు వేశారేగానీ, ఎవ్వరూ అవినీతిపరుల వేషాలు వేయలేదంటూ మెచ్చుకున్నారు. కాంగ్రెస్, వైసీపీలు ప్రజారక్షక పార్టీలు కావని, ప్రజాభక్షక పార్టీలని దుయ్యబట్టారు. జైల్లో ఉంటూనే జగన్ రాజకీయం చేస్తున్నాడని దుయ్యబట్టారు. " తండ్రిని అడ్డంపెట్టుకుని రూ.లక్ష కోట్లు సంపాదించిన వాడికి ఓట్లేసి అధికారం అప్పగిస్తే ఏమౌవుతుందో ఆలోచించండని కోరారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇక్కడ రాష్ట్రంలో గానీ అక్కడ కేంద్రంలోగానీ ప్రజా సమస్యలు తగ్గకపోగా మరింత పెరిగాయని చెప్పుకొచ్చారు. కిరణ్ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇంటికి పోతే తప్ప రాష్ట్ర ప్రజలకు న్యా యం జరగదన్నారు. కేంద్ర ప్రభుత్వం పింఛన్‌కు రూ.400 ఇస్తే అందులో రాష్ట్రం ప్రభుత్వం రూ.200 నొక్కేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదక కర్మాగారాలకు నాసిరకం బొగ్గు కొనుగోలు చేయడంవల్లే కరెంట్ కష్టాలొచ్చాయని ఆరోపించారు.

బాబు చెప్పిన మొసలి కథ!
పిట్టకథల రూపంలో, పామర భాషలో చంద్రబాబు.. ప్రజలకు అవినీతిపై అవగాహన కల్పించే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం కిలేశపురం గ్రామంలో.. " వైసీపీ నేతల మొసలి కన్నీటికి కరిగి ఓటేస్తే మిమ్మల్నే తినేస్తారు'' అంటూ 'అవినీతి మొసలి' కథ వినిపించారు. "ఓ మొసలి ఏటి ఒడ్డున నోరు తెరుచుకుని కన్నీరు కారుస్తోంది.

అటుగా వచ్చిన జంతువులు అది ఎందుకలా ఏడుస్తున్నదో అర్థం కాక.. దాని దగ్గరకెళ్లి ఎందుకు ఏడుస్తున్నానని అడిగాయి. అది బాధ నటిస్తూ "నోట్లో ఎముక గుచ్చుకుంది. దాన్ని తీస్తే నా నొప్పి పోతుంద''ంటూ నమ్మబలికించింది. నమ్మిన జంతువులు ఎముక తీసేందుకు మొసలినోట్లోకి అడుగువేశాయి. అలా వేసిన దానిని వేసినట్లే మొసలి తినేసింది'' అని చెప్పారు.

అసెంబ్లీకి వెళ్లకుండానే లక్ష కోట్లు.. అధికారానికొస్తేనో..

'సీబీఐ పెట్టిన కేసులో నిందితునిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటే ముఖ్యమంత్రి పట్టుబట్టి ఆపారు. ఇప్పుడు అదే మంత్రి బోనెక్కి చేతులు కట్టుకొని న్యాయ మూర్తి ముందు తల వంచి నిలబడితే ప్రభుత్వం పరువు పోలేదా? అవినీతిపరులను కాపాడటానికి ఈ సీఎంకు అంత ఆరాటం ఎందు కు?' అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ నేతలు రావులపాటి సీతారామారావు, కంభంపాటి రామ్మోహ నరావు గురువారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

ఏ రోజు ఏ మంత్రి జైలుకు వెళ్తాడో తెలియని పరిస్థితి నెలకొందని రావులపాటి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సమావేశాలను చంచల్‌గూడ జైలులో పెట్టుకొనే రోజు దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలి మంత్రులు ఆంధ్రా, తెలంగాణ పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కాలం గడుపుతున్నారని, విద్యుత్, ఆర్టీసీ వంటి చార్జీలు వడ్డించడానికే మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయని కంభంపాటి రామ్మోహనరావు విమర్శించారు.

గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని ఆధార్‌తో లంకె పెట్టడాన్ని టీడీపీ నేతలు నిరసించారు. సిలిండర్‌కు వెయ్యి రూపాయలు ముందు వసూలు చేసి తర్వాత సబ్సిడీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామనడం పిచ్చి తుగ్లక్ వ్యవహారం మాదిరిగా ఉందని విమర్శించారు. కాగా.. తన పాదయాత్రను శ్రీకాకుళంలోనే ముగించాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారని, అన్నీ అనుకూలిస్తే అలాగే జరుగుతుందని కంభంపాటి రామ్మోహనరావు పేర్కొన్నారు.

మంత్రి బోనెక్కితే పరువు పోలేదా!: టీడీపీ

తొలి దశలో ఫర్యాలేదంటున్న నేతలు
సహకార ఎన్నికల్లో వైసీపీ గాలి అంతంతే

సహకార ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో ప్రాథమిక సమాచారం ప్రకారం ఐదు జిల్లాల్లో టీడీపీ ఆధిక్యం సాధించింది. వివిధ జిల్లాల నుంచి ఫలితాల సమాచారం సేకరించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ వర్గాలు ఈ విషయం తెలిపాయి. ఖమ్మం, రంగారెడ్డి, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు ఈ సమాచారం సూచిస్తోంది. రాయలసీమ మినహా మిగిలిన చోట్ల అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. సీమలో మాత్రం వైసీపీ - కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కోస్తా, తెలంగాణల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంది. తెలంగాణలో రెండు మూడు జిల్లాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య నెలకొంది.

ఈ ఎన్నికల్లో తమ పార్టీ పనితీరు ఫర్వాలేదని, ఈ ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఐదు జిల్లాల్లో ఆధిక్యం రావడం గొప్ప విషయమని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. "సహకార ఎన్నికల్లో సాధారణంగా అధికారపార్టీనే గెలుస్తుంది. అధికారులు వారి చేతిలో ఉండటం వల్ల తమవారిని అధికసంఖ్యలో సభ్యులుగా చేరుస్తారు. ఈ పరిస్ధితుల్లో కూడా మేం ఇన్ని సీట్లు సాధించడం మాటలు కాదు.'' అని టీడీపీనేత ఒకరు పేర్కొన్నారు. సీమాంధ్రలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో ఆ ఊపును చూపించలేకపోవడం ఆ పార్టీ బలహీనపడుతోందనడానికి నిదర్శనంగా కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు.

"సీమాంధ్రలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా జగన్ పార్టీ ప్రభంజనం వీస్తుందని చాలామంది భావిస్తారు. అది నిజం కాదని ఈ ఎన్నికల్లో రుజువైంది. కాంగ్రెస్ మరీ బలహీనపడలేదని, కొంత నిలదొక్కుకోగలుగుతోందని కూడా ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ గాలి అంత ఎక్కువ లేదన్న విషయం కనిపిస్తోంది.'' అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. తెలంగాణలో రెండు జిల్లాల్లో, కోస్తాలో మూడు జిల్లాల్లో తాము ఆధిక్యంలో నిలవడం టీడీపీ నేతలకు సంతృప్తినిస్తోంది.

ఐదు జిల్లాల్లో టీడీపీ ఆధిక్యం

తొలివిడత సహకార ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు పట్టు నిలుపుకొన్నారు. కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాల్లో గురువారం సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. పీలేరు పరిధిలో ఆరు సహకార సంఘాలకు నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దశలోనే పీలేరు, కె.వి.పల్లె, కలికిరి సహకార సంఘాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన కలకడ, వాల్మీకిపురం, గుర్రకొండ మండలాల పరిధిలోని సహకార సంఘాల్లో అత్యధిక వార్డులు ఏకగ్రీవం కాగా.. కొన్ని వార్డులకు మాత్రం ఎన్నికలు జరిగాయి. వాటిలో ఎక్కువ స్థానాలు సాధించడంతో.. ఈ మూడు సంఘాలు కూడా కాంగ్రెస్ పరమయ్యాయి. ఇక చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఇవే తరహా ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు ఈ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోకున్నా నియోజకవర్గంతో పాటు పక్కనున్న పలమనేరు నియోజకవర్గంలో కూడా టీడీపీ ఆధిక్యత సాధించడం గమనార్హం. కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె సహకార సంఘాలను టీడీపీ కైవసం చేసుకుంది.

పునర్విభజనకు ముందు వరకు కుప్పంలో అంతర్భాగంగా ఉండి ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గంలో కలిసిన వి.కోట మండల పరిధిలో జరిగిన రెండు సహకార సంఘాల ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించింది. దాంతో పాటు పలమనేరు సహకార సంఘ ఎన్నికల్లో టీడీపీ ఆరు వార్డులు గెలుచుకుంది. ఈ సంఘం పరిధిలో వైసీపీ ఆరు వార్డులు, కాంగ్రెస్ ఒక వార్డు గెలుచుకున్నాయి. అధ్యక్ష ఎన్నికలో కాంగ్రెస్ సభ్యుడు టీడీపీకి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన సంఘాల్లో మూడింట రెండొంతుల సంఘాలు టీడీపీ ఖాతాలో జమవుతాయి.

సొంత ఇలాకాలో పట్టు నిలుపుకొన్న కిరణ్, చంద్రబాబు

(మచిలీపట్నం) జిల్లాలో తొలిదశ సహకార ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మచిలీపట్నం, విజయవాడ డివిజన్లలోని 89 సొసైటీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. 95.25 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. డ్రా సందర్భంగా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో మొత్తం 424 సొసైటీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 18 సొసైటీలలో స్టే ఉత్తర్వులతో ఎన్నికలు ఆగిపోయాయి. మొత్తంగా 226 సొసైటీలు ఏకగ్రీవం కాగా 180 సొసైటీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వీటిలో 89 సొసైటీలకు గురువారం ఎన్నికలు జరగ్గా, మిగిలిన గుడివాడ, నూజివీ డు డివిజన్‌లోని 91 సొసైటీలకు రెండో విడతలో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. స్వల్ప సంఘటనలు మినహా గురువారం తొలిదశ ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నా రు. డ్రా సందర్భంగా ఇబ్రహీంపట్నం కొటికలపూడి, బందరు మండలం చిలకలపూడిలో స్వల్ప వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి.

ఏకగ్రీవాలతో టీడీపీ ఆధిక్యం తొలిదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకుని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. 105 సం ఘాలు ఏకగ్రీవం కాగా, వీటిలో 39 సంఘాలను కైవసం చేసుకున్న టీడీపీ మద్దతుదార్లు గురువారం జరిగిన ఎన్నికల్లో 29 చోట్ల విజయం సాధించారు. వీరి సంఖ్య మొత్తంగా 68కి చేరింది. కాంగ్రెస్ మద్దతుదార్లు ఎన్నికల్లో 35 చోట్ల గెలుపొందగా, ఏకగ్రీవాలలో 24 సొసైటీలు పొంది 59 స్థానాలకు చేరారు. వైఎస్సార్ సీపీ ఏకగ్రీవాలలో 27, ఎన్నికలలో 22 సొసైటీలను పొందగలిగింది.

వామపక్షాలు మూడు సొసైటీలను కైవసం చేసుకోగా, ఇతరులు 15 చోట్ల ఉన్నారు.నేడు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక తొలిదశలో గెలుపొందిన అభ్యర్థులలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. సొసైటీ ఎన్నికల అధికారి సమక్షంలో ఈ ఎన్నికలు జరుగుతాయని డీసీవో రమేష్‌బాబు తెలిపారు. సొసైటీ మినిట్స్ బుక్‌లో కార్యవర్గాన్ని నమోదు చేసి ధ్రువీకరించడం జరుగుతుందన్నారు.

సహకార పోరులో ఏకగ్రీవాలతో టీడీపీ ఆధిక్యం

'నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలల వ్యవధిలోనే విజయవాడ నగరాన్ని దేశంలోనే ఇన్‌ఫర్‌ర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) హబ్‌గా మారుస్తా' నని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో సాఫ్ట్‌వేర్ టె క్నాలజీ పార్క్ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశానని, ఇక్కడ ఏర్పాటు చేసిన ఐటీ పార్క్ కూడా విద్యార్ధులకు సరైన సేవలందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర పునః ప్రారంభం అయిన వెంటనే గురువారం పరకాలలోని ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ఓ పెట్రోల్‌బంకులో ముఖాముఖి నిర్వహించారు. ముందు గా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అధికారం లో ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను నాలెజ్జ్ రాష్ట్రంగా తయారు చేశానన్నారు. ఐఐటీ, ఐఐఎం, సివిల్స్ వంటి పోటీ పరీక్షల్లో మన రాష్ట్రం నుంచి ప్రతి ఏటా 30 శాతం మంది ఎంపికయ్యేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ రాషా ్ట్రన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్థ పాలన నడుస్తోందని దీనికి యువతే చమర గీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం పూర్తిగా బాగుపడే వరకూ తాను అవిశ్రాంతంగా కృషి చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తానన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలను సక్రమంగా విద్యార్థులందరికీ అందేలా చూస్తానని ఆయన హామీనిచ్చారు. యువత రాష్ట్రంలోని అవినీతిపరుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

విజయవాడను ఐటీ హబ్ చేస్తా!

  కష్టకాలంలోనే డీలా పడకుండా ధైర్యంగా ఉండాలని.. త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. మహిళల కష్టాలు తొలగడం తథ్యం.. అని అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన జిల్లా తెలుగు మహిళ నాయకురాలు తంగిరాల పద్మావతి ఆధ్వర్యంలో పలువురు మహిళలు చంద్రబాబును కల్సి సమస్యలను ఏకరవుపెట్టారు. విద్యుత్ సరఫరా లేక చీకట్లో మగ్గాల్సి వస్తుందని, బిల్లులు మాత్రం వేలల్లో వస్తున్నాయని వాపోయారు. రోజంతా కష్టపడితే వచ్చే కూలితో ఒక పూట గడవటం కష్టంగా ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో లేవని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి బాధలు విన్న చంద్రబాబు టీడీపీ అధికారంలోకి మీ సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు.

తొలుత బస్సు నుంచి చంద్రబాబు బయటకు రాగానే పరిటాలకు చెందిన చింతల కృష్ణకుమారి, డాక్టర్ పసుపులేటి వీరాస్వామి గుమ్మడికాయతో దిష్టి తీశారు.గ్రీన్‌వేలో మొక్క నాటిన చంద్రబాబు.... క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రతి ఒక్కరూ పాటుపడాలని చంద్రబాబు కోరారు. పరిటాల వద్ద జాతీయ రహదారి పక్క న ఉన్న గ్రీన్‌వేలో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న సంగతి విదితమే. అందుకు గుర్తుగా గ్రీన్‌వే సంస్థ ఎండీ సాదినేని సురేష్‌బాబుతో కలిసి ఎర్రచందనం మొక్కను నాటారు. 'ఏపీయూడబ్ల్యూజే' డైరీ ఆవిష్కరణ... ఏపీయూడబ్ల్యూజే జిల్లా యూనిట్ 2013 డైరీని చంద్రబాబు ఆవిష్కరించారు. శిబిరం వద్ద గురువారం బాబు, యూనియన్ నాయకులతో కలిసి డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చావా రవి, నగేష్, గంగిరెడ్డి రంగారావు, వెంకట్రావు, విజయకుమర్ పాల్గొన్నారు. ఫోటో షెషన్ చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు తదితరులు పోటీపడ్డారు.

ఆయన ఎంతో ఓపికగా సుమారుగా రెండు గంటల సేపు ఫోటో షెషన్‌లో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి ఆయనతో వెన్నంటి ఉంటూ పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, వంటవాళ్లు, వ్యక్తిగత సహయకులు, సెక్యూరిటీ సిబ్బంది, ఇతరత్రా వర్కర్లు రేయింబవళ్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న ప్రతి వాహనం వద్దకు వెళ్లి చిన్న పెద్ద అనే తేడా ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలుకరిస్తూ, వారి భుజాలపై చేతులు వేసి ఫోటోలు దిగారు.

అధికారం ఖాయం..బాధలే తొలగడం తథ్యం

రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. చంద్రబాబు వస్తేనే పాలన గాడిలో పడుతుందని అభిప్రాయపడ్డారు. పరిటాల శిబిరం వద్దకు గురువారం వచ్చిన వడ్డే, అధినేత చంద్రబాబును కల్సి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హాయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాల వల్ల అన్ని వర్గాలవారికి ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవటంతో పాటుగా టీడీపీ హాయాంలో జరిగిన అభివృద్ధి గురించి పాదయాత్రలో వివరించాలని, కరపత్రాల రూపంలో ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబుకు సూచించనట్టు వడ్డే చెప్పారు.

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం


ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే.. దోచుకున్న డబ్బును దాచుకునేందుకు షర్మిల పోటీ పాదయాత్ర చేస్తున్నదని సినీ నటి, తెలుగు మహిళా నాయకురాలు కవిత అన్నారు. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆచంట సునీతతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. అవినీతిని ప్రోత్సహిస్తున్న వారే జగన్‌ను కలుస్తున్నారన్నారు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించగల సత్తా, సమర్ధవంతమైన నాయకత్వం ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేలా తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు

దోచ్చుకున్న డబ్బును దాచుకునేందుకు షర్మిల పాదయాత్ర:కవిత