October 16, 2012

బెల్టు షాపులు బంద్
అధికారంలోకి వస్తే వాటిని మూసేయిస్తాం..
రుణ భారం నుంచి డ్వాక్రా మహిళలకు విముక్తి

ముస్లింలకు 8% రిజర్వేషన్లు..
వృద్ధులకు రూ.600 పింఛన్..
నియోజకవర్గానికో వృద్ధాశ్రమం
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్..
ఆదరించండి.. అండగా నిలుస్తా
"మళ్లీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులు ఎత్తేస్తా. డ్వాక్రా మహిళలను రుణ భారం నుంచి విముక్తులను చేస్తా. రాష్ట్రంలోని ముస్లింలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పిస్తా'' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పాదయాత్ర 14వ రోజు ఆయన తన శైలిని మార్చారు. పక్కా మాస్ లీడర్ అవతారమెత్తారు. ఆయన భాష, వ్యవహార శైలితో కొత్త చంద్రబాబును చూపిస్తున్నారు. పూరి గుడిసెల్లో అడుగు పెట్టి నిరుపేదల జీవితాల్లోకి తొంగి చూశారు. ఇటు నిరుపేదలు, అటు ప్రయాణికుల కష్టసుఖాలను తెలుసుకున్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలను కడతేరుస్తానని హామీ ఇస్తూనే.. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్, వైసీపీలను తూర్పారబట్టారు.

  "గ్రామాల్లో బెల్టుషాపులు మహిళల పాలిట రాక్షసుల్లా మారాయి. గ్రామాల్లో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. కానీ, మద్యం మాత్రం పుష్కలంగా లభిస్తోంది. మేం అధికారంలోకి వస్తే, బెల్టు షాపులను రద్దు చేస్తాం'' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తమ పాలనలో మహిళలను మహారాణులుగా చేసే పథకాలను ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఇబ్బందుల్లోకి నెట్టిందని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలు రుణ భారంతో సతమతమవుతున్నారని, వారి భారాలను తగ్గించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ముస్లింలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

పాదయాత్ర 14వ రోజైన సోమవారం ఆయన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించారు. చిప్పగిరి మండలం బస్సన్నబావిలో ఉదయం పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు.. 17.5 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించి ఆలూరు జూనియర్ కాలేజీలో బస చేశారు. పాదయాత్రలో వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ లేని వృద్ధులను గుర్తించి వృద్ధాశ్రమంలో చేర్పించే బాధ్యతను టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. రైతు రుణాల మాఫీ బాధ్యత తనదేనన్నారు. క్లిష్టదశలో ఉన్న సేద్యానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు.

"పాదయాత్రలో రోజుకు సగటున 20 కిలోమీటర్లు నడుస్తూ 12 గంటలపాటు నిలబడుతున్నాను. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే హైదరాబాద్‌లో ఉండలేక ప్రజలతో మమేకమవడానికి పాదయాత్ర చేపట్టాను. నిండు మనసుతో ఆదరిస్తే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తాను'' అని వ్యాఖ్యానించారు. తన హయాంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బతికానని, భవిష్యత్తులో అవకాశం ఇస్తే నీతివంతమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తన బాట పూలబాట కాదని, ముళ్లపై నడకేనని చంద్రబాబు అన్నారు. పదవుల కోసం తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లలో ప్రజలకు దక్కాల్సిన సంపద కొందరికే పరిమితమైందన్నారు. పాపం పంచుకున్న చాలా మంది నేతలు జైళ్లపాలైన విషయాన్ని గుర్తు చేశారు. అంత ఆశ ఎందుకు? అన్ని ఇబ్బందులు ఎందుకు!? జైలులో కూర్చోవడం ఎందుకంటూ వైసీపీని పరోక్షంగా విమర్శించారు.

గుండె తరుక్కుపోతోంది
కర్నూలు జిల్లాలోని చిప్పగిరి, ఆలూరు ప్రాంతాల్లో ప్రజల బాధలు చూసి గుండె తరుక్కుపోతోందని, నోట మాట రావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వానా కాలంలోనూ సాగు నీరు అందక అల్లాడుతున్నారని, పొలాల్లో పంటలు లేక పేరుకు పోతున్న అప్పులను తీర్చుకోలేక జీవచ్ఛవంలా బతుకుతున్నారని చెప్పారు. నిండు మనసుతో తనను ఆశీర్వదించాలని కోరారు. అవినీతిపరులకు ఓట్లు వేయకపోతే టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు.

ాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా పాదయాత్ర చేస్తున్నారంటూ తనను విమర్శించడానికి ముందు, సోనియా అల్లుడు వాద్రాపై వస్తున్న కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై ఎందుకు నోరు మెదపడం లేదని వైసీపీ నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. తాము అవిశ్వాస తీర్మానం పెడితే, దానిని కేంద్రానికి బూచిగా చూపించి చంచల్‌గూడ జైలు నుంచి జగన్‌ను బయటకు తీసుకు రావడానికి ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. జగన్‌ను కాపాడుకునేందుకు ఆయన తల్లి, చెల్లి ప్రయత్నాలు ముమ్మరం చేశానని చెప్పారు. ధర్మాన్ని, అధర్మాన్ని గుర్తించి సమర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకపోతే కష్టాల్లో కూరుకుపోక తప్పదని హెచ్చరించారు.

అవ్వా.. నన్ను గుర్తు పట్టావా..
"అవ్వా.. బాగున్నావా..? ఎక్కడికి వెళ్లావు.. నన్ను గుర్తుపట్టావా!?'' అంటూ బాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సాదిక్ బీ అనే వృద్ధురాలిని పలకరించారు. ఆమె నువ్వు చంద్రబాబువి కదా నాయనా అనగానే ఆయన ముఖంలో ఆనందం కనిపించింది. తాను అధికారంలోకి వస్తే రూ.600 పింఛన్ ఇస్తానని ఆ వృద్ధురాలికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. వృద్ధురాలికి కొంత నగదును అందజేశారు. బస్సులో ఉన్న విద్యార్థులను, రైతులను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బాబు వెంటే ఆ ముగ్గురూ
చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం రోజు నుంచి రాష్ట్ర తెలుగు మహిళ కార్యక్రమాల కార్యదర్శి సత్యవాణి (గుంటూరు), నాయకురాలు ఫణీశ్వరి (భద్రాచలం), కృష్ణాజిల్లాకు చెందిన సత్యనారాయణ చంద్రబాబు వెంటే నడుస్తున్నారు. చివరి వరకు చంద్రబాబు వెంటే ఉంటామని చెప్పారు.

కాలునొప్పితో..
వస్తున్నా మీ కోసం అంటూ 14 రోజులుగా పాదయాత్ర కొనసాగిస్తున్న బాబు సోమవారం తీవ్రమైన కాలు నొప్పితో బాధ పడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బహిరంగ సభలో చెప్పారు. అనంతపురం జిల్లాలో మట్టి రోడ్లపై నడిచిన చంద్రబాబు.. కర్నూలు జిల్లాలో తారు రోడ్లపై నడవడంతో ఈ నొప్పి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. నొప్పి నివారణకు ఫిజియోథెరపీ చేయనున్నామని తెలిపారు.

14వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం 15.10.2012