January 31, 2013

పచ్చటి మొక్కలను గానీ, ఆ రంగులో ఉన్న ఏవైనా దృశ్యాలను గానీ చూడాలని అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యులు సూచిస్తారు. పాదయాత్రను పునఃప్రారంభించిన నాకు తొలి అడుగులోనే విద్యార్థులు ఎదురుకావడం అలాంటి 'పచ్చటి' హాయి కలిగించింది. నాలుగు రోజుల తరువాత కూడా ఆరోగ్య సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి

చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఇప్పటికీ నియంత్రణలోకి రాలేదు. కాలు మెలిక పడినప్పుడు చీలమండ వద్ద బెణికింది. ఆ నొప్పి ఇంకా సర్దుకోలేదు. మూడు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. కానీ, జనం మధ్యనే నాకు నిజమైన విశ్రాంతి! వారితో ఉంటేనే మిన్నగా కోలుకుంటాననిపిస్తోంది. పైగా, వాళ్ల సమస్యలపై మనసు పెడితే నా బాధలు కాస్త నెమ్మదిస్తాయనేది ఒక ఆలోచన. దానికోసం 117 రోజుల సుదీర్ఘ పాదయాత్రను..మరింత ముందుకు తీసుకెళుతున్నా!

పేరుకే విశ్రాంతి. నడక లేదనే గానీ, ఈ నాలుగు రోజులూ ప్రజలను కలుసుకుంటూనే ఉన్నాను. కాకపోతే, ఇప్పటిదాకా నేనే వాళ్ల దగ్గరకు పోయేవాడిని. ఇప్పుడు వాళ్లే నా దగ్గరకు వచ్చారు. టీచర్ల నుంచి హోటల్ వర్కర్స్ దాకా బృందాలుగా వచ్చి కలిశారు. వ్యాట్ రద్దు పోరాటంలో తమకు మా పార్టీ ఇచ్చిన మద్దతుకు వస్త్ర వ్యాపారుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఇంత చేసినా వాళ్ల సమస్య మాత్రం అలాగే ఉంది.

వాళ్లనే కాదు, ఉద్యోగుల నుంచి వృత్తిదారుల దాకా ఎవరినీ పట్టించుకొని పరామర్శించే పరిస్థితిలో ఈ పాలకులు లేరు. పన్నులు, సర్‌చార్జీలు మోపేటప్పుడు తప్ప వీళ్లకు ప్రజలనేవారు గుర్తుకు వస్తారా అసలు? "మరి మీరు మాత్రం ఏమి చేస్తారు? ఢిల్లీ గ్యాంప్ రేప్ పునరావృతం కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారు'' అని ఆ విద్యార్థిని దాదాపు నన్ను నిలేసింది. ఆ రేపిస్టులను ఉరి తీయాలన్న ఆవేశం పరిటాలలో కలిసిన విద్యార్థినుల్లో కనిపించింది. చట్టాల్లో మార్పులు రాకుండా వీళ్లకీ చెర వీడదు!

జనం మధ్యే కోలుకుంటా..

రాష్ట్రంలోని పేదలు, రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతే వారిని ఆదుకోడానికి చేతులు రాని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నికల్లో ఓటుకు ఇరవై నుంచి రూ.30 వేలను ఎవడబ్బా సొమ్మని ఖర్చు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. గురువారం జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓటుకు నోటు విధానాన్ని అవలంబించిందని ఆయన విమర్శించారు. డబ్బులను విచ్చల విడిగా ఖర్చు చేసి దొడ్డిదారిన సహకార సంఘాల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నించిందని విమర్శించారు.

ఇక్కడా ఓటుకు నోటు: బాబు

వారి దృష్టిలో అన్యాయమంటే ఏమిటీ?..
అసలు జైలుకెందుకెళ్లాడో..?
జగన్‌పై చంద్రబాబు నిప్పులు
పునఃప్రారంభమైన పాదయాత్ర
కృష్ణాజిల్లా నందిగామలో 7.3 కిలోమీటర్లు నడక

  జైలు పార్టీకి ఓటు వేస్తే జీవితాలు అంధకారమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగని, అసమర్థ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారా.. రాష్ట్రం మరింత అధోగతి పాలుకావడం ఖాయమని హెచ్చరించారు. ఆరోగ్య సమస్యలతో నాలుగు రోజుల విరామం అనంతరం గురువారం చంద్రబాబు పాదయాత్రను పునఃప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటలకు కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం దోనబండ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. సత్యనారాయణపురం, కేతనకొండ, మూలపాడు మీదుగా 7.3 కిలోమీటర్లు నడిచారు.

అంతకుముందు, పరిటాల గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. తొలుత ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానూ, పాదయాత్రలోనూ, సభల్లోనూ కాంగ్రెస్, వైసీపీలపై నిప్పులుచెరిగారు. ఆవ్యక్తి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందనేది ప్రజలు సీరియస్‌గా తీసుకుని ఆలోచించాలని పరోక్షంగా జగన్ అంశాన్ని ప్రస్తావించారు.

ఎవరి మీదో కోపంతో తాను ఈ విషయాలు చెప్పడం లేదని, అవినీతి వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ ఐదు సంవత్సరాల నాలుగునెలల పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన వారే ఇప్పడు మాయ మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అన్యాయం జరిగిపోయిందంటున్నవారి దృష్టిలో ఆ మాటకు అర్థం ఏమిటని పరోక్షంగా జగన్ పార్టీ నేతలను ప్రశ్నించారు.

దుర్మార్గులపై తాను సాగిస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా సహకరించాలని పిలుపు నిచ్చారు. "దుర్మార్గులు తింటే తిన్నారులే అని మీరు ఊరుకోవద్దు. మీరు వాడే ప్రతి వస్తువుపైనా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ. లక్షా 25 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. దాన్నంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తూ ప్రజల నెత్తిన భారాలు మోపింది. ఈ రోజు జిల్లాలో కృష్ణానది ఉన్నా తాగునీటికి దిక్కు లేదు. సాగర్ నుంచి ఇక్కడకు నీరు విడుదల కాదు. ఈ విషయాలన్నీ ఆలోచించండి'' అని ప్రజలను కోరారు.

జైలు పార్టీని గెలిపిస్తే అంధకారమే!

నేటి నుంచి మళ్లీ నడక

టీడీపీ అధినేత చంద్రబాబు కాలు నొప్పి కాస్త ఉపశమించింది. షుగర్ లెవల్స్ మాత్రం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. అయినా, చంద్రబాబు తన పాదయాత్రను గురువారం నుంచి పునఃప్రారంభించనున్నారు. ఇకనుంచి రోజుకు పది కిలోమీటర్లు మించి నడవరాదని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 117 రోజులపాటు నడక సాగించిన చంద్రబాబు సుమారు 1860 కిలోమీటర్లు పర్యటించారు.

ఈనెల 26న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల చేరుకున్నారు. కాలు నొప్పి, కీళ్ల నొప్పులు, షుగర్ లెవల్స్ పెరగడంతో ఎనిమిది నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు చెప్పినా.. ససేమిరా అన్న బాబు.. నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుందని వారికి నచ్చచెప్పారు. బుధవారం సమన్వయ కమిటీ సభ్యులతో బస్సులోనే రెండు గంటలపాటు చర్చించారు. గురువారం ఉదయం 11 గంటలకు తనతోపాటు 117 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సిబ్బంది, స్వచ్ఛంద దళాలు, పోలీసులు తదితరులను ముఖాముఖి కలుస్తారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి రామమోహనరావు తెలిపారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు బస చేసిన ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు ఉన్న మూలపాడు గ్రామం వరకు కాలి నడకన వెళతారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీన 9.7 కిలోమీటర్లు నడుస్తారు. రెండో తేదీన వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచనను బట్టి ఎన్ని కిలోమీటర్లు వెళ్లాల్సింది నిర్ణయిస్తారు. వైద్యుల సూచనలను బట్టి పాదయాత్ర దూరాన్ని పెంచడమో లేదా తగ్గించడమో అన్నది ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే చంద్రబాబు కాలునొప్పి కొంత ఫర్వాలేదని గరికపాటి చెప్పారు.

పాదయాత్ర పునఃప్రారంభానికి బాబు రెడీ

కాలివేలి గాయంతో బాధపడుతున్న చంద్రబాబునాలుగు రోజుల విశ్రాంతి అనంతరం గురువారం తిరిగి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. చంద్రబాబు పాదయాత్ర తిరిగి ప్రారంభం కావటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం తొణికిసలాడుతోంది. బుధవారం తనను పరామర్శించడానికి వచ్చిన నాయకులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు...

కాలివేలి గాయంతో బాధ పడుతున్న చంద్రబాబు (ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి) 111 గంటల విశ్రాంతి అనంతరం గురువారం తిరిగి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం తొణికిసలాడుతోంది. చంద్రబాబు బుధవారం బిజీ బిజీగా గడిపారు. ఆయనను పరామర్శించటానికి నాయకులు క్యూ కట్టారు. చంద్రబాబును కలిసిన వారిలో యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు, కోడెల శివప్రసాదరావు, నెట్టెం రఘురామ్, దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య, తంగిరాల ప్రభాకరరావు, వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్, చిగురుపాటి వరప్రసాద్, చంద్రశేఖర్, వర్ల రామయ్య, తొండపు దశరధ జనార్ధన్‌రావు, కేశినేని నాని, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు. వారితో ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాలు, సహకార ఎన్నికలు, ఎమ్మల్సీ ఎన్నికలపై గురించి చర్చించారు. సహకార సంఘాలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవడంతో చంద్రబాబు ఆరోగ్యం మెరుగ్గా ఉందని నాయకులు చెప్పారు. మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నప్పటికీ ఆయన అంగీకరించడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆరోగ్యంను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారన్నారు.

చంద్రబాబును

పరామర్శించిన నారాయణ


సీపీఐ కార్యదర్శి కె.నారాయణ, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సీనియర్ నాయకులు సూర్యదేవర నాగేశ్వరరావు, జరబన నాగేశ్వరరావు, చుండూరు సుబ్బారావు తదితరులు చంద్రబాబును పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్యం బాగా లేదంటే బాబును చూడటానికి వచ్చాం తప్ప.. రాజకీయాలు గురించి మాట్లాడలేదని నారాయణ అన్నారు. పాదయాత్ర విజయవంతం కావాలని, చంద్రబాబు లక్ష్యం నేరవేరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై జాతీయ స్థాయిలో ఆందోళన చేస్తామని ఆయన పేర్కొన్నారు. సమస్యల గురించి వివిధ పార్టీల నాయకులతో చర్చించి జాయింట్ యాక్షన్ ప్లాన్ రూపొందించి ఉద్యమం చేపడతామని నారాయణ అన్నారు.

సమైక్యాంధ్ర కోసం

గంగాధర్ వినతిప్రతం అందజేత

విజయవాడకు చెందిన పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు బైబిల్‌ను అందచేశారు. కొరియా నుంచి తెప్పించిన బైబిల్‌కు బెంగళూరులో చర్చి ఫాదర్లతో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయించారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆధ్వర్యంలో చంద్రబాబును కల్సి పరిశుద్ధ గ్రంథాన్ని అందజేశారు. తెలుగు జాతిని దొరల దోపిడీకి, పాలెగాళ్ల దాష్టిీకాలకు, మతోన్మాదుల ఉన్మత్త చర్యలకు బలిచేయవద్దని, సమైక్యాంధ్ర రాష్ట్రమే తెలుగు జాతి ఆకాంక్షని పేర్కొంటూ పీసీసీ డాక్టర్ సెల్ మాజీ చైర్మన్ డాక్టర్ జి.గంగాధర్, చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.పట్టాభి రామ్, కార్యదర్శి కె.బిందు మాధవరావు, సభ్యులు చంద్రబాబును కల్సి సమస్యలు వివరించారు. వస్త్రలత అసోసియేషన్, విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వచ్చి వ్యాట్‌ను తప్పించటానికి సమస్యపై పోరాడాల్సిందిగా పిలుపునిచ్చారు. అలాగే స్కూల్స్ ప్రతినిధులు కూడా వచ్చి తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు.

నాలుగు రోజుల వినామానంతరం...వస్తున్నా మీ కోసం