January 31, 2013

జైలు పార్టీని గెలిపిస్తే అంధకారమే!

వారి దృష్టిలో అన్యాయమంటే ఏమిటీ?..
అసలు జైలుకెందుకెళ్లాడో..?
జగన్‌పై చంద్రబాబు నిప్పులు
పునఃప్రారంభమైన పాదయాత్ర
కృష్ణాజిల్లా నందిగామలో 7.3 కిలోమీటర్లు నడక

  జైలు పార్టీకి ఓటు వేస్తే జీవితాలు అంధకారమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగని, అసమర్థ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారా.. రాష్ట్రం మరింత అధోగతి పాలుకావడం ఖాయమని హెచ్చరించారు. ఆరోగ్య సమస్యలతో నాలుగు రోజుల విరామం అనంతరం గురువారం చంద్రబాబు పాదయాత్రను పునఃప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటలకు కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం దోనబండ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. సత్యనారాయణపురం, కేతనకొండ, మూలపాడు మీదుగా 7.3 కిలోమీటర్లు నడిచారు.

అంతకుముందు, పరిటాల గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. తొలుత ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానూ, పాదయాత్రలోనూ, సభల్లోనూ కాంగ్రెస్, వైసీపీలపై నిప్పులుచెరిగారు. ఆవ్యక్తి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందనేది ప్రజలు సీరియస్‌గా తీసుకుని ఆలోచించాలని పరోక్షంగా జగన్ అంశాన్ని ప్రస్తావించారు.

ఎవరి మీదో కోపంతో తాను ఈ విషయాలు చెప్పడం లేదని, అవినీతి వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ ఐదు సంవత్సరాల నాలుగునెలల పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన వారే ఇప్పడు మాయ మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అన్యాయం జరిగిపోయిందంటున్నవారి దృష్టిలో ఆ మాటకు అర్థం ఏమిటని పరోక్షంగా జగన్ పార్టీ నేతలను ప్రశ్నించారు.

దుర్మార్గులపై తాను సాగిస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా సహకరించాలని పిలుపు నిచ్చారు. "దుర్మార్గులు తింటే తిన్నారులే అని మీరు ఊరుకోవద్దు. మీరు వాడే ప్రతి వస్తువుపైనా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ. లక్షా 25 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. దాన్నంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తూ ప్రజల నెత్తిన భారాలు మోపింది. ఈ రోజు జిల్లాలో కృష్ణానది ఉన్నా తాగునీటికి దిక్కు లేదు. సాగర్ నుంచి ఇక్కడకు నీరు విడుదల కాదు. ఈ విషయాలన్నీ ఆలోచించండి'' అని ప్రజలను కోరారు.