April 27, 2013

విశాపట్నం: చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు సభకు విచ్చేసిన ప్రతీ ఒక్కరిని అలరించే విధంగా ఉన్నాయి. చంద్రబాబు ర్యాలీ ఇంకా కొనసాగుతుంది. కాసేపట్లో సభా ప్రాంగణానికి ఆయన చేరుకోనున్నారు.

ముగింపు సభలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

విశాఖపట్నం

'రాష్ట్రం ఈ దుస్థితికి రావడానికి కారణం సీఎం కిరణ్, జగన్, కేసీఆర్' అని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం ఒక మూర్ఖుడని, ఆయన టీమ్‌లో ఉన్నవారంతా 420లే అని వ్యాఖ్యానించారు. జగన్ పార్టీ ఒక జైలు పార్టీ అని ఆయన అన్నారు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన జగన్ కేడీ నెంబర్ వన్ అని ఆయన తెలిపారు. రాజకీయ పరిజ్ఞానం లేని షర్మిల సవాలు 'వానపాము బుసలు కొట్టడం వంటిదని' ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమాల పేరుతో విద్యార్థులను, ప్రజలను బుట్టలో వేసుకుని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటున్నారని ఆయన అన్నారు.
: కొందరు నేతలు తమ స్వలాభాల కోసం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తారిలాగా చేశారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభలో శనివారం నాడు ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. 'అభివృద్ధికి, సుపరిపాలనకు అడ్డ ఈ తెలుగుదేశం పార్టీ' అని ఆయన అన్నారు. 2004 తర్వాత రాష్ట్రం పూర్తిగా చిన్నాభిన్నంగా తయ్యారయ్యిందని ఆయన చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అనేక కష్టాల్లోకి నెట్టిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు: రేవంత్ రెడ్డి

విశాఖపట్నం : టీడీపీ అధినేత 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర ముగింపు సభకు ఆ పార్టీ ఎంపీ హరికృష్ణ, నటుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. షూటింగ్‌ల కారణ ంగా జూనియర్ ఎన్టీఆర్, అనారోగ్యం కారణంగా హరికృష్ణ సభ కు దూరంగా ఉండనున్నారు. అయితే చంద్రబాబుతో విభేదాల కారణంగానే సభకు రావడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సభకు హరికృష్ణ, జూ.ఎన్టీఆర్ రాక అనుమానం

విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా..మీకోసం' ముగింపు సభ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు సీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.

అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలు లంకలపాలెం వద్ద ఆనందపురం వైపు , శాంఠ్యాం మీదుగా అడవివరం వచ్చే వాహనాలు హనుమంతపాక, జీడుగుళ్ల పాలెం వైపు, గాజువాక మీదుగా విశాఖ వచ్చే వాహనాలు షీలానగర్ వైపు మళ్లిస్తున్నట్లు సీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.

విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం కుంభకోణాల రాజధానిగా మారిందని టీడీపీ నేత సుధీష్ రాంభొట్ల వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలన గాడిలో పడాలంటూ చంద్రబాబు సీఎం కావాలని ఆయన స్పష్టం చేశారు. 63 ఏళ్ల వయసులో 2817 కి.మీ మేర చేపట్టిన చంద్రబాబు పాదయాత్రను చారిత్రాత్మక ఘట్టంగా సుధీష్ రాంభొట్ల అభివర్ణించారు.

రాష్ట్రం గాడిన పడాలంటే బాబు సీఎం కావాలి : సుధీష్ రాంభొట్ల

విశాఖపట్నం : 'వస్తున్నా...మీకోసం' ముగింపు సభలో ప్రసంగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 17 మంది నేతలను ఎంపిక చేశారు. సాయంత్రం 5:30-6 గంటల మధ్య బాబు వేదికపై వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు ఉపన్యాసాలు ముగించాలని నేతలకు సూచించారు.

సభలో ప్రసంగించేందుకు 17 మంది నేతల ఎంపిక

విశాఖపట్నం : ముగింపు సభలో భాగంగా అగనంపూడి టోల్‌గేట్ శివాజీపాలెం వద్ద ఏర్పాటు చేసిన 60 అడుగుల ఎత్తున్న పైలాన్‌ను శనివారం పలువురు టీడీపీ నేతలు సందర్శించారు. నామా నాగేశ్వర్‌రావు, మోత్కుపల్లి, సుజనాచౌదరి, దేవినేని ఉమా తదితరులు సందర్శించారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు చంద్రబాబు నాయడు పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.

విశాఖ : పైలాన్‌ను సందర్శించిన టీడీపీ నేతలు

విశాఖపట్నం
: రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా ఒక్క చంద్రబాబునాయుడికే ఉంది అని టీడీ పీ నేతలు ముక్తకంఠంతో తెలిపారు. ప్రజాసమస్యలు తీరాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిందే అని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. చంద్రబాబు పాదయాత్ర వల్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం వచ్చిందని, రాబోయే రోజుల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా చంద్రబాబుకే ఉంది : టీడీపీ నేతలు

విజయనగరం : చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు వెళ్తున్న వాహనాలను జిల్లాలో పోలీసులు అడ్డుకుంటున్నారు. చీపురపల్లి, గణపతినగరంలో వాహనాలను నిలిపివేశారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు

విశాఖపట్నం
: చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా అనంతపురం జిల్లాకు చెందిన వసంతనాయుడు అని అభిమాని ఆయనకు వెండి చెప్పులు బహూకరించారు.

బాబుకు వెండి చెప్పులు బహూకరించిన అభిమాని

విశాఖపట్నం
: 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర ముగింపు సభలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అగనంపూడి టోల్‌గేట్ శివాజీపాలెం వద్ద 60 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించారు. పైలాన్ ఆవిష్కరణలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, భువనేశ్వరి, లోకేష్ హాజరయ్యారు.

పైలాన్‌ను ఆవిష్కరించిన బాబు

ముగిసిన చంద్రబాబు పాదయాత్ర
పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు,అభిమానులు

విశాఖపట్నం

టీడీపీ శ్రేణులు ముగింపు సభ ఏర్పాట్లను భారీగా చేశారు. జిల్లా అంతటా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానెర్లతో అందంగా అలంకరించారు. దీంతో విశాఖ మొత్తం పసుపుమయంగా మారింది.

2012 అక్టోబర్ 2 న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి చంద్రబాబునాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 208 రోజుల పాటు 2817 కిలో మీటర్ల మేర చంద్రబాబు మహాపాదయాత్ర సాగింది. రాయలసీమ, కోస్తా, తెలంగాణాల్లో 16 జిల్లాలు, 86 నియోజకవర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు నగరాలు, 162 మండలాలు, 1253 గ్రామాల్లో బాబు పాదయాత్ర కొనసాగింది.

తన అరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా 63 ఏళ్ల వయసులో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే కష్టాలు తీరుస్తానని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా..మీకోసం' పేరిట చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర శనివారం సాయంత్రం ముగిసింది. జిల్లాలోని అగనంపూడి టోల్‌గేట్ శివాజీపాలెం వద్ద 60 అడుగుల పైలాన్‌ను బాబు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. బాలకృష్ణ, భువనేశ్వరి, లోకేష్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జిల్లాకు తరలివచ్చారు.

విశాఖలో పైలాన్, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

సాయంత్రం బహిరంగ సభ..భారీ ఏర్పాట్లు

విశాఖపట్నం: రాయలసీమ, తెలంగాణ, కోస్తాల్లో 16 జిల్లాలు, 86 అసెంబ్లీ నియోజకవర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు నగరాలు, 162 మండలాలు, 1253 గ్రామాల గుండా... 208 రోజుల పాదయాత్ర! 2817 కిలోమీటర్ల మహా పాదయాత్ర! 'వస్తున్నా మీకోసం' అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర... తుది మజిలీకి చేరుకుంది. శనివారం జరిగే పాదయాత్ర ముగింపు సభకు విశాఖ నగరం వేదికగా మారింది.

ఉక్కు నగరం పసుమయమైంది. ఎటు చూసినా రెపరెపలాడుతున్న పసుపు జెండాలు, పసుపు పచ్చ తోరణాలే! చంద్రబాబు శుక్రవారం రాత్రి కూర్మన్నపాలెంలోని సుజనా స్టీల్స్‌లో బస చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఒక కిలోమీటరు దూరం నడిచి అగనంపూడిలో ఏర్పాటుచేసిన పైలాన్ దగ్గరకు చేరుకుంటారు. సుమారుగా వెయ్యి గజాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన పైలాన్ ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటలకు తెలుగుదేశం పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని, పాదయాత్ర ముగింపును సూచిస్తూ సందేశంతో కూడిన శిలాఫలకాన్ని, పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పది వేల బైకులతో ర్యాలీగా బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ వేదిక అయిన ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. బహిరంగ సభలో చంద్రబాబు సుమారు గంటసేపు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఏడు నెలల పాటు ప్రజల మధ్య పర్యటించి తాను గుర్తించిన సమస్యలను, వాటికి పార్టీ తరఫున పరిష్కారాలను వివరిస్తారు.

పకడ్బందీ ఏర్పాటు సుమారుగా 16 ఎకరాల విస్తీర్ణం గల ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొత్తం మూడు లక్షల మందికి ఆ ప్రాంతం సరిపోతుందని పోలీసుల అంచనా. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. సభను మధ్యాహ్నం మూడు గంటలకే ప్రారంభిస్తారు. సినీ నటుడు ఏవీఎస్, నేపథ్య గాయకులు వందేమాతరం శ్రీనివాస్, సునీత, నాగూర్‌బాబు తదితరుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ సందేశాత్మక గీతాలు, ఎన్టీఆర్ సినిమాల్లోని సామాజిక చైతన్య గీతాలను గాయకులు ఆలపిస్తారు.

రాత్రి ఏడుగంటలకల్లా సభను ముగించాలని పార్టీ అగ్రనాయకులు భావిస్తున్నారు. విశాఖపట్నానికి పొరుగునున్న నాలుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులను తరలించడానికి పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, గరికిపాటి మోహన్‌రావు, తదితరులు కొద్దిరోజులుగా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

13 రైళ్లు, 500కి పైగా బస్సులు, ఇతర వాహనాల్లో కార్యకర్తలు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక డీసీపీ పర్యవేక్షణలో ఒక అదనపు డీసీపీ, ముగ్గురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, వందమంది ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లతోపాటు 400 మంది కానిస్టేబుళ్లు, ఒక ప్లటూన్ ఏఆర్ కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించనున్నారు.

పసుపెక్కిన విశాఖ నేటితో ముగియన్ను బాబు పాదయాత్ర

తెలంగాణలో అగ్నిపరీక్ష! సీమాంధ్రలో విషమ పరీక్ష! పేరుకు ప్రధాన ప్రతిపక్షమే అయినా... అనేక పక్షాలతో పోటాపోటీ! ఈ బహుముఖ పోటీలో నిలబడతామా? పడిపోతామా? అనే సందేహం! వరుస ఉప ఎన్నికల్లో చేదు అనుభవాలు! ఇదీ... అప్పుడు తెలుగుదేశం పరిస్థితి! ఇలాంటి పరిస్థితిలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్ర ఎలా సాగింది? ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? బాబు కష్టానికి ఫలితం లభించిందా? అనుకున్నది సాధించారా? ఆ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు? 'ఆంధ్రజ్యోతి' విశ్లేషణ...

హైదరాబాద్ : 'పాదయాత్రా... అబ్బే కష్టం. ఈ వయసులో ఆరోగ్యం సహకరించదు'... అని కొందరు భయపెట్టారు. 'పాదయాత్ర అక్కర్లేదు. వాహన యాత్ర చేస్తే బాగుంటుంది' అని మరికొందరు అన్నారు. 'అబ్బే... ఇదంతా ఉపయోగం లేని వ్యవహారం' అని ఇంకొందరు పెదవి విరిచారు. ఇప్పుడు ఇదే నేతలు... 'చంద్రబాబు పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ప్రాణ ప్రతిష్ఠ చేసింది'... అని ముక్తకంఠంతో చెబుతున్నారు.

ఏడు నెలలపాటు అలుపెరగకుండా రాష్ట్రం ఆ కొస నుంచి ఈ కొస వరకూ ఆయన జరిపిన యాత్ర ఆ పార్టీకి నిజంగానే వర ప్రసాదంగా మారింది. ఆయన యాత్ర మొదలు పెట్టినప్పుడు అనేక మంది నేతలు లోలోపలే పెదవి విరిచారు. ఇప్పుడు యాత్ర ఫలితం గణనీయంగా ఉందని వారే అంగీకరిస్తున్నారు. 'వస్తున్నా మీకోసం' అని చంద్రబాబు యాత్ర మొదలుపెట్టడానికి ముందు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాజకీయ తుఫానులో చిక్కుకున్న చిగురుటాకులా ఉండేది.

ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ వరుస పరాజయాలు ఎదుర్కొంది. పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్ట మొదటిసారి కొన్ని సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన దుస్థితి ఎదురైంది. ప్రత్యేకించి సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం ఆ పార్టీ వర్గాలకు శరాఘాతంలా తగిలింది. అవినీతి అజెండాకే విలువ లేకుండా పోయింది. రాష్ట్రంలో టీడీపీ మళ్లీ కోలుకోవడం సాధ్యమేనా? అనే ఆందోళన పార్టీ నేతల్లో మొదలైంది.

ఈ పరిస్థితి నుంచి పార్టీని బయట పడేయడానికి ఏదో ఒక సాహసం చేయక తప్పదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించారు. మొదట్లో ఈ ప్రతిపాదనను పార్టీలో మెజారిటీ నేతలు వ్యతిరేకించారు. కానీ... చంద్రబాబు మాత్రం 'నిర్ణయం తీసేసుకున్నాను' అని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మూడున్నర నెలల్లో ముగించాలనుకొన్న యాత్రను... ఏడు నెలలపాటు నడిపించారు. కాలు పెట్టడమే కష్టమనుకొన్న తెలంగాణలో చంద్రబాబు పాదయాత్ర ఏకంగా మూడు నెలలపాటు సాగింది.

ఒక కదలిక... చంద్రబాబు అడుగు పెట్టిన ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కొత్త ఊపిరి పోసుకుంది. అంతవరకూ స్తబ్దుగా ఉన్న పార్టీ శ్రేణులు లేచి నిలుచున్నాయి. ఈ ఉత్సాహం యాత్ర మధ్యలో వచ్చిన సహకార ఎన్నికల్లో ప్రతిఫలించింది. రెండు జిల్లా సహకార బ్యాంకులను గెలుచుకోవడంతోపాటు నాలుగైదు జిల్లాల్లో గణనీయ సంఖ్యలో సీట్లను సాధించగలిగింది. ఈ యాత్ర సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకించి రైతు రుణాల మాఫీ హామీ విస్తృతంగా ప్రచారం పొందింది.

'ఈసారి పంట రుణాల బకాయిలు కట్టాలా వద్దా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలను రైతులు ప్రశ్నించారు. టీడీపీ వస్తే బకాయిలు మాఫీ చేస్తుందన్న నమ్మకం కుదరడం వల్లే ఇలా ఆరా తీశారు' అని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. జనం మధ్య నడుస్తూ, జనంలోకి వచ్చి మాట్లాడటం వల్లే చంద్రబాబు మాటలపై ప్రజలకు గురి కుదిరిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. 'ఇవే హామీలు ఆయన హైదరాబాద్‌లో కూర్చుని చెబితే అంత ప్రభావం చూపేవి కావు. ఆయన శ్రమపడి పాదయాత్ర చేస్తూ ఇస్తున్న హామీలు కావడంతో వాటిపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతోంది' అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు చెప్పారు.

ఏడు నెలల పాదయాత్ర తర్వాత చంద్రబాబు ఒకటి మాత్రం స్పష్టంగా సాధించగలిగారు. వచ్చే ఎన్నికల్లో అధికార సాధనలో టీడీపీ బలమైన పోటీదారుగా ఉందని, పక్కన పెట్టే పరిస్థితి లేదని ఇతర పార్టీలు కూడా అంగీకరించే పరిస్థితి తెచ్చారు. 'తమదే ప్రభంజనం అని చెప్పిన పార్టీలు ఇప్పుడు గొంతు తగ్గించుకొన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ బలంగా ఉండవచ్చు. కానీ అన్ని ప్రాంతాల్లో వాటికి బలమైన పోటీదారుగా ఉన్నది మేమే. ఇంకా ఏడాది సమయం ఉంది. ఇతరులు క్రమక్రమంగా తగ్గుతుంటే మేం రోజురోజుకు పుంజుకుంటున్నాం' అని ఆ పార్టీ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

మరుగున పడిపోయిన అవినీతి అజెండాను మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా చంద్రబాబు విజయం సాధించారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పారు. 'పాదయాత్ర ప్రారంభంలో చంద్రబాబు ఒక్కరే అవినీతి గురించి మాట్లాడేవారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఆయన లేవనెత్తుతున్న అంశాలకు భయపడే వైసీపీ పోటీగా షర్మిల పాదయాత్రను మొదలు పెట్టించింది. ఆయనను చూసి ఎంత భయపడుతున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం' అని టీడీపీ నేత ఒకరు తెలిపారు. బాబు పాదయాత్ర పురోగమిస్తున్న కొద్దీ వలసలు తగ్గుముఖం పట్టడం మరో విశేషం.

యాత్రా సమయంలోనూ ఇద్దరు ముగ్గురు నేతలు వెళ్లిపోయినా కింది స్థాయిలో పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడుతున్నాయని, వలసలను చూసి తాము ఆందోళన పడాల్సిన పరిస్థితి తగ్గిపోయిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒకరు అన్నారు. 'వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపని మేం డంబాలు కొట్టుకోవడం లేదు. బాగా దెబ్బతిన్న పరిస్థితి నుంచి నువ్వా నేనా అన్న స్థితిలోకి వచ్చాం. అదేమీ చిన్న విషయం కాదు. దానిని చంద్రబాబు సాధించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కష్టపడితే ఫలితం ఉంటుందన్న ధైర్యం వచ్చింది' అని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తెలంగాణలో అగ్నిపరీక్ష! సీమాంధ్రలో విషమ పరీక్ష! పేరుకు ప్రధాన ప్రతిపక్షమే అయినా... అనేక పక్షాలతో పోటాపోటీ!

రికార్డుల బాబు!
వైఎస్ పాదయాత్రకు రెట్టింపు నడక
వైఎస్ 53 ఏళ్లప్పుడు..బాబు 63 ఏళ్ల వయసులో
ప్రచారంలో మాత్రం వైఎస్‌కంటే వెనుకే....

హైదరాబాద్ : పాలనలోనే కాదు.. పాదయాత్రలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డులు బద్దలు కొట్టారు! ఇటీవలి కాలం వరకు బాగా ప్రాచుర్యం పొందిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు రెట్టింపు దూరం నడిచి గట్టి పిండంగా గుర్తింపు పొందారు. వయసు రీత్యా.. నడిచిన దూరం రీత్యా.. యాత్ర నిర్వహించిన తీరు రీత్యా బాబు యాత్ర అరుదైనదన్న ప్రశంసలు పొందుతోంది. సరిగ్గా దశాబ్దం కిందట పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి 1356 కి.మీ. నడిచారు. అప్పట్లో ఆయన వయసు 53 సంవత్సరాలు! రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు.

11 జిల్లాల్లోని 33 అసెంబ్లీ నియోజక వర్గాలను ఆయన సందర్శించారు. ఆయన పాదయాత్ర 55 రోజులపాటు సాగింది. కానీ, చంద్రబాబు 63 ఏళ్ల వయసులో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన 64వ పుట్టిన రోజును కూడా ఆయన పాదయాత్రలోనే జరుపుకొన్నారు. ఇక, చంద్రబాబు పాదయాత్ర సుదీర్ఘంగా 208 రోజులపాటు సాగింది. అంతే సుదీర్ఘంగా ఆయన 2,817 కి.మీ. నడిచారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మొదలు పెట్టి విశాఖ నగరంలోని శివాజీ నగర్‌లో ముగించారు. ఈ యాత్ర సందర్భంగా చంద్రబాబు 16 జిల్లాల్లోని 86 అసెంబ్లీ నియోజక వర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లు, 162 మండలాలు, 1,253 గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు.

"రాష్ట్రంలో ఇది అరుదైన రికార్డు. ఇప్పటి వరకూ ఎవరూ ఇంత దూరం పాదయాత్ర చేయలేదు. కొందరి పాదయాత్రలు మధ్యలో విరామం తీసుకొన్నాయి. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకొన్నవారు ఉన్నారు. కానీ, అక్టోబర్ 2న ఇంటి నుంచి బయలుదేరిన చంద్రబాబు.. అనారోగ్యం వేధించినా.. శరీరం సహకరించకపోయినా.. విరామం ఇవ్వాలని వైద్యులు సూచించినా.. యాత్ర ముగిసే వరకూ మళ్లీ ఇంటి గడప తొక్కలేదు. ఆయనకు మించిన పాదయాత్ర చేసిన వాళ్లు దేశంలో ఒక్కరే ఉన్నారు. ఆయనే.. మాజీ ప్రధాని చంద్రశేఖర్. ఆయన కన్యాకుమారి నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని మహాత్మ గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు పాదయాత్ర చేశారు.

ఆరున్నర నెలలపాటు 4,260 కిలోమీటర్లు నడిచారు. కానీ, ఆయన కూడా చంద్రబాబు మాదిరిగా ఇన్ని గ్రామాలు పర్యటించలేదు'' అని బాబు పాదయాత్రకు రూట్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించిన కంభంపాటి రామ్మోహన రావు చెప్పారు. కాగా, వైఎస్ పాదయాత్రకు, చంద్రబాబు పాదయాత్రకు మధ్య రెండు ప్రధాన తేడాలున్నాయి. చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ పదేళ్ల తక్కువ వయసులో పాదయాత్ర చేశారు. అందుకే, ఆయన కొంతవరకు సునాయాసంగా పాదయాత్ర చేయగలిగారన్నది కొందరి అభిప్రాయం. కానీ, 63 ఏళ్ల వయసులో ఇంత సుదీర్ఘ పాదయాత్ర సహజంగానే చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమే చూపింది.

ఇక, యాత్రా మార్గంలోనూ రెండు యాత్రల మధ్య తేడా ఉంది. వైఎస్ పాదయాత్ర ప్రధాన రహదారులపై సాగిపోగా.. చంద్రబాబు తన పాదయాత్రను వీలైనంత వరకూ ప్రధాన రహదారుల్లోకి పోకుండా గ్రామాల మీదుగా జరిపారు. ఎక్కువ గ్రామాల్లో ఎక్కువ మంది ప్రజలను సందర్శించాలన్న తపనతో ఆయన గ్రామీణ ప్రాంతాల మీదుగా యాత్ర జరిపారు. కాగా, వైఎస్ తన పాదయాత్ర ద్వారా తనపై ఉన్న ఫ్యాక్షనిస్టు ముద్రను పోగొట్టుకొని ప్రజా నేతగా అవతరించారు. చంద్రబాబు తన పాదయాత్ర ద్వారా తనపై ఉన్న వ్యతిరేకతలను చాలా వాటిని తగ్గించుకొని ప్రజా బాహుళ్యానికి చేరువ కాగలిగారు. మారిన మనిషిగా గుర్తింపు పొందారు.

వైఎస్ 55 రోజులు..బాబు 208 రోజులు వైఎస్ 1356 కిమీ..బాబు 2817 కిలోమీటర్లు

హైదరాబాద్
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ పాదయాత్రను ముగించుకుని ఆదివారం తన ఇంటికి చేరుకోనున్నారు. ఏడు నెలల తర్వాత ఆయన ఇంటి ముఖం చూడనున్నారు. ఆదివారం ఆయన విశాఖపట్నం నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్‌ను చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ కొద్ది సేపు పార్టీ శ్రేణులతో చర్చించిన అనంతరం నివాసానికి వెళతారు.

రేపు ఇంటికి బాబు

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో వినియోగిస్తున్న ప్రచార రథానికి(బస్సు) ప్రత్యేకత ఉంది. ప్రముఖుల పర్యటన కోసం ప్రత్యేక వాహనాలు తయారు చేసే ఓ ప్రముఖ కంపెనీ నుంచి ఈ బస్సును అద్దెకు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ఇదే బస్సును వినియోగించారు. ఆయన పార్టీ సమాజ్‌వాదీ ఎన్నికల గుర్తు కూడా సైకిలే కావడం విశేషం.

ఎన్నికల ప్రచారానికి, వ్యక్తిగత అవసరాలకు, ముఖ్యులతో సమావేశాలకు అనుగుణంగా ఈ బస్సును తీర్చిదిద్దారు. ఇందులో ్రడైవర్ కేబిన్‌తో పాటు మరో మూడు కేబిన్లు ఉంటాయి. తొలి కేబిన్‌లో 15 మంది సమావేశమయ్యేలా సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. చంద్రబాబు తనను కలవడానికి వచ్చేవారితో ఇందులోనే మాట్లాడతారు. జిల్లా, నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తారు. రెండో కేబిన్ పరిమితంగా ఉంటుంది.

కుటుంబ సభ్యులు, వీవీఐపీలు వచ్చినపుడు ప్రత్యేకంగా ముచ్చటిం
చడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కేబిన్‌లోనే చంద్రబాబు టిఫిన్, భోజనాలు చేస్తారు. ఇక్కడే డ్రెస్సింగ్ టేబుల్ అవీ ఉంటాయి. ఇక మూడో కేబిన్‌లో స్నానపానాదులకు అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి. వార్తలు విశేషాలు తెలుసుకోవడానికి వీలుగా టీవీ, డిష్ యాంటెనా, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. బస్సులో నుంచి డెక్ పైకి చేరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వాహనం నడిపేందుకు యూపీ నుంచే ్రడైవర్ అమర్‌నాథ్ మిశ్రా వచ్చాడు.

బాబు బస్సు సూపర్! వాహనంలోనే సకల సౌకర్యాలు

న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కోరేందుకు గాను ప్రధానిని కలవాలని టీడీపీ నిర్ణయించింది. పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కోరారు.

బయ్యారంపై ప్రధానిని కలవనున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర శనివారం విశాఖపట్టణంలో ముగుస్తున్న సందర్భంగా జరగనున్న చరిత్రాత్మక బహిరంగ సభకు జిల్లా నుంచి ఆ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్ళాయి. ఇందుకోసం పార్టీ జిల్లా యంత్రాంగం రెండు ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసింది. మరోవైపు జిల్లావ్యాప్తంగా పలువురు నేతలు, కార్యకర్తలు సొంతంగా కూడా వాహనాలు ఏర్పాటు చేసుకుని బయల్దేరి వెళ్ళారు. మొత్తంమీద జిల్లా నుంచి గురు, శుక్రవారాల్లో సుమారు 10 వేల మంది చంద్రబాబు సభకు వెళ్ళినట్టు అంచనా.

 తిరుపతి: 'రాబోయేది చంద్రన్న రాజ్యమే. ప్రజల కోసం కోసం మీరు చేసిన పాదయాత్ర చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. మీ శ్రమ వృథాకాదు. రాష్ట్ర ప్రజలూ మీ పాలన కోరుకుంటున్నారు. మీకు అండగా మేం ఉన్నాం. అందుకే విశాఖకు తరలి వస్తున్నాం' అంటూ తెలుగు తమ్ముళ్లు శుక్రవారం ఉత్సాహంగా విశాఖపట్నంకు రెండు ప్రత్యేక రైళ్లలో తరలి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'మీ కోసం వస్తున్నా' పాదయాత్ర శనివారం ముగుస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పాదయాత్ర 2012 అక్టోబరు 2న అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం నుంచి ప్రారంభమై గురువారం నాటికి 206 రోజులకు చేరుకుంది.

అలాగే 2,800 కిలోమీటర్లను దాటేశారు. రాష్ట్ర చరిత్రలో ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన నేతలెవరూ లేరు. ఈ యాత్ర ద్వారా పార్టీలో నూతనోత్సాహం నింపడంతోపాటు ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం బాబుకు లభించింది. అలాగే 2014 ఎన్నికల్లో విజయఢంకా మోగించడానికీ ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అనుబంధ సంఘాలను నియమిస్తున్నారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఓ నాయకుడిని ఈ సభకు తీసుకెళుతున్నారు. వార్డు సభ్యులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 200 మంది క్రియాశీలక కార్యకర్తలు విశాఖ సభకు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల నుంచి 2,800 మంది కార్యకర్తలు రెండు ప్రత్యేక రైళ్లలో విశాఖకు తరలివెళ్లారు. మరో 3వేల మంది వరకు ప్రత్యేక వాహనాల ద్వారా బయల్దేరారు. కార్యకర్తల కోసం చిత్తూరు, రేణిగుంటలో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జిల్లా నుంచి సభకు వెళుతున్న కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారే కావడం గమనార్హం. జన సమీకరణకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, సీనియర్ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే హేమలత, తిరుపతిలో నియోజకవర్గ ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తి ఎంతో కృషి చేశారు.

20 కోచ్‌లతో

చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు

చిత్తూరు టౌన్: విశాఖలో నిర్వహించనున్న బహిరంగ సభకు చిత్తూరు రైల్వేస్టేషన్ నుంచి శుక్రవారం సాయంత్రం 20 కోచ్‌లతో ప్రత్యేక రైలు బయల్దేరింది. ఇందుకోసం మధ్యాహ్నానికే కుప్పం, పలమనేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలతోపాటు మదనపల్లె, పుంగునూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చిత్తూరు చేరుకున్నారు. తొలుత స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి నేతలందరూ పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడినుంచి చిత్తూరు రైల్వేస్టేషన్‌కెళ్లి సాయంత్రం ప్రత్యేక రైలులో విశాఖకు తరలి వెళ్లారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, రాష్ట్ర కార్యదర్శి దొరబాబు, జిల్లా ఉపా«ధ్యక్షుడు కఠారి మోహన్, నేతలు మాపాక్షి మోహన్, బాలాజి నాయుడు, షణ్ముగం, వైవీ రాజేశ్వరి, అశోక్ ఆనంద్ యాదవ్, విల్వనాధం, దయారం, నీరజాక్షుల నాయుడు, కమలేష్ నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, రమేష్, యువరాజులు నేతృత్వంలో కార్యకర్తలను రైలు ఎక్కించారు. ఈ ప్రత్యేక రైలుకు టీడీపీ బ్యానర్లు, స్టిక్కర్లను, జెండాలను అతికించారు.

భోజనానికి అల్లాడిన కార్యకర్తలు: వందలాదిగా చిత్తూరుకు తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు జిల్లా నాయకులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రైల్వేస్టేషన్‌లోనే భోజనం పెడతారని వేచి ఉన్నారు. అయితే చిత్తూరు నేతలు తమకేమీ సంబంధం లేదనడంతో హోటళ్లకెళ్లి భోజనం పొట్లాలు తెప్పించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జంగాలపల్లె శ్రీనివాసులు గురువారం ఉదయమే విశాఖపట్నంకు వెళ్లిపోవడంతో ఇక్కడ ఏర్పాట్లు చూసుకునే దిక్కు లేకపోయిందంటూ పలువురు వాపోయారు.

ఛలో వైజాగ్!

విశాఖపట్నం
: 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకై ప్రముఖ హీరో బాలకృష్ణ శనివారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఆయనతో పాటు తారకరత్న, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్యేలు నగరానికి చేరుకున్నారు. ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు వేదిక వద్దకు తరలివస్తున్నారు. ముగింపు సభ కోసం 11 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు అగనంపూడి టోల్‌గేట్ శివాజీపాలెం వద్ద 60 అడుగులు పైలాన్ స్థూపం తుది మెరుగులు దిద్దుకుంటోంది. పైలాన్ పక్కనే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం మూడు గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.

విశాఖకు చేరుకున్న బాలకృష్ణ

సగం మంది జైల్లోనే
ఇక కేబినెట్ భేటీలూ చంచల్‌గూడలోనే
అమ్మహస్తం కాదు..మొండి హస్తం
సోదరులతో కలిసి కిరణ్ దందా
కటకటాల్లో జగన్ కాపురం
విశాఖ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు

విశాఖపట్నం

మరోమంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఇంకా పలువురు మంత్రులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు కేబినెట్‌లో సగం మంది చంచల్‌గూడ జైలుకు వెళతారు. రానున్న రోజుల్లో కేబినెట్ సమావేశాలు అక్కడే ఏర్పాటుచేసుకోవాల్సి వస్తుంది'' అని వెదుళ్లనరవలో జరిగిన బహిరంగసభలో ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పలు పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయని జోస్యంచెప్పా రు. " వైసీపీ జైలుపార్టీగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీబీ ఐ చుట్టూ చక్కర్లు కొడుతున్నది'' అని వ్యంగ్యంగా అన్నా రు.

వైఎస్ తన కుమారుడి కోసం దొంగ కంపెనీలు పెట్టి ంచి చివరకు అతడిని కటకటాల పాల్జేశారని, ఇటువంటి తండ్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. తప్పు చేశాడు కాబట్టే బెయిల్ రాలేదని, అయినా సిగ్గు లేకుండా చంచల్‌గూడ జైల్లో రాజకీయాలు చేస్తున్నాడని జగన్‌పై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సోదరులను అడ్డం పెట్టుకొని సొమ్ములు దండుకుంటున్నారని, ఒక సోదరుడు చిత్తూరులో, మరో సోదరుడు హైదరాబాద్‌లో దందా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధికారంలోకి రాగానే బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు.

మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే దోషులకు ఉరిశిక్షే విరుగుడు అని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులను ఆదుకోవడానికి వారి విద్యార్హతను బట్టి భృతిని అందిస్తామని చెప్పారు. పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లలతోపాటు మగపిల్లలకు కూడా సైకిళ్లు ఉచితంగా అందజేస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా రుణాలు ఇప్పిస్తామన్నారు. కాగా, విశాఖ జిల్లాలో శనివారంతో పాదయాత్ర ముగుస్తున్న దరిమిలా జిల్లా డిక్లరేషన్‌ను చంద్రబాబు ప్రకటించారు. విశాఖని ఐటీ కేంద్రంగా మారుస్తామని, బాక్సైట్ ఒప్పందాలు రద్దుచేసి, అధికారంలో ఉన్నంతకాలం అక్కడ తవ్వకాలు జరక్కుండా చూస్తామని హామీ ఇచ్చారు.
: "రాష్ట్ర మంత్రివర్గంలో సగం మంది ముద్దాయిలే. ఇక ముందు కేబినెట్ సమావేశాలు జైల్లోనే జరుగుతాయి'' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. 'అమ్మ హస్తం' పథకం మొండి హస్తంగా మారిందని, ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఉపయోగపడడం లేదని విమర్శించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం నంగినారుపాడు వద్ద శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 'కళంకిత' మంత్రులను కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతున్నదని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. "హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓబులాపురం గనుల కేసులో ఏ-4 నిందితురాలు.

అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలకు చెక్

చిరునవ్వుతో..!
మారిన చంద్రబాబు శైలి..
గంభీరతను వదిలేసి చిరునవ్వుకు పెద్దపీట
ప్రజలకు దగ్గరగా..
కుటుంబ పెద్దగా..
మాస్ లీడరైన హైటెక్ బాబు

హైదరాబాద్: 'విక్టరీ' పోయింది! 'నమస్కారం' వచ్చింది! 'వక్త' కాస్తా 'శ్రోత' అయ్యారు! మోములో గాంభీర్యం స్థానంలో చిరునగవు నాట్యమాడుతోంది! ఆవేశం, ఆగ్రహం స్థానంలోకి సౌమ్యత వచ్చి చేరింది! హైటెక్ బాబు కాస్తా మాస్ లీడర్ అయ్యారు! పాదయాత్ర తన కోపం నరాన్ని తెంపేసిందని అప్పట్లో వైఎస్ వ్యాఖ్యానిస్తే.. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర టీడీపీ అధినేత చంద్రబాబులో కొత్త మనిషిని ఆవిష్కరింపజేసింది. రోజుల తరబడి ప్రజల మధ్య గడపడం.. నిరుపేదలతో మమేకం కావడం.. రకరకాల జీవన శైలులను ప్రత్యక్షంగా చూడటం.. వారి కష్టసుఖాలను, ఆలోచనలను తెలుసుకోవడం.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఆయనలో ఈ మార్పునకు దారి తీసింది.

హైటెక్ బాబు అన్న ముద్రను పోగొట్టి జనం మనిషి అన్న పేరును తెచ్చింది. పాదయాత్రకు ముందు చంద్రబాబు జీవన శైలి వేరు. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన చొక్కాను నలగనిచ్చేవారు కాదు. క్రాఫ్ కొద్దిగా కూడా చెదిరేది కాదు. నిత్యం నల్లగా నిగనిగలాడే బూట్లతో కనిపించేవారు. జన సమూహాలకు ఒక అడుగు దూరంలో ఉండి మాట్లాడేవారు. ఎవరైనా దగ్గరగా వచ్చినా.. వారి భుజంపై చేయి వేసి మాట్లాడే అలవాటు తక్కువ. కానీ, ఇప్పుడు బాబులో ఎన్నో మార్పులు. చొక్కా నలిగినా, జుట్టు చెదిరినా పట్టించుకోవడం లేదు. ప్రజలతో మమేకం అవుతున్నారు. పాదయాత్రలో తన వద్దకు వచ్చిన వారి భుజాలపై చేయి వేసి నడుస్తూ మాట్లాడుతున్నారు.

గతంలో మాదిరిగా విక్టరీ చిహ్నం చూపించడం మానేసి చక్కగా నమస్కారం పెడుతున్నారు. పేదల గుడిసెలు, కాకా హోటళ్లు, రైతుల పొలాలు, కమ్మరి కొలుములు.. ఎక్కడికైనా వెళ్లిపోయి వారి పక్కనే కూర్చుని చేతిలో చేయి వేసి మాట్లాడుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తున్నారు. గంభీరంగా ఉండాలని ప్రయత్నం చేయకుండా నవ్వుతూ కలుపుగోలుగా ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ లీడర్‌గా పరివర్తన చెందారు. పాదయాత్రలో కేవలం తన ఉపన్యాసాలను వినిపించడమే కాకుండా ప్రతిచోటా వచ్చిన వారితో వివిధ అంశాలపై మాట్లాడించారు. రైతులు, కూలీలు, పొదుపు సంఘాల మహిళలు, వృత్తి కార్మికులు, యువకులు, విద్యార్థులు వంటి వివిధ వర్గాల వారికి మైకు ఇచ్చి వారి సమస్యలు, రాష్ట్ర సమస్యలు చెప్పాలంటూ ప్రోత్సహించారు.

దీంతో, స్థానికుల్లో ఆసక్తి పెరిగింది. పాదయాత్రపై చర్చ సాగుతోంది. చంద్రబాబు వెళ్లిన తర్వాత కూడా ఎవరేం మాట్లాడారు.. ఆయనేం చెప్పారన్నది ఆయా గ్రామాల ప్రజల్లో చర్చనీయాంశమైంది. తన ప్రసంగాల్లో చంద్రబాబు ఒక కుటుంబ పెద్ద మాదిరిగా మాట్లాడుతున్నారు. 'మీ కుటుంబ పెద్ద'గా ఉంటానని భరోసా ఇస్తున్నారు. "అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రం దెబ్బతింది. దాంతో, ప్రజల జీవితాలు కూడా దెబ్బతిన్నాయి. దీనిని మనం మళ్లీ గాడిలో పెట్టుకోవాలి. నేను మీ కుటుంబానికి పెద్దలాంటి వాడిని. మనని మనం బాగు చేసుకోవాలి. నాపై విశ్వాసం ఉంచండి.

మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత నాది'' అంటూ భరోసా ఇస్తున్నారు. బహిరంగ సభల్లోనూ.. ప్రజలతో మమేకమైనప్పుడే కాదు.. పార్టీ సమావేశాల్లోనూ చంద్రబాబు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలని వారి వెన్ను తడుతూ ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుని మాదిరిగా ఆయన ప్రసంగాలు సాగాయి. "ఏం చెబితే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఊగుతారో ఆయన అదే చెబుతున్నారు. అలా చెప్పాలా అని బయటి వారికి అనిపించవచ్చు. కానీ, అంతర్గత సమావేశాల్లో అలా మాట్లాడితేనే పార్టీ శ్రేణుల్లో కదలిక వస్తుంది'' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

ఒక చేత్తో పాదయాత్ర.. మరో చేత్తో పార్టీ వ్యవహారాలను ఒకేసారి చూసుకోవాల్సి రావడం చంద్రబాబుపై ఒత్తిడి పెంచినా వీలైనంత వరకూ ఆయన సంయమనం పాటించే ప్రయత్నం చేశారు. ఆవేశాన్ని తగ్గించుకొన్నారు. అవకాశాలు రాని నేతలు విరుచుకుపడినా.. పార్లమెంటుకు గైర్హాజరైన నేతలు పార్టీకి ఇబ్బంది కలిగించినా ఆవేశపడకుండా సౌమ్యంగానే ఆ సమస్యలను అధిగమించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడుతూ ఉత్సాహపర్చడం.. బాగా మాట్లాడిన వారిని అభినందించడం ద్వారా బాబు తమకు అందుబాటులోనే ఉన్నారన్న విశ్వాసం కలిగించడం ద్వారా టీం వర్క్‌ను పెంచారు.

కార్యకర్తలతోనై సరదా సరదాగా..ఇట్లు మీ కోసం