April 27, 2013

వైఎస్ 55 రోజులు..బాబు 208 రోజులు వైఎస్ 1356 కిమీ..బాబు 2817 కిలోమీటర్లు

రికార్డుల బాబు!
వైఎస్ పాదయాత్రకు రెట్టింపు నడక
వైఎస్ 53 ఏళ్లప్పుడు..బాబు 63 ఏళ్ల వయసులో
ప్రచారంలో మాత్రం వైఎస్‌కంటే వెనుకే....

హైదరాబాద్ : పాలనలోనే కాదు.. పాదయాత్రలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డులు బద్దలు కొట్టారు! ఇటీవలి కాలం వరకు బాగా ప్రాచుర్యం పొందిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు రెట్టింపు దూరం నడిచి గట్టి పిండంగా గుర్తింపు పొందారు. వయసు రీత్యా.. నడిచిన దూరం రీత్యా.. యాత్ర నిర్వహించిన తీరు రీత్యా బాబు యాత్ర అరుదైనదన్న ప్రశంసలు పొందుతోంది. సరిగ్గా దశాబ్దం కిందట పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి 1356 కి.మీ. నడిచారు. అప్పట్లో ఆయన వయసు 53 సంవత్సరాలు! రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు.

11 జిల్లాల్లోని 33 అసెంబ్లీ నియోజక వర్గాలను ఆయన సందర్శించారు. ఆయన పాదయాత్ర 55 రోజులపాటు సాగింది. కానీ, చంద్రబాబు 63 ఏళ్ల వయసులో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన 64వ పుట్టిన రోజును కూడా ఆయన పాదయాత్రలోనే జరుపుకొన్నారు. ఇక, చంద్రబాబు పాదయాత్ర సుదీర్ఘంగా 208 రోజులపాటు సాగింది. అంతే సుదీర్ఘంగా ఆయన 2,817 కి.మీ. నడిచారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మొదలు పెట్టి విశాఖ నగరంలోని శివాజీ నగర్‌లో ముగించారు. ఈ యాత్ర సందర్భంగా చంద్రబాబు 16 జిల్లాల్లోని 86 అసెంబ్లీ నియోజక వర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లు, 162 మండలాలు, 1,253 గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు.

"రాష్ట్రంలో ఇది అరుదైన రికార్డు. ఇప్పటి వరకూ ఎవరూ ఇంత దూరం పాదయాత్ర చేయలేదు. కొందరి పాదయాత్రలు మధ్యలో విరామం తీసుకొన్నాయి. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకొన్నవారు ఉన్నారు. కానీ, అక్టోబర్ 2న ఇంటి నుంచి బయలుదేరిన చంద్రబాబు.. అనారోగ్యం వేధించినా.. శరీరం సహకరించకపోయినా.. విరామం ఇవ్వాలని వైద్యులు సూచించినా.. యాత్ర ముగిసే వరకూ మళ్లీ ఇంటి గడప తొక్కలేదు. ఆయనకు మించిన పాదయాత్ర చేసిన వాళ్లు దేశంలో ఒక్కరే ఉన్నారు. ఆయనే.. మాజీ ప్రధాని చంద్రశేఖర్. ఆయన కన్యాకుమారి నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని మహాత్మ గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు పాదయాత్ర చేశారు.

ఆరున్నర నెలలపాటు 4,260 కిలోమీటర్లు నడిచారు. కానీ, ఆయన కూడా చంద్రబాబు మాదిరిగా ఇన్ని గ్రామాలు పర్యటించలేదు'' అని బాబు పాదయాత్రకు రూట్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించిన కంభంపాటి రామ్మోహన రావు చెప్పారు. కాగా, వైఎస్ పాదయాత్రకు, చంద్రబాబు పాదయాత్రకు మధ్య రెండు ప్రధాన తేడాలున్నాయి. చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ పదేళ్ల తక్కువ వయసులో పాదయాత్ర చేశారు. అందుకే, ఆయన కొంతవరకు సునాయాసంగా పాదయాత్ర చేయగలిగారన్నది కొందరి అభిప్రాయం. కానీ, 63 ఏళ్ల వయసులో ఇంత సుదీర్ఘ పాదయాత్ర సహజంగానే చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమే చూపింది.

ఇక, యాత్రా మార్గంలోనూ రెండు యాత్రల మధ్య తేడా ఉంది. వైఎస్ పాదయాత్ర ప్రధాన రహదారులపై సాగిపోగా.. చంద్రబాబు తన పాదయాత్రను వీలైనంత వరకూ ప్రధాన రహదారుల్లోకి పోకుండా గ్రామాల మీదుగా జరిపారు. ఎక్కువ గ్రామాల్లో ఎక్కువ మంది ప్రజలను సందర్శించాలన్న తపనతో ఆయన గ్రామీణ ప్రాంతాల మీదుగా యాత్ర జరిపారు. కాగా, వైఎస్ తన పాదయాత్ర ద్వారా తనపై ఉన్న ఫ్యాక్షనిస్టు ముద్రను పోగొట్టుకొని ప్రజా నేతగా అవతరించారు. చంద్రబాబు తన పాదయాత్ర ద్వారా తనపై ఉన్న వ్యతిరేకతలను చాలా వాటిని తగ్గించుకొని ప్రజా బాహుళ్యానికి చేరువ కాగలిగారు. మారిన మనిషిగా గుర్తింపు పొందారు.