April 27, 2013

కార్యకర్తలతోనై సరదా సరదాగా..ఇట్లు మీ కోసం

చిరునవ్వుతో..!
మారిన చంద్రబాబు శైలి..
గంభీరతను వదిలేసి చిరునవ్వుకు పెద్దపీట
ప్రజలకు దగ్గరగా..
కుటుంబ పెద్దగా..
మాస్ లీడరైన హైటెక్ బాబు

హైదరాబాద్: 'విక్టరీ' పోయింది! 'నమస్కారం' వచ్చింది! 'వక్త' కాస్తా 'శ్రోత' అయ్యారు! మోములో గాంభీర్యం స్థానంలో చిరునగవు నాట్యమాడుతోంది! ఆవేశం, ఆగ్రహం స్థానంలోకి సౌమ్యత వచ్చి చేరింది! హైటెక్ బాబు కాస్తా మాస్ లీడర్ అయ్యారు! పాదయాత్ర తన కోపం నరాన్ని తెంపేసిందని అప్పట్లో వైఎస్ వ్యాఖ్యానిస్తే.. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర టీడీపీ అధినేత చంద్రబాబులో కొత్త మనిషిని ఆవిష్కరింపజేసింది. రోజుల తరబడి ప్రజల మధ్య గడపడం.. నిరుపేదలతో మమేకం కావడం.. రకరకాల జీవన శైలులను ప్రత్యక్షంగా చూడటం.. వారి కష్టసుఖాలను, ఆలోచనలను తెలుసుకోవడం.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఆయనలో ఈ మార్పునకు దారి తీసింది.

హైటెక్ బాబు అన్న ముద్రను పోగొట్టి జనం మనిషి అన్న పేరును తెచ్చింది. పాదయాత్రకు ముందు చంద్రబాబు జీవన శైలి వేరు. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన చొక్కాను నలగనిచ్చేవారు కాదు. క్రాఫ్ కొద్దిగా కూడా చెదిరేది కాదు. నిత్యం నల్లగా నిగనిగలాడే బూట్లతో కనిపించేవారు. జన సమూహాలకు ఒక అడుగు దూరంలో ఉండి మాట్లాడేవారు. ఎవరైనా దగ్గరగా వచ్చినా.. వారి భుజంపై చేయి వేసి మాట్లాడే అలవాటు తక్కువ. కానీ, ఇప్పుడు బాబులో ఎన్నో మార్పులు. చొక్కా నలిగినా, జుట్టు చెదిరినా పట్టించుకోవడం లేదు. ప్రజలతో మమేకం అవుతున్నారు. పాదయాత్రలో తన వద్దకు వచ్చిన వారి భుజాలపై చేయి వేసి నడుస్తూ మాట్లాడుతున్నారు.

గతంలో మాదిరిగా విక్టరీ చిహ్నం చూపించడం మానేసి చక్కగా నమస్కారం పెడుతున్నారు. పేదల గుడిసెలు, కాకా హోటళ్లు, రైతుల పొలాలు, కమ్మరి కొలుములు.. ఎక్కడికైనా వెళ్లిపోయి వారి పక్కనే కూర్చుని చేతిలో చేయి వేసి మాట్లాడుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తున్నారు. గంభీరంగా ఉండాలని ప్రయత్నం చేయకుండా నవ్వుతూ కలుపుగోలుగా ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ లీడర్‌గా పరివర్తన చెందారు. పాదయాత్రలో కేవలం తన ఉపన్యాసాలను వినిపించడమే కాకుండా ప్రతిచోటా వచ్చిన వారితో వివిధ అంశాలపై మాట్లాడించారు. రైతులు, కూలీలు, పొదుపు సంఘాల మహిళలు, వృత్తి కార్మికులు, యువకులు, విద్యార్థులు వంటి వివిధ వర్గాల వారికి మైకు ఇచ్చి వారి సమస్యలు, రాష్ట్ర సమస్యలు చెప్పాలంటూ ప్రోత్సహించారు.

దీంతో, స్థానికుల్లో ఆసక్తి పెరిగింది. పాదయాత్రపై చర్చ సాగుతోంది. చంద్రబాబు వెళ్లిన తర్వాత కూడా ఎవరేం మాట్లాడారు.. ఆయనేం చెప్పారన్నది ఆయా గ్రామాల ప్రజల్లో చర్చనీయాంశమైంది. తన ప్రసంగాల్లో చంద్రబాబు ఒక కుటుంబ పెద్ద మాదిరిగా మాట్లాడుతున్నారు. 'మీ కుటుంబ పెద్ద'గా ఉంటానని భరోసా ఇస్తున్నారు. "అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రం దెబ్బతింది. దాంతో, ప్రజల జీవితాలు కూడా దెబ్బతిన్నాయి. దీనిని మనం మళ్లీ గాడిలో పెట్టుకోవాలి. నేను మీ కుటుంబానికి పెద్దలాంటి వాడిని. మనని మనం బాగు చేసుకోవాలి. నాపై విశ్వాసం ఉంచండి.

మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత నాది'' అంటూ భరోసా ఇస్తున్నారు. బహిరంగ సభల్లోనూ.. ప్రజలతో మమేకమైనప్పుడే కాదు.. పార్టీ సమావేశాల్లోనూ చంద్రబాబు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలని వారి వెన్ను తడుతూ ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుని మాదిరిగా ఆయన ప్రసంగాలు సాగాయి. "ఏం చెబితే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఊగుతారో ఆయన అదే చెబుతున్నారు. అలా చెప్పాలా అని బయటి వారికి అనిపించవచ్చు. కానీ, అంతర్గత సమావేశాల్లో అలా మాట్లాడితేనే పార్టీ శ్రేణుల్లో కదలిక వస్తుంది'' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

ఒక చేత్తో పాదయాత్ర.. మరో చేత్తో పార్టీ వ్యవహారాలను ఒకేసారి చూసుకోవాల్సి రావడం చంద్రబాబుపై ఒత్తిడి పెంచినా వీలైనంత వరకూ ఆయన సంయమనం పాటించే ప్రయత్నం చేశారు. ఆవేశాన్ని తగ్గించుకొన్నారు. అవకాశాలు రాని నేతలు విరుచుకుపడినా.. పార్లమెంటుకు గైర్హాజరైన నేతలు పార్టీకి ఇబ్బంది కలిగించినా ఆవేశపడకుండా సౌమ్యంగానే ఆ సమస్యలను అధిగమించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడుతూ ఉత్సాహపర్చడం.. బాగా మాట్లాడిన వారిని అభినందించడం ద్వారా బాబు తమకు అందుబాటులోనే ఉన్నారన్న విశ్వాసం కలిగించడం ద్వారా టీం వర్క్‌ను పెంచారు.