April 2, 2013


టి.డి.పి కే ఎక్కువ ఓట్లు

తేల్చుకుందాం.. రా!
నీ వాటా ఎంత?
విద్యుత్ వ్యవస్థని భ్రష్టు పట్టించిందెవరు?
చర్చకు రావాలని కిరణ్‌కు చంద్రబాబు సవాల్
కాకినాడలో ఒకరాజు దీక్ష.. విరమణ

కాకినాడ : విద్యుత్ వ్యవస్థను వైఎస్ భ్రష్టుపట్టిస్తే.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా అంధకారంలో ముంచారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. ఎవరి హయాంలో విద్యుత్ పరిస్థితి దిగజారిందో 'తేల్చుకుందాం.. రా' అంటూ కిరణ్‌కు సవాల్ విసిరారు. విద్యుత్ కోతలు, చార్జీల పెంపునకు వ్యతిరేకంగా కాకినాడలోని సబ్‌స్టేషన్ వద్ద చంద్రబాబు ఒకరోజు దీక్ష సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. అంతకుముందు..ఉదయం 10 గంటలకు పాదయాత్రగా తాను బస చేసిన ఆనంద భారతి గ్రౌండ్ నుంచి ఆయన బయలుదేరారు.

2.3 కిలోమీటర్ల మేర లాంతరు పట్టుకుని నడిచి.. జేఎన్‌టీయూ వద్ద గల నాగమల్లితోటలోని సబ్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. సాయంత్రం ఐదు గంటలకు కాకినాడకు చెందిన శ్రద్ధాజైన్, పూజా జైన్ అనే చిన్నారులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా విద్యుత్ విషయంలో ప్రభుత్వం వైఖరిని, సీఎం కిరణ్ నిర్లిప్తతను ఆయన ఎండగట్టారు. "1994 నుంచి 2013 వరకు విద్యుత్ వ్యవస్థపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిందే. ఎవరు బాగుచేశారు.. ఎవరు భ్రష్టుపట్టించారనేది తేలిపోవాలి. చర్చకు రావాలని కిరణ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసురుతున్నాను'' అని అన్నారు.



"మా హయాంలో చార్జీల రూపేణా రూ.1600 కోట్లు పెంచితే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు పెంచింది. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడి..రాష్ట్రంలో 10 లక్షలమంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. కరెంటు కొనుగోలు అవినీతిలో వైఎస్, కిరణ్‌కుమార్ రెడ్డిల వాటా ఎంతని ప్రశ్నించారు. బాబు దీక్షకు లోక్‌సత్తా, పురోహితుల సంఘం, బ్రాహ్మణ సంఘం, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్, పలు ప్రజాసంఘాలు, బార్ అసోసియేషన్, పారిశ్రామిక వేత్తల సమాఖ్య తదితర సంఘాలు సంఘీభావం తెలిపాయి.

అలాగే.. యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ కోతలు, చార్జీలపై తమ ఉద్యమం ఇప్పుడే మొదలయిందని, చార్జీలు తగ్గించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అనంతరం ఆయన కాకినాడ టౌన్‌లో పాదయాత్ర కొనసాగించారు. టీడీపీ హయాంలో ఆదర్శంగా కనిపించిన ఆంధ్రప్రదేశ్.. వైఎస్, కాంగ్రెస్ దొంగలవల్ల అవినీతికి రాజధానిలా మారిందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత క్రైస్తవ శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తామన్నారు. 'ఉద్యోగులూ! దొంగలపార్టీకి ఓటేయకండి..' అని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అవసరంలేదని గవర్నర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

కరెంటు అవినీతిలో వైఎస్ వాటా ఎంత?