November 14, 2012



వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి షరతు విధించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం విమర్శించారు. బాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర రంగారెడ్డిలో కొనసాగుతోంది. పాదయాత్రలో చంద్రబాబు ప్రజా సమస్యలను తెలుసుకొని వారిని ఓదార్చుతున్నారు.
కాంగ్రెసు ప్రభుత్వంలో బతకలేని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే పత్తి ఎక్కువగా పండించే ప్రాంతాల్లో స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వాన్ని అంతమొందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెసు రెండుగా చీలిపోయిందన్నారు. కేసులు ఎత్తివేస్తే తల్లి కాంగ్రెసులో చేరతామంటూ పిల్ల కాంగ్రెసు రాయబారాలు నడుపుతోందన్నారు. పిల్లలు కష్టపడి చదివి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు.
కెసిఆర్ అసలు రంగు తెలిసింది.. మోత్కుపల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసలు రంగును ప్రజలు తెలుసుకున్నారని తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని తెలంగాణవాదాన్ని అమ్ముకున్న ఘనత ఆయనదే అన్నారు. బాబు పాదయాత్రకు స్పందన చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. కెసిఆర్ మనసులో సమైక్యాంధ్ర బయట మాత్రం తెలంగాణ అని ఆ పార్టీ నేతలే అంటున్నారని విమర్శించారు.
కెసిఆర్‌కు చంద్రబాబుతో కలిసి కూర్చునే అర్హత లేదన్నారు. తెలంగాణ అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలతో కెసిఆర్ వ్యాపారం చేస్తున్నారని, ఆయన తెలంగాణ తెస్తానంటే నమ్మేవారు లేరన్నారు. అబద్దాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు స్థానాల్లో గెలిస్తే కెసిఆర్ వాళ్లను అమ్ముతారని అన్నారు. అఖిలపక్షం నిర్వహించమని కెసిఆర్ ఎప్పుడైనా అడిగారా అని ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేందుకు సోనియా గాంధీకి షరతు



రంగారెడ్డి, నవంబర్ 14 : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 40 వ రోజు పాదయాత్రలో భాగంగా బుధవారం ఉదయం కంకల్‌లోని ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ హయాంలో వేసిన రోడ్లే తప్ప ఇప్పటి వరకు ప్రభుత్వం రోడ్లు వేయలేదని, ఆ నిధులన్నీ దోచేశారని మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు19 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు.

హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా మారింది : చంద్రబాబు