November 12, 2012



ఆ పార్టీలు జంపు జిలానీలే
అటూ ఇటూ దూకేందుకు తహతహ..
కాంగ్రెస్‌తో విలీనం కోసం పోటాపోటీ
యాత్రను చూసి గుభేలు..
అందుకే అడ్డంకులు..
టీఆర్ఎస్, వైసీపీలపై బాబు నిప్పులు
రంగారెడ్డిజిల్లా, నవంబర్ 12: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు టీఆర్ఎస్, పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) పోటీపడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. విలీనం కోసం గులాబీ నేతలు రోజూ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో ముస్లిం సామాజికవర్గానికి 15 సీట్లు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎంఐఎం బయటకు రావడం, టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ విలీనానికి అదొక సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్న తరుణంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాబోయే రాజకీయ పరిణామాలను ముందే ఊహించి శ్రేణులను సమాయత్తం చేయడమే కాదు.. తాజా పరిణామాలతో చీలే ముస్లిం ఓటుపై టీడీపీ దృష్టి కేంద్రీకరించినట్టు కూడా ఆయన తాజా ప్రకటన సూచిస్తోంది. 'వస్తున్నా..మీకోసం ' పాదయాత్రలో భాగంగా సోమవారం ఆయన రంగారెడ్డిజిల్లా పరిగి నియోజకవర్గంలో యాత్ర కొనసాగించారు. తిమ్మాయిపల్లి, ఊట్‌పల్లి, రామిరెడ్డిపల్లి గేటు, నారాయణపూర్ గేటు, సుల్తాన్‌పూర్, పరిగి, హన్మున్‌గండి మీదుగా ఆయన పాదయాత్ర రంగాపూర్ వరకు కొనసాగించారు. మార్గ మధ్యలో ఆయన రైతులు, విద్యార్థులు, మహిళలను కలిసి వారి సమస్యలను విన్నారు. "తెలుగుదేశం పార్టీపై కొన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయి.

మీ అండ ఉండగా అవేమీ చేయలేవు'' అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని తాము సవాల్ విసురుతున్నా ఎవరూ రావడం లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ముక్కలు తిని ప్రజలకు మెతుకులు వేస్తున్నారన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి వళ్లంతా పొగరేనని వ్యాఖ్యానించారు. "పేదలేమైనా టాటాలూ బిర్లాలా? మీరు వేసే పన్నులకు డబ్బు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాల''ని నేరుగా సీఎంను ప్రశ్నించారు. దీపావళి, ఇతర పండుగలను కూడా చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నానా కష్టాలు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ తన తనయుని కోసం హైదరాబాద్ సగాన్ని అమ్మేశారని, ఆయన హయంలో మొదలైన అవినీతి కొనసాగుతుందన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలుపై చర్చజరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుంటే వీరికి టీఆర్ఎస్ వత్తాసు పలుకుతుందని ధ్వజమెత్తారు. పిల్ల కాంగ్రెస్ వల్ల కూడా ఏమీ జరగదని, ఏ అనుభవం లేకున్నా కొందరు సీఎం పదవి కావాలనుకుంటున్నారని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "నల్గొండలో పిల్ల కాంగ్రెస్ సభ పెడితే ఎవరూ అడ్డుపడరు. అదే తాము పాదయాత్ర చేస్తే అడ్డుకుంటున్నారు. తెలుగుదేశాన్ని లేకుండా చేసి భూస్వాములు, పెత్తందార్లు రాజ్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని ఆరోపించారు.

కొన్ని పార్టీలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నందునే పాదయాత్ర అడ్డుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు. సకల జనుల సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం తాము అధికారంలోకి వస్తే కొత్త పాలసీని తీసుకువస్తామని చెప్పారు. ఆర్టీసీని తాము ప్రైవేటు పరం కాకుండా కాపాడతామని తెలిపారు. గీత కార్మికులకు జీవిత కాల లైసెన్స్ ఇస్తామని చెప్పారు. ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని తెలిపారు. కాగా, పరిగి, సుల్తాన్‌పూర్, తిమ్మాయిపల్లి, రంగాపూర్‌ల్లో చంద్రబాబుకు ముస్లింలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చంద్రబాబు వరాల వాన కురిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు 8 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనాభా దామాషా ప్రకారం వచ్చే శాసనసభ ఎన్నికల్లో 15 సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా రూ.2500 కోట్లతో వారి కోసం బడ్జెట్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. మసీదు నిర్మించుకోవడం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చా రు. ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే రూ. 50 వేలతో పాటు షాదిఖానల నిర్మాణం కోసం రూ. 15 లక్షలు కేటాయిస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 525 షాదిఖానలు నిర్మించిన విషయం గుర్తుచేశారు.

ఇదిలా ఉండగా, పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్టు ప్రచారం జరుగుతున్న హరీశ్వర్‌రెడ్డికి అత్యంత అనుబంధం కలిగిన ఆయన తాత ఊరు ఊట్‌పల్లి గ్రామాన్ని చంద్రబాబు కలియదిరిగారు. సోమవారం ఉదయం 11.17 గంటలకు తిమ్మాయపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు ఊటుపల్లిలో వీధి వీధినా తిరిగారు. 30 కుటుంబాలతో మాట్లాడారు. గ్రామంలో గొల్ల బాలయ్య ఇంటికి వెళ్లగా గొంగళి, మేక పిల్లను బహూకరించారు.

పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి చంద్రబాబు ఇంత వరకూ ఏ గ్రామ వీధుల్లో కూడా తిరగలేదు. నర్సమ్మ, కిష్టమ్మ, గౌరమ్మ, ఈడ్గి కిష్టమ్మ, మామిళ్ల కిష్టమ్మ, పరిగి అనంతయ్య అనే వృద్ధులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. రాంచంద్రయ్య అనే వడ్రంగి వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకున్నారు. పెద్ద బాడిషాతో పాలెను చెక్కి చూపించారు. గొల్ల ఎల్లయ్య మందను చూసి మేకల పెంపకం ఎలా ఉందని అడిగారు.

గొర్రెల కంటే పాడి పశువులను పోషించుకుంటే లాభసాటిగా ఉంటుందని సలహా ఇచ్చారు. సాక్షరభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మహిళలను ఆరా తీశారు. మైసమ్మ దేవాలయంలో పూజలు చేశారు. తాగునీటి సమస్య అధికంగా ఉందని మహిళలు చెప్పడంతో ఓ చేతి పంపును కొట్టి నీళ్లను పరిశీలించారు.

ఆ పార్టీలు జంపు జిలానీలే, అటూ ఇటూ దూకేందుకు తహతహ.


42వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర పోటోలు....12.11.2012



రాష్ట్రంలో అత్యంత నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయని చంద్రబాబు సోమవారం రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగిన పాదయాత్రలో వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో ఎక్కడా జరుగని విధంగా ఎమ్మెల్యేలలను సంతలో పశువుల్లా కొంటున్న నీచ చరిత్ర వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు. వీరు కూడా తాము మనుషులమని, ప్రజా ప్రతినిధులమని మరిచిపోయి ఓ రేటుకు అమ్ముడుపోతున్నారని అన్నారు. వైఎస్సార్, జగన్ ఇద్దరూ కలిసి రాజకీయాలను డబ్బుతో కలుషితం చేశారన్నారు. అయినా దోచుకున్న డబ్బు కాబట్టే ఇంత విచ్చలవిడిగా ఖర్చుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఇపుడు మనుషుల్లో విలువలు పడిపోయానని, నేతల్లో అస్సలు లేవని ఆయన ఆవేదన చెందారు. చిన్న చిన్న స్వలాభాల కోసం వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని, రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని చంద్రబాబు “వలస” నేతలకు సూచించారు. రాజకీయాల్లో డబ్బు కొంతకాలమే కాపాడుతుందని, విలువలుంటేనే శాశ్వతంగా ఇక్కడ నిలదొక్కుకోగలమని అన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు చంద్రబాబుకు ముస్లింలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. వారినుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ మైనార్టీలకు స్వయం ఉపాధి కల్పించింది టీడీపీయే అన్నారు. మా హయాంలో మతకలహాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా గడిచిందన్నారు. కానీ, లౌకిక పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అనేక చోట్ల అనేక సార్లు మతకలహాలు జరిగాయని అన్నారు.

మనుషులమని, ప్రజా ప్రతినిధులమని మరిచిపోయి ఓ రేటుకు అమ్ముడుపోతున్న ఎమ్మెల్యే లు