October 5, 2013


రాష్ట్ర విభజన అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నడుంబిగించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్దికోసం ఏకపక్ష నిర్ణయం తీసుకున్న వైనాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను జాతీయ పార్టీల దృష్టికి తీసుకురావాలని ఆయన సంకల్పించారు. రాష్ట్రాన్ని విభజించి తద్వారా తెలుగు ప్రజల మధ్య చిచ్చు రగిల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యత్నించిందని, అందులో భాగంగానే విభజన నిర్ణయాన్ని ప్రకటించిందన్న అంశాన్ని జాతీయ స్థాయి నేతలకు వివరించి తద్వారా వారి మద్దతును కూడా కూడగట్టాలని చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు విభజన ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధినాయకత్వం తెరపైకి తెచ్చిన కుట్రను దేశ ప్రజలకు వివరించాలని ఆయన ప్రతిపాదించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం విభజన నిర్ణయం తీసుకున్న విధానాన్ని ఎండగట్టేందుకే దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రజల సమస్యలు, డిమాండ్లను దేశ ప్రజలకు వివరించేందుకే దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్రకు తాను అనుకూలమనే రీతిలో సీమాంధ్ర ప్రజలకు సంకేతాలిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సీమాంధ్ర ప్రజలకు తాను అండగా ఉంటానన్న రీతిలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి, ఉద్యమంలో తమ పార్టీ కార్యకర్తలు భాగస్వాములు అయ్యేందుకు అవకాశం దక్కించుకునేందుకు ఈ దీక్ష దోహదపడుతోందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం ఇరు ప్రాంతాల పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

తమ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే తెరాస, వైకాపాలతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారాన్ని కూడా జాతీయ పార్టీలకు వివరించాలని నిర్ణయించారు. ఈ దీక్షలో జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీల నేతల సంఘీభావాన్ని కూడగట్టాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌ నిర్లక్ష్య వైఖరి, ప్రజల మధ్య ఏర్పడిన విభేదాలను జాతీయ స్థాయిలో వెలుగెత్తేందుకు ఈ దీక్షా వేదికను వాడుకోవాలని ఆశిస్తున్నారు. రాష్ట్ర విభజనలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేసే అంశంపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిసారించకపోవడం, రాజకీయ లబ్ధికోసం తీసుకున్న విభజన నిర్ణయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఈ దీక్షకు పూనుకుంటున్నారు. విభజనపై సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తెలుసుకున్న భాజపా అగ్రనేత అద్వానీ కూడా కాంగ్రెస్‌ నిర్ణయంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేసిన దాఖలాలు గతంలో లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల డిమాండ్ల పరిష్కారానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలన్న విషయంలో చంద్రబాబు దీక్ష చేపడుతున్నారు. విభజన ప్రక్రియలో సీమాంధ్ర ప్రజలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్న యోచనలో తెదేపా ఈ దీక్షకు పథకం వేసింది. అయితే తెలంగాణకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, కేవలం సీమాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యతనిచ్చి ఆ కోణంలోనే దీక్షకు వ్యూహరచన చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తెలుగు ప్రజల మధ్య చిచ్చు రగిల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యత్నించింది


కాంగ్రెస్, వైసిపి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందువల్లే జగన్ కు బెయిల్ వచ్చిందని చర్చలో పాల్గొన్న టిడిపి ఎంపి శివ ప్రసాద్ విమర్శించారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించుకుందని చెప్పారు. దాని ప్రకారమే అటు తెలంగాణలో టిఆర్ఎస్ ను, ఇటు సీమాంధ్రలో వైసిపి ని కలుపుకునే పనిలో పడిందిని చెప్పారు. గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ సీమాంధ్రలో తన అస్తిత్వం కోల్పోయిందని తెలుస్తుందని అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ అధినేత చంద్రబాబు బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలవడం వెనుక రాజకీయకారణాలేమీ లేవని చెప్పారు. వక్రమార్గాల ద్వారా జగన్ బెయిల్ పై బయటికి వచ్చారని విమర్శించారు. ఇప్పుడు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వైసిపి స్టాండ్ తీసుకోగలదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, వైసిపి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందువల్లే జగన్ కు బెయిల్ వచ్చింది