September 22, 2013

తెదేపా. ముప్పైఏళ్ళ రాజకీయ ప్రస్తానంలో సంచలనాలు సృష్టించిన పార్టీ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సర్కారును కూలదోయడంలో, విభిన్న ధృవాల్లాంటి పార్టీలను ఒకే గొడుగుకిందకు చేర్చి ఢిల్లీ సర్కారును ఏర్పాటు చేసిన చరిత్ర పారీే్టక సొంతం. అన్న ఎన్టీఆర్, వారసునిగా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలలో తమదైన ముద్ర వేసినవారే. ఈ పార్టీకి సెక్యులర్ పార్టీగా పేరుంది. భాజపా. దేశంలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీ. మతతత్వ ముద్ర కలిగిన పార్టీ. దాదాపు ఆరేళ్ళ పాటు కేంద్రంలో సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించిన పార్టీ. కొన్ని అంశాల్లో ఈ రెండు పార్టీల మధ్య సారూప్యత లేకున్నా ఒక అంశంలో మాత్రం రెండింటిదీ ఒకే వైఖరి. అదే కాంగ్రెస్ వ్యతిరేక విధానం. ఈ విధానంతోనే 199, 1999ల్లో ఏర్పాటైన ఎన్డీయేసర్కారుకు తెదేపా మద్దతు ప్రకటించింది. ఎన్డీయే సర్కారుకు తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆయువు పట్టులా నిలవగా... 1999లో చంద్రబాబు సర్కారు విజయం సాధించడానికి ఎన్డీయే హయాంలో జరిగిన కార్గిల్ వార్ వంటి విజయాలు దోహదకారిగా నిలిచాయనడంలో సందేశం లేదు. తదనంతర పరిణా మాల్లో వామపక్షాలతో తెదేపా అడుగులు వేయడంతో బిజెపికి దూరమయింది. మారిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పొత్తుల గురించి దీర్ఘంగానే ఆలోచించింది. ఈ అంశంలో తమిళనాడు పార్టీల అనుభవాలను అవలోకనం చేసుకుంది. బద్దశత్రువైన కాంగ్రెస్‌ను తుదముట్టించే మార్గాల్లో ముందుగా తృతీయ ఫ్రంట్‌తో ముందుకు నడిచే అంశాన్ని పరిశీలించింది. ములాయం, మాయా వంటి అవకాశవాద రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన నేతలతో అయ్యేపని కాదని గత అను భవాలతో నిర్థారించుకుంది. కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయి పార్టీ అవసరమని గట్టిగా అభిప్రాయపడింది. మతతత్వ ముద్ర వుందికదా అనే అంశంపై తర్జనభర్జన చేసింది. ముస్లిం ఓటర్లలో కొందరు దూరమయ్యేది ఖాయమని అంచనా వేసుకుంది. అయితే మోడీకి వున్న ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఆయన నాయకత్వంపై యువత, విద్యావంతుల్లో పెరుగుతున్న అంచనాలతో పోల్చుకుంటే నష్టపోయేది తక్కువే, లాభపడేది ఎక్కువనే తనదైన విశ్లేషణలో నిర్థారించుకుంది. మోడీ గుజరాత్‌లో చూపించిన అభివృద్ధి నమూనా ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి నమూనాకు లభించిన ప్రశంసలు, మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేశాక దేశవ్యాప్తంగా పెరిగిన క్రేజీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీని కమలదళంతో స్నేహానికి అడుగులు వేయించాయని చెప్పవచ్చు. హైదరాబాద్‌లో మోడీ చేసిన ప్రసంగం, జనస్పందన కూడా తెలుగుదేశం శిబిరాన్ని ఆలోచింపజేసింది. ఎన్టీఆర్ తరహాలో కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో ఓడించేందుకు తమతో కలిసిరావాలని మోడీ తెదేపాకు పిలుపునిచ్చిన విషయం విధితమే. కాంగ్రెస్‌తో ఆదినుంచి శతృపార్టీగా చూసే చరిత్ర కలిగిన తెలుగుదేశం దానికి శతృవైన బిజెపితో కలిస్తే రాష్ర్ట ప్రయోజనాలు కూడా కాపాడుకోవచ్చుననే ఆలోచన తెదేపాలో మొగ్గతొడిగింది. మొన్నటి వరకు ఈ రెండుపార్టీలను శతృపార్టీలగానే చూడగా, అయితే కాంగ్రెస్ కంటే బిజెపి బెటర్ అనే అభిప్రాయం వినవస్తోంది. అందునా ఓబీసీలను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పటికే బీసీల్లో గట్టి పట్టువున్న తెదేపా ఓటు బ్యాంకు మరింత సుస్థిరమవుతున్నదన్నది అంచనా. రాష్ర్ట పరిస్థితుల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా తనతో కలిసే, విలీనమయ్యే తెరాస, వైకాపాలతో లోపాయికారి ఒప్పందాలతో ముందుకు సాగుతోంది. విభజన తర్వాత ఎన్నికలు జరుగుతాయా లేక సమైక్య రాష్ర్టంలోనే ఎన్నికలు జరుగుతాయా అన్న అనిశ్చితి ఇంకాకొనసాగుతూనే వుంది. రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారి పోతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కేడర్ కలిగిన భాజపాతో కలిస్తే దానికి తమకు వున్న ఓటు బ్యాంకు కూడా తోడైతే ఉభయతారకంగా వుంటుందని అంచనా వేసుకుంది. అటు సీమాంధ్రలోనూ విద్యావంతులు, యువత, మధ్యతరగతి కుటుంబీకుల ఓట్లతో పాటు బీసీలు, భాజపా సాంప్రదాయ ఓటు కూడా తమకు అనుకూలంగా వుంటుందన్నది ఒక అంచనా. ముస్లిం ఓటర్లు సహజంగానే కాంగ్రెస్, వైసీపీ, తెరాస ఇతర సెక్యులర్ ముద్ర కలిగిన పార్టీల మధ్య చీలిపోతాయికనుక తమ పార్టీ ఈ రకంగా నష్టపోయే ఓట్లను భాజపా స్నేహంతో పూడ్చుకోవడంతో పాటు, అదనంగా మోడీ ఆదరణను మరిన్ని ఓట్ల రూపంలో పొందవచ్చునన్నది అంచనా. రాష్ర్ట ప్రయోజనాలను కాపాడుకోవాలి, కేంద్రంలో అనుకున్న అభివృద్ధి పనులు సాధించుకోవాలంటే ప్రధాన పార్టీ అయిన భాజపాతో కలిసి నడవటమే శ్రేయస్కరమని తెదేపా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. గత కొన్ని నెలలుగా ఈ అంశంపై తెదేపా శ్రేణులు అధినేతపై ఒత్తిడి చేస్తూనే వున్నారు. ముస్లింలను దూరం చేసుకుంటామనే సంకోచం ఆయన్ను ఇన్నాళ్ళూ వెనుకంజ వేయించింది. అయితే మారుతున్న సమీకరణలు కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్న వైనం, మోడీకి గతంలో వున్న మైనస్‌లకు అతీతంగా అన్ని వర్గాల్లో పెరిగిన ఆదరణ, మూడో ఫ్రంట్‌పై ఆవిరైన ఆశలు, తమిళనాడు అనుభవాలు వెరసి చంద్రబాబును భాజపా దోస్తీవైపు అడుగులు వేయించినట్టుగా తెలుస్తోంది.అక్టోబర్ మొదటి వారం నుంచే భాజపా, తెదేపాలు కలిసి పనిచేయ బోతున్నాయి. ఈ అంశంపై చంద్రబాబు, మోడీలు ఒక అవగాహనకు వచ్చారని విశ్వసనీయ సమాచారం. ఏపీలోని 42 లోక్ సభ సీట్లను మెజార్టీని సొంతం చేసుకోవాలనే వ్యూహంతో ఈ ఇద్దరూ కలిసి అడుగులు వేయబోతున్నారు. దాంధీ జయంతి వేదికగా ఇందుకు ముహూర్తం ఖరారయిందని సమాచారం. అదే రోజున మోడీ, బాబు ఒకే వేదికను పంచుకో బోతున్నారు. అయితే వేదిక ఎక్కడ అనేది సస్పెన్స్.

త్వరలో తెదేపా, భాజపాల... పరిణయం

 సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నేత దేవినేని చంద్రశేఖర్ సోమవారం 72 గంటల దీక్షకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, గద్దెరామ్మోహన్, విద్యాసాగర్ దీక్షకు మద్దతు తెలిపారు.

దేవినేని చంద్రశేఖర్ 72 గంటల దీక్

రాష్ట్రాభివృద్ధే నాకు ముఖ్యం
ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దనే ఢిల్లీ వచ్చా
కానీ, కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది
టీఆర్ఎస్ విలీనం, వైసీపీ పొత్తుపైనే దాని దృష్టి: చంద్రబాబు

సున్నితమైన రాష్ట్ర విభజన వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్‌ను విలీనం చేసుకునేందుకు, వైసీపీతో పొ త్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. "నాది టీటర్నో, యూటర్నో కాదు.. పీ టర్న్. అంటే ప్రజల టర్న్. ఇరు ప్రాంతాల బాగోగుల కోసం, తెలుగుజాతి కోసం పోరాడుతున్నాను. ఒక తండ్రికి ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరో ఒక్కరి సంక్షేమాన్నే కోరుకోడు. నేను కూడా మూడు ప్రాంతాల ప్రజల ను పిల్లల మాదిరిగా భావిస్తున్నాను. వారందరి బాగోగులు కోరుకుంటున్నా ను'' అని వివరించారు.


రాష్ట్రంలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు చొరవ చూ పాలంటూ పార్టీ ఎంపీలతో కలిసి శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన ఆయన ఆదివారం జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, సీపీఐ వృద్ధనేత ఏబీ బర్ధన్‌లతో భేటీ అయ్యారు. ఆ వివరాలను విలేకరుల సమావేశంలో వివరించారు. రాష్ట్ర ప్రజల సమస్యల కంటే రాజకీయాలే కాంగ్రెస్‌కి ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. తన ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆ పార్టీ తగలబెడుతోందని, ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ పార్టీలోని ఇరు ప్రాంత నాయకులు ద్వం ద్వ వైఖరి అవలంభిస్తున్నారన్నారు.

"తెలంగాణలో టీఆర్ఎస్‌ను విలీనం చేసుకుని, సీమాంధ్రలో జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుని..రెండు చోట్లా లబ్ధి పొందాలన్నదే కాంగ్రెస్ తాపత్రయం. కాబట్టే, తెలంగాణకు మద్దతు ఇస్తున్న బీజేపీ, సీపీఐలతో పాటు జాతీయ పార్టీలైన జేడీయూ, డీఎంకే, ఏఐడీఎంకే, ఏజీపీ, టీఎంసీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు సైతం కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి'' అన్నారు. విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ పరిష్కరించిన విధానం తప్పన్నారు. "రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వస్తా యి. పోతాయి. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ కాదు. అది కాంగ్రెస్ సొంత జాగీ రూ కాదు. కానీ, కాంగ్రెస్ మాత్రం అదే ధోరణిలో ఉంది. విభజన ప్రక్రియను సొంత పార్టీ అంతర్గత వ్యవహారంగా మార్చేసింది'' అని ఆరోపించారు.

తెలంగాణలో 42 రోజులు సకల జనుల సమ్మె జరిగి, వందలాది మంది యువత బలిదానాలు చేసుకోగా, సీమాంధ్రలో గత 57 రోజులుగా ప్రజలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. "పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించటంతో ఇటు టీఆర్ఎస్‌తోనూ, అటు వైసీపీతోనూ ఒప్పందాలు కుదుర్చుకుని, సమస్యను పరిష్కరించాల్సిన కాంగ్రెస్సే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. తెలంగాణ ప్రకటన చేసిన వేదికపై నుంచే టీఆర్ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేసుకుంటామని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.

వైసీపీదీ తమదీ ఒకటే డీఎన్ఏ అన్నారు. తమను విమర్శించినా అది తమకు మేలే చేస్తుందని రాజ్యసభలో చిదంబరం వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూసిన తరువాతే ప్రధానమంత్రికి నేను లేఖలు రాయగా ఆయన పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రపతి జోక్యం కోరుతూ ఢిల్లీకి వచ్చాను'' అని వివరించారు. వాస్తవానికి కాంగ్రెస్‌దీ, వైసీపీదీ దేశాన్ని దోచుకునే డీఎన్ఏ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్రం, కాంగ్రెస్ నేతలు స్పందించకుంటే, వారి సంగతి ప్రజలే చూసుకుంటారని హెచ్చరించారు. సోనియాగాంధీ టెన్ జన్‌పథ్ నుంచి రాస్తున్న స్క్రిప్ట్ ప్రకారం కిరణ్, కేసీఆర్, జగన్ నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు.

కాగా, రాష్ట్ర పరిస్థితుల గురించి చంద్రబాబు వివరించగా, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఆయన వాదనను ఒకింత ఆందోళనతో ఆలకించారు "ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలంతా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోరుతున్నప్పుడు వారి డిమాండ్లకు స్పందించకపోవటం సరికాదు. దేశాన్ని నడిపే పద్ధతి ఇది కాదు. అభివృద్ధిపథం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను పక్కదోవ పట్టించారు. తిరిగి ఆంధ్రా అభివృద్ధి పథంలోకి రావాలి'' అని శరద్ యాదవ్ ఆకాంక్షించారు.

కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న చంద్రబాబు విజ్ఞప్తిపై సీపీఐ నేత బర్ధన్ సానుకూలంగా స్పందించారు. "అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం అంధకారంలోకి నెట్టింది. ఇరు ప్రాంతాల నేతలను కేంద్రం పిలిచి చర్చలు జరపాలి. కానీ, కేంద్రం అచేతనంగా ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది'' అని బర్ధన్ విమర్శించారు. ఇదిలాఉండగా, ఢిల్లీలో సోమవారం జరగనున్న జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.

బిడ్డల బాగు కోరుకునే తండ్రిని ఇరు ప్రాంతాలవారూ నా పిల్లలే....

జాతీయ రాజకీయాల్లో సానుకూల పాత్ర పోషిస్తాం
ఢిల్లీలో చంద్రబాబు వెల్లడి

దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ.. జాతీయ స్థాయిలో సానుకూల పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ఎన్డీయేతో కలిసి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ఆదివారమిక్కడ ఆయన వ్యాఖ్యానించారు. "ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న విశాలమైన రోడ్లు,సెల్‌ఫోన్లు అప్పటి మా కృషి ఫలితమే. దేశం గర్వించే రీతిలో పనిచేశాం'' అని వివరించారు. కాంగ్రెస్, యుపీఏ మాత్రం దేశాన్ని దోచుకుంటోం దని, ఆర్థిక రంగం అధోగతి పాలైందన్నారు. "ప్రజలంతా నిరాశలో ఉన్నారు. జాతి మొత్తం ఇలా సమస్యల్లో పడినప్పుడు టీడీపీ మరోసారి కీలక పాత్ర పోషిస్తుంద''ని వెల్లడించారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు ఎప్పుడు పెట్టుకుంటున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు.


"రాజ్‌నాథ్‌ని కలిశాను. రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఆయనతో రాజకీయాలు ఎలా మాట్లాడగలను. సమస్యలు ముగియగానే తప్పకుండా దేశంపై దృష్టి సారిస్తాను. దానికి ఇంకా సమయం ఉం ది'' అని వివరించారు. "ఎన్డీయే కన్వీనర్‌గా మిమ్మల్ని చూడొచ్చా?''.."మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై మీ వైఖరి ఏమిటి?'' అంటూ పలు విధాలుగా ప్రశ్నించినప్పటికీ చంద్రబాబు నవ్వుతూ.. వ్యాఖ్యానించేందుకు సున్నితంగా తిరస్కరించారు. విలేకరులు తెలివైన వారని, అయితే ఇప్పుడు తాను రాజకీయాల గురించి మాట్లాడదల్చుకోలేదని బదులిచ్చారు.

"ఎన్డీయే కన్వీనర్‌గా మిమ్మల్ని చూడొచ్చా?''.."మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై మీ వైఖరి ఏమిటి?''

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : ఎన్నికల ముందే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలుసుకున్నాయని, వైసీపీ ఎందుకోసం పనిచేస్తోందో అర్థమవుతోందని, జగన్మోహన్‌రెడ్డిని బెయిల్‌పై బయటకు తెచ్చేందుకే కాంగ్రెస్‌తో కలిసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం అన్నారు.  కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల సతీమణులు రాష్ట్రపతిని కలవడం ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి నిదర్శనమని అన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని సోమిరెడ్డి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకుల సతీమణులు భర్తలకు తెలియకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలను సీమాంధ్రలో అడ్డుకుంటుంటే వారి సతీమణులతో కలిసి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. విభజన విషయంలో సీమాంధ్ర నేతలను ఒప్పించేందుకే కాంగ్రెసు పార్టీ ఆంటోని కమిటీని వేసిందని, ఇక్కడి ప్రజలను మెప్పించేందుకు ఏం కమిటీ వేస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు.

భర్తలకు తెలియకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లారా ?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే కొన్ని సార్లు నిద్ర పోలేక పోతున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం సీపీఐ జాతీయ నేత ఏబి బర్దన్‌ను కలిసిన అనంతరం బాబు మీడియాతో మాట్లాడారు. బర్దన్‌కు రాష్ట్ర పరిస్థితి వివరించానని అన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నానని బర్దన్ చెప్పారని అన్నారు.

కాంగ్రెస్‌కు ఇప్పటికైనా కనువిప్పు కలిగిన సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. సీమాంద్రలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కేంద్రానికి ఉందన్నారు.

పరిస్థితులను చూస్తుంటే కొన్ని సార్లు నిద్ర పోలేక పోతున్నా...........

రాజ్యాంగాధినేతగా జోక్యం చేసుకోండి
కేంద్రానికి ఆదేశాలు జారీచేయండి
ఇరు వర్గాలనూ పిలిచి మాట్లాడాలి
సానుకూల పరిష్కారం సాధించాలి
రెండు లేఖలు రాసినా స్పందించని ప్రధాని
చిదంబరం, షిండే బాధ్యాతారాహిత్యం
రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు
రాష్ట్రంలో పరిస్థితి వివరణ

రాష్ట్రంలో పరిస్థితి దిగజారుతోందని, తక్షణం జోక్యం చేసుకుని చిచ్చు చల్లార్చాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. ఇరుప్రాంతాలకు చెందిన నేతలతో శనివారం ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిశారు. కేంద్రం వైఖరి వల్ల ప్రజల్లో రాజకీయ వ్యవస్థపైనే విశ్వాసం సన్నగిల్లుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చంద్రబాబు చెప్పారు. వివిధ జేఏసీలు, పౌర సమాజ సంస్థలు, సమస్యతో ముడిపడి ఉన్న ఇతర వర్గాలతో వెంటనే చర్చలు జరపాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.

"రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆగస్టు 9, 29 తేదీల్లో లేఖలు రాశాను. ఉద్యమిస్తున్న వర్గాల మధ్య సయోధ్య ఏర్పర్చాల్సిన అవసరాన్ని గుర్తు చేశాను. ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఒక రాజనీతిజ్ఞుడిగా క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి.... 'ఆంటోనీ కమిటీకి చెప్పుకోండి' అని ఎన్జీవో నేతలకు సూచించడం అభ్యంతరకరమన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీని ఇతరులెలా కలుస్తారని ఆయన ప్రశ్నంచారు. అంటే విభజన వ్యవహారం కాంగ్రెస్ తన అంతర్గత సమస్యగా భావిస్తోందని అన్నారు.


"అభివృద్ది పథంలో ముందంజ వేస్తూ, శాంతియుత వాతావరణానికి పేరెన్నికగన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల కనీవినీ ఎరగని రీతిలో నష్టపోయింది. గత నాలుగుదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయింది. ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. టీఆర్ఎస్‌ను విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ రాజకీయ కుతంతాలు పన్నింది. వైసీపీ, కాంగ్రెస్ కూడా కుమ్మక్కయినట్లు ఆ పార్టీల వైఖరిని బట్టి తెలుస్తోంది'' అని చంద్రబాబు రాష్ట్రపతికి తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మందగించిందని తెలిపారు. ఈ కుమ్మక్కు వల్ల జగన్‌కు త్వరలో బెయిల్ కూడా వ స్తుందని అంటున్నారని చంద్రబాబు వివరించారు.

విభజన సమస్యను కాంగ్రెస్ తన సొంత రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటోందని రాజ్యసభలో అన్ని రాజకీయ పార్టీలు విమర్శించినప్పుడు చిదంబరం నిర్లక్ష్యంగా, తప్పించుకునే ధోరణిలో సమాధానం ఇచ్చారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. షిండే, ఇతర కాంగ్రెస్ నేతలు పొంతనలేని ప్రకటనలు చేస్తూ మరింత అయోమయం సృష్టిస్తున్నారని రాష్ట్రపతికి తెలిపారు. అప్పట్లో సకల జనుల సమ్మె, ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మె గురించి వివరించారు. అన్నిరకాల ప్రజా సేవలకు పూర్తిగా విఘాతం కలుగుతోందన్నారు.

"ప్రజలు తమంతట తాము తీవ్ర ఆందోళనకు దిగారు. ఆశ్చర్యకరంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. సీమాంధ్రలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు చేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగుల మధ్య అశాంతి ఏర్పడి, సంబంధాలు దెబ్బతినే ప్రమాదముంది. ఇది వాంఛనీయం కాదు'' అని రాష్ట్రపతికి తెలిపారు.


రాష్ట్రపతిని, బీజేపీ, సీపీఎం నేతలను కలిసిన తర్వాత అక్కడికక్కడే చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. "రాష్ట్రంలో ముఖ్యమంత్రి పనిచేయడంలేదు. మంత్రులూ పని చేయడంలేదు. కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయాలకోసం ప్రజలతో క్రూరపరిహాసం ఆడింది'' అని తెలిపారు. తాను రాజకీయాలు మాట్లాడడానికి, పొత్తుల గురించి చర్చించడానికి ఢిల్లీ రాలేదని, రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితిని జాతీయ స్థాయి నేతలకు వివరించేందుకే వచ్చానని తెలిపారు. జాతీయ స్థాయిలో తమ సంబంధాలను ఉపయోగించి రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాలని బీజేపీ, ఇతర పార్టీల నేతలను కోరానన్నారు. జేఏసీల నేతలు, సమస్యతో సంబంధం ఉన్న ఇతర వర్గాలతో చర్చించడం ద్వారానే ఒక పరిష్కార మార్గం కుదురుతుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో కాంగ్రెస్ తుఫాను సృష్టించిందని ఆయన అన్నారు. తెలంగాణలో రెండు సంవత్సరాలు ఉద్యమం జరిగి వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడితే... అదే పరిస్థితి సీమాంధ్రలో పునరావృతం అవుతోందని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేసిన పాపం కాంగ్రెస్‌కు దక్కుతుందన్నారు.


సీమాంధ్రలో ప్రజల ఆందోళన గురించి చంద్రబాబు తమకు వివరించారని రాజ్‌నాథ్ మీడియాతో అన్నారు. తెలంగాణకు సంబంధించి బీజేపీ వైఖరి మారదని... అదే సమయంలో సీమాంధ్రను పట్టించుకుని తీరాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు ద్వారా రాష్ట్రంలోని పరిస్థితులపై విస్తృత సమాచారం అందిందని చెప్పారు. ఈ విషయం మినహా... పొత్తులు, ఇతర రాజకీయ అంశాలు తమ మధ్య చర్చకు రాలేదన్నారు.


రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సీపీఎం నేత ప్రకాశ్ కరత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభన గురించి, సీమాంధ్రలో ఆందోళన గురించి చంద్రబాబు వివరించారన్నారు. చంద్రబాబుతోపాటు ఢిల్లీకి వచ్చిన నేతల్లో నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణ, సీఎం రమేశ్, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప, గుండు సుధారాణి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కోడెల శివప్రసాద్ రావు, దయాకర్ రావు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

టీఆర్ఎస్‌ను విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ రాజకీయ కుతంతాలు పన్నింది.