September 22, 2013

బిడ్డల బాగు కోరుకునే తండ్రిని ఇరు ప్రాంతాలవారూ నా పిల్లలే....

రాష్ట్రాభివృద్ధే నాకు ముఖ్యం
ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దనే ఢిల్లీ వచ్చా
కానీ, కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది
టీఆర్ఎస్ విలీనం, వైసీపీ పొత్తుపైనే దాని దృష్టి: చంద్రబాబు

సున్నితమైన రాష్ట్ర విభజన వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్‌ను విలీనం చేసుకునేందుకు, వైసీపీతో పొ త్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. "నాది టీటర్నో, యూటర్నో కాదు.. పీ టర్న్. అంటే ప్రజల టర్న్. ఇరు ప్రాంతాల బాగోగుల కోసం, తెలుగుజాతి కోసం పోరాడుతున్నాను. ఒక తండ్రికి ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరో ఒక్కరి సంక్షేమాన్నే కోరుకోడు. నేను కూడా మూడు ప్రాంతాల ప్రజల ను పిల్లల మాదిరిగా భావిస్తున్నాను. వారందరి బాగోగులు కోరుకుంటున్నా ను'' అని వివరించారు.


రాష్ట్రంలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు చొరవ చూ పాలంటూ పార్టీ ఎంపీలతో కలిసి శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన ఆయన ఆదివారం జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, సీపీఐ వృద్ధనేత ఏబీ బర్ధన్‌లతో భేటీ అయ్యారు. ఆ వివరాలను విలేకరుల సమావేశంలో వివరించారు. రాష్ట్ర ప్రజల సమస్యల కంటే రాజకీయాలే కాంగ్రెస్‌కి ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. తన ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆ పార్టీ తగలబెడుతోందని, ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ పార్టీలోని ఇరు ప్రాంత నాయకులు ద్వం ద్వ వైఖరి అవలంభిస్తున్నారన్నారు.

"తెలంగాణలో టీఆర్ఎస్‌ను విలీనం చేసుకుని, సీమాంధ్రలో జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుని..రెండు చోట్లా లబ్ధి పొందాలన్నదే కాంగ్రెస్ తాపత్రయం. కాబట్టే, తెలంగాణకు మద్దతు ఇస్తున్న బీజేపీ, సీపీఐలతో పాటు జాతీయ పార్టీలైన జేడీయూ, డీఎంకే, ఏఐడీఎంకే, ఏజీపీ, టీఎంసీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు సైతం కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి'' అన్నారు. విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ పరిష్కరించిన విధానం తప్పన్నారు. "రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వస్తా యి. పోతాయి. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ కాదు. అది కాంగ్రెస్ సొంత జాగీ రూ కాదు. కానీ, కాంగ్రెస్ మాత్రం అదే ధోరణిలో ఉంది. విభజన ప్రక్రియను సొంత పార్టీ అంతర్గత వ్యవహారంగా మార్చేసింది'' అని ఆరోపించారు.

తెలంగాణలో 42 రోజులు సకల జనుల సమ్మె జరిగి, వందలాది మంది యువత బలిదానాలు చేసుకోగా, సీమాంధ్రలో గత 57 రోజులుగా ప్రజలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. "పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించటంతో ఇటు టీఆర్ఎస్‌తోనూ, అటు వైసీపీతోనూ ఒప్పందాలు కుదుర్చుకుని, సమస్యను పరిష్కరించాల్సిన కాంగ్రెస్సే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. తెలంగాణ ప్రకటన చేసిన వేదికపై నుంచే టీఆర్ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేసుకుంటామని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.

వైసీపీదీ తమదీ ఒకటే డీఎన్ఏ అన్నారు. తమను విమర్శించినా అది తమకు మేలే చేస్తుందని రాజ్యసభలో చిదంబరం వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూసిన తరువాతే ప్రధానమంత్రికి నేను లేఖలు రాయగా ఆయన పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రపతి జోక్యం కోరుతూ ఢిల్లీకి వచ్చాను'' అని వివరించారు. వాస్తవానికి కాంగ్రెస్‌దీ, వైసీపీదీ దేశాన్ని దోచుకునే డీఎన్ఏ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్రం, కాంగ్రెస్ నేతలు స్పందించకుంటే, వారి సంగతి ప్రజలే చూసుకుంటారని హెచ్చరించారు. సోనియాగాంధీ టెన్ జన్‌పథ్ నుంచి రాస్తున్న స్క్రిప్ట్ ప్రకారం కిరణ్, కేసీఆర్, జగన్ నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు.

కాగా, రాష్ట్ర పరిస్థితుల గురించి చంద్రబాబు వివరించగా, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఆయన వాదనను ఒకింత ఆందోళనతో ఆలకించారు "ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలంతా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోరుతున్నప్పుడు వారి డిమాండ్లకు స్పందించకపోవటం సరికాదు. దేశాన్ని నడిపే పద్ధతి ఇది కాదు. అభివృద్ధిపథం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను పక్కదోవ పట్టించారు. తిరిగి ఆంధ్రా అభివృద్ధి పథంలోకి రావాలి'' అని శరద్ యాదవ్ ఆకాంక్షించారు.

కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న చంద్రబాబు విజ్ఞప్తిపై సీపీఐ నేత బర్ధన్ సానుకూలంగా స్పందించారు. "అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం అంధకారంలోకి నెట్టింది. ఇరు ప్రాంతాల నేతలను కేంద్రం పిలిచి చర్చలు జరపాలి. కానీ, కేంద్రం అచేతనంగా ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది'' అని బర్ధన్ విమర్శించారు. ఇదిలాఉండగా, ఢిల్లీలో సోమవారం జరగనున్న జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.