September 22, 2013

త్వరలో తెదేపా, భాజపాల... పరిణయం

తెదేపా. ముప్పైఏళ్ళ రాజకీయ ప్రస్తానంలో సంచలనాలు సృష్టించిన పార్టీ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సర్కారును కూలదోయడంలో, విభిన్న ధృవాల్లాంటి పార్టీలను ఒకే గొడుగుకిందకు చేర్చి ఢిల్లీ సర్కారును ఏర్పాటు చేసిన చరిత్ర పారీే్టక సొంతం. అన్న ఎన్టీఆర్, వారసునిగా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలలో తమదైన ముద్ర వేసినవారే. ఈ పార్టీకి సెక్యులర్ పార్టీగా పేరుంది. భాజపా. దేశంలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీ. మతతత్వ ముద్ర కలిగిన పార్టీ. దాదాపు ఆరేళ్ళ పాటు కేంద్రంలో సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించిన పార్టీ. కొన్ని అంశాల్లో ఈ రెండు పార్టీల మధ్య సారూప్యత లేకున్నా ఒక అంశంలో మాత్రం రెండింటిదీ ఒకే వైఖరి. అదే కాంగ్రెస్ వ్యతిరేక విధానం. ఈ విధానంతోనే 199, 1999ల్లో ఏర్పాటైన ఎన్డీయేసర్కారుకు తెదేపా మద్దతు ప్రకటించింది. ఎన్డీయే సర్కారుకు తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆయువు పట్టులా నిలవగా... 1999లో చంద్రబాబు సర్కారు విజయం సాధించడానికి ఎన్డీయే హయాంలో జరిగిన కార్గిల్ వార్ వంటి విజయాలు దోహదకారిగా నిలిచాయనడంలో సందేశం లేదు. తదనంతర పరిణా మాల్లో వామపక్షాలతో తెదేపా అడుగులు వేయడంతో బిజెపికి దూరమయింది. మారిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పొత్తుల గురించి దీర్ఘంగానే ఆలోచించింది. ఈ అంశంలో తమిళనాడు పార్టీల అనుభవాలను అవలోకనం చేసుకుంది. బద్దశత్రువైన కాంగ్రెస్‌ను తుదముట్టించే మార్గాల్లో ముందుగా తృతీయ ఫ్రంట్‌తో ముందుకు నడిచే అంశాన్ని పరిశీలించింది. ములాయం, మాయా వంటి అవకాశవాద రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన నేతలతో అయ్యేపని కాదని గత అను భవాలతో నిర్థారించుకుంది. కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయి పార్టీ అవసరమని గట్టిగా అభిప్రాయపడింది. మతతత్వ ముద్ర వుందికదా అనే అంశంపై తర్జనభర్జన చేసింది. ముస్లిం ఓటర్లలో కొందరు దూరమయ్యేది ఖాయమని అంచనా వేసుకుంది. అయితే మోడీకి వున్న ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఆయన నాయకత్వంపై యువత, విద్యావంతుల్లో పెరుగుతున్న అంచనాలతో పోల్చుకుంటే నష్టపోయేది తక్కువే, లాభపడేది ఎక్కువనే తనదైన విశ్లేషణలో నిర్థారించుకుంది. మోడీ గుజరాత్‌లో చూపించిన అభివృద్ధి నమూనా ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి నమూనాకు లభించిన ప్రశంసలు, మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేశాక దేశవ్యాప్తంగా పెరిగిన క్రేజీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీని కమలదళంతో స్నేహానికి అడుగులు వేయించాయని చెప్పవచ్చు. హైదరాబాద్‌లో మోడీ చేసిన ప్రసంగం, జనస్పందన కూడా తెలుగుదేశం శిబిరాన్ని ఆలోచింపజేసింది. ఎన్టీఆర్ తరహాలో కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో ఓడించేందుకు తమతో కలిసిరావాలని మోడీ తెదేపాకు పిలుపునిచ్చిన విషయం విధితమే. కాంగ్రెస్‌తో ఆదినుంచి శతృపార్టీగా చూసే చరిత్ర కలిగిన తెలుగుదేశం దానికి శతృవైన బిజెపితో కలిస్తే రాష్ర్ట ప్రయోజనాలు కూడా కాపాడుకోవచ్చుననే ఆలోచన తెదేపాలో మొగ్గతొడిగింది. మొన్నటి వరకు ఈ రెండుపార్టీలను శతృపార్టీలగానే చూడగా, అయితే కాంగ్రెస్ కంటే బిజెపి బెటర్ అనే అభిప్రాయం వినవస్తోంది. అందునా ఓబీసీలను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పటికే బీసీల్లో గట్టి పట్టువున్న తెదేపా ఓటు బ్యాంకు మరింత సుస్థిరమవుతున్నదన్నది అంచనా. రాష్ర్ట పరిస్థితుల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా తనతో కలిసే, విలీనమయ్యే తెరాస, వైకాపాలతో లోపాయికారి ఒప్పందాలతో ముందుకు సాగుతోంది. విభజన తర్వాత ఎన్నికలు జరుగుతాయా లేక సమైక్య రాష్ర్టంలోనే ఎన్నికలు జరుగుతాయా అన్న అనిశ్చితి ఇంకాకొనసాగుతూనే వుంది. రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారి పోతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కేడర్ కలిగిన భాజపాతో కలిస్తే దానికి తమకు వున్న ఓటు బ్యాంకు కూడా తోడైతే ఉభయతారకంగా వుంటుందని అంచనా వేసుకుంది. అటు సీమాంధ్రలోనూ విద్యావంతులు, యువత, మధ్యతరగతి కుటుంబీకుల ఓట్లతో పాటు బీసీలు, భాజపా సాంప్రదాయ ఓటు కూడా తమకు అనుకూలంగా వుంటుందన్నది ఒక అంచనా. ముస్లిం ఓటర్లు సహజంగానే కాంగ్రెస్, వైసీపీ, తెరాస ఇతర సెక్యులర్ ముద్ర కలిగిన పార్టీల మధ్య చీలిపోతాయికనుక తమ పార్టీ ఈ రకంగా నష్టపోయే ఓట్లను భాజపా స్నేహంతో పూడ్చుకోవడంతో పాటు, అదనంగా మోడీ ఆదరణను మరిన్ని ఓట్ల రూపంలో పొందవచ్చునన్నది అంచనా. రాష్ర్ట ప్రయోజనాలను కాపాడుకోవాలి, కేంద్రంలో అనుకున్న అభివృద్ధి పనులు సాధించుకోవాలంటే ప్రధాన పార్టీ అయిన భాజపాతో కలిసి నడవటమే శ్రేయస్కరమని తెదేపా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. గత కొన్ని నెలలుగా ఈ అంశంపై తెదేపా శ్రేణులు అధినేతపై ఒత్తిడి చేస్తూనే వున్నారు. ముస్లింలను దూరం చేసుకుంటామనే సంకోచం ఆయన్ను ఇన్నాళ్ళూ వెనుకంజ వేయించింది. అయితే మారుతున్న సమీకరణలు కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్న వైనం, మోడీకి గతంలో వున్న మైనస్‌లకు అతీతంగా అన్ని వర్గాల్లో పెరిగిన ఆదరణ, మూడో ఫ్రంట్‌పై ఆవిరైన ఆశలు, తమిళనాడు అనుభవాలు వెరసి చంద్రబాబును భాజపా దోస్తీవైపు అడుగులు వేయించినట్టుగా తెలుస్తోంది.అక్టోబర్ మొదటి వారం నుంచే భాజపా, తెదేపాలు కలిసి పనిచేయ బోతున్నాయి. ఈ అంశంపై చంద్రబాబు, మోడీలు ఒక అవగాహనకు వచ్చారని విశ్వసనీయ సమాచారం. ఏపీలోని 42 లోక్ సభ సీట్లను మెజార్టీని సొంతం చేసుకోవాలనే వ్యూహంతో ఈ ఇద్దరూ కలిసి అడుగులు వేయబోతున్నారు. దాంధీ జయంతి వేదికగా ఇందుకు ముహూర్తం ఖరారయిందని సమాచారం. అదే రోజున మోడీ, బాబు ఒకే వేదికను పంచుకో బోతున్నారు. అయితే వేదిక ఎక్కడ అనేది సస్పెన్స్.