July 21, 2013


కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా, రైతు సంక్షేమాల నుండి తప్పుకుంటోందని టిడిపి నేత కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయ్యాయని వివరించారు. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయని, హెలికాఫ్టర్ల ద్వారా బాధితులకు ఆహారాన్ని అందించే పరిస్థితి ఉందన్నారు. వరద ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన తీసుకునే చర్యలు సరిగా లేవని ఈ సందర్భంగా కోడెల విమర్శించారు. ప్రభుత్వం జిల్లాకొక ఇంఛార్జిని పెట్టినప్పటికీ జరగాల్సిన నివారణ చర్యలు సరిగ్గా జరగడం లేదనేది వాస్తవమన్నారు. అదేవిధంగా రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయని, కనుక ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్ళ కాలంలో పరిస్థితిని చూస్తే 35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సేద్యం తగ్గిపోయిందని, రైతులు సేద్యాన్ని మానేస్తున్నారని, గత తొమ్మిది సంవత్సరాల్లో 13 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని మానేశారన్నారు. రైతులు, రైతు కూలీలుగా మారిపోతున్నారన్నారు. 31 లక్షల మంది రైతులు కూలీలుగా మారిపోయారని వివరించారు. దాదాపు 12 లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. సెజ్ లు, రోడ్డు వెడల్పు పేరుతో సంవత్సరానికి రెండు పంటలు పండే భూముల్ని సైతం ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు. దీంతో అనేక మంది వ్యవసాయాన్ని వదిలేశారని, మిగిలిన వారు చేద్దామన్నా అనుకూల పరిస్థితులు లేవన్నారు.విత్తనాలన్నీ ఇంతకుముందు 50 శాతం సబ్సిడీతో ఇచ్చేవారని, దాన్ని 33 శాతం సబ్సిడీగా తగ్గించివేశారన్నారు. సబ్సిడీ విత్తనాల ధరను 5 శాతం నుండి 15 శాతం వరకు రేట్లు పెంచేశారని చెప్పారు. ఇదే ధరకు బయట మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు దొరుకుతున్న పరిస్థితి వుంది. విత్తనాల కంపెనీలకో, సర్టిఫైడ్ సీడ్స్ కంపెనీలకో సహాయం చేస్తున్న పరిస్థితి తప్ప సబ్సిడీ విత్తనాలతో ప్రభుత్వం చేసే సహాయం శూన్యమని విమర్శించారు.

రైతుల్ని కూలీలుగా మారుస్తున్న ప్రభుత్వం - కోడెల

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలే ష్ యాదవ్ తనకు మంచి మిత్రుడని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ చాలా బాగుందని అఖిలేష్ చెప్పారని, టీడీపీ హాయంలోనే అభివృద్ధి జరిగిందని తాను చెప్పినట్లు తలసాని తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభలో పాల్గొనడానికై నగరానికి వచ్చిన అఖిలేష్ మారేడ్ పల్లిలోని తలసాని శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనతో 15నిమిషాలపాటు సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి అఖిలేష్ మహాసభకు బయలుదేరి వెళ్లారు.

అఖిలేష్ మంచి మిత్రుడు : తలసాని

 పంచాయతీ ఎన్నికల్లో నిజాయతీ ఉన్న సర్పంచిని ఎన్నుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ చంద్రబాబు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంచి సర్పంచి విజయం సాధిస్తేనే గ్రామాలు సురక్షితంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలను బలోపేతం దిశగా తీసుకెళ్లింది టీడీపీనే అని తెలిపారు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే సరైన నాయకత్వం ఉంటుందన్నారు. స్థానిక సంస్థలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. సుపరిపాలన కోసం తాము గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తే వాటిని కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచికి ఉన్న అధికారాలను కాంగ్రెస్ క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిందన్నారు.

నిజాయతీ ఉన్నసర్పంచిని ఎన్నుకోవాలి:బాబు