July 20, 2013

సీనియర్‌ నాయకులు చంద్రబాబు నాయుడును కలుసుకోవడం తనకు అమితానందాన్ని ఇచ్చిందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. శనివారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన అఖిలేష్‌ అనంతరం బయట వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో క్లుప్తంగా మాట్లాడారు. భేటీలో మూడో ఫ్రంట్‌ గురించి చర్చించారా అన్న ప్రశ్నకు 'ఏం చర్చించ కూడదా?' అని ఎదురు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వంద స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించడం.. అధికారంలోకి వస్తే వారి అభ్యున్నతికి 10వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న నిర్ణయాలపై అఖిలేష్‌ హర్షం వ్యక్తం చేశారు. యూపీలో తాము కూడా చాలా ముందుగా అభ్యర్థులను ప్రకటించి సత్ఫలితాలను సాధించామన్నారు.

అఖిలేష్‌- లోకేష్‌... అలయ్‌- బలయ్‌

అంతకు ముందు చంద్రబాబు నివాసంలో యువనేత నారా లోకేష్‌, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ పరస్పరం ప్రేమ పూర్వకంగా ఆలింగనం చేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సమావేశం ఆద్యంతం యువ నేతలు పక్కపక్కనే కూర్చున్నారు. ముఖ్యంగా స్వయం సహాయ బృందాలు, ఐటీ రంగ అభివృద్ధి, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన వైనంపై చంద్రబాబు వద్ద అఖిలేష్‌ ఆరా తీశారు. మరీ ముఖ్యంగా ఇటీవల పూర్తి చేసిన 'వస్తున్నా.. మీ కోసం' యాత్రా విశేషాలను ఆసక్తిగా విన్నారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి ఇరు కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాలను వారు గుర్తు చేసుకున్నారు. తాను బాల్యం నుంచీ చంద్రబాబు నాయుడును చూసే వాడినని భేటీలో గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకంగా ఏ విషయంపైనా వారు సీరియస్‌గా చర్చించకున్నప్పటికీ- చాలా సేపు సొంత కుటుంబంలా మాట్లాడుకున్నారని తెదేపా వర్గాలు వెల్లడించాయి. అఖిలేష్‌ యాదవ్‌తో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులు ఐటీ మంత్రి అభిషేక్‌ మిశ్రా, రెవిన్యూ మంత్రి అంబికా చౌదరి ఉన్నారు.

బాబుతో అఖిలేష్‌ భాయి..భాయి