July 31, 2013

ఓట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టిందని టీడీపీ నేత
పయ్యావుల కేశవ్ ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమైక్యరాష్ట్రం కోసం రాజీనామాలకు వెనుకాడే ప్రసక్తే లేదని పయ్యావుల స్పష్టం చేశారు.

ఓట్ల కోసమే రాష్ట్రాన్ని విడగొట్టారు : పయ్యావుల

చంద్రబాబు లేఖ ఇస్తే తెలంగాణ ఆపుతామని మంత్రులు శైలజానాథ్, టీజీ మాట్లాడటం సిగ్గుచేటు అని టీడీపీ నేత
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరు పార్టీలు తెలంగాణకు అంగీకారం తెలిపాయని, కేవలం టీడీపీ వల్లే రాష్ట్ర విభజన జరుగలేదన్నారు.
సీమాంధ్రలో వైసీపీతో కాంగ్రెస్ డ్రామాలు ఆడిస్తోందని, వైసీపీతో విభజన ఉద్యమాన్ని రాజేసి, ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణ బిల్లు పెట్టేలోపే రాజధానికయ్యే వ్యయం, సాగునీటి పంపిణీపై స్పష్టత రావాలన్నారు. ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం తమ ఉద్దేశం కాదని ఆయన తెలిపారు.
హైదరాబాద్ సహా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది టీడీపీనే అని గుర్తుచేశారు. కేసీఆర్ పునఃనిర్మాణ వ్యాఖ్యల్లో అర్థం లేదని విమర్శించారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేయాలని సోమిరెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ వల్లే రాష్ట్ర విభజన జరుగలేదు : సోమిరెడ్డి

ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ హయాంలోనే హైదరాబాద్‌ను చాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కొత్త రాజధాని ఏర్పాటుపై కేంద్రం నిర్థిష్టమైన ప్రకటన చేయలేదని ఆయన అన్నారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రేగకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
చారిత్రక కారణాల వల్ల కేంద్రానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నామన్నారు. కొత్త రాజధాని అభివృద్ధి చేయడానికి నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, కొత్త రాజధానిని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్ర నిధులతో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సూచించారు. సాగునీటి సమస్య ఎలా పరిష్కారిస్తారో చెప్పాలన్నారు. ఉద్యోగాలు, విద్యుత్, వనరుల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
కొత్త రాజధాని ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్రం విడిపోయినా ప్రజల మధ్య సమైక్యత ఉండాలని బాబు కోరారు. ప్రాణహిత ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలు బిల్లులో పొందుపర్చాలి. సీమాంధ్ర ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదని హితవు చేశారు.
అందరికీ న్యాయం జరిగేలా చొరవ తీసుకుంటామని...కేంద్రం, అన్ని పార్టీలతో మాట్లాడతామని చంద్రబాబు హామీ ఇచారు. రాజకీయాల గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేనని బాబు చెప్పారు. తెలంగాణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో నిన్న దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. కాంగ్రెస్ మాధిరిగా రాజకీయ లబ్దికోసం ప్రయత్నించడం లేదని చంద్రబాబు తెలియజేశారు.

కొత్త రాజధానిపై కేంద్రం ప్రకటన చేయలేదు : చంద్రబాబు