December 29, 2012



 
తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు వద్దు.. బతికుండి పోరాడాల ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి చిట్యాల మండలం టేకుమట్ల, రాఘవరెడ్డిపేట గ్రామాల్లో జరిగిన బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. గతంలో అనేకమార్లు తెలంగా ణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని విద్యార్థులను కోరాం.. మరోసారి విజ్ఞ ప్తి చేస్తున్నా.. తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దు, బతికుండి పోరాడాలి తప్ప తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని పేర్కొన్నారు. పంట గిట్టుబాటు ధర రాక అప్పుల బాధతో రాష్ట్రంలో 22,500మంది ఆత్మహత్యల కు పాల్పడ్డారని, చావాల్సింది మనం కాదు.. చంపాల్సింది కాంగ్రెస్ పార్టీనని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలంగాణను అభివృద్ధి చేసింది టీ డీపేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్‌ను ఐదు జిల్లాలకు కలిపి రింగ్‌రోడ్డు నిర్మిం చి, విమానాశ్రయం ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలు నిర్మించామన్నారు. కేసీఆర్ కుం భకర్ణుడని, ఆరు నెలలు ఫాంహౌజ్‌లో పడుకుని లేచి మాయమాటలు చెప్పి మభ్య పెడుతున్నాడని ఆరోపించారు. అఖిలపక్షంలో తామే తెలంగాణపై స్ప ష్టం చేశామని, అందరూ టీడీపీ వైఖరి ని మెచ్చుకుంటుంటే కేసీఆర్‌కు మా త్రం కనిపించడం లేదన్నారు. పచ్చకామెర్లోడికి ప్రపంచమంతా పచ్చగా కనిపించినట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో 9ఏళ్లుగా దొంగలు పడ్డారని, మనం చేసిన అభివృద్ధి ఫలాలను దోచుకుంటున్నారని ఆరోపించా రు. ఇంతటి అసమర్థ ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, అవినీతి మంత్రులను కాపాడేందుకు బిజీగా ఉన్నాడన్నారు.

మా హయాంలో రాష్ట్ర ఆదాయం రూ.8వేల కోట్లు ఉంటే రోడ్లు వేశాం.. ప్రాజెక్టులు కట్టించాం.. అనేక అభివృద్ధి పథకాలు చేపట్టాం అన్నారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ రూ.15 వేల కోట్లు ఉంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు అప్పులే మిగిలిపోయాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు సైతం పెరిగాయని పేర్కొన్నారు. ఆడ పిల్లల అభివృద్ధి కోసం ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. రాని కరెంట్‌కు రెండు బుగ్గలు ఉంటే రూ.15వేలు రూ.16వేల బిల్లు వస్తుంద ని, కట్టకుంటే కేసులు పెడతామని ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

పేదలు చదువుకునేందుకు ప్రభుత్వం కనీసం స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భతి కల్పిస్తామని, అవసరమైతే వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి, హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగలను ఆదుకునేందుకు ఎస్సీ వర్గీకరణ చేసి వారి ఇళ్లలో ఓ పెద్దమాదిగ అనిపించుకుంటానన్నారు. ఎన్‌టీఆర్ సుజల పథ కం ద్వారా అన్ని గ్రామాలకు గోదావరి జలాలు తాగిస్తామని పేర్కొన్నారు.

గ్రామాల్లో మందు ఫుల్.. మంచినీళ్లు నిల్‌గా మారిందన్నారు. గతంలో రూ.20 చీఫ్‌లిక్కర్ ఇప్పుడు రూ.100అయ్యిందని, మా ఆడపడుచులు సంపాదించిన డబ్బులు బెల్ట్‌షాపులకే పోతున్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో బెల్ట్‌షాపులు రద్దు చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.600లు, వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. నియోజకవర్గానికో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి, టీడీపీ వద్ధులను ఆదుకుంటుందన్నారు. ప్రతి నిరుపేదకు లక్ష రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టిస్తామన్నారు.

బీసీల అభివృద్ధి కోసం కషి చేస్తున్నామని, 143కులాలు ఉన్న బీసీ సంక్షేమం కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందన్నారు. బీసీలకు అసెంబ్లీలో వంద సీట్లు కేటాయిస్తామని తెలిపారు. వెనకబడిన తరగతుల వారు ఇప్పటికీ పల్లకి మోయడమే కాదు.. పల్లకి ఎక్కాలని తమ వర్గం వారు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటే తమ పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. 500జనాభా దాటిన గూడెం, తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తానని పేర్కొన్నారు. ప్రతీ గిరిజన కుటుంబాలకు రెండు ఎకరాల భూమి కేటాయిస్తామన్నారు. ముస్లింల అభివద్ధికి రూ.2,500కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు.

63ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేస్తున్నానంటే ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకేనన్నారు. ఈ కార్యక్రమంలో టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క, సత్యవతిరాథోడ్, ఎంపీ సుధారాణి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం, పూజారి సుదర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కోసం బతికుండి పోరాడాలి...చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.



ప్రజల సమస్యలను సావధానంగా ఆలకించిన చంద్రబాబు వారికి నేనున్నానని ధైర్యం చెప్పారు. త్వరలో రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభు త్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఈ సమస్యలన్నీ తీరిపోతాయ ని ధైర్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంతో చేపట్టిన సంక్షమ పధకాలు, అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం దుబ్యా ల గ్రామ కూడలిలలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలను సంధించారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకించలేదు. భవిష్యత్తులో వ్యతిరేకించబోమని స్పష్టంగా బాబు ప్రకటించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల అప్పులను పూర్తిగా మాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల అప్పులను సైతం రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. రైతులకు 9గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తామ ని, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను వ్యవసాయ పనులకు వినియోగిస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకడం లేదు కానీ మధ్యం మాత్రం ఫుల్‌గా దొరుకుతోందన్నారు. మధ్యం విచ్చలవిడి విక్రయాల వల్ల నిరుపేదల కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయిస్తానని ప్రకటించా రు. ఇందుకు సంబంధించిన సంతకం చేసేది రెండవ ఫైల్‌గా, రైతుల అప్పుల మాఫీ మొదటి ఫైల్‌గా ఉంటుందన్నారు.

గ్రామస్తులకు బాబు వరాలను కురిపించారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే 1400 ఎకరాలకు సాగునీరు అందేలా వెల్లంపల్లి వావిలా మధ్య వర్రెపైచెక్ డ్యాంను నిర్మిస్తుందని, దుబ్యాల గుమ్మడిపల్లి మద్య బీటి రోడ్డు నిర్మిస్తుందని వాగ్దానం చేశారు. కులవృత్తులను కాపాడుతామ ని, వెనుకబడి తరగతులవారిని ఆదుకుంటామని చెప్పారు. సరిగ్గా రెండు గంటలకు బాబు దుబ్యాల గ్రామ శివార్లలో తన బస్సులోకి వెళ్ళిపోయా రు. మధ్నాహ్నం భోజనానంతరం కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. 4 గంటలకు తన పాదయాత్రను తిరిగి మొదలు పెట్టారు. రాఘవరెడ్డిపేట, అంకుషాపురం మీదుగా సుబ్బక్కపల్లికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు.

నేనున్నాను...



ఢిల్లీ సంఘటనపై బాబు తీవ్రంగా చలించిపోయారు. యువతి మృతికి సంతాప సూచన గా బాబుతో పాటు టీడీపీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించారు. ఆత్మశాంతికి రెండు నిముషా లు మౌనం పాటించారు. ఢిల్లీ సంఘటనకు బా ధ్యులైన దోషులను శిక్షించడంలో కేంద్ర ప్రభు త్వ వైఫల్యాన్ని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఈ సంఘటనకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారిపై పోలీసు బలగాలు బలప్రయోగం చేయడాన్ని ఖండించారు. దోషులకు ఉరిశిక్ష వేసినా త ప్పులేదన్నారు. పార్లమెంట్‌ను వెంటనే సమావే శ పరిచి చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు.

చలించిన బాబు



 
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయ్రాత జిల్లా లో తొలి రోజు (శనివారం) ప్రశాంతంగా జరిగింది. ఢిల్లీలో తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో టీడీపీతో పాటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీలు వ్యక్తం చేసిన వైఖరులకు నిరసనగా శుక్రవారం ప్రదర్శనలు, దిష్టిబొమ్మల ద హనాలు జరిగింది తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. టీఆర్ఎస్ బంద్‌కు కూడా పిలుపు నిచ్చింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు పాదయాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఎలా జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అయింది. ఆ భయాలన్నీ పటాపంచలయ్యాయి. అనుకున్న ప్రకారం ఆద్యంతం ఉత్సాహంగా, కోలాహలంగా సాగింది.


విలేకరుల సమావేశంలో...

బాబు తాను బస చేసిన వాహనం నుంచి సరిగ్గా 11 గంటలకు బయటకు వచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో విలేకరుల స మావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా బాబు తన బస నుంచి బయటికి రాగానే పాదయాత్ర సాగే నియోజకవర్గం నాయకులతో కొద్ది సేపు సమావేశం అవుతారు. నియోజకవర్గం పరిధిలో ని సమస్యలపై చర్చిస్తారు. తర్వాత నేరుగా పా దయాత్ర మొదలు పెడతారు. విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం తక్కువ. కానీ వెల్లంపల్లిలో మాత్రం విలేకరుల సమావేశంతోనే బా బు యాత్ర మొదలైంది. ఇప్పటి వరకు సాగిన పాదయాత్రలో బాబు రెండు సార్లు మాత్రమే వి లేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఒకసారి నీలం తుఫానుపై, మరో సారి ఎర్రం నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి సంఘటన. ఇక్కడ మూడవ సారి ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి మృతి చెందిన సంఘటనపై విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.

5 గ్రామాలు..13 కిమీ..

 సరిగ్గా 12 గంటలకు బాబు పాదయాత్ర మొ దలైంది. తొలి రోజు బాబు అయిదు గ్రామాల గుండా 13 కిమీ పాదయాత్ర చేశారు. భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మొగుళ్ళపల్లి మండాలలోని వెల్లంపల్లి, దుబ్యాల, రా ఘవరెడ్డి పేట, టేకుమట్ల, అంకుషాపురం గ్రా మాల మీదుగా పాదయాత్ర సాగింది. బాబుకు కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలికారు. పార్టీ పతాకాలతో ముందు నడిచారు. ఎమ్మార్పీ స్ కార్యకర్తలు కూడా తమ పతాకాలతో తోడు గా నడిచారు. బాబుకు ఇరువైపుల రక్షణ కవచంగా నిలిచారు. పాదయాత్రలో టీడీపీ కన్నా ఎమ్మార్పీస్ పతాకాలే ఎక్కువగా కనిపించాయి. మార్గంమధ్యలో ఎమ్మార్పీస్ కార్యకర్తలు బాబు కు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ముం దు డప్పుచప్పుళ్ళతో కళాకారులు ముందు నడిచారు. మహిళలు బాబుకు ఎదురేగి మంగళహారతులు ఇచ్చారు. బోనాలతో నడిచారు. వెల్లంపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మగుడిని చంద్రబాబు దర్శించుకున్నారు.

సమస్యలపై ఆరా..

పాదయాత్ర సందర్భంగా గ్రామీణులు అనేక సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చా రు. ప్రధానంగా కరెంట్ కోతలతో తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. పండి న పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోయారు. మార్గ మధ్యలో బాబు రైతులు, మహిళా కూలీలు, వృద్ధులుతో మాట్లాడారు. దు బ్యాలలో చిక్కినేని మల్హల్‌రావు అనే రైతులతో బాబు మాట్లాడారు. తనకున్న రెండెకరాలలో వేసిన పత్తి, వరి కరెంట్ కోతల వల్ల ఎండిపోయిందని ఆయన వాపోయాడు. కరెంట్ ఎప్పు డు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు.

మార్గంమధ్యలో కొంత మంది మహిళా వ్యవసాయకూలీలను కూడా కలిసారు. సంగి శారద, సంగి స్వరూప తమకు వేలల్లో కరెంట్ బిల్లులు వచ్చినట్టు ఫిర్యాదు చేశారు. ఏ ప్రభుత్వ పథకాలు అందడం లేదని, ఇళ్ళబిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. రోడ్డుపై నిస్సహాయంగా కూర్చున్న ఓ వృద్దురాలిని కూడా బాబు పరామార్శించారు. తనను చూసేవారు లేరని, వృద్ధప్యా పించన్ రావడం లేదని ఆ వృద్ధురాలు చెప్పింది. పాదయాత్రలో మిక్కినేని సర్వోత్తమరావు అనే రైతు పత్తిబస్తాతో ఎదురయ్యాడు. బాబు ఆ పత్తిబస్తాను తనతలపై పెట్టుకున్నారు. గిట్టుబాటు ధర లభిస్తుందా అని ఆరా తీశారు. పత్తిరైతు సమస్యను బాబు సావధానంగా విన్నారు. మధ్యలో గొర్రెలకాపర్ల సంఘం ప్రతినిధులు చంద్రబాబుకు గొంగడి కప్పి గొర్రెపిల్లను బహుమతిగా అందచేశారు. వారి సమస్యలను కూడా ఆలకించారు.

ప్రజలను పలకరిస్తూ...సమస్యలపై స్పందిస్తూ...




పాదయాత్ర 1400 కిలోమీటర్లు పూర్తి
మారిన షెడ్యూల్
నల్లగొండ, గుంటూరు, కృష్ణా మీదుగా పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ అంత దూరం నడిచారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మధ్య ఉన్న దూరం 1400 కిలోమీటర్లు. చంద్రబాబు ఇప్పటికి సరిగ్గా అంత దూరం నడిచారు. శనివారం వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం, చిట్యాల మండలం టేకుమట్ల గ్రామం వద్ద చంద్రబాబు 1400 కి.మీ మైలురాయిని అధిగమించారని ఆ పార్టీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు.

శనివారంతో చంద్రబాబు యాత్ర 89 రోజులు పూర్తయింది. ఈ వ్యవధిలో ఆయన తొమ్మిది జిల్లాల్లోని 37 నియోజకవర్గాల పరిధిలో.. 74 మండలాలు, 13 మునిసిపాలిటీలు, 608 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర వంద రోజుల మార్కును చంద్రబాబు వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దులో పూర్తి చేసుకొనే అవకాశం ఉంది.

పాదయాత్ర పొడిగింపు
చంద్రబాబు పాదయాత్ర పొడిగింపు ఖరారైంది. ముందు అనుకొన్న దాని ప్రకారం ఆయన ఖమ్మం జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టాలి. కానీ, ఖమ్మం జిల్లా నుంచి నల్లగొండ జిల్లా మీదుగా వెళ్లేలా పాదయాత్ర షెడ్యూల్‌ను మార్చారు. నల్లగొండ మీదుగా గుంటూరు జిల్లా వెళ్ళి అక్కడ నుంచి కృష్ణా మీదుగా గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. దీనివల్ల 'వస్తున్నా.. మీకోసం' మరో రెండు నెలలు పొడిగించినట్లేనని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ అంత దూరం నడిచిన బాబు