December 29, 2012

28న ఎంట్రీ... 29నుంచి యాత్ర




వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న జిల్లాలోని చిట్యాల మండలం వెల్లంపల్లికి చేరుకుంటాడని 29 నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి తెలిపారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బస్వారెడ్డి మాట్లాడుతూ వాస్తవంగా ఈ నెల 27న జిల్లాకు చంద్రబాబు రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన ముందుగా ప్రకటించినట్లుగా కాకుం డా ఒకరోజు ఆలస్యంగా 28న జిల్లాకు చేరుకుంటారని తెలిపారు. 28న చిట్యాల మండలం వెల్లంపల్లి గ్రామానికి సాయంత్రం చేరుకునే చంద్రబాబు బస అదే గ్రామంలో చేస్తాడని పేర్కొన్నారు.

29న ఉదయం వెల్లంపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమై టేకుమట్లలో సభ ఉంటుందన్నారు. అదే విధంగా 30న మొగుళ్లపల్లి, 31న పరకాల, జనవరి 1న శాయంపేట, ఆత్మకూరు, 2న దుగ్గొండి మండలం గిర్నిబావి, 3న సంగెం, 5న పర్వతగిరి, 6న నెల్లికుదురు, 7న నర్సింహులపేట, 8న మరిపెడ మండల కేంద్రాల్లో బహిరంగ సభలుంటాయని ఆయన వివరించారు. బాబు యాత్ర జిల్లాలో ఆరు నియోజకవర్గాలు (భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహూబూబాబాద్, డోర్నకల్), 65 గ్రామాలు, 12 మండల కేంద్రాల గుండా 12 రోజులు జరుగుతుందని మొత్తం 156 కిలోమీటర్లు బాబు యాత్ర చేస్తారని తెలిపారు. జిల్లాలో జరిగే వస్తున్నా మీకోసం యాత్రకు అన్ని వర్గాలు సహకరించాలని బస్వారెడ్డి విజ్ఞప్తి చేశారు.

బీసీ వర్గాలు కదలి రావాలి..: జిల్లాలోని బీసీ వర్గాలు బాబు యాత్రలో పాల్గొనేందుకు తరలి రావాలని ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు, టీడీపీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకాచారి కోరారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించబడిందన్నారు. గత జూలైలో టీడీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందన్నారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.

ఈ విలేఖరుల సమావేశంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర నేత లు అశోక్‌గౌడ్, అమరేందర్‌గౌడ్, నర్సింహులు, జిల్లా టీడీపీ నేతలు పూజారి సుదర్శన్‌గౌడ్, బొజ్జపల్లి రాజయ్య, దొనికెల మల్లయ్య, పుల్లూరి అశోక్, బయ్య స్వామి, మార్గం సారంగం తదితరులు పాల్గొన్నారు.