December 29, 2012

నేటి నుంచే బాబు యాత్ర



 
రెండు పార్టీలు మోహరించాయి. తెలంగాణ పై వేటికవి తమ వాదాలను వినిపిస్తున్నాయి. పరస్పరం ఖండించుకుంటున్నాయి. విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నాయి. సవాళ్ళు... ప్రతి సవా ళ్ళు విసురుకుంటున్నాయి. ఫలితంగా రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావర ణం ఏర్పడుతోంది. క్రమంగా అది ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ పరిస్థితులనేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోకి శుక్రవారం రాత్రి ప్రవేశించారు. రాత్రి 8.20 గంటలకు కరీంనగర్‌జిల్లా జమ్మికుంట మండలం నగరం గ్రామం మీదుగా జిల్లా సరిహద్దులోని చిట్యాల మండ లం వెల్లంపల్లి గ్రామంలో అడుగుపెట్టారు. మూడున్నర కిలో మీటర్ల మేర కు పాదయాత్ర చేశారు. అనంతరం వెల్లంపల్లి గ్రామశివార్లలో బసచేశారు. శనివారం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుడతారు.

వేడెక్కిన వాతావరణం

తెలంగాణపై ఢిల్లీలో శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశం సృష్టించిన వాతావరణం ఇది. అఖిల పక్ష సమావేశానంతర పరిస్థితులను బట్టి బాబు పాదయాత్ర సాగే తీరుపై గత కొద్దిరోజులుగా జిల్లాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించకపోతే అడ్డుకుంటామని టీఆర్ఎస్ శ్రేణులు ముందు నుంచే హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. తమ పార్టీ వైఖరి విస్పష్టం గా ఉంటుందని తెలుగు తమ్ముళ్ళు వాదించారు. శుక్రవారం అఖిల పక్ష సమావేశంలో పార్టీ పక్షాన తెలంగాణ పట్ల సానుకూల అభిప్రాయాలు వెల్లడించారు. ఇందుకు జిల్లాలోని టీడీపీ శ్రేణులు బాణాసంచాకాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనుకున్నట్టుగా తమ పార్టీ తెలంగాణపై సానుకూలమైన రీతిలో విస్పష్టమైన వైఖరిని వెల్లడించింది నాయకులు చెప్పారు. అయితే టీఆర్ఎస్ నాయకులు దీనిని విభేదిస్తున్నారు. టీడీపీ వైఖరి కొత్తసీసాలో పాత సారాలా ఉందంటూ విమర్శలు కురిపించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో జిల్లాలో వాతావరణంవేడెక్కింది.

ఉద్రిక్తత నీడలు

అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ వెల్లడించిన వైఖరులకు నిరసనగా టీఆర్ఎస్ శనివారం జిల్లా లో బంద్‌కు పిలుపునిచ్చింది.ఈ బంద్ కు వివిధ జాక్‌లు మద్దతు ప్రకటించా యి. తెలంగాణ అంశంపై అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ 2008నాటి లేఖకు కట్టుబడి ఉంటానని స్పష్టంగా చెప్పినప్పటికీ టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడాన్ని టీడీపీ నాయకు లు ఖండిస్తున్నారు. బాబు పాదయాత్రను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. పాదయాత్రకు వస్తు న్న అపూర్వ స్పందనను చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చిందని విమర్శిస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు శుక్రవారం రాత్రి బాబు జిల్లా లో అడుగుపెట్టారు. బాబు పాదయా త్ర చేసే మార్గంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఉదయం నుంచే వెల్లంపల్లి గ్రామంలోని ప్రతీ ఇంటిని సోదా చేసారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు. టేకుమట్లలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తల ప్రయత్నాన్ని పోలీసులు ముందే భగ్నం చేశారు