December 29, 2012

ఓరుగల్లులో అడుగుపెట్టిన చంద్రబాబు



కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని శుక్రవారం రాత్రి వరంగల్ జిల్లాలో అడుగుపెట్టిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. జమ్మికుంట మండలం నగరం గ్రామం నుంచి చిట్యాల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి బయలుదేరిన క్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, ఎమ్మెల్యేలు రేవూ రి ప్రకాష్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు, చిట్యాల మం డల అధ్యక్షుడు పులి తిరుపతిరెడ్డి తదితరులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.

ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనుబంధ సంఘాల యువకులు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు డప్పుచప్పుళ్లు, వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. వేలాది మంది పోలీసులు రోడ్డుకు ఇరువైపులా రక్షణగా నిలువగా 500మంది కార్యకర్తల కాన్వాయ్‌తో చంద్రబాబునాయుడు జిల్లా లో అడుగుపెట్టారు. రెండు జిల్లాల సరిహద్దు ప్రాం తం కావడంతో వెల్లంపల్లి గ్రామం జాతరను తలపించింది. విపరీతమైన చలివేస్తున్న లెక్క చేయకుండా మహిళలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. జమ్మికుంట మండలం నగరం గ్రామం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి అందరినీ పలకరించారు. అనంతరం వెల్లంపల్లి గ్రామశివారులో ఏర్పాటు చేసి న విడిదిలో చంద్రబాబు బస చేశారు.

పల్లెలను దిగ్బంధించిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్న మీకోసం' పాదయాత్రను పురస్కరించుకుని మండలంలోని వెల్లంపల్లి, టేకుమట్ల గ్రామాలను పో లీసులు శుక్రవారం దిగ్బంధించారు. రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు 2500 మంది సివిల్, స్పెషల్‌పార్టీ పోలీసులు గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నా రు.మండలంలోని చల్లగరిగ నుంచి మొదలుకుని చిట్యాల మండల కేంద్రంతోపాటు టేకుమట్ల, రామకిష్టాపూర్(టి), అంకుషాపూర్, సుబ్బక్కపల్లి, నవాబుపేట, వెల్లంపల్లి, కుందనపల్లి గ్రామాల రహదారుల ను తమ ఆధీనంలోకి తీసుకుని బాంబు, డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి కల్వర్టు వద్ద ఇద్దరు హోంగార్డులను ఏర్పాటు చేశారు.

పాదయాత్రకు ఆటంకాలు కల్పించేందుకు జిల్లా కేంద్రం, హైదరాబాద్, కేయూ, ఓయూల నుంచి కొం తమంది విద్యార్థులు గ్రామాల్లోకి వచ్చారనే సమాచారంతో ప్రతీ గ్రామాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్థానిక పరకాల డీఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. కాగా, చంద్రబాబు యాత్ర సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలను గ్రామకూడళ్లలో ఏర్పాటు చేశారు. దీంతో వెల్లంపల్లి, టేకుమట్ల, అంకుషాపూర్, సుబ్బక్కపల్లి గ్రామాలు పసుపుమయంగా మారాయి. వెల్లంపల్లిలో చంద్రబాబు బస ఏర్పాట్లను భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు దగ్గరుండి పర్యవేక్షించారు. చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి వందలాది మంది పోలీసులు రక్షణగా ఉన్నారు.