December 29, 2012

ఢిల్లీ అంత దూరం నడిచిన బాబు




పాదయాత్ర 1400 కిలోమీటర్లు పూర్తి
మారిన షెడ్యూల్
నల్లగొండ, గుంటూరు, కృష్ణా మీదుగా పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ అంత దూరం నడిచారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మధ్య ఉన్న దూరం 1400 కిలోమీటర్లు. చంద్రబాబు ఇప్పటికి సరిగ్గా అంత దూరం నడిచారు. శనివారం వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం, చిట్యాల మండలం టేకుమట్ల గ్రామం వద్ద చంద్రబాబు 1400 కి.మీ మైలురాయిని అధిగమించారని ఆ పార్టీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు.

శనివారంతో చంద్రబాబు యాత్ర 89 రోజులు పూర్తయింది. ఈ వ్యవధిలో ఆయన తొమ్మిది జిల్లాల్లోని 37 నియోజకవర్గాల పరిధిలో.. 74 మండలాలు, 13 మునిసిపాలిటీలు, 608 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర వంద రోజుల మార్కును చంద్రబాబు వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దులో పూర్తి చేసుకొనే అవకాశం ఉంది.

పాదయాత్ర పొడిగింపు
చంద్రబాబు పాదయాత్ర పొడిగింపు ఖరారైంది. ముందు అనుకొన్న దాని ప్రకారం ఆయన ఖమ్మం జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టాలి. కానీ, ఖమ్మం జిల్లా నుంచి నల్లగొండ జిల్లా మీదుగా వెళ్లేలా పాదయాత్ర షెడ్యూల్‌ను మార్చారు. నల్లగొండ మీదుగా గుంటూరు జిల్లా వెళ్ళి అక్కడ నుంచి కృష్ణా మీదుగా గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. దీనివల్ల 'వస్తున్నా.. మీకోసం' మరో రెండు నెలలు పొడిగించినట్లేనని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.