October 7, 2012

"క్విట్ కాంగ్రెస్
కాంగ్రెస్‌ను ఉతికి ఆరేయండి!
కాంగ్రెస్, వైసీపీలను దేశం నుంచి బహిష్కరిద్దాం
మీ కష్టాలు చూడలేక వచ్చా
రుణ విముక్తులను చేసే వరకు పోరాడతా
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తా
చదువుకునే ప్రతి ఒక్కరికీ ఉద్యోగం"

 

అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్, వైసీపీలను దేశం నుంచి బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. లక్షలాది కోట్ల ప్రజా ధనాన్ని తమ సొంత ఖాతాల్లో వేసుకుని జైలు పాలయ్యారని, భవిష్యత్తులో కేబినెట్ సమావేశాలు కూడా చంచల్‌గూడ జైల్లో పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. అక్టోబర్ 2న తాను పాదయాత్ర ప్రారంభించానని, క్విట్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని 'క్విట్ కాంగ్రెస్' పేరిట ఆ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బట్టలు ఉతికి ఆరేసినట్లు కాంగ్రెస్ నేతలను ఉతికి ఆరేయాలని రజకులకు సూచించారు.

ముప్పై ఏళ్లుగా టీడీపీని ఆదరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించి కష్టాలు తెచ్చుకున్నారని, మీరు పడుతున్న కష్టాలు చూడలేకే మీ వద్దకు వచ్చానని ప్రజలకు స్పష్టం చేశారు. రైతులను, ప్రజలను రుణ విముక్తులను చేసేంత వరకు పోరాడతానని, తాను ఒక్కసారి పట్టుబట్టితే వదలనన్న విషయం మీకూ తెలుసునని వ్యాఖ్యానించారు. పాదయాత్ర ఆరో రోజైన ఆదివారం రాప్తాడు నియోజకవర్గం పేరూరు గురుకుల పాఠశాల నుంచి తన పాదయాత్రను మొదలుపెట్టారు. అనంతరం మంత్రి రఘువీరారెడ్డి నియోజకవర్గమైన కల్యాణదుర్గంలోకి అడుగుపెట్టారు.

అక్కడి అచ్చంపల్లి వద్ద చంద్రబాబు వంద కిలోమీటర్ల మైలురాయిని దాటారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆరో రోజు 23 కిలోమీటర్లు నడక సాగించి కుర్లాపల్లి క్రాస్ వద్ద బస చేశారు. పాదయాత్రలో భాగంగా పేరూరు డ్యాంను పరిశీలించి డ్యాంకు హంద్రీ నీవా నీటిని తెప్పిస్తానని హామీ ఇచ్చారు. పేరూరు, చెన్నంపల్లి, ఒంటారెడ్డి తదితర గ్రామాల్లో కార్యకర్తలు చంద్రబాబుకు పూల బాట ఏర్పాటు చేయగా, మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు లక్ష్యంగా బాబు హామీలు గుప్పించారు. పది వేల కోట్లు ఖర్చు చేసి బీసీల ఎదుగుదలకు అన్ని విధాలా కృషి చేస్తానని, మైనార్టీల కోసం రూ.2500 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.

ముస్లిం యువతీ యువకులకు రూ.50 వేలతో ఉచితంగా పెళ్లిళ్లు చేస్తామన్నారు. జిల్లాలోని మంత్రులు ఒకరు మాయల మరాఠీ, మరొకరు మాటల మరాఠీ అని విమర్శించారు. మహిళల కన్నీళ్లు చూడలేక తాను దీపం పథకం ద్వారా 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇప్పించానని, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ ధరను పదే పదే పెంచడమే కాకుండా సిలిండర్లపై నియంత్రణ కూడా పెట్టిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే మద్య నియంత్రణ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రారంభంలోనే గురుకుల పాఠశాల విద్యార్థులతో అరగంటకుపైగా మాటామంతీ కొనసాగించారు. తాను మళ్లీ అధికారం చేపడితే రీయింబర్స్‌మెంట్ కొనసాగిస్తానని, చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

అనామలీస్ కమిటీని రద్దు చేసి పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసేలా కృషి చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు చెప్పారు. వివిధ చోట్ల చంద్రబాబు మాట్లాడుతూ, ఎవడబ్బ సొమ్మని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అందిన కాడికి దోచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అవినీతిపై పలువురు ఫిర్యాదు చేయడంతో, "కళ్లముందే కాంగ్రెస్ నేతలు నాలుగైదు ఇళ్లు కట్టుకుని ఇతరులకు ఇల్లు కూడా లేకుండా చేస్తే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. ఎవడబ్బ సొమ్మని దోచేస్తున్నారు?'' అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.

పాదయాత్ర Day6...07.10.2012

పాదయాత్ర పోటోలు







6th Day Padayatra Photos 7.10.2012


ప్రెస్ నోట్ 7.10.2012

పాదయాత్ర  పోటోలు 5వ రోజు (06.10.2012} రాప్తాడు ,అనంతపురం జిల్లా







పాదయాత్ర  పోటోలు 5వ రోజు (06.10.2012}

5th Day Padayatra photos 6.10.2012


నేటి నడక

అన్నదాత 'కూలి'పోయాడు!
అన్నదాతకు అనంత కష్టాలు
పొట్ట చేతబట్టుకుని వలస పోతున్నాడు
ఐదో రోజు పాదయాత్రలో బాబు ఆవేదన

డ్వాక్రా మహిళలు పావలా కాదు రూపాయి వడ్డీ చెల్లిస్తున్నారు
లక్షాధికారులను చేస్తామని అప్పుల పాల్జేశారు
అధికారంలోకి వస్తే రూ.లక్షతో పక్కా ఇళ్లు
వృద్ధాప్య పింఛను రూ.500, వికలాంగులకు రూ.1500
వర్డీకరణతో మాదిగల రుణం తీర్చుకుంటా: చంద్రబాబు
ధర్మవరం, రామగిరి, అనంతపురం, అక్టోబర్ 6 : "పంట చేతికంది ఆరేడేళ్లయింది. పదిమందికీ అన్నం పెట్టే రైతన్నలు ఇంటిల్లిపాదినీ కాపాడుకునేందుకు వలసబాట పట్టి కూలీలయ్యారు. అనంతపురం జిల్లాలో వరుస కరువులతో అన్నదాత దుస్థితి ఇది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తాము డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం లక్షాధికారులను చేస్తామని గొప్పలు చెప్పి, అప్పుల పాల్జేసిందని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అనంతపురానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు.

రూ.లక్షతో పక్కా ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛనుగా రూ.500, వికలాంగులకు రూ.1500 ఇస్తామని పునరుద్ఘాటించారు. రైతును రుణవిముక్తం చేయడంపైనా ఆలోచిస్తున్నామన్నారు. చంద్రబాబు పాదయాత్ర శనివారం ఐదో రోజుకు చేరుకుంది. ఉదయాన్నే బస్సులో వ్యాయామం, యోగా తర్వాత పది గంటలకే పాదయాత్రకు సిద్ధమయ్యారు. గరిమేకలపల్లె నుంచి పేరూరు గురుకుల పాఠశాల వరకు 20 కిలోమీటర్లు నడిచారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌తోపాటు వేలాది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

రాప్తాడు నియోజకవర్గం తిమ్మాపురం ఎస్సీ కాలనీలో దళిత మహిళలతో సహపంక్తి భోజనం చేశారు. వారికి స్వయంగా వడ్డించారు. ఓ మహిళకు ఆయన గోరుముద్దలు తినిపించడంతో కాలనీ వాసు లు మురిసిపోయారు. గరిమేకలపల్లి నందమూరి నగర్‌లో కొలిమి పని చేసుకునే ఈశ్వరయ్య, భవ్య దంపతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు కొలిమి పనిచేశారు. కుల వృత్తులవారికి ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశా రు. వర్షాలు లేక రైతులకు పనుల్లేవని, దానివల్ల తమకూ పనుల్లేకుండా పోయాయని చెప్పారు.

చంద్రబాబు స్పందిస్తూ, టీడీపీ హయాంలో కులవృత్తులను గౌరవించామని, తిరిగి అధికారంలోకి వస్తే, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మంచి పనిముట్లను అందజేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, రోగాల బారిన పడుతున్నామని తిమ్మాపురంలో వెంకటేశ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చంద్రబాబు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఆ గ్రామానికి మినరల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంసీపల్లిలో ఓ మహిళ మాట్లాడుతూ, భర్త మరణించాడని, ఓ కుమారుడు ఎక్కడికో వెళ్లిపోయాడని, మరో కుమారుడి చేయి విరిగిందని, ఆస్పత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నామని వాపోయింది. దీంతో ఆ బాలుడి చికిత్స కోసం రూ.5వేలు అందించారు.

"టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మీలాంటి వారినందరినీ ఆదుకుంటాం'' అని భరోసా ఇచ్చారు. అక్కడే మరో మహి ళ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్లకు దొంగ బిల్లులు చేసుకుని అధికార పార్టీ నేతలే పంచుకుతిన్నారని ఫిర్యాదు చేసింది. టీడీపీ అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పక్కా గృహాల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఎంసీపల్లి, కొండాపురం, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో మహిళలు చంద్రబాబుకు హారతులతో నీరాజనాలు పలికారు. ఎంసీ పల్లి పొలాల్లో గొర్రెల కాపరులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు.

వివిధ ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. "నేను వచ్చింది మీ కష్టాలు తెలుసుకునేందుకే. ఇదో పవిత్రయాత్ర. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తాను. మీరు కూడా తిరుగుబాటుకు సిద్ధం కావా లి. కాంగ్రెస్ పార్టీని బంగాళా«ఖాతంలో కలిపే వరకు పోరాటం సాగించాలి'' అని పిలుపునిచ్చారు. నేటి దుర్భర పరిస్థితులకు వైఎస్ రాజశేఖర రెడ్డే బాధ్యుడన్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆయన వ్యవహరించారన్నారు. ప్రస్తుత సీఎం కిరణ్ విచిత్రమైన వ్యకి అని, ఆయన ఏమి చెబుతారో, ఎక్కడ ఉంటారో ఎవరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగల రుణం తీర్చుకుంటానని శపథం చేశారు.

చెన్నేకొత్తపల్లి మండలం బసినేపల్లిలో టీడీపీ వర్గీయులు ముగ్గురిని హతమార్చారని ఓ మహిళ పేర్కొనగా "ప్రజా నాయకుడు పరిటాల రవిని హతమార్చారు. ఒక్క రవిని చంపితే వందలాదిమంది పుట్టుకువస్తారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారు. దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు. ఖబడ్దార్' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "అన్నింటా అక్రమాలే. ఇందిరమ్మ ఇళ్లలో దొంగ బిల్లులు చేసుకున్నారు. ఉపాధి హామీ పేరుతో కొల్లగొట్టారు. పింఛన్లలో అన్యాయం చేశారు. అనాథలకు అంత్యోదయ ద్వారా 30కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా పది కేజీలే ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. పేదల పేరుతో సిమెంటు బస్తాలు తెగనమ్ముకున్నారు. మీ కష్టాలు చూసి మనసు చలించింది. దోచుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు'' అని చంద్రబాబు మండిపడ్డారు.

జిల్లా మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ శుద్ధ దండగని, వారు జిల్లాకు చేసింది ఏమీ లేదని, ఒకరు నోరువిప్పితే అబద్ధాలేనని, మరొకరికి జిల్లాపై ధ్యాసే లేదని ధ్వజమెత్తారు. అన్ని అంగాలనూ సక్రమంగా ఇచ్చి దేవుడు పుట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వికలాంగులుగా మారుస్తోందని, ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఆరోగ్యశ్రీకి నేను వ్యతిరేకం కాదు. కానీ, ఫ్లోరైడ్ నీళ్లు తాగి ఆస్పత్రి పాలైతే చికిత్స చేయడం లేదు. ఆస్పత్రికి వెళితే బతికి బయటకొస్తామన్న ధీమా లేదు. అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. నా రాజకీయ చరిత్రలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంపదను అడ్డదిడ్డంగా దోచుకున్న అవినీతిపరుల సొత్తును సీబీఐ వెలికి తీస్తోందని చెప్పారు. దోచుకున్న సొమ్మును విదేశాల్లో భద్రపరచుకున్నారని, వారి రహస్యాలను సీబీఐ వెలుగులోకి తెస్తోందని చెప్పారు. "గతంలో జైలుకెళ్లడమంటే అత్యంత హీనం. ఇప్పుడు గొప్పగా ఫీలవుతుండడం సిగ్గుపడాల్సిన విషయం'' అన్నారు.

పాదయాత్ర Day 5