December 4, 2012

ఈ ప్రాంతంలో బంగారం పండే భూములున్నాయి. కానీ, పాలకుల్లోనే చిత్తశుద్ధి లేదు. మంజీరా ఎక్కువ భాగం నిజామాబాద్ జిల్లాలోనే ప్రవహిస్తోంది. గోదావరి కూడా అందుబాటులోనే ఉంది. కానీ, ఈ జాడి జమాల్‌పూర్ ప్రాంతంలోని భూములకు నీరు లేదు. జిల్లాలోని మరే ప్రాంతానిదైనా ఇదే పరిస్థితి. బహుశా రాష్ట్రంలో ఇన్ని రకాల పంటలు పండగలిగే భూములు ఈ జిల్లాలోనే ఉన్నాయి. వరి, చెరుకు, పత్తి, పసుపు, వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు పువ్వు, సోయాబీన్.. వంటి ఏ పంటైనా ఈ జిల్లాలో పండించే అవకాశముంది. నిజాంసాగర్ ఉన్నా చివరి భూమికి నీళ్లొచ్చే పరిస్థితి లేదు. శక్తి, సారం కలిగిన ఇలాంటి భూమిని బీడుగా చూడాల్సి రావడం బాధేస్తోంది!

నేను ఉన్నప్పుడు రైతును ఇలా కష్టపెట్టలేదు. పంటలు పండే భూమిని ఎక్కడా పడావు పెట్టలేదు. చివరి భూములకు నీళ్లు తేవడం కోసం ఈ జిల్లాలోనే గుత్పా, అలీ సాగర్ ప్రాజెక్టులు ప్రారంభించాను. వైఎస్ హయాంలో ఈ రెండు ప్రాజెక్టులపై ఆర్భాటమే తప్ప పనులు చేసిన దాఖలా కనిపించడం లేదు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిన ఫలితమే ఇది! రైతులు కలిసికట్టుగా ఏర్పాటుచేసుకున్న లిప్టులు కూడా కరంట్ లేక ఎత్తిపోతున్నాయి.

సాగునీటి మంత్రి ఇక్కడివాడే. ఐనా ఈ ప్రాంతానికి న్యాయం జరగకపోవడం చాలా బాధాకరం. వాళ్లకు శ్రద్ధ లేదు. పరిష్కరించాలన్న ఆలోచనా లేదు. వ్యవసాయంలో రాష్ట్రానికే ఆదర్శం అంకాపూర్. ఆ గ్రామం కూడా ఈ జిల్లాలోనే ఉంది. నా యాత్ర అంకాపూర్‌కు ఈ దఫా వెళ్లనప్పటికీ ఈ జిల్లాలో నడుస్తున్నప్పుడు, కర్షక పరిషత్ చైర్మన్‌గా ఆ గ్రామాన్ని సందర్శించిన గుర్తులు మదిలో మెదిలాయి. ఇలాంటి బంగారు భూములున్న జిల్లాకు సాగునీటి పరంగా కాస్త చేయూత ఇస్తే ప్రతి గ్రామాన్నీ అంకాపూర్‌గా మార్చొచ్చు.

ప్రతి గ్రామాన్నీ 'అంకాపూర్' చేస్తా

అందులో 430 లారీలను సీబీఐ గుర్తించింది
జనం భాషలో వైఎస్, జగన్ అవినీతిని ఎండగట్టిన బాబు

నిజామాబాద్, డిసెంబర్ 4 : వైఎస్ కుటుంబం వెయ్యి లారీల డబ్బు దోచిందని, ఇప్పటిదాకా 430 లారీల డబ్బును సీబీఐ గుర్తించిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. 'జనం భాషలో జగన్ పని పట్టండి' అని సోమవారం టీడీఎల్పీ భేటీలో పిలుపునిచ్చిన అధినేత.. మంగళవారం తానూ అదే బాట పట్టారు. బండారుపల్లి, పెదమావంది, చినమావంది, పెగడాపల్లి గ్రామాల్లో జరిగిన సభల్లో వైఎస్, జగన్‌లపై చెలరేగి విమర్శలు చేశారు. జగన్ ఇంత డబ్బు ఎలా తిన్నాడని సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయిన విషయాన్ని గుర్తు చేశారు.

దోచి విదేశాల్లో దాచిన ఆ డబ్బులో సగం ప్రజలకు ఇచ్చినా రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేదని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో 26 జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని లూటీ చేశారని, మంత్రులకూ ఆ అవినీతిలో వాటాలు ఉన్నాయని విమర్శించారు. పంచాయతీ బోర్డుకు కూడా గెలువలేని వైసీపీ నేతలకు తాను సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. వైసీపీ, టీఆర్ఎస్‌లు ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలిసే పార్టీలేన న్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌లో కలిసేందుకు వైసీపీ రాయబారం నడుపుతోందని దుయ్యబట్టారు.

వెయ్యి లారీల డబ్బు దోచారు! చంద్రబాబు

అందుకే నా వెనుక పరుగులు తీస్తున్నారు
వైసీపీ, టీఆర్ఎస్‌లు ఎప్పటికైనా కాంగ్రెస్‌లోకే..
జగన్ దోచి దాచిన డబ్బు పంచితే రాష్ట్రానికి మహర్దశే
నిజామాబాద్ పాదయాత్రలో చంద్రబాబు

నిజామాబాద్, డిసెంబర్ 4 : "నేను పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ప్రత్యర్థుల పంచెలూడుతున్నాయి. ప్రజల సొమ్ము దోచుకున్న వారు, ప్రజలను కష్టాలు పెడుతున్న వారు, మాటల గారడీ చేస్తున్నవారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నా వెంటే పరుగులు తీస్తున్నారు '' అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన తరువాతే వైసీపీ యాత్రకు బయలుదేరడం, బుధవారంనుంచి టీఆర్ఎస్ 'పల్లెబాట' పడుతున్న నేపథ్యంలో ఆయన ఆ పార్టీల తీరుపై వ్యంగ్యాస్త్రాలను ఘాటుగా సంధించారు.

కాంగ్రెస్ దొంగలు ఎదురుదాడి చేయడమే తప్ప ఏమి చేయలేరని మండిపడ్డారు. అసలా పార్టీకి నాయకత్వమే లేదని విరుచుకుపడ్డారు.నిజామాబాద్ జిల్లా జాడి జమాల్‌పూర్ నుంచి మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. జాడి శివారులో విత్తనాలు నాటుతున్న లక్ష్మి అనే వ్యవసాయ కూలీని పలకరించారు. "వారం పాటు కూలీ చేస్తే వచ్చే డబ్బు అంగడి సరుకులకే సరిపోతున్నాయి. సార్. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వల్ల కడుపునిండా తిండి తినలేకపోతున్నాం'' అని ఆమె ఆవేదన వెళ్లబోసుకోగా " నన్ను గెలిపించండి. ధరలు దించేస్తా'' అని భరోసా ఇచ్చారు.

పెద్దమావంది గ్రామంలో పులి శంకరిబాయి అనే మహిళ విద్యుత్ బిల్లులపై ఆక్రోశం వెళ్లగక్కింది. "ఇంట్లో ఒక బల్బు, ఫ్యాను మాత్రమే ఉన్నాయి సార్. అయినా నెలకు రూ.20వేల కరెంటు బిల్లు వచ్చింద''ని పేర్కొనడంతో ఆమె చేయికి మైకు ఇచ్చి ఆయన మాట్లాడించారు. పెద్దమావందిలో మంగళి సాయిలు అనే వ్యక్తి షాపులోకి వెళ్లి బాబు కటింగ్ చేయించుకున్నారు. శనగ పంట సాగు చేస్తున్న మాశెట్టి రమేష్ పంటపొలంలోకి వెళ్లి పంట పరిస్థితిపై ఆరా తీశారు. శనగపంట సహా అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు పెంచుతామని హామీ ఇచ్చారు.

తాను ఇంటర్ సీఈసీ చదివానని, ఏ పని దొరకక చివరకు కూలీగా పని చేస్తున్నానని లావణ్య అనే కూలీ తెలపగా, స్వయం శక్తితో జీవిస్తున్నావు'' అంటూ అభినందించారు. బండారుపల్లి, పెదమావంది, చినమావంది, పెగడాపల్లి గ్రామాల్లో జరిగిన సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ దొంగలకు మళ్లీ అధికారమిస్తే ఇంటి కప్పులనూ మిగలనివ్వబోరని విమర్శించారు. అభివృద్ధి అంటే ఏమిటో సీఎం కిరణ్‌కు తెలియదని, ఆయనో నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పావలావడ్డీ పేరుతో మహిళా సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధికోసమే సెంటిమెంట్‌ను వాడుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబందుల పాలన సాగుతోందని, పేదవాడు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కావాలంటే లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. మళ్లీ కట్టెల పొయ్యిలే గతి కానున్నాయని విచారం వెలిబుచ్చారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. లక్షన్నర కోట్లకు పెరిగిన బడ్జెట్..ప్రజా సమస్యలకు బదులు కాంగ్రెస్ దొంగల జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు.

మద్యం ధర పెంచి దేశాన్ని ఉద్దరించినట్లు ముఖ్యమంత్రి భావిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై 2009లోనే తీర్మానం చేశామని గుర్తుచేశారు." వారు ఏమీ చేయరు.. ఎవరిని ఏమీ చేయనివ్వ''రని టీఆర్ఎస్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. రైతు సమస్యలపై కిరణ్ సర్కారుకు శ్రద్ధే లేదని విమర్శించారు. "పత్తికొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చెరుకు టన్నుకు రూ.3500 మద్దతు ధర ప్రకటించాలి. పాలకులకు పదవులపై వ్యామోహం తప్ప ప్రజలపై లేదు. ఎక్కడ కూడా నాణ్యమైన పనులు కనిపించడం లేద''ని మండిపడ్డారు. కాగా బుధవారం సాయంత్రంతో జిల్లాలో బాబు పాదయాత్ర ముగియనుంది

నా పాదయాత్రతో వాళ్ల పంచెలూడుతున్నాయి:చంద్రబాబు

04.12.2012 Chandrababunaidu "vastunnameekosam"padayatra photos (eenadu)