December 4, 2012

నా పాదయాత్రతో వాళ్ల పంచెలూడుతున్నాయి:చంద్రబాబు

అందుకే నా వెనుక పరుగులు తీస్తున్నారు
వైసీపీ, టీఆర్ఎస్‌లు ఎప్పటికైనా కాంగ్రెస్‌లోకే..
జగన్ దోచి దాచిన డబ్బు పంచితే రాష్ట్రానికి మహర్దశే
నిజామాబాద్ పాదయాత్రలో చంద్రబాబు

నిజామాబాద్, డిసెంబర్ 4 : "నేను పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ప్రత్యర్థుల పంచెలూడుతున్నాయి. ప్రజల సొమ్ము దోచుకున్న వారు, ప్రజలను కష్టాలు పెడుతున్న వారు, మాటల గారడీ చేస్తున్నవారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నా వెంటే పరుగులు తీస్తున్నారు '' అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన తరువాతే వైసీపీ యాత్రకు బయలుదేరడం, బుధవారంనుంచి టీఆర్ఎస్ 'పల్లెబాట' పడుతున్న నేపథ్యంలో ఆయన ఆ పార్టీల తీరుపై వ్యంగ్యాస్త్రాలను ఘాటుగా సంధించారు.

కాంగ్రెస్ దొంగలు ఎదురుదాడి చేయడమే తప్ప ఏమి చేయలేరని మండిపడ్డారు. అసలా పార్టీకి నాయకత్వమే లేదని విరుచుకుపడ్డారు.నిజామాబాద్ జిల్లా జాడి జమాల్‌పూర్ నుంచి మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. జాడి శివారులో విత్తనాలు నాటుతున్న లక్ష్మి అనే వ్యవసాయ కూలీని పలకరించారు. "వారం పాటు కూలీ చేస్తే వచ్చే డబ్బు అంగడి సరుకులకే సరిపోతున్నాయి. సార్. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వల్ల కడుపునిండా తిండి తినలేకపోతున్నాం'' అని ఆమె ఆవేదన వెళ్లబోసుకోగా " నన్ను గెలిపించండి. ధరలు దించేస్తా'' అని భరోసా ఇచ్చారు.

పెద్దమావంది గ్రామంలో పులి శంకరిబాయి అనే మహిళ విద్యుత్ బిల్లులపై ఆక్రోశం వెళ్లగక్కింది. "ఇంట్లో ఒక బల్బు, ఫ్యాను మాత్రమే ఉన్నాయి సార్. అయినా నెలకు రూ.20వేల కరెంటు బిల్లు వచ్చింద''ని పేర్కొనడంతో ఆమె చేయికి మైకు ఇచ్చి ఆయన మాట్లాడించారు. పెద్దమావందిలో మంగళి సాయిలు అనే వ్యక్తి షాపులోకి వెళ్లి బాబు కటింగ్ చేయించుకున్నారు. శనగ పంట సాగు చేస్తున్న మాశెట్టి రమేష్ పంటపొలంలోకి వెళ్లి పంట పరిస్థితిపై ఆరా తీశారు. శనగపంట సహా అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు పెంచుతామని హామీ ఇచ్చారు.

తాను ఇంటర్ సీఈసీ చదివానని, ఏ పని దొరకక చివరకు కూలీగా పని చేస్తున్నానని లావణ్య అనే కూలీ తెలపగా, స్వయం శక్తితో జీవిస్తున్నావు'' అంటూ అభినందించారు. బండారుపల్లి, పెదమావంది, చినమావంది, పెగడాపల్లి గ్రామాల్లో జరిగిన సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ దొంగలకు మళ్లీ అధికారమిస్తే ఇంటి కప్పులనూ మిగలనివ్వబోరని విమర్శించారు. అభివృద్ధి అంటే ఏమిటో సీఎం కిరణ్‌కు తెలియదని, ఆయనో నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పావలావడ్డీ పేరుతో మహిళా సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధికోసమే సెంటిమెంట్‌ను వాడుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబందుల పాలన సాగుతోందని, పేదవాడు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కావాలంటే లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. మళ్లీ కట్టెల పొయ్యిలే గతి కానున్నాయని విచారం వెలిబుచ్చారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. లక్షన్నర కోట్లకు పెరిగిన బడ్జెట్..ప్రజా సమస్యలకు బదులు కాంగ్రెస్ దొంగల జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు.

మద్యం ధర పెంచి దేశాన్ని ఉద్దరించినట్లు ముఖ్యమంత్రి భావిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై 2009లోనే తీర్మానం చేశామని గుర్తుచేశారు." వారు ఏమీ చేయరు.. ఎవరిని ఏమీ చేయనివ్వ''రని టీఆర్ఎస్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. రైతు సమస్యలపై కిరణ్ సర్కారుకు శ్రద్ధే లేదని విమర్శించారు. "పత్తికొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చెరుకు టన్నుకు రూ.3500 మద్దతు ధర ప్రకటించాలి. పాలకులకు పదవులపై వ్యామోహం తప్ప ప్రజలపై లేదు. ఎక్కడ కూడా నాణ్యమైన పనులు కనిపించడం లేద''ని మండిపడ్డారు. కాగా బుధవారం సాయంత్రంతో జిల్లాలో బాబు పాదయాత్ర ముగియనుంది