December 4, 2012

ప్రతి గ్రామాన్నీ 'అంకాపూర్' చేస్తా

ఈ ప్రాంతంలో బంగారం పండే భూములున్నాయి. కానీ, పాలకుల్లోనే చిత్తశుద్ధి లేదు. మంజీరా ఎక్కువ భాగం నిజామాబాద్ జిల్లాలోనే ప్రవహిస్తోంది. గోదావరి కూడా అందుబాటులోనే ఉంది. కానీ, ఈ జాడి జమాల్‌పూర్ ప్రాంతంలోని భూములకు నీరు లేదు. జిల్లాలోని మరే ప్రాంతానిదైనా ఇదే పరిస్థితి. బహుశా రాష్ట్రంలో ఇన్ని రకాల పంటలు పండగలిగే భూములు ఈ జిల్లాలోనే ఉన్నాయి. వరి, చెరుకు, పత్తి, పసుపు, వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు పువ్వు, సోయాబీన్.. వంటి ఏ పంటైనా ఈ జిల్లాలో పండించే అవకాశముంది. నిజాంసాగర్ ఉన్నా చివరి భూమికి నీళ్లొచ్చే పరిస్థితి లేదు. శక్తి, సారం కలిగిన ఇలాంటి భూమిని బీడుగా చూడాల్సి రావడం బాధేస్తోంది!

నేను ఉన్నప్పుడు రైతును ఇలా కష్టపెట్టలేదు. పంటలు పండే భూమిని ఎక్కడా పడావు పెట్టలేదు. చివరి భూములకు నీళ్లు తేవడం కోసం ఈ జిల్లాలోనే గుత్పా, అలీ సాగర్ ప్రాజెక్టులు ప్రారంభించాను. వైఎస్ హయాంలో ఈ రెండు ప్రాజెక్టులపై ఆర్భాటమే తప్ప పనులు చేసిన దాఖలా కనిపించడం లేదు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిన ఫలితమే ఇది! రైతులు కలిసికట్టుగా ఏర్పాటుచేసుకున్న లిప్టులు కూడా కరంట్ లేక ఎత్తిపోతున్నాయి.

సాగునీటి మంత్రి ఇక్కడివాడే. ఐనా ఈ ప్రాంతానికి న్యాయం జరగకపోవడం చాలా బాధాకరం. వాళ్లకు శ్రద్ధ లేదు. పరిష్కరించాలన్న ఆలోచనా లేదు. వ్యవసాయంలో రాష్ట్రానికే ఆదర్శం అంకాపూర్. ఆ గ్రామం కూడా ఈ జిల్లాలోనే ఉంది. నా యాత్ర అంకాపూర్‌కు ఈ దఫా వెళ్లనప్పటికీ ఈ జిల్లాలో నడుస్తున్నప్పుడు, కర్షక పరిషత్ చైర్మన్‌గా ఆ గ్రామాన్ని సందర్శించిన గుర్తులు మదిలో మెదిలాయి. ఇలాంటి బంగారు భూములున్న జిల్లాకు సాగునీటి పరంగా కాస్త చేయూత ఇస్తే ప్రతి గ్రామాన్నీ అంకాపూర్‌గా మార్చొచ్చు.