February 23, 2013

కుప్పం సైకిల్‌పై లోకేష్ సవారీ?

స్థానిక ఎన్నికల పై గురి

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన తనయుడు లోకేష్ 'స్థానికఎన్నికల' బాధ్యతలు స్వీకరించనున్నారా? గాడి తప్పిన టీడీపీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారా? శుక్రవారం కుప్పంలో ఆ యన జరిపిన 'ప్రైవేటు' పర్యటన ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాన్నే ఇస్తున్నది. చి త్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో ఓ కార్యకర్త ఇంట్లో జరిగిన వివాహానికి లోకేష్ శుక్రవారం హాజరయ్యారు.

తాను మళ్లీ వారంరోజుల్లో కుప్పంలో పర్యటిస్తానని, అప్పుడు కార్యకర్తలతో తీరిగ్గా మాట్లాడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ స్థానిక నాయకత్వంతో మాత్రం అంటీముట్టనట్లే వ్యవహరించారు. మందలింపు ధోరణిలో హెచ్చరికలూ చేశారు. డీసీఎంఎస్ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ఆదేశాలను ఇక్కడి నాయకులు ధిక్కరించడమే దీనికి కారణం. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ సహకారంతో వచ్చే డీసీఎంఎస్ పదవులు మనకొద్దని, ఆ ఎన్నికను బహిష్కరించాలని బాబు ఆదేశించారు. అయినా, చంద్రబాబు ఆదేశాల్ని ధిక్కరించి కుప్పం నియోజకవర్గానికే చెందిన డైరెక్టర్లు శ్యామరాజు, వరలక్ష్మమ్మ కాంగ్రెస్ సహకారంతో డీసీఎంస్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు పొందారు. దీంతో పర్యటన ఆద్యంతం లోకేష్ స్థానిక నేతలతో ఆగ్రహంతో ఉన్నారు. 'ఇక్కడ పార్టీ ఎటువెళ్తోంది. మీరింతమంది ఉండి ఏం చేస్తున్నా రు? మూడునెలల కోసారి నాన్న పర్యటిస్తున్నా, ఈ ఐక్యతా లోపమేమిటి?' అంటూ ప్రశ్నించారు.

నాయకులతో అసహనంగా ఉన్న ఆయన.. తనను పలకరించిన సామాన్యులతో మాత్రం ఆప్యాయంగా మాట్లాడారు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో 'నాన్నెలా ఉన్నారప్పా?' అని అడిగిన వృద్ధురాలికి.. కాళ్లనొప్పులతో ఉన్నారని, పాదయాత్ర పూర్తయిన తర్వాత మీ దగ్గరికి వస్తారని చెప్పారు. ప్రచారరథం ఎక్కి ముందుకు సాగాలని కోరిన స్థానిక నా యకులపై మాత్రం అసహనాన్ని ప్రదర్శించారు. తానొచ్చింది పెళ్లికే కానీ, పార్టీ కార్యక్రమాల కోసం కాదని మందలించారు. దీంతో స్థానిక నాయకులెవరూ ఆయన దరి చేరలేకపోయారు. మళ్లీ మార్చి నెల 7, 8, 9 తేదీల్లో ఆయన కుప్పంలో పర్యటించనున్నారు.

సింగిల్ విండో ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లతో వైసీపీ తన ఉనికి చాటింది. పార్టీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు బాబు ఆదేశాలను ధిక్కరించిన క్రమంలో.. నియోజకవర్గాన్ని ఇలాగే వదిలేస్తే పరిస్థితులు కట్టుతప్పుతాయని చంద్రబాబు భావించినట్టున్నారు. అందుకనే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని గాడినపెట్టి.. సంపూర్ణ విజయం చేజిక్కించుకునేందుకు తనయుడు లోకేష్‌కు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీవర్గాలు భావిస్తున్నాయి.