February 23, 2013

పంక్చర్ కాదు.. చక్రమే మార్చాలి

అర్ధాయుష్షు అంటే వీరిదే! యాభై ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోతాయి. కుర్ర ఈడుకే ఎముకలు అరిగిపోతాయి. నడిమి వయసు రాకముందే నడుం వంగిపోతుంది. తమ అర్ధాకలిలానే, అర్ధనగ్నంగా(లుంగీతో) ఉండే ఈ మనుషులు మన మధ్యనే తిరుగుతున్నారంటే నమ్మగలమా? శ్రమశక్తులను వెచ్చించి ఊపిరి నిలుపుకొంటూ ఉండే వీరి ఉనికిని విస్మరించగలమా? భట్టిప్రోలు ప్రాంతంలో తిరుగుతుండగా, ఎదురైన మనుషులూ, వాళ్లు వినిపించిన చేనేత వెతలూ విన్నప్పుడు కలిగిన భావమిది.

ఈ ప్రాంతంలోని నేతన్నలంతా ఒక సమావేశం పెట్టుకొని పిలిస్తే వెళ్లాను. చేనేత డిక్లరేషన్ ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే పాలకుల హామీలు అందని ద్రాక్షగా మారిన వైనాన్ని చెప్పుకొని వాపోయారు. చేనేతకు ఉన్న ఒకటీఅరా సంక్షేమ పథకాలూ మాస్టర్ వీవర్స్ పెరటి చెట్లుగా మారాయట. 'మా కన్నా ఉపాధి హామీ కూలీ బతుకే బెటర్‌గా ఉన్నది సార్..' అని అంటున్నప్పుడు వారి చీకటి కళ్లలో నైరాశ్యం కదలాడింది.

ఉపాధి కోసం కొందరు..ఉన్నదాన్ని నిలుపుకొనేందుకు మరికొందరు.. మొత్తంమీద యువకులంతా రోడ్డు మీదే ఉన్నారనిపించింది. సూరేపల్లిలో పంక్చర్ షాపులో పలకరించిన యువకుడు గానీ, ఆ పక్కనే ఉన్న వెల్డింగ్ షాపులో ముచ్చటించిన కుర్రాడు గానీ ఒకే గోడు వినిపించారు. "చేతులకు పని చూపకపోతే పోయారు.. కనీసం కరెంట్ అన్నా కరెక్టుగా ఇస్తే అదే మాకు పది వేలు.. లేదంటే మేమంతా రోడ్డున పడాల్సిందే సార్'' అని పంక్చర్ వేస్తూనే వెంకటేశ్వరరావు కళ్లు వత్తుకున్నాడు. పంక్చర్ వేయడం కాదు.. 'సర్కారు' చక్రాన్నే మార్చేయాలేమో!