March 25, 2013

హైదరాబాద్: తన పాలనలో టీడీపీ విద్యుత్‌రంగాన్ని చాలా బాగా నిర్వహించిందని, కాని సభలో జరిగిన చర్చలో దానిని సరిగ్గా చెప్పుకోలేకపోయిందని ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తెలంగాణ నగారా సమితి నేత, ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి వ్యాఖ్యానించారు. 'ఒక్క తెలంగాణ విషయంలోనే నేను పార్టీతో విభేదించా. మంచి జరిగి ఉంటే చెప్పడానికి నాకు ఇబ్బందేమీ లేదు.

విద్యుత్ రంగంలో టీడీపీ చాలా బాగా చేసింది. ఆ రోజు నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా. రైతులు గడియారం చూసుకొని పొలం వెళ్ళే స్థాయిలో క రెంటు ఇచ్చింది. ఎంత కరువు ఉన్నా రైతులకు ఇబ్బంది రానీయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంతా నాశనం అయింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఇంకా బాగా దాడి చేసి ఉండాల్సింది.' అని నాగం అన్నారు. తన రాజకీయ ప్రస్థానంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, ఏ పార్టీలో చేరేది తగిన సమయం వచ్చినప్పుడు చెబుతానని ఆయన అన్నారు.

టీడీపీ హయాం భేష్: నాగం

చీకట్లో ముంచారు!
ఎన్నికల లబ్ధికోసం రాష్ట్రాన్ని బలిపెట్టిన వైఎస్
కాంగ్రెస్ పాలనపై టీడీపీ బ్లాక్ పేపర్

హైదరాబాద్ : వైఎస్ సర్కారు నిర్లక్ష్యం...కిరణ్ సర్కారు కుంభకోణాలు కలగలిసి ఆంధ్రప్రదేశ్‌ను అంధకార ప్రదేశ్‌గా మిగిల్చాయని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. తొమ్మిదేళ్లపాటు తెలుగుదేశం ప్రభుత్వం నానా చాకిరీ చేసి విద్యుత్‌లో రాష్ట్రాన్ని మిగులులోకి తీసుకువస్తే కాంగ్రెస్ ఆ కృషినంతా అట్టడుగు స్థా యికి దిగజార్చిందని విమర్శించింది. విద్యుత్ రంగంలో తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీడీపీ సోమవారం బ్లాక్ పేపర్ (నిరసన పత్రం) విడుదల చేసింది. విద్యుత్ రంగ స్థితిగతులపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో.. ఈ బ్లాక్ పేపర్‌ని విడుదల చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

అప్పుడూ.. ఇప్పుడూ: "కరువులోనూ టీడీపీ తొమ్మిది గంటలపాటు కరెంటు ఇచ్చింది. తీవ్రమైన విద్యుత్ సమస్యల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒక దశకు తెచ్చింది. ఐదు వేల మెగావాట్ల మేర అదనంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. రూ. 18 వేల కోట్లు ఖర్చు చేసి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలను పటిష్టం చేసింది. విద్యుత్ సంస్థల ఆర్థిక లోటు పూడ్చి కొత్త పెట్టుబడులు తెచ్చుకొనే శక్తిని కల్పించింది. వ్యవసాయానికి వాడిన విద్యుత్‌కు రూ.19 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చింది. కరెంటు సరఫరాను చూసి రైతులు తమ గడియారాల్లో సమయం సరిదిద్దుకొనేంత సమయ పాలనతో సరఫరా జరిగింది''

'చీకటి' మాటలు!: టీడీపీ హయాంలో రాష్ట్రంలో వెలుగులు నిండగా, కాంగ్రెస్ పాలన వచ్చి చీకటి చేసిందని బ్లాక్ పేపర్‌లో ఆక్షేపించారు. "తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఐదు వేల మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్లు ప్రభుత్వం చెప్పుకొంటోంది. కానీ, ఇందులో ప్రైవేట్ ప్లాంట్ల నుంచి కొనుగోళ్లే ఎక్కువ. కరువు ఉన్నా టీడీపీ పాలనలో జల విద్యుదుత్పత్తి 981 మెగావాట్లు పెరగ్గా, రిజర్వాయర్లు నిండుగా ఉన్నా కాంగ్రెస్ హయాంలో మాత్రం 243 మెగావాట్లు మాత్రమే అదనంగా పెంచారు. రూ. 20 వేల కోట్ల ప్రణాళికా వ్యయంలో టీడీపీ..విద్యుత్ రంగానికి రూ.రెండు వేల కోట్లు కేటాయిస్తే..కాంగ్రెస్ తన లక్ష కోట్ల బడ్జెట్‌లో రూ. వంద కోట్లు కూడా కేటాయించడం లేదు. టీడీపీ హయాంలో ప్రైవేటు ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లు 9. 97 శాతం ఉంటే, కాంగ్రెస్ హయాంలో కమీషన్ల కోసం 17. 17 శాతానికి పెంచారు.

వ్యవసాయానికి విద్యుత్ వినియోగం టీడీ పీ హయాంలో 62 శాతం కాగా, ఇప్పుడది 47 శాతమే. విద్యుత్ రంగానికి ప్రభుత్వ సబ్సిడీ టీడీపీ హయాంలో 6. 56 శాతం ఉంటే ఇప్పుడది 4. 79 శాతానికి తగ్గిపోయింది. బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి కేటాయింపులు అప్పుడు 7.8 ఉంటే ఇప్పుడు 3.9శాతం. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కేవలం నాలుగేళ్లలో అవి ముప్ఫై వేల కోట్ల రూపాయిల మేర బకాయిల్లో కూరుకుపోయాయి.

2009 ఎన్నికల సమయంలో యూనిట్ రూ. 14కు విద్యుత్ కొనిపించి రూ. ఆరు వేల కోట్లు విద్యుత్ సంస్థలతో ఖర్చు చేయించారు. ఆ డబ్బులు మాత్రం ఆ సంస్థలకు ఇవ్వలేదు. దానితో అవి ఆ భారాన్ని ఇప్పుడు ప్రజలపై మోపుతున్నాయి''

జీవం లేని 'జెన్‌కో'!: అయిన కాడికి తిని జెన్‌కోను తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బ్లాక్ పేపర్ ఆరోపించింది. "జెన్‌కో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. కేటీపీఎస్ రెండో దశ, పులిచింతల, ఆర్టీపీఎస్, కృష్ణపట్నం ధర్మల్ ప్లాంటులు ఏనాటికి పూర్తవుతాయో తెలియదు. నేదునూరు, సత్తుపల్లి, శంకరపల్లి ప్రాజెక్టులను పూర్తిగా అటకెక్కించారు. వాన్‌పిక్ కోసం వేటపాలెం జెన్‌కో ప్లాంటును నిలుపుదల చేశారు. పులివెందుల అణు విద్యుత్ ప్లాంటు కర్ణాటకకు వెళ్లిపోతోంది. సకాలంలో నిధులు ఇచ్చి వీటిని పూర్తి చేస్తే 11 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చేది.

కానీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జెన్‌కో ఐదేళ్లలో తాను ఉత్పత్తి చేయాల్సిన దానిలో లక్ష మిలియన్ యూనిట్లు చేయలేకపోయింది. పైగా రూ. 3434 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. కేవీపీ కొడుకు, వైఎస్ అల్లుడు భాగస్వాములుగా ఉన్న ఒక బినామీ కంపెనీకి లాభాలు రావడం కోసం ఆర్టీపీపీ, వీటీపీఎస్, కాకతీయ ప్లాంట్ల నిర్మాణ వ్యయాన్ని పెంచేశారు. దీనిని కాగ్ ఎత్తిచూపింది. ఈ ప్రాజెక్టుల్లో నిర్మాణ లోపాలు, నాసిరకం పరికరాల వినియోగంతో రూ. 1950 కోట్ల దుర్వినియోగం జరిగిందని పేర్కొంది''

అంతా 'గ్యాస్'!: "ప్రైవేటు రంగంలో 3300 మెగావాట్ల గ్యాస్ ఆధారిత ప్లాంట్లు సిద్ధమయ్యాయి. అయితే, గ్యాస్ తెచ్చుకోలేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. టీడీపీ హ యాంలో గ్యాస్ ప్రాజెక్టులు 70 శాతం ఉత్పత్తి చేస్తే, ఇప్పుడు 24 శాతమే ఉత్పత్తి చేస్తున్నాయి. వచ్చే కొద్దిపాటి గ్యాస్‌నూ ప్రభుత్వానికి తక్కువ ధరకు కరెంటు ఇచ్చేవాటికి కాకుండా మర్చంట్ ప్లాంట్లకు (లాంకో, ఎల్వీఎస్, వేమగిరి) కట్టబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారు.

ట్రాన్స్‌కో సిఫారసు చేయకపోయినా మర్చంట్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయి. దీనివల్ల ప్రజలపై రూ. 4 వేల కోట్ల భారం పడుతోంది. క్యాప్టివ్ జనరేషన్ ఉన్న పరిశ్రమలు తక్కువ ధరకు విద్యుత్ తీసుకొని.. ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించి వేల కోట్లు స్వాహా చేశారు. కిరణ్ సర్కారు హయాంలో బొగ్గు కొనుగోళ్లు పెద్ద కుంభకోణంగా మారాయి. విద్యుత్ కొనుగోళ్లు అవినీతిమయంగా మారాయి''

'ఉచితం' ఉసూరు: "రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని 2004 ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత మూడేళ్లలో రూ. ఏడు వేల కోట్ల మేర ప్రజలపై భారం మోపింది. టీడీపీ హయాంలో 14 శాతం చార్జీలు పెంచినందుకు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 55 శాతం మేర వడ్డించారు. టెలిస్కోపిక్ విధానం ఎత్తివేసి ఈ భారం రెట్టింపు చేయాలని చూస్తున్నారు. రైతులకు తొమ్మిది గంటలపాటు కరెంటు ఇస్తామని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఇప్పుడది మూడు గంటలకు పడిపోయింది. విద్యుత్ కోతలతో రైతులకు ఈ మూడేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కోతలతో రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఈ ఒక్క నెలలోనే 20 వేల యూనిట్లు మూతపడ్డాయి''

వైఎస్ నుంచి కిరణ్ దాకా అవినీతిమయమే

సబ్సిడీపై కొవ్వొత్తులు సరఫరా చేయండి
జనవరిలోనే కోతలు పెట్టే దయనీయ స్థితి
విద్యుత్తు అంశంపై మండిపడ్డ టీడీపీ

హైదరాబాద్: కరెంటుపై సర్కారు తీరును తెలుగుదేశం పార్టీ కడిగిపారేసింది. విద్యుత్తు సమస్యపై చర్చించి తీరాల్సిందే అని పట్టుబట్టి సాధించుకుని... ప్రభుత్వంపై విరుచుకుపడింది. విద్యుత్ అంశంపై సోమవారం శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ సభ్యుడు పయ్యావుల కేశవ్ మాట్లాడారు. 'విద్యుత్తు సంక్షోభంపై పత్రికలలో ప్రతీరోజూ పతాక శీర్షికలలో వార్తలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా విద్యుత్తు బాధితులే. ఇప్పటివరకూ రైతుల ఆత్మహత్యలు మాత్రమే చూశాం. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు'' అని విమర్శించారు.

దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా జనవరి, ఫిబ్రవరి నుంచే కోతలు అమలవుతున్నాయన్నారు. "ఆస్పత్రుల్లో టార్చ్‌లైట్ల వెలుగులోనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకొకటి లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడమే ప్రస్తుత విద్యుత్తు సంక్షోభానికి కారణం. కరెంటుతోకాదు... కరెంటు బిల్లులతోనే షాకులు కొడుతున్నాయి'' అని వ్యాఖ్యానించారు.

నాడు మేమిలా: టీడీపీ హయాంలో భారీగా అదనపు విద్యుదుత్పత్తిని సాధించామని... కాంగ్రెస్ ఎందుకు ఆ పని చేయలేకపోయిందని పయ్యావుల నిలదీశారు. "అప్పుడు చంద్రబాబు బహిరంగ టెండర్లు పిలిచి రాష్ట్రానికి ఎవరు అతి తక్కువ ధరకు కరెంటు ఇస్తారో వారికే రాయితీలు, ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూములు, నీళ్లు ఇస్తామని ప్రకటించి... అదే విధానం అమలు చేశారు. కానీ... వైఎస్ వచ్చాక అనేక ప్రైవేటు విద్యుత్తు కంపెనీలకు 45వేల ఎకరాలు ధారాదత్తం చేశారు. వాళ్లకు ఇచ్చిన బొగ్గు మనది, భూమి మనది, బూడిదా మనకే. కానీ... విద్యుత్తు మాత్రం పొరుగు రాష్ట్రాలకు. ఈ దగా, దోపిడీకి వైఎస్సే కారణం'' అని మండిపడ్డారు.

విద్యుత్తు చార్జీల తగ్గింపు (రోల్‌బ్యాక్) అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్‌చార్జీల రూపంలో ప్రజలపై రూ.31వేల కోట్ల భారం మోపిందని పయ్యావుల మండిపడ్డారు. "ఇప్పటి పరిస్థితికి నాటి సీఎం వైఎస్, మాజీ సీఎం రోశయ్య, ప్రస్తుత సీఎం కిరణ్... అందరూ కారకులే'' అని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కిటికీలు తెరచిపెట్టుకోవాలని చెబుతున్నారని... సచివాలయంలో ఎందరు మంత్రులు, అధికారులు కిటికీలు తెరిచి ఉంచుకుంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన పవర్ గురించిఆలోచిస్తున్నారని... తాము రాష్ట్రానికి పవర్ కావాలని అడుగుతున్నామని తెలిపారు.

సోనియా కొవ్వొత్తులు: ప్రజలకు అవసరమైన కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం సోనియా కొవ్వొత్తులు, రాహుల్ విసనకర్రలు సబ్సిడీపై ఇవ్వాలంటూ పయ్యావుల ఎద్దేవా చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య ప్రభుత్వానికి అసలే పట్టడంలేదన్నారు. "ట్రాన్స్‌ఫార్మర్ల కోసం అనంతపురం జిల్లాలోనే 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పంటలకు నిప్పు పెట్టి రైతులు రోడ్లపై ఉంటున్నారు. విద్యుత్తు కోతలతో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. మొగుడు మోటార్లతో, భార్య స్టార్టర్లతో కాపురాలు చేస్తున్నారు. 11 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. మరో 20 వేల పరిశ్రమలు మూసివేత దశలో ఉన్నాయి'' అంటూ కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను చైనా, అమెరికాతో పోల్చడంలేదని... ఒకప్పుడు విద్యుత్తు రంగంలో మనకన్నా వెనుకబడిన గుజరాత్ ఇప్పుడు ఎలా దూసుకుపోయిందో గుర్తించాలని హితవు పలికారు.

సీఎం గారూ పల్లెలకు రండి: రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగుతోందంటూ సీఎం సన్నిహిత చానెల్ ఊదరగొడుతోందని కేశవ్ పేర్కొన్నారు. "నాడు వైఎస్ నడిస్తే నేలంతా పచ్చబడినట్లు చూపించారు. సీఎంగారూ... పల్లెలకు రండి. మీ వెలుగులను అక్కడ ప్రసారం చేయండి! పల్లెలకెళదాం! చర్చ పెడదాం!' అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభంపై శ్వేతపత్రం జారీ చేయాలని కేశవ్ డిమాండ్ చేశారు.

దీటుగా సీఎం సమాధానం: విద్యుత్తు సంక్షోభంపై పయ్యావుల కేశవ్ మాట్లాడుతుండగా కిరణ్ పలు సందర్భాల్లో కల్పించుకుని... అప్పటికప్పుడే తమ వాదన వినిపించారు. 'విద్యుత్తు అంశం తీవ్రమైనది. చాలా ఇబ్బందులున్నాయని మేమూ చెబుతున్నాం. కేశవ్ చక్కగా మాట్లాడుతున్నారు. కానీ, నిర్మాణాత్మకమైన సలహాలనివ్వాలి. మంచి సూచనలు ఇస్తే పాటించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం' అని హితవు పలికారు. 'కాగ్' ప్రస్తావన వచ్చినప్పుడు... ఆ నివేదిక ఖురాన్, బైబిల్, భగవద్గీత కాదని సీఎం వ్యాఖ్యానించారు. అదే సమయంలో కాగ్ నివేదికలను తాను తక్కువ చేయడంలేదని... అవే నిజమని మాత్రం చెప్పబోనని స్పష్టం చేశారు.

విపక్షాల నిరసనల నడుమ: సోమవారం సీపీఎం, సీపీఐ సభ్యులు కళ్లకు గంతలు, విద్యుత్ తీగల ఉరితాళ్లతో సభలోకి ప్రవేశించారు. ఆ పార్టీల శాసనసభాపక్ష నేతలు జూలకంటి రంగారెడ్డి, గుండా మల్లేశ్, టీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయానికి పదే పదే అంతరాయం ఎదురుకావడంతో... ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చినట్లుగా ప్రకటించిన స్పీకర్ విద్యుత్తు సమస్యపై చర్చకు అనుమతించారు.

పవర్ లేని ప్రభుత్వం : వామపక్షాలు
రాష్ట్రంలో పవర్‌లేని ప్రభుత్వం సభను కొనసాగించడం చేతకాక పారిపోయిందని సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. వాయిదాల మీద వాయి దా వేస్తూ కావాలనే సభ నిర్వహించకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు. విద్యుత్ సమస్యలపై వామపక్ష నేతలు ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేస్తుంటే సభలో దానిపై చర్చ జరగకపోవడాన్ని సీపీఐ నేత గుండా మల్లేశ్ తప్పు పట్టారు.

సోనియా కొవ్వొత్తులు రాహుల్ విసనకర్రలు ఇవ్వండి

ఎటుచూసినా ప్లకార్డులే! రాష్ట్రంలోని సమస్యలన్నీ ఒక్కచోట కుప్పపడ్డాయా అనిపించింది. ప్రజల కష్టాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు.. మండపేట సభ అంతటా అవే కనిపించాయి. కాలువల పూడికతీత నుంచి బెల్టుషాపుల ఎత్తివేత దాకా..ఎన్నెన్ని డిమాండ్లు వాళ్ల గొంతుల్లో పలికాయి! గ్రామస్థాయిలో సమన్వయంతో పరిష్కరించుకోగల సమస్యలు వాటిలో కొన్ని కాగా, హైదరాబాద్ గద్దెను కదిలించిగానీ సాధించుకోలేనివి మరికొన్ని. ప్రభుత్వం పూనుకోవాల్సినవి కొన్నయితే, ప్రభుత్వమే సృష్టించినవి మరికొన్ని.. రైతులు, కార్మికులు, బీఎడ్ నిరుద్యోగులు, మహిళలు, వ్యాట్ ఉద్యమకారులు, పరిశ్రమల యజమాన్యాలతో సభ నిండిపోయింది.

ఎవరి సమస్యలు వారివే. కానీ, ఉమ్మడిగా 'కరెంట్ కోతలు-చార్జీల'పైనే అందరి ఆవేదన. 'రాజీవ్ యువ కిరణాలను' అపహాస్యం చేస్తున్నట్టున్నాయి ఆ యువకుల మాటలు. "ఈ సర్కారు ఒక చేత్తో ఇస్తుంది..మరో చేత్తో బలవంతంగా లాగేసుకుంటోంది సార్! ఏడు లక్షలమందిమి బజారున పడ్డాం. పూర్తిగా ఆశలు వదులుకోలేం.. అలాగని మా కుటుంబాలకు భారంగా జీవించలేకపోతున్నా'మని బీఎడ్ నిరుద్యోగులు వాపోయారు. ఏదీ ఆ యువ కల?

ఇదేదో రికార్డుల కోసంకాదు. ఇది నా ఒక్కడి వ్యక్తిగత విజయమూ కాదు. కొన్ని లక్షల మందిని నేరుగా కలుసుకునేందుకే ఇంత దూరం (2,500 కిలోమీటర్లు) నడిచాను. ఎంత దూరం నడిచినా, మరెంత దారి మిగిలి ఉన్నా.. స్వయంగా ఈ ప్రజల బాధలను పంచుకున్నానన్న తృప్తి మాత్రం నాకు మిగిలింది. బతుకు భారమైన జీవులకు భవిష్యత్తుపై భరోసా కల్పించగలిగినప్పుడే సార్థకత. దానికోసం ఎంత దూరమైనా నడుస్తాను.

'యువ'కల ఏమైపోయింది?

హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. రాజమండ్రి సీటును సినీ నటుడు మురళీమోహన్‌కు ఖరారు చేశారు. ఎస్సీలకు రిజర్వు చేసిన అమలాపురం సీటుకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేశారు. సూర్యారావు పేరును చంద్రబాబు ఆ జిల్లా పార్టీ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఇక కాకినాడ సీటుకు పోతుల విశ్వం పేరు ఖరారు చేశారు. త్వరలోనే చంద్రబాబు ఆయన పేరును ప్రకటించనున్నట్లు ఆ జిల్లా పార్టీవర్గాలు తెలిపాయి.

స్థానిక నాయకులతో మాట్లాడి వీరి పేర్లను ఆయన ఖరారు చేసినట్లు ఈ వర్గాలు తెలిపాయి. విద్యా సంస్థల అధినేత అయిన విశ్వం గతంలో ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పనిచేసి.. ఆ తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఒకసారి పోటీచేశారు. కాగా, తూర్పుగోదావరికి పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ సీట్లలో ఒక సీటుకు (ఏలూరు- మాగంటి బాబు) అభ్యర్థిని ఖరారు చేశారు.

కృష్ణా జిల్లాలో రెండు సీట్లు ఉండగా, మచిలీపట్నం సీటుకు సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావును ఈసారి కూడా నిలపనున్నారు. విజయవాడ సీటుకు కేశినేని ట్రావెల్స్ అధినేత నాని పేరు ఖరారైంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఆ జిల్లా పార్టీ నేతలకు చంద్రబాబు ఆయన పేరును ఇప్పటికే వెల్లడించినట్లు సమాచారం. ఈ స్థానంలో మునుపటి ఎన్నికలలో పోటీచేసిన వల్లభనేని వంశీని నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గంలో నిలపాలని టీడీపీ యోచిస్తోంది.

'తూర్పు'లో అభ్యర్థుల ఖరారు

బెబ్బులిలా తిరగబడండి!
తల్లి, పిల్ల కాంగ్రెస్‌లను వదలొద్దు
ఉపేక్షిస్తే మరిన్ని కష్టాలు
పేద కాపుల కోసం పథకం ప్రకటిస్తా
'తూర్పు'లో చంద్రబాబు వెల్లడి
2500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న పాదయాత్ర

కాకినాడ: "తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ల అవినీతిపై బెబ్బులులై, కొండవీటి సింహాలై తిరగబడండి. మీ సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన సొమ్మును ఈ గజదొంగలు దోచుకున్నారు. ఆ దొంగలపై తిరగబడదాం. ఆ అవినీతి దున్నపోతుల్ని సాగనంపుదాం'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిదవద్ద సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వృద్ధులను, యువకులను, కార్మికులను పలకరిస్తూ ఉత్సాహంగా ఆయన నడక సాగించారు. "చంద్రన్నా నీ పాలన మళ్లీ రావాలి'' అని ఏడిదలో ఓ మహిళ అన్న మాటలతో ఆయన చలించిపోయారు.

"కరెంటు లేదు..నీళ్లు రావు.. ధరలు పెరిగాయి. మాకన్నీ సమస్యలే. వీటిని తీర్చాలంటే మీరు మళ్లీ అధికారంలోకి రావాలి'' అని వేడుకున్న ఆ మహిళకు ధైర్యం చెప్పి ఆయన ముందుకు కదిలారు. ఇలాగే ఉపేక్షిస్తే ఈ కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ దొంగలు చెలరేగిపోతారని యువత, టీడీపీ కార్యకర్తలతో అన్నారు. కాంగ్రెస్ అద్దె ఇంటిని వదిలి టీడీపీ అనే సొంత ఇంటికి తిరిగి రావాలని పలు వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముందు నుంచీ టీడీపీకి అండదండలు అందించిన కాపులు మధ్యలో ఒకాయన మోజులో(చిరంజీవి) బయటకు వెళ్లారని, ఇపుడు వారంతా వచ్చి తన పాదయాత్రను ఆదరించడం ఆనందంగా ఉన్నదని అన్నారు.

కాపులలో పేదల కోసం ప్రత్యేక పథకాన్ని రెండుమూడు రోజులలో ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా 'రాజు-పేద' కథ చెప్పి ఆకట్టుకున్నారు. ఆ కథలో అత్యాశ గల పేదవాడిలాగే.. జగన్ కూడా పేదలకు దక్కాల్సిన భూముల్ని కొల్లగొట్టి చివరకు జైల్లోపడ్డారని ఎద్దేవాచేశారు. వైఎస్ హయాంలో జరిగిన అక్రమాల్లో.. రూ.42 వేల కోట్లదాకా సీబీఐ విచారణలో ఇప్పటివరకు బయటపడ్డాయని బాబు వివరించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యసేవలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

కౌలు రైతులకు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ హామీతో వడ్డీలేని రుణాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ బానిస పాలన నుంచి బయటపడాలంటే టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. జగన్ పత్రిక.. ఓ విషపుత్రిక అని మండిపడ్డారు. కాగా, మండపేట వద్ద పాదయాత్ర 2500 కిలోమీటర్లు దాటిన సందర్భంగా భారీ పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. భారీ కేక్‌ను కట్‌చేసి అభిమానులకు పంచారు. అలాగే 2500 కొవ్వొత్తులతో నిర్వహించిన భారీ ప్రదర్శన ఆకట్టుకుంది.

గజదొంగల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వచ్చే నెలలో విశాఖ జిల్లాలో చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది. అయితే నగరంలోని తూర్పు నియోజకవర్గానికి సంబంధించి రూటు ఇవ్వాల్సి వుంది. పైలాన్ నిర్మాణ స్థలం ఎంపిక మేరకు బహిరంగ వేదిక వుంటుంది. వేసవి దృష్ట్యా ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర మొదలవుంది. రాత్రి పదిగంటలకు ముగిస్తారు. మొత్తంగా 19 రోజుల పాదయాత్రలో 163 కిలోమీటర్ల దూరం నడుస్తారు. జిల్లాలో 11 నియోజకవర్గాలలో కొనసాగుతున్న ఈ పాదయాత్రలో ఐదు రోజులు ఒక్క నర్సీపట్నానికే కేటాయించారు. నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పరిశీలకుడు సుజనాచౌదరి ఆదివారం సమావేశమై రూటును ఖరారు చేశారు. రూటుకు సంబంధించి వివరాలిలా వున్నాయి...

వచ్చే నెల ఎనిమిదో తేదీన తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు నుంచి నాతవరం మండలం గన్నవరం మెట్టకు చేరుకోవడం ద్వారా చంద్రబాబు విశాఖ జిల్లాలో అడుగుపెడతారు. ఆ రోజు శరభవరం, శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్, డి.ఎర్రవరం వరకు 10.3 కి.మీ. పాదయాత్ర చేస్తారు. తొమ్మిదిన డి.ఎర్రవరంలో యాత్ర మొదలుపెట్టి చెట్టుపల్లి, జిల్లేడిపూడి, చెర్లోపాలెం, కొత్తూరు జంక్షన్(పాయకరావుపేట నియోజకవర్గం), పాములపాక వరకు 12.5 కి.మీ. నడుస్తారు. పదిన పాదయాత్రకు విరామం.

తిరిగి 11న పాములపాకలో పాదయాత్ర ప్రారంభించి భీమిరెడ్డిపాలెం, నీలిగుంట, రామచంద్రపాలెం, బి.కె.పల్లి మీదుగా జల్లూరు వరకు 11.5 కిలోమీటర్ల దూరం నడుస్తారు. ఏప్రిల్ 12న జల్లూరు నుంచి యండపల్లి, మల్లవరం, గిడుతూరు, బయ్యవరం, కొండల అగ్రహారం , నల్లమారెమ్మగుడి వరకు 11 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. 13న నల్లమారెమ్మగుడి నుంచి మాకరపాలెం, తామరం, రాచపల్లి జంక్షన్, బి.బి.పాలెం, శెట్టిపాలెం, రాజుపేట, సబ్‌స్టేషన్ వరకు 12 కిలోమీటర్లమేర పాదయాత్ర చేస్తారు.

మరుసటి రోజు 14 ఆదివారం కావడంతో పాదయాత్రకు విరామం. 15న అనకాపల్లి నియోజకవర్గంలోని పాతకన్నూరుపాలెం, కన్నూరుపాలెం, ఆనందపురం జంక్షన్, కొత్తూరు, అడ్డాం జంక్షన్, జి.భీమవరం, అచ్లెర్ల జంక్షన్ వరకు పది కిలోమీటర్లు నడుస్తారు. 16న బంగారుపేట, తాళ్లపాలెం, అమీన్ సాహెబ్‌పేట జంక్షన్, గొబ్బూరు జంక్షన్, నర్సింగబిల్లి, సోమవరం, సోమవారం బ్రిడ్జి వరకు 9.5 కి.మీ., 17న ఎలమంచిలి నియోజకవర్గంలో గణపర్తి, చూచుకొండ, ఎం.జగన్నాథపురం, మల్లవరం జంక్షన్, ఉప్పవరం, ఎర్రవరం, కొండకర్ల జంక్షన్ వరకు 10.9 కి.మీ. సాగుతుంది. 18న హరిపాలెం, తిమ్మరాజుపేట, మునగపాక, ఓంపోలు, నాగులాపల్లి, అనకాపల్లి బైపాస్ రోడ్ జంక్షన్ వరకు 9.1 కి.మీ., 19న అనకాపల్లి పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్, నెహ్రూచౌక్, ఎన్టీఆర్ జంక్షన్, చిననాలుగురోడ్ల జంక్షన్, రింగురోడ్, పార్కు జంక్షన్, సుంకరమెట్ట, శంకరం, రేబాక, కాపుశెట్టివానిపాలెం, కోడూరు జంక్షన్ మీదుగా మర్రిపాలెం వరకు 11.9 కి.మీ. నడుస్తారు. 20న పెందుర్తి నియోజకవర్గంలో బాటజంగాలపాలెం, సున్నపు బట్టీలు, అసకపల్లి జంక్షన్, ఎరువాడ జంక్షన్, సబ్బవరం జంక్షన్, జోడుగుళ్ల జంక్షన్, సురెడ్డిపాలెం వరకు 10.3 కి.మీ. పాదయాత్ర కొనసాగుతుంది. 21న ఆదివారం కావడంతో విస్తృత స్తాయి సమావేశం నిర్వహిస్తారు.

తిరిగి 22న అమృతపురం, అమరపిన్నిపాలెం, పెద్దగొల్లపాలెం, నంగినారపాడు, వెదుళ్ల నరవ, కొత్తూరు జంక్షన్ వరకు 10.6 కి.మీ. నడక పూర్తిచేయడం ద్వారా రూరల్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ముగుస్తుంది. కాగా 23న గాజువాక నియోజకవర్గంలోని దువ్వాడలో అడుగుపెట్టడం ద్వారా నగరంలోకి ప్రవేశించే చంద్రబాబు ఆ రోజు రాజీవ్‌నగర్, కూర్మన్నపాలెం, వడ్లపూడి, శ్రీనగర్, నడుపూరు, పెదగంట్యాడ, కొత్తగాజువాక జంక్షన్ వరకు 10 కిలోమీటర్లు నడుస్తారు. 24న పాతగాజువాక జంక్షన్, ఆటోనగర్, నాతయ్యపాలెం, షీలానగర్, ఎన్ఏడీ జంక్షన్ వరకు 11.5 కి.మీ., 25న విశాఖ పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లోని మర్రిపాలెం, ఐటీఐ జంక్షన్, కంచరపాలెం, కాన్వెంట్ జంక్షన్, కొబ్బరితోట, దుర్గాలమ్మగుడి, జగదాంబ జంక్షన్ వరకు 9.4 కి.మీ. నడుస్తారు.

26న తూర్పు నియోజకవర్గంలో పాదయాత్రపై ఇంకా రూటు ఖరారుకాలేదు. 26న తూర్పులో పాదయాత్ర పూర్తిచేయనున్న చంద్రబాబు 27న బహిరంగ సభలో పాల్గొని 'వస్తున్నా మీకోసం'యాత్రను ముగిస్తారు. కాగా రాత్రి బసకు సంబంధించి ఇప్పటి వరకు ఖరారుచేసిన స్థలాలు మారే అవకాశం వుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మూడు రోజులు వెనక్కు? ఇదిలావుండగా టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' యాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం వున్నట్టు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ఒక రోజు ఆలస్యం అయ్యే అవకాశం వుందని అందువల్ల విశాఖకు ఏప్రిల్ ఎనిమిదికి బదులు తొమ్మిదిన రానున్నట్టు తెలిసింది. అయితే ఏప్రిల్ పదో తేదీన కొత్త అమావాస్య పండుగను విశాఖ రూరల్ ప్రాంతంలో సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో తొమ్మిది, పది తేదీలు చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోనే పర్యటించేలా చూడాలని విశాఖ నాయకులు ఆదివారం రాత్రి అధిష్ఠానానికి ప్రతిపాదించారు. దీనిపై ఒకటి రెండురోజుల్లో అధికారికంగా సమాచారం వచ్చే అవకాశం వుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బాబు బహిరంగ సభ ఏర్పాట్లకు కమిటీ టీడీపీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్న పాదయాత్ర ముగింపురోజున జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభతోపాటు పైలాన్ నిర్మించనున్నారు. బహిరంగ సభ నిర్వహణ, పైలాన్ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించడానికి సీనియర్ నాయకులతో కమిటీని ఏర్పాటుచేయనున్నారు. రూరల్, నగరంలో చంద్రబాబు పాదయాత్రలో నాయకులంతా బిజీగా వుంటున్నందున బహిరంగకు జన సమీకరణకు ఇబ్బంది లేకుండా కమిటీ పర్యవేక్షిస్తుందని జిల్లా నాయకత్వం యోచిస్తుంది. అయితే కమిటీలో ఎవరెవర్ని నియమించాలి అన్నది ఒకటి రెండురోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

8నుంచి బాబు యాత్ర

తూ.గో : వస్తున్నా...మీకోసం పాదయాత్రలో ఉన్న టీడీ పీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం టీడీఎల్పీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీలో విద్యుత్ సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. విద్యుత్ సమస్యపై చర్చ జరగకుండా వైసీపీ అడ్డుకునే అవకాశం ఉందని, చర్చ జరిగితే విద్యుత్ సంక్షోభానికి వైఎస్ కారణమనే విషయం బయటపడుతుందని నేతలకు తెలిపారు. ప్రభుత్వం కూడా తప్పుంచుకోవాలనే ప్రయత్నం చేస్తుందని, సభలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యేలకు బాబు నిర్దేశించారు.

టీడీఎల్పీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థిగా శాసనమండలికి ఎన్నికైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఎమ్మెల్సీ ధృవపత్రం స్వీకరించారు.

ఎమ్మెల్సీ ధృవపతరం స్వీరించిన యనమల

విద్యుత్ సమస్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది
విద్యుత్ కోతతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి
టీడీపీ హయాంలో విద్యుత్ ఉత్పత్తికి చేస్తే,

హైదరాబాద్: విద్యుత్ సమస్యలతో రాష్ట్రం అట్టుడుకుతోందని, నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్లినా విద్యుత్ గురించే ప్రశ్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని, కరెంట్ సమస్యలతో చిన్న పరిశ్రమల యాజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం అసెంబ్లీలో విద్యుత్ సమస్యలపై జరుగుతున్న చర్చల్లో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రులలో కొవ్వొత్తులు వెలిగించుకుని ఆపరేషన్లు చేస్తున్నారని పయ్యావుల అన్నారు. ప్రైవేటు సంస్థలు విద్యుత్‌ను అమ్ముకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్ సమస్యలకు కిరణ్ సర్కారుతో పాటు రోశయ్య, వైఎస్ ప్రభుత్వాలు కూడా కారణమన్నారు. నేతులు, ఉద్యోగులు విద్యుత్‌ను పొదుపు చేయకుండా, ప్రజలను పొదుపు చేయమనడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.

పరిస్థితి ఇలాగే ఉంటే సోనియా కొవ్వొత్తులు, రాహుల్ విసనకర్రలు అందరికీ పంచిపెట్టాలని పయ్యావుల ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యను తేల్చకుండా ప్రకృతి సహకరించడం లేదంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. చార్జీల పెంపును కాంగ్రెస్ మెనీఫెస్టోలో ప్రకటించలేదని ఈ సందర్భంగా కేశవ్ గుర్తుచేశారు. ఇప్పటి వరకు ప్రజలపై రూ.32 కోట్ల భారాన్ని వేసిందన్నారు. వైఎస్ హయాంలో జరిగిన తప్పులకు ఇప్పుడు ప్రజలు శిక్ష అనుభవించాల్సివస్తోందని ఆయన అన్నారు.

వైఎస్ 20 ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు 45 వేల ఎకరాల భూమి కేటాయించారని కేశవ్ అన్నారు. బొగ్గు మనది, భూమి మనది, బూడిద మన దని, అయితే విద్యుత్‌ను మాత్రం పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని పయ్యావుల తీవ్రంగా మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకుంటున్న ల్యాంకో, జీవీకే ప్లాంటుకు గ్యాస్ ఎందుకు కేటాయించారని ఆయన ప్రశ్నించారు. కమిషన్లు తీసుకుని పెద్ద కంపెనీలకే అనుమతులిస్తున్నారని కేశవ్ ఆరోపించారు.

కాగ్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏం జరగకపోతే కాగ్ ఎందుకు తప్పుబట్టిందని పయ్యావుల ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెంపునకు కృషి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు విద్యుత్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. డిస్కంలను దివాలా తీయించిన ఘనత వైఎస్‌దే అని కేశవ్ అన్నారు. క మిషన్ల కోసం కోస్తా తీరం మొత్తం వైఎస్ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

విద్యుత్ సమస్యపై కాగ్ నివేదికను పయ్యావుల ప్రస్తావించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేచి.. కాగ్ అంటే భగవత్‌గీతో, ఖురానో, బైబిలో కాదన్నారు. కాగ్ నివేదికపై పిఏసి నివేదిక ఇస్తుందన్నారు. ఇతర ప్రాజెక్టుల కన్నా జెన్ కో ధర ఎక్కువని కాగ్ నివేదికలో పేర్కొన్నదని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తాను కాగ్‌ను తప్పు పట్టడం లేదని కిరణ్ చెప్పారు. అయితే, విశ్లేషణ చేశాకే ఓ అంచనాకు రావడం కుదురుతుందన్నారు.

డిస్కంలను దివాలా తీయించిన ఘనత వైఎస్‌దే : పయ్యావుల

కాకినాడ సిటీ:రాష్ట్ర రాజకీయాలలో 'తూర్పుగోదావరి'కి ప్రత్యేక స్థానం వుంది. ఇక్కడ ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. అంటే ఇక్కడ ప్రజల నాడిని పడితే మొత్తం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వుంటారు. ఇపుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నారు. 'తూర్పు'లో ఈ నాలుగు రోజుల పాదయాత్ర స్పందన ఎలా వుంది? ఏయే వర్గాలు మనకు దగ్గరవుతున్నాయ్.? ఇంకా ఏయే వర్గాల వారిని దగ్గర చేసుకోవాలి. అందుకు మనం ఏం చేయాలి? అంటూ చంద్రబాబు పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

పాదయాత్రకు ఒక్క రోజు విరామం ఇచ్చిన సందర్భంగా అనేకమంది నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నాని చెబుతున్న చంద్రబాబు ఇదే సమయంలో ఏయే వర్గాలు తమను ఆదరిస్తున్నాయో.. ఇంకా ఏయే సామాజిక వర్గాల ప్రజలను దగ్గర చేసుకునేందుకు ఏయే వ్యూహాలు రూపొందించుకోవాలి? అనే ఆలోచనలో వున్నారు. ఈనెల 20న జిల్లాలో చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర ప్రారంభయింది. చంద్రబాబుకు స్వాగతం చెప్పేందుకు రాజమండ్రి నేతలు అనూహ్య రీతిలో ఏర్పాట్లు చేశారు. జనం కూడా భారీగా రావడంతో చంద్రబాబుతోపాటు.. పార్టీ నేత లూ హుషారుగా కన్పించారు. ఇలా నాలుగు రోజుల యాత్రలో వేలాదిగా జనం చంద్రబాబు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 2009 ఎన్నికల ముందు 'మీ కోసం' పేరుతో చంద్రబాబు జిల్లాలో యాత్ర నిర్వహించారు. అప్పటితో పోలిస్తే ఈ యాత్రకు జనం ఎక్కువగా వస్తున్నారు.

ఆ సామాజిక వర్గంపైనే గురి 2009 అసెంబ్లీ ఎన్నికలలో పీఆర్పీ వెంట వెళ్లిన బలమైన సామాజిక వర్గంపైనే చంద్రబాబు దృష్టిసారిస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌తో ఆయా సామాజిక వర్గాలు, వర్గీకరణకు అనుకూలమని చెప్పడంతో మాదిగ, ఉపకులాల సామాజిక వర్గాలలో టీడీపీకి బలం పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో పీఆర్పీకి వెన్నుదన్నుగా నిలబడిన 'కాపు' సామాజిక వర్గంవారిని ఆకట్టుకునేందుకు చంద్రబాబు పదేపదే వారి ప్రస్తావనే తీసుకువస్తున్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అని ప్రకటించిన చంద్రబాబు.. అగ్రవర్ణాలలో కాపుల్లోనే ఎక్కువ పేదలు వున్నారని.. వారికి తగిన రీతిలో న్యాయం చేస్తామని ప్రకటిస్తున్నారు.

కార్యకర్తల సూచనలకు ప్రాధాన్యత అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సందర్భంగా పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. విలువైన సూచనలు ఉంటే ఖచ్చితంగా వాటిపై బాబు ప్రస్తావిస్తున్నారు. 'గత ఎన్నికలలో సామాజిక న్యాయం చేస్తాడని నమ్మి చిరంజీవి వెంట వెళ్లాం. అతను మోసం చేసి కాంగ్రెస్‌కి అమ్ముడుపోయాడు. ఇపుడు ఆ తప్పు చేయం. మమ్మల్ని మీరు ఆదుకోవాలి. కాపుల్లోనే ఎక్కువ పేదలు ఉన్నారు. రిజర్వేషన్లు అక్కర్లేదు కానీ.. ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలి..' అని అమలాపురం సమీక్ష సందర్భంగా ఒక కార్యకర్త బాబు దృష్టికి తీసుకువచ్చారు. అప్పటి నుంచీ చంద్రబాబు ప్రతీ సమావేశంలోనూ అగ్రవర్ణ పేదలు, కాపుల పేదరికం గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీంతో మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.. అన్న నమ్మకం ఆ వర్గంలో కలుగుతోంది.

రుణ మాఫీపైనా స్పందన టీడీపీని గెలిపిస్తే వ్యవసాయ, చేనేత, ఇతర వృత్తుల వారి రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీనిపై కూడా ఆయా వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేస్తామని స్పష్టమైన ప్రకటన ఇవ్వడంతో రైతన్నల నుంచీ టీడీపీకి మద్దతు పెరుగుతోందని పార్టీ వర్గాలు చంద్రబాబు దృష్టికి తీసుకువస్తున్నారు.

అభ్యర్థుల ఎంపికపైనా స్పష్టత అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి గొల్లపల్లి సూర్యారావు, రాజమండ్రి నుంచి మురళీమోహన్ అభ్యర్ధిత్వాలపై చంద్రబాబు జిల్లాకు వచ్చిన తొలిరోజే స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో అభ్యర్థులను ముందే ఖరారుచేయనున్నట్టు సంకేతాలు పంపారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఎవరికి టికెట్లు ఇచ్చేది ఈ పాదయాత్రలోనే చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం వుంది.

విరామంలో విశ్లేషణ!


రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్రకు వివిధవర్గాల నుంచి స్పందన రావడంతోపాటు పలువురు పార్టీలోకి వస్తుండటంతో పార్టీ వర్గాలలో ఆత్మవిశ్వాసం పెరిగింది. గత ఏడాది జరిగిన రామచంద్రపురం ఉపఎన్నికలో వెనుకబడిన తెలుగుదేశం పార్టీ ఇటీవల అనూహ్యంగా బలాన్ని పెంచుకున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు పాదయాత్రలో ప్రజలే స్వయంగా తమ వాణి వినిపించడం గమనార్హం. దీనిని చంద్రబాబు అనుకూలంగా ఉపయోగించుంటున్నారు. ప్రభుత్వం మీద, అవినీతిపైన ప్రజలకు అర్ధమయ్యేరీతిలో పిట్ట కథలు కూడా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి సమీక్షా సమావేశాలలోనే చురకలు వేస్తున్నారు.

టిక్కెట్లకు పెరుగుతున్న పోటీ: ఇటీవల పార్టీనుంచి పోటీ చేయడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్యకూడా పెరుగుతోంది.

అసెంబ్లీ నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం వుండగా.. ఒకటీ అరా మారే అవకాశాలను కూడా కాదనలేం. కొత్తగా తుని నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతోపాటు శాసనమండలిలో ప్రతిపక్షనేత కాబోతున్నారు. దాంతో అక్కడ యనమల కృష్ణుడిని పోటీకి పెట్టే విషయాన్ని ఇప్పటికే యనమల రామకృష్ణుడు ధృవీకరించిన విషయం తెలిసిందే. ఈసారి ఎస్సీ నియోజకవర్గాలలో కూడా అనేక మం ది అభ్యర్ధులు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు.

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శెట్టిబలిజలకు ప్రాధాన్యత లభించనుండగా.. కాపులకు కాకినాడ ఎంపీ స్థానంతో పాటు పలు అసెంబ్లీ స్థానాలు కూడా ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం వున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల అధినేత పోతుల విశ్వం ఇటీవల చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. జిల్లాలో అధినేత పాదయాత్ర పూర్తయ్యేలోపు అభ్యర్ధుల విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం వుంది.

యాత్రతో టీడీపీ శ్రేణుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం

మండపేట: టీడీపీ అధినేత మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా శనివారం మండపేట మండలం ఏడిదకు చేరుకుంది. ఆయన పాదయాత్రకు ఆదివారం విరామం ప్రకటించటంతో ఆయన పూర్తిగా విశ్రాంతిలోనే గడిపారు. పాదయాత్ర సందర్భంగా బాబును కలిసేందుకు శనివారం ఏడిదకు వచ్చిన భువనేశ్వరి తిరిగి ఆదివారం హైదరాబాదుకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఆయన బసచేసిన ఏడిద చింతాలమ్మగుడి సమీపంలో ఏర్పాటుచేసిన శిబిరం పోలీసులతో నిండిపోయింది. బాబు విజయవాడ ముఖ్యనేతలతో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు.

కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వల్లభనేని వంశీ, కేశినేని నానీ, బుద్దా వెంకన్న, నాగుళ్ల మీరా తదితరు లు చంద్రబాబును విడివిడిగా కలుసుకున్నారు. వీరితో బాబు సుదీర్ఘంగా గంటన్నరపాటు చర్చ లు జరిపారు. ఈ చర్చల్లో విజయవాడ రాజకీయాలపై నేతలు బాబుతో చర్చించారు. ఈ చర్చల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షించినట్లు తెలిసింది. బాబును కలిసిన నేతలను విలేఖర్లు ప్రశ్నించగా విజయవాడలో టీడీపీ బలంగా ఉందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషిచేస్తామని, బాబు ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత కేశినేని నాని చెప్పారు. పార్టీ పదవుల వ్యవహారంపై ప్రశ్నించినప్పుడుఅలాంటి అంశాలేవీ చర్చకురాలేదని తెలిపారు.

ప్రస్తుతం తా మంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని ప్రకటించారు. టీడీపీ నేత వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు కుటుంబ సభ్యులతో చంద్రబాబును కలిశారు. బాబును కలిసిన వారిలో ముఖ్యనేతలతో పాటు కె.గంగవరం మండలంలో ఉన్న కొంతమంది కార్మికులు బాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు ను కలిసిన వారిలో ముఖ్య నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు.

ఏడిదలోనేతల సందడి...