March 25, 2013

యాత్రతో టీడీపీ శ్రేణుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం


రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్రకు వివిధవర్గాల నుంచి స్పందన రావడంతోపాటు పలువురు పార్టీలోకి వస్తుండటంతో పార్టీ వర్గాలలో ఆత్మవిశ్వాసం పెరిగింది. గత ఏడాది జరిగిన రామచంద్రపురం ఉపఎన్నికలో వెనుకబడిన తెలుగుదేశం పార్టీ ఇటీవల అనూహ్యంగా బలాన్ని పెంచుకున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు పాదయాత్రలో ప్రజలే స్వయంగా తమ వాణి వినిపించడం గమనార్హం. దీనిని చంద్రబాబు అనుకూలంగా ఉపయోగించుంటున్నారు. ప్రభుత్వం మీద, అవినీతిపైన ప్రజలకు అర్ధమయ్యేరీతిలో పిట్ట కథలు కూడా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి సమీక్షా సమావేశాలలోనే చురకలు వేస్తున్నారు.

టిక్కెట్లకు పెరుగుతున్న పోటీ: ఇటీవల పార్టీనుంచి పోటీ చేయడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్యకూడా పెరుగుతోంది.

అసెంబ్లీ నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం వుండగా.. ఒకటీ అరా మారే అవకాశాలను కూడా కాదనలేం. కొత్తగా తుని నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతోపాటు శాసనమండలిలో ప్రతిపక్షనేత కాబోతున్నారు. దాంతో అక్కడ యనమల కృష్ణుడిని పోటీకి పెట్టే విషయాన్ని ఇప్పటికే యనమల రామకృష్ణుడు ధృవీకరించిన విషయం తెలిసిందే. ఈసారి ఎస్సీ నియోజకవర్గాలలో కూడా అనేక మం ది అభ్యర్ధులు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు.

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శెట్టిబలిజలకు ప్రాధాన్యత లభించనుండగా.. కాపులకు కాకినాడ ఎంపీ స్థానంతో పాటు పలు అసెంబ్లీ స్థానాలు కూడా ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం వున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల అధినేత పోతుల విశ్వం ఇటీవల చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. జిల్లాలో అధినేత పాదయాత్ర పూర్తయ్యేలోపు అభ్యర్ధుల విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం వుంది.