March 25, 2013

విరామంలో విశ్లేషణ!

కాకినాడ సిటీ:రాష్ట్ర రాజకీయాలలో 'తూర్పుగోదావరి'కి ప్రత్యేక స్థానం వుంది. ఇక్కడ ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. అంటే ఇక్కడ ప్రజల నాడిని పడితే మొత్తం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వుంటారు. ఇపుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నారు. 'తూర్పు'లో ఈ నాలుగు రోజుల పాదయాత్ర స్పందన ఎలా వుంది? ఏయే వర్గాలు మనకు దగ్గరవుతున్నాయ్.? ఇంకా ఏయే వర్గాల వారిని దగ్గర చేసుకోవాలి. అందుకు మనం ఏం చేయాలి? అంటూ చంద్రబాబు పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

పాదయాత్రకు ఒక్క రోజు విరామం ఇచ్చిన సందర్భంగా అనేకమంది నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నాని చెబుతున్న చంద్రబాబు ఇదే సమయంలో ఏయే వర్గాలు తమను ఆదరిస్తున్నాయో.. ఇంకా ఏయే సామాజిక వర్గాల ప్రజలను దగ్గర చేసుకునేందుకు ఏయే వ్యూహాలు రూపొందించుకోవాలి? అనే ఆలోచనలో వున్నారు. ఈనెల 20న జిల్లాలో చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర ప్రారంభయింది. చంద్రబాబుకు స్వాగతం చెప్పేందుకు రాజమండ్రి నేతలు అనూహ్య రీతిలో ఏర్పాట్లు చేశారు. జనం కూడా భారీగా రావడంతో చంద్రబాబుతోపాటు.. పార్టీ నేత లూ హుషారుగా కన్పించారు. ఇలా నాలుగు రోజుల యాత్రలో వేలాదిగా జనం చంద్రబాబు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 2009 ఎన్నికల ముందు 'మీ కోసం' పేరుతో చంద్రబాబు జిల్లాలో యాత్ర నిర్వహించారు. అప్పటితో పోలిస్తే ఈ యాత్రకు జనం ఎక్కువగా వస్తున్నారు.

ఆ సామాజిక వర్గంపైనే గురి 2009 అసెంబ్లీ ఎన్నికలలో పీఆర్పీ వెంట వెళ్లిన బలమైన సామాజిక వర్గంపైనే చంద్రబాబు దృష్టిసారిస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌తో ఆయా సామాజిక వర్గాలు, వర్గీకరణకు అనుకూలమని చెప్పడంతో మాదిగ, ఉపకులాల సామాజిక వర్గాలలో టీడీపీకి బలం పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో పీఆర్పీకి వెన్నుదన్నుగా నిలబడిన 'కాపు' సామాజిక వర్గంవారిని ఆకట్టుకునేందుకు చంద్రబాబు పదేపదే వారి ప్రస్తావనే తీసుకువస్తున్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అని ప్రకటించిన చంద్రబాబు.. అగ్రవర్ణాలలో కాపుల్లోనే ఎక్కువ పేదలు వున్నారని.. వారికి తగిన రీతిలో న్యాయం చేస్తామని ప్రకటిస్తున్నారు.

కార్యకర్తల సూచనలకు ప్రాధాన్యత అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సందర్భంగా పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. విలువైన సూచనలు ఉంటే ఖచ్చితంగా వాటిపై బాబు ప్రస్తావిస్తున్నారు. 'గత ఎన్నికలలో సామాజిక న్యాయం చేస్తాడని నమ్మి చిరంజీవి వెంట వెళ్లాం. అతను మోసం చేసి కాంగ్రెస్‌కి అమ్ముడుపోయాడు. ఇపుడు ఆ తప్పు చేయం. మమ్మల్ని మీరు ఆదుకోవాలి. కాపుల్లోనే ఎక్కువ పేదలు ఉన్నారు. రిజర్వేషన్లు అక్కర్లేదు కానీ.. ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలి..' అని అమలాపురం సమీక్ష సందర్భంగా ఒక కార్యకర్త బాబు దృష్టికి తీసుకువచ్చారు. అప్పటి నుంచీ చంద్రబాబు ప్రతీ సమావేశంలోనూ అగ్రవర్ణ పేదలు, కాపుల పేదరికం గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీంతో మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.. అన్న నమ్మకం ఆ వర్గంలో కలుగుతోంది.

రుణ మాఫీపైనా స్పందన టీడీపీని గెలిపిస్తే వ్యవసాయ, చేనేత, ఇతర వృత్తుల వారి రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీనిపై కూడా ఆయా వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేస్తామని స్పష్టమైన ప్రకటన ఇవ్వడంతో రైతన్నల నుంచీ టీడీపీకి మద్దతు పెరుగుతోందని పార్టీ వర్గాలు చంద్రబాబు దృష్టికి తీసుకువస్తున్నారు.

అభ్యర్థుల ఎంపికపైనా స్పష్టత అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి గొల్లపల్లి సూర్యారావు, రాజమండ్రి నుంచి మురళీమోహన్ అభ్యర్ధిత్వాలపై చంద్రబాబు జిల్లాకు వచ్చిన తొలిరోజే స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో అభ్యర్థులను ముందే ఖరారుచేయనున్నట్టు సంకేతాలు పంపారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఎవరికి టికెట్లు ఇచ్చేది ఈ పాదయాత్రలోనే చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం వుంది.