March 25, 2013

8నుంచి బాబు యాత్ర


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వచ్చే నెలలో విశాఖ జిల్లాలో చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది. అయితే నగరంలోని తూర్పు నియోజకవర్గానికి సంబంధించి రూటు ఇవ్వాల్సి వుంది. పైలాన్ నిర్మాణ స్థలం ఎంపిక మేరకు బహిరంగ వేదిక వుంటుంది. వేసవి దృష్ట్యా ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర మొదలవుంది. రాత్రి పదిగంటలకు ముగిస్తారు. మొత్తంగా 19 రోజుల పాదయాత్రలో 163 కిలోమీటర్ల దూరం నడుస్తారు. జిల్లాలో 11 నియోజకవర్గాలలో కొనసాగుతున్న ఈ పాదయాత్రలో ఐదు రోజులు ఒక్క నర్సీపట్నానికే కేటాయించారు. నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పరిశీలకుడు సుజనాచౌదరి ఆదివారం సమావేశమై రూటును ఖరారు చేశారు. రూటుకు సంబంధించి వివరాలిలా వున్నాయి...

వచ్చే నెల ఎనిమిదో తేదీన తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు నుంచి నాతవరం మండలం గన్నవరం మెట్టకు చేరుకోవడం ద్వారా చంద్రబాబు విశాఖ జిల్లాలో అడుగుపెడతారు. ఆ రోజు శరభవరం, శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్, డి.ఎర్రవరం వరకు 10.3 కి.మీ. పాదయాత్ర చేస్తారు. తొమ్మిదిన డి.ఎర్రవరంలో యాత్ర మొదలుపెట్టి చెట్టుపల్లి, జిల్లేడిపూడి, చెర్లోపాలెం, కొత్తూరు జంక్షన్(పాయకరావుపేట నియోజకవర్గం), పాములపాక వరకు 12.5 కి.మీ. నడుస్తారు. పదిన పాదయాత్రకు విరామం.

తిరిగి 11న పాములపాకలో పాదయాత్ర ప్రారంభించి భీమిరెడ్డిపాలెం, నీలిగుంట, రామచంద్రపాలెం, బి.కె.పల్లి మీదుగా జల్లూరు వరకు 11.5 కిలోమీటర్ల దూరం నడుస్తారు. ఏప్రిల్ 12న జల్లూరు నుంచి యండపల్లి, మల్లవరం, గిడుతూరు, బయ్యవరం, కొండల అగ్రహారం , నల్లమారెమ్మగుడి వరకు 11 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. 13న నల్లమారెమ్మగుడి నుంచి మాకరపాలెం, తామరం, రాచపల్లి జంక్షన్, బి.బి.పాలెం, శెట్టిపాలెం, రాజుపేట, సబ్‌స్టేషన్ వరకు 12 కిలోమీటర్లమేర పాదయాత్ర చేస్తారు.

మరుసటి రోజు 14 ఆదివారం కావడంతో పాదయాత్రకు విరామం. 15న అనకాపల్లి నియోజకవర్గంలోని పాతకన్నూరుపాలెం, కన్నూరుపాలెం, ఆనందపురం జంక్షన్, కొత్తూరు, అడ్డాం జంక్షన్, జి.భీమవరం, అచ్లెర్ల జంక్షన్ వరకు పది కిలోమీటర్లు నడుస్తారు. 16న బంగారుపేట, తాళ్లపాలెం, అమీన్ సాహెబ్‌పేట జంక్షన్, గొబ్బూరు జంక్షన్, నర్సింగబిల్లి, సోమవరం, సోమవారం బ్రిడ్జి వరకు 9.5 కి.మీ., 17న ఎలమంచిలి నియోజకవర్గంలో గణపర్తి, చూచుకొండ, ఎం.జగన్నాథపురం, మల్లవరం జంక్షన్, ఉప్పవరం, ఎర్రవరం, కొండకర్ల జంక్షన్ వరకు 10.9 కి.మీ. సాగుతుంది. 18న హరిపాలెం, తిమ్మరాజుపేట, మునగపాక, ఓంపోలు, నాగులాపల్లి, అనకాపల్లి బైపాస్ రోడ్ జంక్షన్ వరకు 9.1 కి.మీ., 19న అనకాపల్లి పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్, నెహ్రూచౌక్, ఎన్టీఆర్ జంక్షన్, చిననాలుగురోడ్ల జంక్షన్, రింగురోడ్, పార్కు జంక్షన్, సుంకరమెట్ట, శంకరం, రేబాక, కాపుశెట్టివానిపాలెం, కోడూరు జంక్షన్ మీదుగా మర్రిపాలెం వరకు 11.9 కి.మీ. నడుస్తారు. 20న పెందుర్తి నియోజకవర్గంలో బాటజంగాలపాలెం, సున్నపు బట్టీలు, అసకపల్లి జంక్షన్, ఎరువాడ జంక్షన్, సబ్బవరం జంక్షన్, జోడుగుళ్ల జంక్షన్, సురెడ్డిపాలెం వరకు 10.3 కి.మీ. పాదయాత్ర కొనసాగుతుంది. 21న ఆదివారం కావడంతో విస్తృత స్తాయి సమావేశం నిర్వహిస్తారు.

తిరిగి 22న అమృతపురం, అమరపిన్నిపాలెం, పెద్దగొల్లపాలెం, నంగినారపాడు, వెదుళ్ల నరవ, కొత్తూరు జంక్షన్ వరకు 10.6 కి.మీ. నడక పూర్తిచేయడం ద్వారా రూరల్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ముగుస్తుంది. కాగా 23న గాజువాక నియోజకవర్గంలోని దువ్వాడలో అడుగుపెట్టడం ద్వారా నగరంలోకి ప్రవేశించే చంద్రబాబు ఆ రోజు రాజీవ్‌నగర్, కూర్మన్నపాలెం, వడ్లపూడి, శ్రీనగర్, నడుపూరు, పెదగంట్యాడ, కొత్తగాజువాక జంక్షన్ వరకు 10 కిలోమీటర్లు నడుస్తారు. 24న పాతగాజువాక జంక్షన్, ఆటోనగర్, నాతయ్యపాలెం, షీలానగర్, ఎన్ఏడీ జంక్షన్ వరకు 11.5 కి.మీ., 25న విశాఖ పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లోని మర్రిపాలెం, ఐటీఐ జంక్షన్, కంచరపాలెం, కాన్వెంట్ జంక్షన్, కొబ్బరితోట, దుర్గాలమ్మగుడి, జగదాంబ జంక్షన్ వరకు 9.4 కి.మీ. నడుస్తారు.

26న తూర్పు నియోజకవర్గంలో పాదయాత్రపై ఇంకా రూటు ఖరారుకాలేదు. 26న తూర్పులో పాదయాత్ర పూర్తిచేయనున్న చంద్రబాబు 27న బహిరంగ సభలో పాల్గొని 'వస్తున్నా మీకోసం'యాత్రను ముగిస్తారు. కాగా రాత్రి బసకు సంబంధించి ఇప్పటి వరకు ఖరారుచేసిన స్థలాలు మారే అవకాశం వుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మూడు రోజులు వెనక్కు? ఇదిలావుండగా టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' యాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం వున్నట్టు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ఒక రోజు ఆలస్యం అయ్యే అవకాశం వుందని అందువల్ల విశాఖకు ఏప్రిల్ ఎనిమిదికి బదులు తొమ్మిదిన రానున్నట్టు తెలిసింది. అయితే ఏప్రిల్ పదో తేదీన కొత్త అమావాస్య పండుగను విశాఖ రూరల్ ప్రాంతంలో సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో తొమ్మిది, పది తేదీలు చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోనే పర్యటించేలా చూడాలని విశాఖ నాయకులు ఆదివారం రాత్రి అధిష్ఠానానికి ప్రతిపాదించారు. దీనిపై ఒకటి రెండురోజుల్లో అధికారికంగా సమాచారం వచ్చే అవకాశం వుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బాబు బహిరంగ సభ ఏర్పాట్లకు కమిటీ టీడీపీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్న పాదయాత్ర ముగింపురోజున జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభతోపాటు పైలాన్ నిర్మించనున్నారు. బహిరంగ సభ నిర్వహణ, పైలాన్ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించడానికి సీనియర్ నాయకులతో కమిటీని ఏర్పాటుచేయనున్నారు. రూరల్, నగరంలో చంద్రబాబు పాదయాత్రలో నాయకులంతా బిజీగా వుంటున్నందున బహిరంగకు జన సమీకరణకు ఇబ్బంది లేకుండా కమిటీ పర్యవేక్షిస్తుందని జిల్లా నాయకత్వం యోచిస్తుంది. అయితే కమిటీలో ఎవరెవర్ని నియమించాలి అన్నది ఒకటి రెండురోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.