March 25, 2013

వైఎస్ నుంచి కిరణ్ దాకా అవినీతిమయమే

చీకట్లో ముంచారు!
ఎన్నికల లబ్ధికోసం రాష్ట్రాన్ని బలిపెట్టిన వైఎస్
కాంగ్రెస్ పాలనపై టీడీపీ బ్లాక్ పేపర్

హైదరాబాద్ : వైఎస్ సర్కారు నిర్లక్ష్యం...కిరణ్ సర్కారు కుంభకోణాలు కలగలిసి ఆంధ్రప్రదేశ్‌ను అంధకార ప్రదేశ్‌గా మిగిల్చాయని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. తొమ్మిదేళ్లపాటు తెలుగుదేశం ప్రభుత్వం నానా చాకిరీ చేసి విద్యుత్‌లో రాష్ట్రాన్ని మిగులులోకి తీసుకువస్తే కాంగ్రెస్ ఆ కృషినంతా అట్టడుగు స్థా యికి దిగజార్చిందని విమర్శించింది. విద్యుత్ రంగంలో తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీడీపీ సోమవారం బ్లాక్ పేపర్ (నిరసన పత్రం) విడుదల చేసింది. విద్యుత్ రంగ స్థితిగతులపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో.. ఈ బ్లాక్ పేపర్‌ని విడుదల చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

అప్పుడూ.. ఇప్పుడూ: "కరువులోనూ టీడీపీ తొమ్మిది గంటలపాటు కరెంటు ఇచ్చింది. తీవ్రమైన విద్యుత్ సమస్యల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒక దశకు తెచ్చింది. ఐదు వేల మెగావాట్ల మేర అదనంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. రూ. 18 వేల కోట్లు ఖర్చు చేసి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలను పటిష్టం చేసింది. విద్యుత్ సంస్థల ఆర్థిక లోటు పూడ్చి కొత్త పెట్టుబడులు తెచ్చుకొనే శక్తిని కల్పించింది. వ్యవసాయానికి వాడిన విద్యుత్‌కు రూ.19 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చింది. కరెంటు సరఫరాను చూసి రైతులు తమ గడియారాల్లో సమయం సరిదిద్దుకొనేంత సమయ పాలనతో సరఫరా జరిగింది''

'చీకటి' మాటలు!: టీడీపీ హయాంలో రాష్ట్రంలో వెలుగులు నిండగా, కాంగ్రెస్ పాలన వచ్చి చీకటి చేసిందని బ్లాక్ పేపర్‌లో ఆక్షేపించారు. "తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఐదు వేల మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్లు ప్రభుత్వం చెప్పుకొంటోంది. కానీ, ఇందులో ప్రైవేట్ ప్లాంట్ల నుంచి కొనుగోళ్లే ఎక్కువ. కరువు ఉన్నా టీడీపీ పాలనలో జల విద్యుదుత్పత్తి 981 మెగావాట్లు పెరగ్గా, రిజర్వాయర్లు నిండుగా ఉన్నా కాంగ్రెస్ హయాంలో మాత్రం 243 మెగావాట్లు మాత్రమే అదనంగా పెంచారు. రూ. 20 వేల కోట్ల ప్రణాళికా వ్యయంలో టీడీపీ..విద్యుత్ రంగానికి రూ.రెండు వేల కోట్లు కేటాయిస్తే..కాంగ్రెస్ తన లక్ష కోట్ల బడ్జెట్‌లో రూ. వంద కోట్లు కూడా కేటాయించడం లేదు. టీడీపీ హయాంలో ప్రైవేటు ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లు 9. 97 శాతం ఉంటే, కాంగ్రెస్ హయాంలో కమీషన్ల కోసం 17. 17 శాతానికి పెంచారు.

వ్యవసాయానికి విద్యుత్ వినియోగం టీడీ పీ హయాంలో 62 శాతం కాగా, ఇప్పుడది 47 శాతమే. విద్యుత్ రంగానికి ప్రభుత్వ సబ్సిడీ టీడీపీ హయాంలో 6. 56 శాతం ఉంటే ఇప్పుడది 4. 79 శాతానికి తగ్గిపోయింది. బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి కేటాయింపులు అప్పుడు 7.8 ఉంటే ఇప్పుడు 3.9శాతం. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కేవలం నాలుగేళ్లలో అవి ముప్ఫై వేల కోట్ల రూపాయిల మేర బకాయిల్లో కూరుకుపోయాయి.

2009 ఎన్నికల సమయంలో యూనిట్ రూ. 14కు విద్యుత్ కొనిపించి రూ. ఆరు వేల కోట్లు విద్యుత్ సంస్థలతో ఖర్చు చేయించారు. ఆ డబ్బులు మాత్రం ఆ సంస్థలకు ఇవ్వలేదు. దానితో అవి ఆ భారాన్ని ఇప్పుడు ప్రజలపై మోపుతున్నాయి''

జీవం లేని 'జెన్‌కో'!: అయిన కాడికి తిని జెన్‌కోను తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బ్లాక్ పేపర్ ఆరోపించింది. "జెన్‌కో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. కేటీపీఎస్ రెండో దశ, పులిచింతల, ఆర్టీపీఎస్, కృష్ణపట్నం ధర్మల్ ప్లాంటులు ఏనాటికి పూర్తవుతాయో తెలియదు. నేదునూరు, సత్తుపల్లి, శంకరపల్లి ప్రాజెక్టులను పూర్తిగా అటకెక్కించారు. వాన్‌పిక్ కోసం వేటపాలెం జెన్‌కో ప్లాంటును నిలుపుదల చేశారు. పులివెందుల అణు విద్యుత్ ప్లాంటు కర్ణాటకకు వెళ్లిపోతోంది. సకాలంలో నిధులు ఇచ్చి వీటిని పూర్తి చేస్తే 11 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చేది.

కానీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జెన్‌కో ఐదేళ్లలో తాను ఉత్పత్తి చేయాల్సిన దానిలో లక్ష మిలియన్ యూనిట్లు చేయలేకపోయింది. పైగా రూ. 3434 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. కేవీపీ కొడుకు, వైఎస్ అల్లుడు భాగస్వాములుగా ఉన్న ఒక బినామీ కంపెనీకి లాభాలు రావడం కోసం ఆర్టీపీపీ, వీటీపీఎస్, కాకతీయ ప్లాంట్ల నిర్మాణ వ్యయాన్ని పెంచేశారు. దీనిని కాగ్ ఎత్తిచూపింది. ఈ ప్రాజెక్టుల్లో నిర్మాణ లోపాలు, నాసిరకం పరికరాల వినియోగంతో రూ. 1950 కోట్ల దుర్వినియోగం జరిగిందని పేర్కొంది''

అంతా 'గ్యాస్'!: "ప్రైవేటు రంగంలో 3300 మెగావాట్ల గ్యాస్ ఆధారిత ప్లాంట్లు సిద్ధమయ్యాయి. అయితే, గ్యాస్ తెచ్చుకోలేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. టీడీపీ హ యాంలో గ్యాస్ ప్రాజెక్టులు 70 శాతం ఉత్పత్తి చేస్తే, ఇప్పుడు 24 శాతమే ఉత్పత్తి చేస్తున్నాయి. వచ్చే కొద్దిపాటి గ్యాస్‌నూ ప్రభుత్వానికి తక్కువ ధరకు కరెంటు ఇచ్చేవాటికి కాకుండా మర్చంట్ ప్లాంట్లకు (లాంకో, ఎల్వీఎస్, వేమగిరి) కట్టబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారు.

ట్రాన్స్‌కో సిఫారసు చేయకపోయినా మర్చంట్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయి. దీనివల్ల ప్రజలపై రూ. 4 వేల కోట్ల భారం పడుతోంది. క్యాప్టివ్ జనరేషన్ ఉన్న పరిశ్రమలు తక్కువ ధరకు విద్యుత్ తీసుకొని.. ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించి వేల కోట్లు స్వాహా చేశారు. కిరణ్ సర్కారు హయాంలో బొగ్గు కొనుగోళ్లు పెద్ద కుంభకోణంగా మారాయి. విద్యుత్ కొనుగోళ్లు అవినీతిమయంగా మారాయి''

'ఉచితం' ఉసూరు: "రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని 2004 ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత మూడేళ్లలో రూ. ఏడు వేల కోట్ల మేర ప్రజలపై భారం మోపింది. టీడీపీ హయాంలో 14 శాతం చార్జీలు పెంచినందుకు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 55 శాతం మేర వడ్డించారు. టెలిస్కోపిక్ విధానం ఎత్తివేసి ఈ భారం రెట్టింపు చేయాలని చూస్తున్నారు. రైతులకు తొమ్మిది గంటలపాటు కరెంటు ఇస్తామని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఇప్పుడది మూడు గంటలకు పడిపోయింది. విద్యుత్ కోతలతో రైతులకు ఈ మూడేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కోతలతో రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఈ ఒక్క నెలలోనే 20 వేల యూనిట్లు మూతపడ్డాయి''