March 25, 2013

సోనియా కొవ్వొత్తులు రాహుల్ విసనకర్రలు ఇవ్వండి

సబ్సిడీపై కొవ్వొత్తులు సరఫరా చేయండి
జనవరిలోనే కోతలు పెట్టే దయనీయ స్థితి
విద్యుత్తు అంశంపై మండిపడ్డ టీడీపీ

హైదరాబాద్: కరెంటుపై సర్కారు తీరును తెలుగుదేశం పార్టీ కడిగిపారేసింది. విద్యుత్తు సమస్యపై చర్చించి తీరాల్సిందే అని పట్టుబట్టి సాధించుకుని... ప్రభుత్వంపై విరుచుకుపడింది. విద్యుత్ అంశంపై సోమవారం శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ సభ్యుడు పయ్యావుల కేశవ్ మాట్లాడారు. 'విద్యుత్తు సంక్షోభంపై పత్రికలలో ప్రతీరోజూ పతాక శీర్షికలలో వార్తలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా విద్యుత్తు బాధితులే. ఇప్పటివరకూ రైతుల ఆత్మహత్యలు మాత్రమే చూశాం. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు'' అని విమర్శించారు.

దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా జనవరి, ఫిబ్రవరి నుంచే కోతలు అమలవుతున్నాయన్నారు. "ఆస్పత్రుల్లో టార్చ్‌లైట్ల వెలుగులోనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకొకటి లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడమే ప్రస్తుత విద్యుత్తు సంక్షోభానికి కారణం. కరెంటుతోకాదు... కరెంటు బిల్లులతోనే షాకులు కొడుతున్నాయి'' అని వ్యాఖ్యానించారు.

నాడు మేమిలా: టీడీపీ హయాంలో భారీగా అదనపు విద్యుదుత్పత్తిని సాధించామని... కాంగ్రెస్ ఎందుకు ఆ పని చేయలేకపోయిందని పయ్యావుల నిలదీశారు. "అప్పుడు చంద్రబాబు బహిరంగ టెండర్లు పిలిచి రాష్ట్రానికి ఎవరు అతి తక్కువ ధరకు కరెంటు ఇస్తారో వారికే రాయితీలు, ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూములు, నీళ్లు ఇస్తామని ప్రకటించి... అదే విధానం అమలు చేశారు. కానీ... వైఎస్ వచ్చాక అనేక ప్రైవేటు విద్యుత్తు కంపెనీలకు 45వేల ఎకరాలు ధారాదత్తం చేశారు. వాళ్లకు ఇచ్చిన బొగ్గు మనది, భూమి మనది, బూడిదా మనకే. కానీ... విద్యుత్తు మాత్రం పొరుగు రాష్ట్రాలకు. ఈ దగా, దోపిడీకి వైఎస్సే కారణం'' అని మండిపడ్డారు.

విద్యుత్తు చార్జీల తగ్గింపు (రోల్‌బ్యాక్) అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్‌చార్జీల రూపంలో ప్రజలపై రూ.31వేల కోట్ల భారం మోపిందని పయ్యావుల మండిపడ్డారు. "ఇప్పటి పరిస్థితికి నాటి సీఎం వైఎస్, మాజీ సీఎం రోశయ్య, ప్రస్తుత సీఎం కిరణ్... అందరూ కారకులే'' అని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కిటికీలు తెరచిపెట్టుకోవాలని చెబుతున్నారని... సచివాలయంలో ఎందరు మంత్రులు, అధికారులు కిటికీలు తెరిచి ఉంచుకుంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన పవర్ గురించిఆలోచిస్తున్నారని... తాము రాష్ట్రానికి పవర్ కావాలని అడుగుతున్నామని తెలిపారు.

సోనియా కొవ్వొత్తులు: ప్రజలకు అవసరమైన కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం సోనియా కొవ్వొత్తులు, రాహుల్ విసనకర్రలు సబ్సిడీపై ఇవ్వాలంటూ పయ్యావుల ఎద్దేవా చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య ప్రభుత్వానికి అసలే పట్టడంలేదన్నారు. "ట్రాన్స్‌ఫార్మర్ల కోసం అనంతపురం జిల్లాలోనే 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పంటలకు నిప్పు పెట్టి రైతులు రోడ్లపై ఉంటున్నారు. విద్యుత్తు కోతలతో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. మొగుడు మోటార్లతో, భార్య స్టార్టర్లతో కాపురాలు చేస్తున్నారు. 11 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. మరో 20 వేల పరిశ్రమలు మూసివేత దశలో ఉన్నాయి'' అంటూ కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను చైనా, అమెరికాతో పోల్చడంలేదని... ఒకప్పుడు విద్యుత్తు రంగంలో మనకన్నా వెనుకబడిన గుజరాత్ ఇప్పుడు ఎలా దూసుకుపోయిందో గుర్తించాలని హితవు పలికారు.

సీఎం గారూ పల్లెలకు రండి: రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగుతోందంటూ సీఎం సన్నిహిత చానెల్ ఊదరగొడుతోందని కేశవ్ పేర్కొన్నారు. "నాడు వైఎస్ నడిస్తే నేలంతా పచ్చబడినట్లు చూపించారు. సీఎంగారూ... పల్లెలకు రండి. మీ వెలుగులను అక్కడ ప్రసారం చేయండి! పల్లెలకెళదాం! చర్చ పెడదాం!' అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభంపై శ్వేతపత్రం జారీ చేయాలని కేశవ్ డిమాండ్ చేశారు.

దీటుగా సీఎం సమాధానం: విద్యుత్తు సంక్షోభంపై పయ్యావుల కేశవ్ మాట్లాడుతుండగా కిరణ్ పలు సందర్భాల్లో కల్పించుకుని... అప్పటికప్పుడే తమ వాదన వినిపించారు. 'విద్యుత్తు అంశం తీవ్రమైనది. చాలా ఇబ్బందులున్నాయని మేమూ చెబుతున్నాం. కేశవ్ చక్కగా మాట్లాడుతున్నారు. కానీ, నిర్మాణాత్మకమైన సలహాలనివ్వాలి. మంచి సూచనలు ఇస్తే పాటించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం' అని హితవు పలికారు. 'కాగ్' ప్రస్తావన వచ్చినప్పుడు... ఆ నివేదిక ఖురాన్, బైబిల్, భగవద్గీత కాదని సీఎం వ్యాఖ్యానించారు. అదే సమయంలో కాగ్ నివేదికలను తాను తక్కువ చేయడంలేదని... అవే నిజమని మాత్రం చెప్పబోనని స్పష్టం చేశారు.

విపక్షాల నిరసనల నడుమ: సోమవారం సీపీఎం, సీపీఐ సభ్యులు కళ్లకు గంతలు, విద్యుత్ తీగల ఉరితాళ్లతో సభలోకి ప్రవేశించారు. ఆ పార్టీల శాసనసభాపక్ష నేతలు జూలకంటి రంగారెడ్డి, గుండా మల్లేశ్, టీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయానికి పదే పదే అంతరాయం ఎదురుకావడంతో... ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చినట్లుగా ప్రకటించిన స్పీకర్ విద్యుత్తు సమస్యపై చర్చకు అనుమతించారు.

పవర్ లేని ప్రభుత్వం : వామపక్షాలు
రాష్ట్రంలో పవర్‌లేని ప్రభుత్వం సభను కొనసాగించడం చేతకాక పారిపోయిందని సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. వాయిదాల మీద వాయి దా వేస్తూ కావాలనే సభ నిర్వహించకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు. విద్యుత్ సమస్యలపై వామపక్ష నేతలు ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేస్తుంటే సభలో దానిపై చర్చ జరగకపోవడాన్ని సీపీఐ నేత గుండా మల్లేశ్ తప్పు పట్టారు.