March 25, 2013

'యువ'కల ఏమైపోయింది?

ఎటుచూసినా ప్లకార్డులే! రాష్ట్రంలోని సమస్యలన్నీ ఒక్కచోట కుప్పపడ్డాయా అనిపించింది. ప్రజల కష్టాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు.. మండపేట సభ అంతటా అవే కనిపించాయి. కాలువల పూడికతీత నుంచి బెల్టుషాపుల ఎత్తివేత దాకా..ఎన్నెన్ని డిమాండ్లు వాళ్ల గొంతుల్లో పలికాయి! గ్రామస్థాయిలో సమన్వయంతో పరిష్కరించుకోగల సమస్యలు వాటిలో కొన్ని కాగా, హైదరాబాద్ గద్దెను కదిలించిగానీ సాధించుకోలేనివి మరికొన్ని. ప్రభుత్వం పూనుకోవాల్సినవి కొన్నయితే, ప్రభుత్వమే సృష్టించినవి మరికొన్ని.. రైతులు, కార్మికులు, బీఎడ్ నిరుద్యోగులు, మహిళలు, వ్యాట్ ఉద్యమకారులు, పరిశ్రమల యజమాన్యాలతో సభ నిండిపోయింది.

ఎవరి సమస్యలు వారివే. కానీ, ఉమ్మడిగా 'కరెంట్ కోతలు-చార్జీల'పైనే అందరి ఆవేదన. 'రాజీవ్ యువ కిరణాలను' అపహాస్యం చేస్తున్నట్టున్నాయి ఆ యువకుల మాటలు. "ఈ సర్కారు ఒక చేత్తో ఇస్తుంది..మరో చేత్తో బలవంతంగా లాగేసుకుంటోంది సార్! ఏడు లక్షలమందిమి బజారున పడ్డాం. పూర్తిగా ఆశలు వదులుకోలేం.. అలాగని మా కుటుంబాలకు భారంగా జీవించలేకపోతున్నా'మని బీఎడ్ నిరుద్యోగులు వాపోయారు. ఏదీ ఆ యువ కల?

ఇదేదో రికార్డుల కోసంకాదు. ఇది నా ఒక్కడి వ్యక్తిగత విజయమూ కాదు. కొన్ని లక్షల మందిని నేరుగా కలుసుకునేందుకే ఇంత దూరం (2,500 కిలోమీటర్లు) నడిచాను. ఎంత దూరం నడిచినా, మరెంత దారి మిగిలి ఉన్నా.. స్వయంగా ఈ ప్రజల బాధలను పంచుకున్నానన్న తృప్తి మాత్రం నాకు మిగిలింది. బతుకు భారమైన జీవులకు భవిష్యత్తుపై భరోసా కల్పించగలిగినప్పుడే సార్థకత. దానికోసం ఎంత దూరమైనా నడుస్తాను.