March 25, 2013

డిస్కంలను దివాలా తీయించిన ఘనత వైఎస్‌దే : పయ్యావుల

విద్యుత్ సమస్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది
విద్యుత్ కోతతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి
టీడీపీ హయాంలో విద్యుత్ ఉత్పత్తికి చేస్తే,

హైదరాబాద్: విద్యుత్ సమస్యలతో రాష్ట్రం అట్టుడుకుతోందని, నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్లినా విద్యుత్ గురించే ప్రశ్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని, కరెంట్ సమస్యలతో చిన్న పరిశ్రమల యాజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం అసెంబ్లీలో విద్యుత్ సమస్యలపై జరుగుతున్న చర్చల్లో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రులలో కొవ్వొత్తులు వెలిగించుకుని ఆపరేషన్లు చేస్తున్నారని పయ్యావుల అన్నారు. ప్రైవేటు సంస్థలు విద్యుత్‌ను అమ్ముకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్ సమస్యలకు కిరణ్ సర్కారుతో పాటు రోశయ్య, వైఎస్ ప్రభుత్వాలు కూడా కారణమన్నారు. నేతులు, ఉద్యోగులు విద్యుత్‌ను పొదుపు చేయకుండా, ప్రజలను పొదుపు చేయమనడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.

పరిస్థితి ఇలాగే ఉంటే సోనియా కొవ్వొత్తులు, రాహుల్ విసనకర్రలు అందరికీ పంచిపెట్టాలని పయ్యావుల ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యను తేల్చకుండా ప్రకృతి సహకరించడం లేదంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. చార్జీల పెంపును కాంగ్రెస్ మెనీఫెస్టోలో ప్రకటించలేదని ఈ సందర్భంగా కేశవ్ గుర్తుచేశారు. ఇప్పటి వరకు ప్రజలపై రూ.32 కోట్ల భారాన్ని వేసిందన్నారు. వైఎస్ హయాంలో జరిగిన తప్పులకు ఇప్పుడు ప్రజలు శిక్ష అనుభవించాల్సివస్తోందని ఆయన అన్నారు.

వైఎస్ 20 ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు 45 వేల ఎకరాల భూమి కేటాయించారని కేశవ్ అన్నారు. బొగ్గు మనది, భూమి మనది, బూడిద మన దని, అయితే విద్యుత్‌ను మాత్రం పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని పయ్యావుల తీవ్రంగా మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకుంటున్న ల్యాంకో, జీవీకే ప్లాంటుకు గ్యాస్ ఎందుకు కేటాయించారని ఆయన ప్రశ్నించారు. కమిషన్లు తీసుకుని పెద్ద కంపెనీలకే అనుమతులిస్తున్నారని కేశవ్ ఆరోపించారు.

కాగ్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏం జరగకపోతే కాగ్ ఎందుకు తప్పుబట్టిందని పయ్యావుల ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెంపునకు కృషి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు విద్యుత్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. డిస్కంలను దివాలా తీయించిన ఘనత వైఎస్‌దే అని కేశవ్ అన్నారు. క మిషన్ల కోసం కోస్తా తీరం మొత్తం వైఎస్ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

విద్యుత్ సమస్యపై కాగ్ నివేదికను పయ్యావుల ప్రస్తావించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేచి.. కాగ్ అంటే భగవత్‌గీతో, ఖురానో, బైబిలో కాదన్నారు. కాగ్ నివేదికపై పిఏసి నివేదిక ఇస్తుందన్నారు. ఇతర ప్రాజెక్టుల కన్నా జెన్ కో ధర ఎక్కువని కాగ్ నివేదికలో పేర్కొన్నదని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తాను కాగ్‌ను తప్పు పట్టడం లేదని కిరణ్ చెప్పారు. అయితే, విశ్లేషణ చేశాకే ఓ అంచనాకు రావడం కుదురుతుందన్నారు.