March 25, 2013

గజదొంగల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు

బెబ్బులిలా తిరగబడండి!
తల్లి, పిల్ల కాంగ్రెస్‌లను వదలొద్దు
ఉపేక్షిస్తే మరిన్ని కష్టాలు
పేద కాపుల కోసం పథకం ప్రకటిస్తా
'తూర్పు'లో చంద్రబాబు వెల్లడి
2500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న పాదయాత్ర

కాకినాడ: "తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ల అవినీతిపై బెబ్బులులై, కొండవీటి సింహాలై తిరగబడండి. మీ సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన సొమ్మును ఈ గజదొంగలు దోచుకున్నారు. ఆ దొంగలపై తిరగబడదాం. ఆ అవినీతి దున్నపోతుల్ని సాగనంపుదాం'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిదవద్ద సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వృద్ధులను, యువకులను, కార్మికులను పలకరిస్తూ ఉత్సాహంగా ఆయన నడక సాగించారు. "చంద్రన్నా నీ పాలన మళ్లీ రావాలి'' అని ఏడిదలో ఓ మహిళ అన్న మాటలతో ఆయన చలించిపోయారు.

"కరెంటు లేదు..నీళ్లు రావు.. ధరలు పెరిగాయి. మాకన్నీ సమస్యలే. వీటిని తీర్చాలంటే మీరు మళ్లీ అధికారంలోకి రావాలి'' అని వేడుకున్న ఆ మహిళకు ధైర్యం చెప్పి ఆయన ముందుకు కదిలారు. ఇలాగే ఉపేక్షిస్తే ఈ కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ దొంగలు చెలరేగిపోతారని యువత, టీడీపీ కార్యకర్తలతో అన్నారు. కాంగ్రెస్ అద్దె ఇంటిని వదిలి టీడీపీ అనే సొంత ఇంటికి తిరిగి రావాలని పలు వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముందు నుంచీ టీడీపీకి అండదండలు అందించిన కాపులు మధ్యలో ఒకాయన మోజులో(చిరంజీవి) బయటకు వెళ్లారని, ఇపుడు వారంతా వచ్చి తన పాదయాత్రను ఆదరించడం ఆనందంగా ఉన్నదని అన్నారు.

కాపులలో పేదల కోసం ప్రత్యేక పథకాన్ని రెండుమూడు రోజులలో ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా 'రాజు-పేద' కథ చెప్పి ఆకట్టుకున్నారు. ఆ కథలో అత్యాశ గల పేదవాడిలాగే.. జగన్ కూడా పేదలకు దక్కాల్సిన భూముల్ని కొల్లగొట్టి చివరకు జైల్లోపడ్డారని ఎద్దేవాచేశారు. వైఎస్ హయాంలో జరిగిన అక్రమాల్లో.. రూ.42 వేల కోట్లదాకా సీబీఐ విచారణలో ఇప్పటివరకు బయటపడ్డాయని బాబు వివరించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యసేవలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

కౌలు రైతులకు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ హామీతో వడ్డీలేని రుణాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ బానిస పాలన నుంచి బయటపడాలంటే టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. జగన్ పత్రిక.. ఓ విషపుత్రిక అని మండిపడ్డారు. కాగా, మండపేట వద్ద పాదయాత్ర 2500 కిలోమీటర్లు దాటిన సందర్భంగా భారీ పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. భారీ కేక్‌ను కట్‌చేసి అభిమానులకు పంచారు. అలాగే 2500 కొవ్వొత్తులతో నిర్వహించిన భారీ ప్రదర్శన ఆకట్టుకుంది.