December 5, 2013


 రాయల తెలంగాణ ప్రతిపాదనపై కేబినెట్ నోట్ చూశాకే తాము స్పందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తోందని, తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా అని కాంగ్రెస్ బేరీజు వేసుకుంటోందని ఆరోపించారు.

తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా

కృష్ణ జిలాలపై బ్రెజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వానికి అవగాహన లేదని, అందుకే రాష్టానికి నష్టం జరుగుతున్న ఇంతవరకు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం వస్తుందని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని, తీర్పును రద్దు చేసే విధంగా పోరాడాలని మండవ కోరారు. అలాగే దీనిపై అఖిల పక్షం కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మైనపు బొమ్మలా ఉండకుండా స్పందించి, రాష్ట్రానికి న్యాయం చేయాలని మండవ పేర్కొన్నారు. తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్ అయితే, జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తప్పు పట్టడం సరికాదని ఆయన హితవుపలికారు.

తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్

 రాయల తెలంగాణ ఎవరు అడిగారని, రాయలసీమను విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివప్రసాద్,
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన కాంగ్రెస్ నిర్ణయమని, ఎవరూ కోరలేదని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తెరపైకి తీసుకు వచ్చిందని ఆయన అన్నారు.

మరో ఎంపీ మోదుగుల మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆయన ఓ మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే అని ఆయన పేర్కొన్నారు.

మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే