January 18, 2013

  రెండోరోజు జిల్లాలో చంద్రబాబు పాదయాత్రకు జనం పోటెత్తారు. ఉదయం కిట్స్ కళాశాల వద్ద బస్సుదిగింది మొదలు మళ్లీ చిలుకూరు మండలంలో రాత్రి బసవరకు జనం వెన్నంటె. ఇక కోదాడ పట్టణంలో పాదయాత్రపొడవునా హారతుల స్వాగతం, చప్పట్లు, జేజేలతో చంద్రబాబులో ఉత్సాహాన్ని ఇనుమడింపజేశారు. జనం నుంచి వచ్చిన విశేష స్పందనతో చంద్రబాబు అన్నిచోట్లా ఉత్తేజిత ప్రసంగాలు చేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, ప్యాకేజీ రాజకీయాలు అంటూ కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్‌లను భిన్నరూపాల్లో టార్గెట్ చేస్తూ మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్నారు.

పాయాత్ర మార్గంలో అందరినీ దగ్గరగా పలకరించారు. కేసుల పేరిట వేధిస్తున్న జిల్లా మంత్రులను ఖబడ్దార్...అంటూ హెచ్చరించి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆత్మస్థయిర్యం నింపారు.

చంద్రబాబు 'వస్తున్నా.. మీకోసం' పాద యాత్రకు శుక్రవారం నాటికి 109 వ రోజు. కోదాడ పట్టణంలో సుమారు 16 కి.మీ.ల మేర సాగిన పాదయాత్రను జనం భారీగా అనుసరించారు. ఉదయాన్నే జిల్లా నలుమూలలనుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా కోదాడ చేరుకున్నారు. పట్టణంలో పా దయాత్ర ప్రారంభంనుంచి ముగింపు వరకు అధినాయకుడి వెంటే వారు నడిచారు. ఎడ్లబండ్లు, గొర్రెపిల్లలు చంద్రబాబుకు బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం బస్సు నుంచి దిగగానే కిట్స్ కళాశాల ప్రాంగణంలో ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా నేతలు కదిలివచ్చారు.

అక్కడినుంచి కిట్స్ కళాశాలలో సదస్సుకు చేరుకోగా పెద్దసంఖ్యలో విద్యార్థినులు పూలతో చంద్రబాబును స్వాగతించా రు. జాబ్ రావాలంటే బాబు సీఎం కావాలంటూ విద్యార్థినీ విద్యార్థులు పెద్దపెట్టున నినదించారు. కోదాడ పట్టణంలోకి ప్రవేశిస్తుండగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చందర్‌రావు ఇంటివద్ద వంద మంది మహిళలు మంగళహారతులు పట్టారు. చెప్పులు కుట్టే పల్లె వెంకటేశ్వర్లు... చంద్రబాబు కోసం ప్ర త్యేకంగా తయారుచేసిన చెప్పులను అందజేశాడు. ఖమ్మం క్రాస్‌రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జనం పో టెత్తారు.

కోదాడ పట్టణ ప్రధాన రహదారులు జనంతో నిండిపోయాయి. పట్టణంలో పాదయాత్ర సాగినంతసేపు మహిళలు, పిల్లలు రోడ్లపైకి వచ్చి, భవనాలపైకి ఎక్కి విక్టరీ సింబల్‌తో రెండు వేళ్లు ఊపుతూ చంద్రబాబును ఉత్సాహపరిచారు. మత్య్సకారులు చేపలు పట్టే వలతో పాటు ఓ చేపను చంద్రబాబుకు అందించారు. దళితులు రోడ్లపై నీళ్లు చల్లి, కాలనీ మొత్తం రంగురంగుల రబ్బరు బెలూన్‌లు కట్టి స్వాగతం పలికారు. యువకులు భారీ జెండాలు, పెద్ద సంఖ్యలో ద్విచక్రవాహనాలతో చంద్రబాబును అనుసరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రబాబు పాదయాత్ర మార్గంలో ఉన్న ప్రతి విద్యాసంస్థల విద్యార్థులు రోడ్లకు ఇరువైపులా నిల్చుని స్వాగతం పలికారు.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు కోదాడలో వినతులు వెల్లువెత్తాయి. పీఆర్సీ, పదోన్నతులు, మహి ళా ఉద్యోగుల సౌకర్యాలు సాధించేందుకు సహకరించాలని టీఎన్‌యుఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు చంద్రబాబును కలిశారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు భద్రత కల్పించాలని సామాజిక కార్యకర్త కొల్లు వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్యవైశ్యసంఘ నాయకులు బాబుకు వినతిపత్రం సమర్పించారు. కోర్టు సమీపంలో న్యాయవాదులు తమ సమస్యల వినతిపత్రం అందించారు.

ఉదయం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి చర్చించిన చంద్రబాబు పాదయాత్ర క్రమంలో పలువురిని పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. బజ్జీలు చేసే ప్రకాశ్ అనే వ్యక్తిని పలకరించి వ్యాపరంలో కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనూస్ సెలూన్‌లోకి ప్రవేశించి నరేష్‌కు చంద్రబాబు కటింగ్ చేశారు. తదుపరి నరేష్ చేతులమీదుగా బాబు గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. కమ్మరులను పలకరించి అధికారంలోకి వస్తే ఆదుకుంటానన్నారు. బస్టాండ్ సమీపంలో చిన్నారిని ఎత్తుకుని ముద్దుచేశారు.

చంద్రబాబు తన ప్రతి ప్రసంగంలోనూ కాంగ్రెస్, వైసీపీలను లక్ష్యంగా చేసుకుని విమర్శల జడివాన కురిపించారు. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలను సవివరంగా తెలియజేశారు. వైసీపీ ఆవిర్భావం తీరు, ప్రస్తుతం డబ్బులతో రాజకీయాలను శాసిస్తున్న తీరును దునుమాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థుడు, అవినీతి రక్షకుడు అని దుయ్యబట్టారు. సీఎం వైఫల్యం మూలంగానే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్ లక్షకోట్లు మింగేశాడని, విజయలక్ష్మి వాకిట్లో అవినీతి చెట్టు మొలిచి ప్యాలెస్‌గా ఎదిగిందని భిన్నరీతిలో ప్రసంగించి చంద్రబాబు ఆకట్టుకున్నారు.

కేసీఆర్‌కు ఒక ఉద్యోగం, ఆయన కూతురు, కొడుకు, అల్లుడికి ఉద్యోగం, పోరాటం చేస్తున్న మనకు మాత్రం ఎలాంటి ఉద్యోగాలు లేవు... తమ్ముళ్లూ...! అని యువతను ఉత్సాహపరిచారు.తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు తాను అడుగడుగునా అండగా ఉన్నానంటూ భరోసా కల్పించారు. కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోనంటూ జిల్లా మంత్రులకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం, సాయంత్రం జిల్లా ముఖ్యనేతలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. వివిధ కార్యక్రమాలలో ప్రాధాన్యం ఇవ్వడం, బాబు ఆప్యాయంగా ఆహ్వానిస్తుండడంతో అటు నేతలు ఇటు కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు.

పాదయాత్ర క్రమంలో చంద్రబాబు హామీలు ఇస్తుండడంతో వివిధ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ, వ్యవసాయానికి తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, గ్యాస్ ధర పెంచకపోవడం, విద్యార్థినులకు కరాటేశిక్షణ, బెల్టు షాపుల రద్దు వంటి హామీలతో మహిళల్లో మంచి స్పందన కనిపిస్తోంది. అర్హతను బట్టి ఉద్యోగం, లేదంటే నిరుద్యోగభృతి కల్పిస్తాననడంతో యువకుల్లో స్పందన వ్యక్తమయింది. జిల్లాలోని అన్ని గ్రామాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో సాగర్ నుంచి మంచినీళ్లు అందిస్తానని ప్రకటించగానే చప్పట్లు మార్మోగాయి.

మిన్నంటిన అభిమానం

'తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరించి తప్పుడు కేసులు పెడుతున్నారు. సాగర్‌లో ఉండే మంత్రి, హుజూర్‌నగర్‌లో ఉండే మరొక మంత్రీ...! జాగ్రత్తగా నడుచుకొండి. మా కార్యకర్తల జోలికి వస్తే వారిని కాపాడుకునే సత్తా టీడీపీకి ఉంది ఖబడ్దార్...!' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. శుక్రవారం, రెండోరోజు పాదయాత్ర కోదాడ పట్టణంలోని కిట్స్ కళాశాల, ఖమ్మం క్రాస్‌రోడ్స్, హరిజనవాడ, మార్కెట్ ఆఫీస్, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో సాగింది.

14.8 కి.మీ. పాదయాత్రలోవివిధ వర్గాలను కలుసుకుని మాట్లాడారు. 'నాగార్జునసాగర్‌లో ఉండే ఒక మంత్రి మా నాయకుడు చిన్నపరెడ్డి జోలికి వచ్చి తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. ఎస్ఎంఎస్ పెట్టారని జైలుకు పంపారు. నేను వారిలాగే అనుకుని ఉంటే ఈ మంత్రులు ఏమయ్యేవారు? ఎక్కడుండేవారు?? ప్రజాస్వామ్య పద్ధతిలో రండి. ధైర్యంగా ఎదుర్కొంటాం' అని అన్నారు. 'మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డం వేస్తా' అని కార్యకర్తలకు «భరోసా ఇచ్చారు. 'నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా ఎమ్మెల్యేలు, పోలీసులను కాల్వలపైపెట్టి నీళ్లు ఇప్పించా. కిరికిరి సీఎంకు అవగాహన లేదు. గోదావరి, కృష్ణా ఎక్కడ పారుతుందో తెలియదు' అని కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎద్దేవా చేశారు.

డ్వాక్రా సంఘాలకు పొదుపు ఉద్యమం నేర్పించానని, కట్టెల పొయ్యితో వంట చేయడం కష్టమని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాననని టీడీపీ అధినేత చెప్పారు. తాను సీఎంగా ఉన్న తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా గ్యాస్ ధర పెంచలేదని గుర్తు చేశారు. 'నా హయాంలో కిలోచక్కెర రూ.12 ఉంటే ఇప్పుడది రూ.48కి చేరింది. పప్పు ధర రూ.22 నుంచి రూ.80కి పెరిగింది. చింతపండు కిలో రూ.20 నుంచి రూ.90కి ఎగబాకింది.

ఇలా పెరిగితే ఏం తింటారు' అని ప్రశ్నించారు. దుస్తులు, ఇళ్లు, మంచినీళ్లపై..ఇలా అన్నిటిపైనా పన్నులు పెరిగాయి. దోభీఘాట్లపై సర్వీస్ చార్జ్ విధించి రజకుల నడ్డి విరిచారు' అని ఆగ్రహం వ్యక్తంజేశారు. పన్నులు పెంచి, కుంభ కోణాల రూపంలో సొంత ఆస్తులు పెంచుకోవడమే తప్ప కాంగ్రెస్ నేతలు ఏమైనా మేలు చేశారా తమ్ముళ్లూ...! అని చంద్రబాబు ప్రశ్నించారు.

తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో దొంగలు పడ్డారని, ఇందిరమ్మ ఇళ్లపేరుతో కాంగ్రెస్ నేతలు ఐదారు గృహాల బిల్లులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కూలీ డబ్బులు సైతం వదలడం లేదని, ఆదర్శ రైతులుగా కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టించారని, అంత్యోదయ, ఐఏవై వంటి పేదల పథకాలను ఈ చిన్న చిన్న పందికొక్కులు మింగేస్తున్నాయన్నారు. తొమ్మిది గంటలు కరెంటు ఇస్తామని అధికారంలోకి వచ్చే ముందు, ఏడు గంటలు ఇస్తామని అధికారంలోకి వచ్చాక చెప్పారని, ఇప్పుడు మూడు గంటలకు మించి ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

తన హయాంలో గడియారం చూసుకుంటే కరెంటు వచ్చేదని, విద్యుత్ వ్యవస్థకు పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. రాష్ట్రంలో వస్తున్న లక్షన్నర కోట్ల రూపాయల ఆదాయం కాంగ్రెస్ దొంగల జేబుల్లోకి పోయిందని విమర్శించారు. జిల్లాలో నాలుగు వరుసల రహదారులు, సీసీ రోడ్లు, ఇలా ఏ అభివృద్ధి జరిగినా అది టీడీపీ కాలంలోనే అని తెలిపారు. ఈ ప్రభుత్వ సిద్ధాంతం చూస్తే 'మందు ఫుల్లు.. మంచినీళ్లు నిల్లు' తీరుగా ఉందన్నారు. 'సెల్ ఫోన్‌లో ఎస్ఎంఎస్ కొడితే మందు నడుచుకుంటూ వస్తుంది.

మంచి నీళ్లు మాత్రం ఫోన్ చేసినా రావడం లేదు' అని దుయ్యబట్టారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, తేరా చిన్నపరెడ్డి, గుండ్లపల్లి సురేష్, పాల్వాయి రజనీకుమారి, చిలువేరు కాశీనాథ్, నెల్లూరి దుర్గాప్రసాద్, బోయపల్లి కృష్ణారెడ్డి, జక్కలి అయిలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రులారా..! ఖబడ్దార్!!

తెలుగు జాతిని మరోసారి తట్టి లేపాల్సిన తరుణమిది. అన్నగారిని స్మరించుకొని స్ఫూర్తిని పొందాల్సిన సమయమిది. మహానాయకుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళి అర్పించి నా నడక ప్రారంభించాను. మా కుటుంబ సభ్యులకేకాదు, తెలుగుదేశం శ్రేణు లకే కాదు, ప్రతి తెలుగువాడికీ ఎన్టీఆర్ నిత్య ప్రేరణ. తరాలు మారినా ఆయన ప్రతి ఒక్కరి గుండెలో కొలువై ఉన్నాడు. కాంగ్రెస్ రాక్షస పాలనపై ప్రజల్లో చైతన్యం రగిల్చేందుకు నాడు ఎన్టీఆర్ చైతన్యరథంపై రాష్ట్రమంతటా తిరిగారు. 30 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉంది.

తల్లి కాంగ్రెస్‌కు పిల్ల కాంగ్రెస్సూ తోడైంది. వీళ్ల వల్ల ప్రజలకు చరిత్రలో ఎన్నడూ లేనన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. అందుకే నాటి ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర కంటే మరింత కటువైన నిర్ణయం తీసుకున్నాను. ఈ వయసులో పాదయాత్రకు వచ్చాను. కానీ, ఒక్కొక్క జిల్లాలో యాత్ర పూర్తయినప్పుడల్లా ప్రజల నుంచి వస్తున్న ఆదరణ నాలో మరింత ఉత్సాహం నింపుతోంది. ఈ రాష్ట్రాన్నీ, తెలుగుజాతినీ కాపాడుకోవాలన్న సంకల్పమే నన్ను ముందుకు నడుపుతోంది. తల్లి, పిల్ల కాంగ్రెస్ పోకడలు పరిశీలించినప్పుడు, పది జిల్లాల్లో పూర్తయిన పాదయాత్ర అనుభవాలను సమీక్షించినప్పుడు రెండో దశ సామాజిక న్యాయ నినాదం అందుకోవాల్సిన ఆవశ్యకత కనిపించింది.

కోదాడ పట్టణంలో కలిసిన లంబాడాలు, వడ్డెరలు..ఒకరా ఇద్దరా ఎదురైన ప్రతి కులవృత్తిదారూ నా అడుగులో అడుగు వేశాడు. అన్ని వర్గాలకూ, కులాలకూ న్యాయం చేయగల సత్తా మా పార్టీకే ఉన్నదన్న నమ్మకం వారి ముఖంలో చూడగలిగాను. వారి సమస్యలు ఆలకించడమే కాదు, అవినీతి దుష్ఫలితాలను కూడా సాధ్యమైనంత మేర నా యాత్రలో వివరిస్తున్నాను. అవినీతిపై నేను మొదలుపెట్టిన పోరాటంలో యువతే సరైన ఆయుధం. నా కళ్లూ కాళ్లూ అన్నీ వాళ్ల వైపే. ఏ కళాశాల కనిపించినా, ఏ విద్యార్థి కనిపించినా వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నదందుకే. కోదాడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకూ ఇదే విషయం అర్థం చేయించేందుకు ప్రయత్నించాను. నా ముచ్చట్లు వాళ్ల భవిష్యత్తుకు తొలి మెట్లు!

వాళ్లతో ముచ్చట్లు.. భవితకు తొలిమెట్లు

అదే పెరిగి జగన్ ప్యాలెస్ అయింది
సంతకాలు చేస్తే అవినీతి కాస్తా నీతవుతుందా?
వైఎస్ హయాం అధికారులంతా జైల్లోనే..
నల్లగొండ పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు

  "విజయలక్ష్మి వాకిట్లో అవినీతి చెట్టు పెట్టింది. అది పెరిగి పెద్ద ప్యాలెస్ అయింద''ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన సభలకు జనమే రావడం లేదని అవినీతి డబ్బుతో పెట్టిన జగన్ పత్రిక, మీడియా ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. "మంచి పని చేయాలంటే ఎవరైనా గుడికో, చర్చికో, మసీదుకో వెళతారు. అదే వైసీపీలో చేరాలంటే చంచల్‌గూడ జైలుకు వెళ్లాలి. అక్కడే దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించాలి. పక్కకు వెళ్లి సంచులు తెచ్చుకోవాలి'' అని వైసీపీ తీరును ఎండగట్టారు.

అవినీతిపై పోరాటం చేయడం ద్వారానే మహానేత ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించగలమని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కోదాడ మండలంలో ఏర్పాటుచేసిన విగ్రహాలను ఆవిష్కరిస్తూ శుక్రవారం చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, హరిజనవాడ, మార్కెట్ ఆఫీస్, బాలాజీనగర్ ప్రాంతాల మీదుగా 15 కిలోమీటర్లు నడిచారు.

కోదాడ పట్టణంలోకి ప్రవేశిస్తుండగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చందర్‌రావు ఇంటివద్ద వంద మంది మహిళలు మంగళహారతులు పట్టారు. చెప్పులు కుట్టే పల్లె వెంకటేశ్వర్లు.. ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పులను బహూకరించారు. దానికిముందు ఉదయం బస్సు నుంచి దిగగానే కిట్స్ కళాశాల ప్రాంగణంలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించి ప్రసంగించారు.

జాతీయంగానూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఏకపక్ష పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, చూడలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని నివాళి అర్పించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు అండగా ఉంటానని, అవసరమైతే ఎరువుల ధరలు తగ్గిస్తానని, పత్తి క్వింటాల్ మద్దతు ధర ఐదు వేల రూపాయల నుంచి ఆరువేల వరకు పెంచుతానని ప్రకటించారు.

సంతకాలు పెట్టగానే జగన్ అవినీతి నీతిగా మారుతుందా? అని ప్రశ్నించారు. 'ఆయన దగ్గర పనిచేసిన శాఖ అధిపతులు, పెట్టుబడి పెట్టిన వ్యాపారులు జైలుకు వెళ్లారు. అప్పుడు దోపిడీ చేసిన మంత్రులు ఇప్పుడు దొరల్లా తిరుగుతున్నారు'' అని వైఎస్ పాలననుద్దేశించి చంద్రబాబు విరుచుకుపడ్డారు. కాగా, కిట్స్ కళాశాలకు వెళ్లిన చంద్రబాబుకు విద్యార్థులు వేలాదిగా స్వాగతం పలికారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ వారంతా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా మిర్యాలగూడకు చెందిన గార్లపాటి నిరంజన్‌రెడ్డి నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు ఈ మేరకు ఫ్యాక్స్‌లో సమాచారం పంపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నిరంజన్‌రెడ్డి ఆ పార్టీలో వివిధ హో దాల్లో పని చేస్తున్నారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెరుకు అభివృద్ధి మండలి డైరెక్టర్‌గా నియమించారు. 1987లో సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1990నుంచి 1995 వరకు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1995నుంచి 2000 వరకు మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది పని చేశారు.

2000 నుంచి 2004 వరకు తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. 2004 నుంచి 2008వరకు మిర్యాలగూడ, హుజూర్‌నగర్ ఉమ్మడి నియోజకవర్గ ఇన్‌చార్జిగా అదేకాలంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంపికైనప్పటికీ బీఫారం సకాలంలో అందక పోవడంతో ఎన్నికల నుంచి వైదొలిగారు.

తాజాగా ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు నిరంజన్‌రెడ్డిని రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో టీడీపీ అభివృద్ధికి తోడ్పడతానని, తన నియామకానికి కారకులైన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉమామాధవరెడ్డి, ఎమ్మె ల్యే వేనేపల్లి చందర్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.

పలువురి హర్షంటీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా గార్లపాటి నిరంజన్‌రెడ్డిని నియమించడం పట్ల తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పెద్ది శ్రీనివాస్‌గౌడ్, పాతూరి ప్రసాద్, టీడీపీ నాయకులు తిరందాసు విష్ణు, మంగ్యానాయక్, విద్యాసాగర్, ప్రకాశ్, ఎండి. షఫీ, సాంబశివరావు, హతీరాం, రాములుగౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నిరంజన్‌రెడ్డి

బాబును కలిశా.. ఇప్పుడంతా బాగే!
మనసులో ఉన్నది అధినేతకు చెప్పా
పార్టీ అన్నాక సమస్యలుంటాయి

టీ- టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం పాదయాత్రలో ఉన్న అధినేత చంద్రబాబును కలుసుకున్నారు. అఖిలపక్షానికి తనను పంపలేదనే కారణంగా నర్సింహులు అలక వహించినట్టు వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధా న్యం సంతరించుకుంది. గురువారంతో ఖమ్మంలో పాదయాత్ర ముగిసి, నల్లగొండలోకి ప్రవేశించింది. ఆ జిల్లా సీనియర్‌నేతగా నల్లగొండలో పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై చంద్రబాబుతో నర్సింహలు చర్చించినట్టు తెలుస్తోంది.

అయితే, పార్టీ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతోనే నర్సింహులు చంద్రబాబును కలిసినట్టు సమాచారం. భేటీ అనంతరం మీడియాను కలిసినప్పుడు నర్సింహులు ఉత్సాహంగా కనిపించారు. "పార్టీలో చిన్న చిన్న సమస్యలుంటాయి. వాటిని మా అధినేత సమక్షంలో పరిష్కరించుకున్నా, అంతా క్లియర్' అని తెలిపారు. "నల్లగొండ పాదయాత్రలో పూర్తిగా పాల్గొంటాను. మనసులో ఉన్నదంతా బాబుకు చెప్పాను'' అన్నారు.

పాదయాత్రలో మనస్ఫూర్తిగా పాల్గొంటా: నర్సింహులు

 తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న పాదయాత్రకు జిల్లాలో వేలాదిమందితో ఘనస్వాగతం పలుకుతామని టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి బోయపల్లి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 63 ఏళ్ల వయసులో చంద్రబాబునాయుడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడంకోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాడన్నారు. ఇప్పటికే 1700 కి.మీ. పాదయాత్ర పూర్తయిందన్నారు.

బడుగు, బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను తుడవడం కోసం చంద్రబాబునాయుడు చేపట్టిన ఈ పాదయాత్రను దిగ్విజయం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొర్రా సుధాకర్, నాయకులు కంచనపల్లి రవీందర్‌రావు, లింగంపల్లి శ్రీధర్, పిల్లి రామరాజు, గుండు వెంకటేశ్వర్లు, తేలు రవి తదితరులు పాల్గొన్నారు.

వేలాదిమందితో బాబుకు ఘనస్వాగతం పలుకుతాం

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు 17 నుంచి చేపట్టనున్న పాదయాత్రకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పార్టీకి చెందిన కంభంపాటి రాంమోహన్‌రావు, జిల్లా ఇన్‌చార్జ్ తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో పర్యటించాల్సిన ప్రాంతాలు, దృష్టి సారించాల్సిన సమస్యలు, యాత్రతో పార్టీ బలోపేతం వంటి అం శాలను దృష్టిలో పెట్టుకుని రూట్‌మ్యాప్‌ను ఖరారు చేస్తున్నారు. 18న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.

వర్ధంతి సభకు సమీపంలోని జిల్లా, రాష్ట్ర నేతలు తర లి రానున్నారు. అదేవిధంగా కోదాడ సమీపంలోని బాలాజీనగర్‌తండాలో ఎస్టీ డిక్లరేషన్‌పై తెలుగుదేశం విధానానికి సంబంధించి అధినేత చంద్రబాబు గిరిజనులతో బహిరంగసభ నిర్వహించనున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎస్టీలకు చేయనున్న మేలుపై ఒక విధాన ప్రకటన చేస్తారు.

దీన్ని సమర్ధిస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజన సంఘం, తెలుగుదేశంపార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబుకు సన్మానం జరగనుంది. అనంతగిరి, కోదాడ, బాలాజీనగర్‌తండా, చిలుకూరు, నారాయణపురం, తొగర్రాయి, కాపుగల్లు, నల్లబండగూడెం వంటి ప్రధాన కేంద్రాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. జిల్లా కు చేరుకునే రోజు ఉదయాన్నే కోలాటాలు, గిరిజన నృత్యాలతో సుమారు 10 వేల మంది కార్యకర్తలు చంద్రబాబుకు ఎదురువెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు పాదయాత్రను అనుసరిస్తారు. మొదటి రోజు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల నేతలు బాబు పాదయాత్రలో పాలుపంచుకోనున్నారు.

వివిధ వర్గాలతో ముఖాముఖి

పాదయాత్రలో భాగంగా వివిధ రకాల కుల వృత్తుల వారితో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అందుకనుగుణంగా పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో కుల వృత్తుల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సమస్యపై గ్రామస్థులతో, ఇంజనీరింగ్ విద్యార్థులతో, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యపై లబ్ధిదారులతో చంద్రబాబు ముచ్చటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మోత్కుపల్లితో రాయబారం

అధినేత తీరుతో అలక పాన్పు ఎక్కిన మోత్కుపల్లిని బుజ్జగించేందుకు పార్టీ దూతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. పాదయాత్రకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ దూతలు మోత్కుపల్లిని హైదరాబాద్‌లో కోరినట్లు తెలిసింది. దీంతో మెత్తబడిన ఆయన రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం.

నల్లగొండ జిల్లాలో బాబు పాదయాత్రకు ముమ్మర ఏరాట్లు

అధినేత చంద్రబాబు పాదయాత్రతో జిల్లా పార్టీకి పూర్వ వైభవం చేకూరుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్ తెలిపారు. బుధవారం ఆయన 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. వివిధ రకాల ఇబ్బందులతో అల్లాడిపోతున్న జనంతో మమేకమై వారికి భరోసా కల్పించే దిశగా చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. బాబు రాకకోసం జిల్లా రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని తెలిపారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు మొదటి రోజు అన్ని మండలాల అధ్యక్షులు అధినాయకుడికి స్వాగతం పలుకుతారని చెప్పారు.

ప్రతిరోజు కొన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులు బాబు పాదయాత్రలో పాలు పంచుకుంటారని తెలిపారు. సుమారు 50.5 కి.మీ. మేర నాలుగు రోజులపాటు జిల్లాలో బాబు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఇందుకోసం స్వాగతం మొదలు సభలు, ఆవిష్కరణలు, వీడ్కోలు వరకు ప్రణాళికాబద్ధంగా జిల్లా నాయకత్వం ఏర్పాట్లు చేసిందని వివరించారు. పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని, పాదయాత్ర విజయవంతానికి అంతా కృషి చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబు పాదయాత్రతో పార్టీకి పూర్వవైభవం

జిల్లాలో తొమ్మిది రోజులపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలో స్థానిక సంస్థలకు, సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బాబు పాదయాత్ర జిల్లాలో ప్రవేశించడం టీడీపీ నేతలకు, కార్యకర్తలకు కొండంత బలాన్నిచ్చింది. పాదయాత్ర జరిగిన గ్రామాల్లో ప్రజల సమస్యలు వింటూ, వాటి పరిష్కారానికి హామీలిస్తూనే.. ఆ సమస్యలకు కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాలు, వైఎస్సార్సీపీ నేతల అవినీతే కారణమంటూ చంద్రబాబు ఎండగట్టారు.

ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఎలా ఇబ్బందుల పాలవుతున్నారో వివరిస్తూ వారిలో చైతన్యం తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలపై స్పష్టమైన హామీలనిస్తూ పాదయాత్ర సాగింది. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద ఈ నెల 8న రాత్రి చంద్రబాబు పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. 9వ తేదీ నుంచి జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాదిరిపురంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల స్తూపాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాన్ని కూడా ఇక్కడే నిర్వహించారు. రెండో రోజు వస్తున్నా.. మీకోసం యాత్ర తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల మీదుగా బచ్చోడు వరకు సాగింది. తరువాత ఐదు రోజుల్లో కూసుమంచి, లోక్యాతండ, మద్దులపల్లి మీదుగా ఖమ్మం నగరంలోకి ప్రవేశించింది.

ఖమ్మం పట్టణంలో మాజీ మంత్రి తుమ్మల సారథ్యంలో బాబుకు ఘనస్వాగతం లభించింది. పట్టణ ప్రజలతోపాటు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు కూడా తరలిరావడంతో ఖమ్మం జనసంద్రమైంది. ఖమ్మం నగరంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు పండుగరోజుల్లోనూ పాదయాత్ర కొనసాగించారు. ముదిగొండ, నేలకొండపల్లి మండలాల పరిధిలోని లక్ష్మీపురం, అమ్మపేట క్రాస్‌రోడ్, వనంవారి కిష్టాపురం, బాణాపురం, వల్లభి , రాయగూడెం గ్రామాల మీదుగా సాగిన బాబు పాదయాత్ర తొమ్మిదో రోజున పైనంపల్లి వద్ద ఖమ్మం-నల్గొండ జిల్లా సరిహద్దుల్లోకి చేరుకుంది. మొత్తం మీద జిల్లాలో 55 గ్రామాల మీదుగా బాబు పాదయాత్ర 132.5 కి.మీ మేర సాగింది. ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోనూ చంద్రబాబు పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. రాత్రివేళ కూడా చంద్రబాబు యాత్రకోసం రైతులు, వ్యవసాయ కూలీలు, కులవృత్తుల వారు, ఎమ్మార్పీఎస్, గిరిజన సంఘాలు , మహిళలు, యువకులు బాబు రాకకోసం ఓపికగా ఎదురుచూశారు. 1982 టీడీపీ ఆవిర్భావ తరుణంలో ఎన్టీఆర్ చైతన్యరథంపై నిర్వహించిన పర్యటనకు లభించిన స్థాయిలో వస్తున్నా.. మీ కోసం యాత్రకు విశేష స్పందన లభించింది.

బాధలు వింటూ.. భరోసా ఇస్తూ..

చంద్రబాబు పాదయాత్రలో రైతులకు రుణమాఫీ పథకం, సాగుకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, సబ్సిడీపై సోలార్ పంప్‌సెట్లు, వ్యవసాయ పనులకు ఉపాధి హామీ అనుసంధానం తదితర హామీలిచ్చారు. నిరుపేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్‌మీడియంలో చదువులు, స్కూల్ పిల్లలకు సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ వాపస్, బెల్ట్‌షాపులపై నిషేధం తదితర హామీలు ప్రకటించారు. బీసీలకు 100 సీట్లతోపాటు పేద గొర్రెల కాపరులకు పదెకరాల భూమి, గీత కార్మికులకు గ్రామానికి 10 ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించారు. బీసీలకు 100 సీట్లుతోపాటు 10వేల కోట్లతో బడ్జెట్ ఆయా కులవృత్తుల వారికి పనిముట్లు ఇస్తామని తెలిపారు. అలాగే యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భృతి, మైనార్టీలకు 8 శాతం రిజర్వేషన్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు ఇస్తామని హామీనిచ్చారు. పేదలకు లక్ష రూపాయలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. బాబు పాదయాత్ర సాగుతున్న గ్రామాల్లో స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై స్పందించిన చంద్రబాబు వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు లేఖలు రాశారు. మీరు పరిష్కరించకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఈ సమస్యలు పరిష్కారంతోపాటు ఇచ్చిన హామీలన్ని పరిష్కరిస్తానని ప్రకటించారు.

బాబు యాత్రకు జిల్లా నేతలు కృషి

వస్తున్నా మీకోసం యాత్ర జయప్రదం చేసేందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామ నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఊకే అబ్బయ్య, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నేతలు, మండల కమిటీలు, గ్రామకమిటీలు బాబు యాత్రను విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీల నేతలందరూ తీవ్రంగా శ్రమించారు. తొమ్మిదిరోజుల పాటు యాత్రలో పాల్గొంటున్నవారందరికీ మంచినీటి సరఫరాతోపాటు భోజన వసతులు కల్పించారు. పోలీసు యంత్రాంగం కూడా పాదయాత్ర బందోబస్తు కోసం భారీయెత్తున బలగాలను దింపింది.

జిల్లా సమస్యలపై డిక్లరేషన్ :

చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రలో జిల్లా సమస్యలపై డిక్లరేషన్ ప్రకటించారు. యువతను, చదువుకున్న విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఖమ్మా న్ని ఐటీ కేంద్రం ఏర్పాటుచేస్తానని ప్రకటించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, వ్యవసాయ అనుసంధాన పరిశ్రమలు, గ్రానైట్ హబ్,సెజ్ ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీతోపాటు సాగునీటి ప్రాజెక్టులు తదితర సమస్యలపై డిక్లరేషన్ ప్రకటించారు. వాటి పరిష్కారానికి కృషిచేస్తానని పేర్కొన్నారు.

చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు :

జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర తొమ్మిదో రోజైన గురువారం ఉదయం పైనంపల్లి వద్ద నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులు చంద్రబాబుకు వీడ్కోలు పలికారు. అప్పటికే అక్కడకు చేరుకున్న నల్గొండ జిల్లా టీడీపీ నాయకులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు జిల్లా నేతలు, కార్యకర్తలు, పోలీసు ఉన్నతాధికారులకు మరో సారి కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం జిల్లా నేతలు చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు

నల్లగొండ జిల్లాలోకి అడుగుపెట్టిన నాకు ఎదురైన తొలి పల్లెలో అది ఒకటి. బండలు పగలేసి బతుకుతున్న కుటుంబాలకు నీడనిస్తున్న గ్రామమది. పేరు శాంతినగర్. అక్కడంతా వడ్డెరలే కనిపించారు. వాళ్ల కష్టాలూ కడగండ్లే ముందుగా నన్ను పలకరించాయి. గుడిసెల్లో గూడుకట్టుకున్న బాధలగాథలు మనసున్న ప్రతిఒక్కరినీ కదిలించేలా ఉన్నాయి. కాకులను కొట్టి గద్దలకు పెట్టే ఈ ప్రభుత్వాలు.. కొండలు కొట్టే ఈ బడుగు జీవులను పట్టించుకున్న దాఖలా లేదు. చాలీచాలని గుడిసెల్లో కట్టుకునే బట్ట నుంచి కడుపునకు తిండి దాకా అంతా కరువే.

రాళ్లను సైతం పిండిచేసే వీళ్లు బండబారిన తమ బతుకును మాత్రం పొడి చేయలేకపోతున్నారనిపించింది.పొద్దుకు ముందే ఒక ముద్ద తిని కొండెక్కే వీళ్ల జీవితాల్లోకి ఏ వెలుగులూ తొంగి చూడవు. అసలు వీళ్లసలు జనాభా లెక్కల్లో ఉన్నారా? ప్రమాదంలో తన భర్త చనిపోయాడని చెప్పిందామె. వయసు చిన్నదే. పిల్లలు మరీ చిన్నవాళ్లు. ఎలా బతుకుతుందో? " కూలి చేసుకుంటున్నాను సార్.. కష్టం ఎక్కువ, ఇచ్చేది తక్కువ. నా గతి ఇలా అయింది. ఇప్పుడు నా దిగులంతా ఈ పిల్లల గురించే. చదివించాలని ఉన్నా స్తోమత ఏదీ?'' అన్న ఆ వితంతువు ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమే!

అనంతగిరి దారిలో కొంతమంది నన్ను కలిశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు భూముల రైతులు వాళ్లంతా. వాళ్ల భూములకు సాగర్ నీళ్లు వదలలేదు. పైన మబ్బులాగే సర్కారీ కరెంటు కూడా దైవాదీనమే. ఏం చేయాలి? వాళ్లనే కాదు, నన్నూ ఆ సమస్య ఆలోచింపజేసింది. ఉన్న పరిస్థితిని ఆ రైతు ఉన్నది ఉన్నట్టు కుల్లాగా చెప్పేశాడు.

"సార్.. నా పేరు ఉప్పలయ్య. రైతును. సాగర్‌ను నమ్ముకొని ఈ ఏడాది ఐదెకరాల్లో మిరప, వేరుసెనగ నాటాను. డ్యాం నుంచి నీళ్లు రాలేదు. అయినా బాధపడలేదు. పొలంలో బోరు పంపు ఎలాగూ ఉంది. బావిలో నీళ్లూ ఉన్నాయి. లేనిదల్లా బావిలోని నీళ్లను బోరు ద్వారా తోడేందుకు అవసరమైన కరెంటే. దాంతో పంటంతా పోయింది. ఇప్పటికే యాభై వేలు పెట్టాను. పైసా తిరిగొచ్చేది కనిపించడం లేదు'' అని వాపోతుంటే ఓదార్చడం ఎలాగో అర్థం కాలేదు. కష్టాలన్నీ పాపం ఈ కష్టజీవులకేనా!

కష్టాలన్నీ ఈ కష్టజీవులకేనా!

ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన చంద్రబాబుకు పాదరక్షలు బహూకరించాలని మాదిగలు నిర్ణయించారు. శుక్రవారం కోదాడలో జరిగే బాబు బహిరంగసభలో ఆయనకు వాటిని బహూకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు అంజయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు తెలిపారు.

బాబుకు మాదిగల పాదరక్షలు!

ఇదేమి చార్జ్!
పాలకుల పాపాలకు ప్రజలు బాధ్యులా?
శ్వేతపత్రం విడుదల చేయాలి
నల్లగొండ పాదయాత్రలో చంద్రబాబు డిమాండ్
విద్యుత్ కంపెనీల వద్ద ముడుపులు తిన్న వైఎస్
ఇతర రాష్ట్రాలకు అమ్ముకునేందుకు తలుపులు తీసిన రోశయ్య
బొగ్గు దిగుమతుల్లో రూ.400 కోట్లు తిన్న కిరణ్
ఖమ్మంలో ముగిసిన తొమ్మిది రోజుల పాదయాత్ర

 రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల మోత మోగిస్తున్న కిరణ్ ప్రభుత్వం, శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంల హయాంలో ఎంతెంత చార్జీలు పెరిగాయో, అందులో పాలకుల పాపమెంతో తేలాల్సిందేనన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మీదుగా నల్లగొండ జిల్లా కోదాడ మండలంలోకి గురువారం ఆయన ప్రవేశించారు.

జిల్లాలో తొలిరోజు శాంతినగర్, అనంతగిరి, ఖానాపురం మీదుగా 11.2 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పలుచోట్ల మాట్లాడిన బాబు.. ప్రధానంగా సర్కారు విద్యుత్ విధానాన్ని తూర్పారబట్టారు. "ఇప్పటికే 12 వేల కోట్ల విద్యుత్ చార్జీలు ప్రజల నుంచి వసూలు చేశారు. సర్‌చార్జీల పేరుతో మరో 17వేల కోట్ల బాంబు పేల్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం బకాయిలెన్ని? వైఎస్ కాలంలోనూ, కిరణ్ అసమర్థ పాలనలోనూ ఎంత నష్టం జరిగిందో తేల్చేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని డిమాండ్ చేశారు.

వైఎస్ ముడుపులు తీసుకుని ప్రైవేట్ విద్యుదుత్పత్తి కంపెనీలకు రీషెడ్యూల్ ఇచ్చారని, రోశయ్య ఇతర రాష్ట్రాలకు కరెంటు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వగా, కిరణ్‌కుమార్‌రెడ్డి బొగ్గు దిగుమతి వ్యవహారంలో రూ.400 కోట్లు ముడుపులు తీసుకున్నారని దుయ్యబట్టారు. కృష్ణానదికి అడ్డంగా కర్ణాటక ప్రభుత్వం ఆల్‌మట్టి డ్యాం నిర్మించేందుకు ప్రయత్నిస్తే అప్పట్లో సీఎంగా ఉన్న తాను బ్రేకులు వేసి సీఎంలతో కమిటీని వేయించానని గుర్తుచేశారు.

తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఎదుట వాదించేందుకు పనికిరాని వ్యక్తిని నియమించడంతో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పీఏగా పనిచేసిన రిపుంజయరెడ్డిని ఆయన ఏపీపీఎస్‌సీ సభ్యుడిగా చేయగా, ఉద్యోగాలు అమ్ముకున్నాడని ధ్వజమెత్తారు. అధికారం రాలేదని జగన్.. కాంగ్రెస్ పార్టీ వీడిపోయాడని ఆరోపించారు. కాంగ్రెస్-ఐ, కాంగ్రెస్-వైల తీరు అభివృద్ధి నై.. అవినీతికి సై.. అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

మాదిగ దండోరా కార్యకర్తలు కంటికి రెప్పలా తనను కాపాడుతున్నారని, తన హయాంలోనే వర్గీకరణ మొదలైందని తెలిపారు. మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగేలా చూసి పెద్ద మాదిగ అనిపించుకుంటానన్నారు. తెలంగాణ అంశమై, బలమైన టీడీపీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానంటే ఇతర పార్టీలు గింజుకుంటున్నాయని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ కుటుంబం దోచిన డబ్బులను రాబట్టి ఐదు సార్లు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు.

నల్లగొండ జిల్లాలో ప్రవేశించిన చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. పైనంపల్లి బ్రిడ్జి మీదుగా ఆయన కోదాడ మండలంలో అడుగుపెట్టారు. భారీ జెండాలు, పసుపు కండువాలతో పాదయాత్ర స్థలి పసుపుమయంగా మారింది. యాదవసంఘానికి చెందిన నాయకులు గొర్రెపిల్లను బహూకరించగా, కోదాడ నియోజకవర్గానికి చెందిన వృద్ధ దంపతులు ఆయనకు శాలువా కప్పారు. ఎమ్మార్పీఎస్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ శ్రేణులు భారీగా ద్విచక్రవాహన ర్యాలీతో వచ్చి స్వాగించారు.

సీపీఐ, యూటీఎఫ్ నేతలు సంఘీభావం ప్రకటించారు. తొలిరోజుయాత్రలో భాగంగా శాంతినగర్‌లో వడ్డెరలను, అనంతగిరిలో నాగార్జున సాగర్ ఆయకట్టు భూముల రైతులను కలిసి సమస్యలు ఆరా తీశారు. 9 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో సాగిన పాదయాత్ర గురువారం ముగిసింది. నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద జిల్లాలో నడక పూర్తయింది. జిల్లాలో పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో 55 గ్రామాల్లో 132.5 కి.మీ పాదయాత్ర చేశారు.

విద్యుత్ కంపెనీల వద్ద ముడుపులు తిన్న వైఎస్




అన్న గారి అడుగు జాడలో ,

అన్న గారి అసీసులతో ,

అన్న గారి అనుగ్రహం తో !

తెలుగు జాతి కి వన్నె తెచ్చి,

తెలుగు తనం చాటి చెప్పి,

తెలుగు దేశం పార్టీ స్తాపించిన

మన యుగ పురుషుడు , కారణజన్ముడు

మన నట విశ్వ విక్యాత నట సౌరభ

అన్నగారి కి ఇదే మా నీరాజనం

జోహార్ ఎన్ .టి .అర్ ...జోహార్ ఎన్ .టి. అర్

జోహార్ ఎన్ .టి అర్ ..జోహార్ ఎన్ .టి అర్ అన్నగారి 17 వ వర్దంతి...