January 18, 2013

ఖమ్మం జిల్లా నేతలు చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు

జిల్లాలో తొమ్మిది రోజులపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలో స్థానిక సంస్థలకు, సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బాబు పాదయాత్ర జిల్లాలో ప్రవేశించడం టీడీపీ నేతలకు, కార్యకర్తలకు కొండంత బలాన్నిచ్చింది. పాదయాత్ర జరిగిన గ్రామాల్లో ప్రజల సమస్యలు వింటూ, వాటి పరిష్కారానికి హామీలిస్తూనే.. ఆ సమస్యలకు కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాలు, వైఎస్సార్సీపీ నేతల అవినీతే కారణమంటూ చంద్రబాబు ఎండగట్టారు.

ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఎలా ఇబ్బందుల పాలవుతున్నారో వివరిస్తూ వారిలో చైతన్యం తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలపై స్పష్టమైన హామీలనిస్తూ పాదయాత్ర సాగింది. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద ఈ నెల 8న రాత్రి చంద్రబాబు పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. 9వ తేదీ నుంచి జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాదిరిపురంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల స్తూపాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాన్ని కూడా ఇక్కడే నిర్వహించారు. రెండో రోజు వస్తున్నా.. మీకోసం యాత్ర తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల మీదుగా బచ్చోడు వరకు సాగింది. తరువాత ఐదు రోజుల్లో కూసుమంచి, లోక్యాతండ, మద్దులపల్లి మీదుగా ఖమ్మం నగరంలోకి ప్రవేశించింది.

ఖమ్మం పట్టణంలో మాజీ మంత్రి తుమ్మల సారథ్యంలో బాబుకు ఘనస్వాగతం లభించింది. పట్టణ ప్రజలతోపాటు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు కూడా తరలిరావడంతో ఖమ్మం జనసంద్రమైంది. ఖమ్మం నగరంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు పండుగరోజుల్లోనూ పాదయాత్ర కొనసాగించారు. ముదిగొండ, నేలకొండపల్లి మండలాల పరిధిలోని లక్ష్మీపురం, అమ్మపేట క్రాస్‌రోడ్, వనంవారి కిష్టాపురం, బాణాపురం, వల్లభి , రాయగూడెం గ్రామాల మీదుగా సాగిన బాబు పాదయాత్ర తొమ్మిదో రోజున పైనంపల్లి వద్ద ఖమ్మం-నల్గొండ జిల్లా సరిహద్దుల్లోకి చేరుకుంది. మొత్తం మీద జిల్లాలో 55 గ్రామాల మీదుగా బాబు పాదయాత్ర 132.5 కి.మీ మేర సాగింది. ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోనూ చంద్రబాబు పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. రాత్రివేళ కూడా చంద్రబాబు యాత్రకోసం రైతులు, వ్యవసాయ కూలీలు, కులవృత్తుల వారు, ఎమ్మార్పీఎస్, గిరిజన సంఘాలు , మహిళలు, యువకులు బాబు రాకకోసం ఓపికగా ఎదురుచూశారు. 1982 టీడీపీ ఆవిర్భావ తరుణంలో ఎన్టీఆర్ చైతన్యరథంపై నిర్వహించిన పర్యటనకు లభించిన స్థాయిలో వస్తున్నా.. మీ కోసం యాత్రకు విశేష స్పందన లభించింది.

బాధలు వింటూ.. భరోసా ఇస్తూ..

చంద్రబాబు పాదయాత్రలో రైతులకు రుణమాఫీ పథకం, సాగుకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, సబ్సిడీపై సోలార్ పంప్‌సెట్లు, వ్యవసాయ పనులకు ఉపాధి హామీ అనుసంధానం తదితర హామీలిచ్చారు. నిరుపేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్‌మీడియంలో చదువులు, స్కూల్ పిల్లలకు సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ వాపస్, బెల్ట్‌షాపులపై నిషేధం తదితర హామీలు ప్రకటించారు. బీసీలకు 100 సీట్లతోపాటు పేద గొర్రెల కాపరులకు పదెకరాల భూమి, గీత కార్మికులకు గ్రామానికి 10 ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించారు. బీసీలకు 100 సీట్లుతోపాటు 10వేల కోట్లతో బడ్జెట్ ఆయా కులవృత్తుల వారికి పనిముట్లు ఇస్తామని తెలిపారు. అలాగే యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భృతి, మైనార్టీలకు 8 శాతం రిజర్వేషన్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు ఇస్తామని హామీనిచ్చారు. పేదలకు లక్ష రూపాయలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. బాబు పాదయాత్ర సాగుతున్న గ్రామాల్లో స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై స్పందించిన చంద్రబాబు వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు లేఖలు రాశారు. మీరు పరిష్కరించకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఈ సమస్యలు పరిష్కారంతోపాటు ఇచ్చిన హామీలన్ని పరిష్కరిస్తానని ప్రకటించారు.

బాబు యాత్రకు జిల్లా నేతలు కృషి

వస్తున్నా మీకోసం యాత్ర జయప్రదం చేసేందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామ నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఊకే అబ్బయ్య, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నేతలు, మండల కమిటీలు, గ్రామకమిటీలు బాబు యాత్రను విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీల నేతలందరూ తీవ్రంగా శ్రమించారు. తొమ్మిదిరోజుల పాటు యాత్రలో పాల్గొంటున్నవారందరికీ మంచినీటి సరఫరాతోపాటు భోజన వసతులు కల్పించారు. పోలీసు యంత్రాంగం కూడా పాదయాత్ర బందోబస్తు కోసం భారీయెత్తున బలగాలను దింపింది.

జిల్లా సమస్యలపై డిక్లరేషన్ :

చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రలో జిల్లా సమస్యలపై డిక్లరేషన్ ప్రకటించారు. యువతను, చదువుకున్న విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఖమ్మా న్ని ఐటీ కేంద్రం ఏర్పాటుచేస్తానని ప్రకటించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, వ్యవసాయ అనుసంధాన పరిశ్రమలు, గ్రానైట్ హబ్,సెజ్ ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీతోపాటు సాగునీటి ప్రాజెక్టులు తదితర సమస్యలపై డిక్లరేషన్ ప్రకటించారు. వాటి పరిష్కారానికి కృషిచేస్తానని పేర్కొన్నారు.

చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు :

జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర తొమ్మిదో రోజైన గురువారం ఉదయం పైనంపల్లి వద్ద నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులు చంద్రబాబుకు వీడ్కోలు పలికారు. అప్పటికే అక్కడకు చేరుకున్న నల్గొండ జిల్లా టీడీపీ నాయకులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు జిల్లా నేతలు, కార్యకర్తలు, పోలీసు ఉన్నతాధికారులకు మరో సారి కృతజ్ఞతలు తెలిపారు.