January 18, 2013

మిన్నంటిన అభిమానం

  రెండోరోజు జిల్లాలో చంద్రబాబు పాదయాత్రకు జనం పోటెత్తారు. ఉదయం కిట్స్ కళాశాల వద్ద బస్సుదిగింది మొదలు మళ్లీ చిలుకూరు మండలంలో రాత్రి బసవరకు జనం వెన్నంటె. ఇక కోదాడ పట్టణంలో పాదయాత్రపొడవునా హారతుల స్వాగతం, చప్పట్లు, జేజేలతో చంద్రబాబులో ఉత్సాహాన్ని ఇనుమడింపజేశారు. జనం నుంచి వచ్చిన విశేష స్పందనతో చంద్రబాబు అన్నిచోట్లా ఉత్తేజిత ప్రసంగాలు చేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, ప్యాకేజీ రాజకీయాలు అంటూ కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్‌లను భిన్నరూపాల్లో టార్గెట్ చేస్తూ మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్నారు.

పాయాత్ర మార్గంలో అందరినీ దగ్గరగా పలకరించారు. కేసుల పేరిట వేధిస్తున్న జిల్లా మంత్రులను ఖబడ్దార్...అంటూ హెచ్చరించి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆత్మస్థయిర్యం నింపారు.

చంద్రబాబు 'వస్తున్నా.. మీకోసం' పాద యాత్రకు శుక్రవారం నాటికి 109 వ రోజు. కోదాడ పట్టణంలో సుమారు 16 కి.మీ.ల మేర సాగిన పాదయాత్రను జనం భారీగా అనుసరించారు. ఉదయాన్నే జిల్లా నలుమూలలనుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా కోదాడ చేరుకున్నారు. పట్టణంలో పా దయాత్ర ప్రారంభంనుంచి ముగింపు వరకు అధినాయకుడి వెంటే వారు నడిచారు. ఎడ్లబండ్లు, గొర్రెపిల్లలు చంద్రబాబుకు బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం బస్సు నుంచి దిగగానే కిట్స్ కళాశాల ప్రాంగణంలో ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా నేతలు కదిలివచ్చారు.

అక్కడినుంచి కిట్స్ కళాశాలలో సదస్సుకు చేరుకోగా పెద్దసంఖ్యలో విద్యార్థినులు పూలతో చంద్రబాబును స్వాగతించా రు. జాబ్ రావాలంటే బాబు సీఎం కావాలంటూ విద్యార్థినీ విద్యార్థులు పెద్దపెట్టున నినదించారు. కోదాడ పట్టణంలోకి ప్రవేశిస్తుండగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చందర్‌రావు ఇంటివద్ద వంద మంది మహిళలు మంగళహారతులు పట్టారు. చెప్పులు కుట్టే పల్లె వెంకటేశ్వర్లు... చంద్రబాబు కోసం ప్ర త్యేకంగా తయారుచేసిన చెప్పులను అందజేశాడు. ఖమ్మం క్రాస్‌రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జనం పో టెత్తారు.

కోదాడ పట్టణ ప్రధాన రహదారులు జనంతో నిండిపోయాయి. పట్టణంలో పాదయాత్ర సాగినంతసేపు మహిళలు, పిల్లలు రోడ్లపైకి వచ్చి, భవనాలపైకి ఎక్కి విక్టరీ సింబల్‌తో రెండు వేళ్లు ఊపుతూ చంద్రబాబును ఉత్సాహపరిచారు. మత్య్సకారులు చేపలు పట్టే వలతో పాటు ఓ చేపను చంద్రబాబుకు అందించారు. దళితులు రోడ్లపై నీళ్లు చల్లి, కాలనీ మొత్తం రంగురంగుల రబ్బరు బెలూన్‌లు కట్టి స్వాగతం పలికారు. యువకులు భారీ జెండాలు, పెద్ద సంఖ్యలో ద్విచక్రవాహనాలతో చంద్రబాబును అనుసరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రబాబు పాదయాత్ర మార్గంలో ఉన్న ప్రతి విద్యాసంస్థల విద్యార్థులు రోడ్లకు ఇరువైపులా నిల్చుని స్వాగతం పలికారు.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు కోదాడలో వినతులు వెల్లువెత్తాయి. పీఆర్సీ, పదోన్నతులు, మహి ళా ఉద్యోగుల సౌకర్యాలు సాధించేందుకు సహకరించాలని టీఎన్‌యుఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు చంద్రబాబును కలిశారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు భద్రత కల్పించాలని సామాజిక కార్యకర్త కొల్లు వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్యవైశ్యసంఘ నాయకులు బాబుకు వినతిపత్రం సమర్పించారు. కోర్టు సమీపంలో న్యాయవాదులు తమ సమస్యల వినతిపత్రం అందించారు.

ఉదయం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి చర్చించిన చంద్రబాబు పాదయాత్ర క్రమంలో పలువురిని పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. బజ్జీలు చేసే ప్రకాశ్ అనే వ్యక్తిని పలకరించి వ్యాపరంలో కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనూస్ సెలూన్‌లోకి ప్రవేశించి నరేష్‌కు చంద్రబాబు కటింగ్ చేశారు. తదుపరి నరేష్ చేతులమీదుగా బాబు గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. కమ్మరులను పలకరించి అధికారంలోకి వస్తే ఆదుకుంటానన్నారు. బస్టాండ్ సమీపంలో చిన్నారిని ఎత్తుకుని ముద్దుచేశారు.

చంద్రబాబు తన ప్రతి ప్రసంగంలోనూ కాంగ్రెస్, వైసీపీలను లక్ష్యంగా చేసుకుని విమర్శల జడివాన కురిపించారు. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలను సవివరంగా తెలియజేశారు. వైసీపీ ఆవిర్భావం తీరు, ప్రస్తుతం డబ్బులతో రాజకీయాలను శాసిస్తున్న తీరును దునుమాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థుడు, అవినీతి రక్షకుడు అని దుయ్యబట్టారు. సీఎం వైఫల్యం మూలంగానే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్ లక్షకోట్లు మింగేశాడని, విజయలక్ష్మి వాకిట్లో అవినీతి చెట్టు మొలిచి ప్యాలెస్‌గా ఎదిగిందని భిన్నరీతిలో ప్రసంగించి చంద్రబాబు ఆకట్టుకున్నారు.

కేసీఆర్‌కు ఒక ఉద్యోగం, ఆయన కూతురు, కొడుకు, అల్లుడికి ఉద్యోగం, పోరాటం చేస్తున్న మనకు మాత్రం ఎలాంటి ఉద్యోగాలు లేవు... తమ్ముళ్లూ...! అని యువతను ఉత్సాహపరిచారు.తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు తాను అడుగడుగునా అండగా ఉన్నానంటూ భరోసా కల్పించారు. కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోనంటూ జిల్లా మంత్రులకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం, సాయంత్రం జిల్లా ముఖ్యనేతలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. వివిధ కార్యక్రమాలలో ప్రాధాన్యం ఇవ్వడం, బాబు ఆప్యాయంగా ఆహ్వానిస్తుండడంతో అటు నేతలు ఇటు కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు.

పాదయాత్ర క్రమంలో చంద్రబాబు హామీలు ఇస్తుండడంతో వివిధ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ, వ్యవసాయానికి తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, గ్యాస్ ధర పెంచకపోవడం, విద్యార్థినులకు కరాటేశిక్షణ, బెల్టు షాపుల రద్దు వంటి హామీలతో మహిళల్లో మంచి స్పందన కనిపిస్తోంది. అర్హతను బట్టి ఉద్యోగం, లేదంటే నిరుద్యోగభృతి కల్పిస్తాననడంతో యువకుల్లో స్పందన వ్యక్తమయింది. జిల్లాలోని అన్ని గ్రామాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో సాగర్ నుంచి మంచినీళ్లు అందిస్తానని ప్రకటించగానే చప్పట్లు మార్మోగాయి.