January 18, 2013

విద్యుత్ కంపెనీల వద్ద ముడుపులు తిన్న వైఎస్

ఇదేమి చార్జ్!
పాలకుల పాపాలకు ప్రజలు బాధ్యులా?
శ్వేతపత్రం విడుదల చేయాలి
నల్లగొండ పాదయాత్రలో చంద్రబాబు డిమాండ్
విద్యుత్ కంపెనీల వద్ద ముడుపులు తిన్న వైఎస్
ఇతర రాష్ట్రాలకు అమ్ముకునేందుకు తలుపులు తీసిన రోశయ్య
బొగ్గు దిగుమతుల్లో రూ.400 కోట్లు తిన్న కిరణ్
ఖమ్మంలో ముగిసిన తొమ్మిది రోజుల పాదయాత్ర

 రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల మోత మోగిస్తున్న కిరణ్ ప్రభుత్వం, శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంల హయాంలో ఎంతెంత చార్జీలు పెరిగాయో, అందులో పాలకుల పాపమెంతో తేలాల్సిందేనన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మీదుగా నల్లగొండ జిల్లా కోదాడ మండలంలోకి గురువారం ఆయన ప్రవేశించారు.

జిల్లాలో తొలిరోజు శాంతినగర్, అనంతగిరి, ఖానాపురం మీదుగా 11.2 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పలుచోట్ల మాట్లాడిన బాబు.. ప్రధానంగా సర్కారు విద్యుత్ విధానాన్ని తూర్పారబట్టారు. "ఇప్పటికే 12 వేల కోట్ల విద్యుత్ చార్జీలు ప్రజల నుంచి వసూలు చేశారు. సర్‌చార్జీల పేరుతో మరో 17వేల కోట్ల బాంబు పేల్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం బకాయిలెన్ని? వైఎస్ కాలంలోనూ, కిరణ్ అసమర్థ పాలనలోనూ ఎంత నష్టం జరిగిందో తేల్చేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని డిమాండ్ చేశారు.

వైఎస్ ముడుపులు తీసుకుని ప్రైవేట్ విద్యుదుత్పత్తి కంపెనీలకు రీషెడ్యూల్ ఇచ్చారని, రోశయ్య ఇతర రాష్ట్రాలకు కరెంటు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వగా, కిరణ్‌కుమార్‌రెడ్డి బొగ్గు దిగుమతి వ్యవహారంలో రూ.400 కోట్లు ముడుపులు తీసుకున్నారని దుయ్యబట్టారు. కృష్ణానదికి అడ్డంగా కర్ణాటక ప్రభుత్వం ఆల్‌మట్టి డ్యాం నిర్మించేందుకు ప్రయత్నిస్తే అప్పట్లో సీఎంగా ఉన్న తాను బ్రేకులు వేసి సీఎంలతో కమిటీని వేయించానని గుర్తుచేశారు.

తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఎదుట వాదించేందుకు పనికిరాని వ్యక్తిని నియమించడంతో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పీఏగా పనిచేసిన రిపుంజయరెడ్డిని ఆయన ఏపీపీఎస్‌సీ సభ్యుడిగా చేయగా, ఉద్యోగాలు అమ్ముకున్నాడని ధ్వజమెత్తారు. అధికారం రాలేదని జగన్.. కాంగ్రెస్ పార్టీ వీడిపోయాడని ఆరోపించారు. కాంగ్రెస్-ఐ, కాంగ్రెస్-వైల తీరు అభివృద్ధి నై.. అవినీతికి సై.. అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

మాదిగ దండోరా కార్యకర్తలు కంటికి రెప్పలా తనను కాపాడుతున్నారని, తన హయాంలోనే వర్గీకరణ మొదలైందని తెలిపారు. మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగేలా చూసి పెద్ద మాదిగ అనిపించుకుంటానన్నారు. తెలంగాణ అంశమై, బలమైన టీడీపీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానంటే ఇతర పార్టీలు గింజుకుంటున్నాయని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ కుటుంబం దోచిన డబ్బులను రాబట్టి ఐదు సార్లు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు.

నల్లగొండ జిల్లాలో ప్రవేశించిన చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. పైనంపల్లి బ్రిడ్జి మీదుగా ఆయన కోదాడ మండలంలో అడుగుపెట్టారు. భారీ జెండాలు, పసుపు కండువాలతో పాదయాత్ర స్థలి పసుపుమయంగా మారింది. యాదవసంఘానికి చెందిన నాయకులు గొర్రెపిల్లను బహూకరించగా, కోదాడ నియోజకవర్గానికి చెందిన వృద్ధ దంపతులు ఆయనకు శాలువా కప్పారు. ఎమ్మార్పీఎస్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ శ్రేణులు భారీగా ద్విచక్రవాహన ర్యాలీతో వచ్చి స్వాగించారు.

సీపీఐ, యూటీఎఫ్ నేతలు సంఘీభావం ప్రకటించారు. తొలిరోజుయాత్రలో భాగంగా శాంతినగర్‌లో వడ్డెరలను, అనంతగిరిలో నాగార్జున సాగర్ ఆయకట్టు భూముల రైతులను కలిసి సమస్యలు ఆరా తీశారు. 9 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో సాగిన పాదయాత్ర గురువారం ముగిసింది. నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద జిల్లాలో నడక పూర్తయింది. జిల్లాలో పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో 55 గ్రామాల్లో 132.5 కి.మీ పాదయాత్ర చేశారు.