January 18, 2013

కష్టాలన్నీ ఈ కష్టజీవులకేనా!

నల్లగొండ జిల్లాలోకి అడుగుపెట్టిన నాకు ఎదురైన తొలి పల్లెలో అది ఒకటి. బండలు పగలేసి బతుకుతున్న కుటుంబాలకు నీడనిస్తున్న గ్రామమది. పేరు శాంతినగర్. అక్కడంతా వడ్డెరలే కనిపించారు. వాళ్ల కష్టాలూ కడగండ్లే ముందుగా నన్ను పలకరించాయి. గుడిసెల్లో గూడుకట్టుకున్న బాధలగాథలు మనసున్న ప్రతిఒక్కరినీ కదిలించేలా ఉన్నాయి. కాకులను కొట్టి గద్దలకు పెట్టే ఈ ప్రభుత్వాలు.. కొండలు కొట్టే ఈ బడుగు జీవులను పట్టించుకున్న దాఖలా లేదు. చాలీచాలని గుడిసెల్లో కట్టుకునే బట్ట నుంచి కడుపునకు తిండి దాకా అంతా కరువే.

రాళ్లను సైతం పిండిచేసే వీళ్లు బండబారిన తమ బతుకును మాత్రం పొడి చేయలేకపోతున్నారనిపించింది.పొద్దుకు ముందే ఒక ముద్ద తిని కొండెక్కే వీళ్ల జీవితాల్లోకి ఏ వెలుగులూ తొంగి చూడవు. అసలు వీళ్లసలు జనాభా లెక్కల్లో ఉన్నారా? ప్రమాదంలో తన భర్త చనిపోయాడని చెప్పిందామె. వయసు చిన్నదే. పిల్లలు మరీ చిన్నవాళ్లు. ఎలా బతుకుతుందో? " కూలి చేసుకుంటున్నాను సార్.. కష్టం ఎక్కువ, ఇచ్చేది తక్కువ. నా గతి ఇలా అయింది. ఇప్పుడు నా దిగులంతా ఈ పిల్లల గురించే. చదివించాలని ఉన్నా స్తోమత ఏదీ?'' అన్న ఆ వితంతువు ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమే!

అనంతగిరి దారిలో కొంతమంది నన్ను కలిశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు భూముల రైతులు వాళ్లంతా. వాళ్ల భూములకు సాగర్ నీళ్లు వదలలేదు. పైన మబ్బులాగే సర్కారీ కరెంటు కూడా దైవాదీనమే. ఏం చేయాలి? వాళ్లనే కాదు, నన్నూ ఆ సమస్య ఆలోచింపజేసింది. ఉన్న పరిస్థితిని ఆ రైతు ఉన్నది ఉన్నట్టు కుల్లాగా చెప్పేశాడు.

"సార్.. నా పేరు ఉప్పలయ్య. రైతును. సాగర్‌ను నమ్ముకొని ఈ ఏడాది ఐదెకరాల్లో మిరప, వేరుసెనగ నాటాను. డ్యాం నుంచి నీళ్లు రాలేదు. అయినా బాధపడలేదు. పొలంలో బోరు పంపు ఎలాగూ ఉంది. బావిలో నీళ్లూ ఉన్నాయి. లేనిదల్లా బావిలోని నీళ్లను బోరు ద్వారా తోడేందుకు అవసరమైన కరెంటే. దాంతో పంటంతా పోయింది. ఇప్పటికే యాభై వేలు పెట్టాను. పైసా తిరిగొచ్చేది కనిపించడం లేదు'' అని వాపోతుంటే ఓదార్చడం ఎలాగో అర్థం కాలేదు. కష్టాలన్నీ పాపం ఈ కష్టజీవులకేనా!