January 18, 2013

నల్లగొండ జిల్లాలో బాబు పాదయాత్రకు ముమ్మర ఏరాట్లు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు 17 నుంచి చేపట్టనున్న పాదయాత్రకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పార్టీకి చెందిన కంభంపాటి రాంమోహన్‌రావు, జిల్లా ఇన్‌చార్జ్ తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో పర్యటించాల్సిన ప్రాంతాలు, దృష్టి సారించాల్సిన సమస్యలు, యాత్రతో పార్టీ బలోపేతం వంటి అం శాలను దృష్టిలో పెట్టుకుని రూట్‌మ్యాప్‌ను ఖరారు చేస్తున్నారు. 18న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.

వర్ధంతి సభకు సమీపంలోని జిల్లా, రాష్ట్ర నేతలు తర లి రానున్నారు. అదేవిధంగా కోదాడ సమీపంలోని బాలాజీనగర్‌తండాలో ఎస్టీ డిక్లరేషన్‌పై తెలుగుదేశం విధానానికి సంబంధించి అధినేత చంద్రబాబు గిరిజనులతో బహిరంగసభ నిర్వహించనున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎస్టీలకు చేయనున్న మేలుపై ఒక విధాన ప్రకటన చేస్తారు.

దీన్ని సమర్ధిస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజన సంఘం, తెలుగుదేశంపార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబుకు సన్మానం జరగనుంది. అనంతగిరి, కోదాడ, బాలాజీనగర్‌తండా, చిలుకూరు, నారాయణపురం, తొగర్రాయి, కాపుగల్లు, నల్లబండగూడెం వంటి ప్రధాన కేంద్రాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. జిల్లా కు చేరుకునే రోజు ఉదయాన్నే కోలాటాలు, గిరిజన నృత్యాలతో సుమారు 10 వేల మంది కార్యకర్తలు చంద్రబాబుకు ఎదురువెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు పాదయాత్రను అనుసరిస్తారు. మొదటి రోజు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల నేతలు బాబు పాదయాత్రలో పాలుపంచుకోనున్నారు.

వివిధ వర్గాలతో ముఖాముఖి

పాదయాత్రలో భాగంగా వివిధ రకాల కుల వృత్తుల వారితో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అందుకనుగుణంగా పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో కుల వృత్తుల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సమస్యపై గ్రామస్థులతో, ఇంజనీరింగ్ విద్యార్థులతో, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యపై లబ్ధిదారులతో చంద్రబాబు ముచ్చటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మోత్కుపల్లితో రాయబారం

అధినేత తీరుతో అలక పాన్పు ఎక్కిన మోత్కుపల్లిని బుజ్జగించేందుకు పార్టీ దూతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. పాదయాత్రకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ దూతలు మోత్కుపల్లిని హైదరాబాద్‌లో కోరినట్లు తెలిసింది. దీంతో మెత్తబడిన ఆయన రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం.