January 18, 2013

వాళ్లతో ముచ్చట్లు.. భవితకు తొలిమెట్లు

తెలుగు జాతిని మరోసారి తట్టి లేపాల్సిన తరుణమిది. అన్నగారిని స్మరించుకొని స్ఫూర్తిని పొందాల్సిన సమయమిది. మహానాయకుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళి అర్పించి నా నడక ప్రారంభించాను. మా కుటుంబ సభ్యులకేకాదు, తెలుగుదేశం శ్రేణు లకే కాదు, ప్రతి తెలుగువాడికీ ఎన్టీఆర్ నిత్య ప్రేరణ. తరాలు మారినా ఆయన ప్రతి ఒక్కరి గుండెలో కొలువై ఉన్నాడు. కాంగ్రెస్ రాక్షస పాలనపై ప్రజల్లో చైతన్యం రగిల్చేందుకు నాడు ఎన్టీఆర్ చైతన్యరథంపై రాష్ట్రమంతటా తిరిగారు. 30 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉంది.

తల్లి కాంగ్రెస్‌కు పిల్ల కాంగ్రెస్సూ తోడైంది. వీళ్ల వల్ల ప్రజలకు చరిత్రలో ఎన్నడూ లేనన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. అందుకే నాటి ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర కంటే మరింత కటువైన నిర్ణయం తీసుకున్నాను. ఈ వయసులో పాదయాత్రకు వచ్చాను. కానీ, ఒక్కొక్క జిల్లాలో యాత్ర పూర్తయినప్పుడల్లా ప్రజల నుంచి వస్తున్న ఆదరణ నాలో మరింత ఉత్సాహం నింపుతోంది. ఈ రాష్ట్రాన్నీ, తెలుగుజాతినీ కాపాడుకోవాలన్న సంకల్పమే నన్ను ముందుకు నడుపుతోంది. తల్లి, పిల్ల కాంగ్రెస్ పోకడలు పరిశీలించినప్పుడు, పది జిల్లాల్లో పూర్తయిన పాదయాత్ర అనుభవాలను సమీక్షించినప్పుడు రెండో దశ సామాజిక న్యాయ నినాదం అందుకోవాల్సిన ఆవశ్యకత కనిపించింది.

కోదాడ పట్టణంలో కలిసిన లంబాడాలు, వడ్డెరలు..ఒకరా ఇద్దరా ఎదురైన ప్రతి కులవృత్తిదారూ నా అడుగులో అడుగు వేశాడు. అన్ని వర్గాలకూ, కులాలకూ న్యాయం చేయగల సత్తా మా పార్టీకే ఉన్నదన్న నమ్మకం వారి ముఖంలో చూడగలిగాను. వారి సమస్యలు ఆలకించడమే కాదు, అవినీతి దుష్ఫలితాలను కూడా సాధ్యమైనంత మేర నా యాత్రలో వివరిస్తున్నాను. అవినీతిపై నేను మొదలుపెట్టిన పోరాటంలో యువతే సరైన ఆయుధం. నా కళ్లూ కాళ్లూ అన్నీ వాళ్ల వైపే. ఏ కళాశాల కనిపించినా, ఏ విద్యార్థి కనిపించినా వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నదందుకే. కోదాడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకూ ఇదే విషయం అర్థం చేయించేందుకు ప్రయత్నించాను. నా ముచ్చట్లు వాళ్ల భవిష్యత్తుకు తొలి మెట్లు!